బ్లాక్ స్వాన్ - శ్రియ: కే-పాప్‌లో భారత యువతి ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి?

బ్లాక్‌స్వాన్

ఫొటో సోర్స్, DR MUSIC

    • రచయిత, యునా కూ
    • హోదా, బీబీసీ కొరియన్

చీర కట్టుని పోలిన దుస్తులు వేసుకొని, ఆభరణాలు పెట్టుకొని నలుగురు యువతులు ఒక దేవాలయం దగ్గర ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు.

దేవాలయాల్లో కనిపించే రంగు పొడి గులాల్‌ను వారు మొహాలపై రాసుకున్నారు.

ఇదేదో బాలీవుడ్ సినిమా అనుకుంటే పొరపాటే. కే-పాప్ గర్ల్ గ్రూప్ బ్లాక్‌స్వాన్ కొత్త మ్యూజిక్ వీడియో ఇది.

ఒక్క కొరియన్ కూడా లేని కే-పాప్ గర్ల్ గ్రూప్‌గా బ్లాక్‌స్వాన్ రికార్డు సృష్టించింది. ఇదివరకు అందరూ అమెరికన్లతో కే-పాప్ బాయ్స్ బ్యాండ్ ‘ఈఎక్స్‌పీ ఎడిషన్’ ఉండేది. కానీ, చాలా కాలం నుంచీ ఆ బ్యాండ్ నుంచి పాటలు రావడం లేదు.

కే-పాప్ గ్రూప్‌లలో విదేశీయులు ఉండటం కొత్తేమీ కాదు. అయితే, ఇలాంటి గ్రూపుల్లో ఎక్కువగా ఇతర ఆసియా దేశాల ప్రజలే ఉంటారు. కే-పాప్‌లో అతిపెద్ద గర్ల్ గ్రూప్‌ బ్లాక్‌పింక్‌లోనూ ఇలానే ఒక థాయిలాండ్ వాసి ఉన్నారు.

కానీ, బ్లాక్‌స్వాన్‌లో కనిపిస్తున్న శ్రియ మాత్రమే భారత్‌వాసి. శ్రియ ఒడిశాకు చెందిన అమ్మాయి.

మిగతా ఎవరూ ఆసియా ప్రజలు కూడా కాదు. ఫాతౌ సెనేగల్, బెల్జియంలలో పెరిగారు. గాబీ బ్రెజీలియన్-జర్మన్, ఎన్‌వీ అమెరికావాసి.

బ్లాక్‌స్వాన్

ఫొటో సోర్స్, DR MUSIC

కే-పాప్‌కు ప్రాచుర్యం పెరుగుతోంది. అదే సమయంలో కే-పాప్‌ నిర్వచనమూ మారుతోంది. మరి బ్లాక్‌స్వాన్ గ్రూపును దీనిలో భాగంగానే ప్రజలు చూస్తున్నారా?

‘‘వీరంతా ఓ కొరియా ఎంటర్‌టైన్మెంట్ కంపెనీ కోసం పనిచేస్తున్నారు. కొరియాలోనే తొలి ప్రదర్శన ఇచ్చారు. కొరియన్‌లోనే పాడుతున్నారు. కాబట్టి వారిని కే-పాప్‌గా చెప్పుకోవచ్చు’’ అని ఒక విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.

అయితే, కొంతమంది కొరియన్ల నుంచి ప్రతికూల స్పందనలు కూడా వస్తున్నాయి. ‘‘కొరియన్లు లేకపోతే.. అది కేవలం పాప్ గ్రూప్ మాత్రమే. కే-పాప్ కాదు’’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.

అయితే, ఇలాంటి కామెంట్లను బ్లాక్‌స్వాన్ బృందం పట్టించుకోవడం లేదు. ‘‘మేం కొరియన్‌లోనే పాడుతున్నాం. మమ్మల్ని మేం కే-పాప్‌గానే చూసుకుంటున్నాం’’ అని బృందం చెబుతోంది.

ప్రస్తుతం దక్షిణ కొరియా ప్రభుత్వం.. విదేశీయులు కే-పాప్‌లో శిక్షణ తీసుకునేందుకు రెండేళ్ల ‘‘కే-కల్చర్ ట్రైనింగ్ వీసా’’లను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే, దీనిపై కూడా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

బ్లాక్‌స్వాన్ కావాలనే విదేశీయులతో ఏర్పాటుచేసిన గ్రూప్ కాదు. కాలక్రమంలో నెమ్మదిగా దీనిలో విదేశీయులు చేరారు. ఈ గ్రూప్‌కు ముందుగా ‘రనీనా’ అనే గ్రూప్ ఉండేది. అది 2011లో ప్రారంభమైంది. దీనిలో ఆరుగురు కొరియన్లు, ఒక థాయ్ యువతి ఉండేవారు.

2020లో మ్యూజిక్ కంపెనీ డీఆర్ మ్యూజిక్ ‘రనీనా’ను బ్లాక్‌స్వాన్‌గా రీబ్రాండ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఫాతౌను మాత్రమే ఈ బ్రాండింగ్ తర్వాత బ్లాక్‌స్వాన్‌కు వచ్చారు. ఆ తర్వాత కాలంలో మిగతా విదేశీ అమ్మాయిలు దీనిలో చేరారు.

‘‘కొరియన్లు లేకపోవడంతో కొంతమంది దీన్ని వింతగా చూస్తున్నారు. మరికొందరు అసలు నచ్చడంలేదని చెబుతున్నారు. కానీ, కే-పాప్ మార్కెట్ విస్తరణలో భాగంగా వచ్చిన కొత్త అవకాశంగా దీన్ని మేం చూస్తున్నాం’’ అని బీబీసీతో డీఆర్ మ్యూజిక్ తెలిపింది.

బ్లాక్‌స్వాన్

ఫొటో సోర్స్, DR MUSIC

అయితే, ఈ బృందం ఎన్నో సవాళ్లు కూడా ఎదుర్కొంది.

ఇక్కడ భాషే తొలి అడ్డంకి. కే-పాప్ సభ్యులు కొరియన్‌లో మాట్లాడుతూ, ప్రదర్శనలు ఇవ్వాలని ప్రజలు ఆశిస్తారు. కొరియన్ మాట్లాడే తీరు కూడా భిన్నంగా ఉంటుంది. వయసు, సామాజిక పరిస్థితులు, సందర్భాలను బట్టి కొరియన్ మారుతూ ఉంటుంది. ఈ తేడాలను జాగ్రత్తగా గుర్తించగలగాలి.

‘‘మీరు కొరియన్‌లో మాట్లాడేటప్పడు ఆ వ్యక్తి పేరు ఉపయోగించరు లేదా ‘‘యు’’ అని కూడా అనరు. పోర్చుగీసు, ఇంగ్లీష్‌లలో వాక్యంలో ‘యు’ అనే పదం ఉంటుంది. అందుకే ఈ భాషను అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది’’ అని గాబీ చెప్పారు.

ఇప్పటికీ గ్రూపులో కొందరు కొరియన్‌తో కుస్తీ పడుతున్నారు.

అయితే, భాష కంటే డ్యాన్సే అతి కష్టమైనది. దీని కోసం రోజంతా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.

‘‘లేదు.. నువ్వు తప్పు చేస్తున్నావు, మళ్లీ చెయ్యి. అని పదేపదే వారు చెప్పేవారు’’ అని ఎన్‌వీ గుర్తుచేసుకుంది. ఆమె మ్యూజికల్ థియేటర్, యాక్టింగ్‌లోనే చదువుకున్నారు.

బ్రెజిల్‌లోని ఒక డ్యాన్స్‌ గ్రూప్‌లో పనిచేసిన అనుభవం గాబీకి ఉంది. అందుకే తేలిగ్గానే ఇక్కడి డ్యాన్స్ నేర్చుకోవచ్చని ఆమె అనుకున్నారు.

‘‘కానీ, ఇక్కడకు వచ్చిన తర్వాత, అసలు డ్యాన్స్ గురించి ఏమీ తెలియదని అర్థమైంది’’ అని ఆమె చెప్పారు.

శిక్షణ తీసుకునేవారంతా ఇక్కడ కలిసే జీవించాలి. బయటకు తిరగడానికి వెళ్లడం, డేటింగ్ లాంటివి అసలు చేయకూడదు. అంతేకాదు, చక్కగా కనిపించేందుకు బరువు తగ్గాలని కూడా వీరికి సూచించారు. కొరియాలో ప్రముఖులు కొన్ని నైతిక విలువలను పాటిస్తారు. వీరు కూడా అలానే ఉండాలని ప్రజలు కోరుకుంటారు.

బ్లాక్‌స్వాన్

ఫొటో సోర్స్, DR MUSIC

ఫ్రీల్యాన్స్ క్యాస్టింగ్ డైరెక్టర్ జీ-వూంగ్ ఎనిమిదేళ్లపాటు కే-పాప్ గ్రూపులకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. కొంతమంది విదేశీయులు ఇక్కడి ఆంక్షలను తట్టుకోలేక వెళ్లిపోయినట్లు తనతో చాలా మంది చెప్పారని ఆయన అన్నారు.

విదేశీయులతో కలిసి పనిచేయడం ఇక్కడ వారికి కూడా కష్టంగా ఉంటుందని ఆయన అంగీకరించారు. ‘‘ఇక్కడి ఆంక్షలపై వారు చాలా ప్రశ్నలు అడుగుతారు’’ అని ఆయన చెప్పారు.

కఠినమైన శిక్షణ, విపరీతమైన పోటీ వల్ల కే-పాప్ సెలబ్రిటీల్లో కొందరు మానసిక అనారోగ్యం బారినపడుతున్నారు కూడా.

గత ఏప్రిల్‌లో ఆస్ట్రో బ్యాండ్ సభ్యుడు మూన్‌బిన్ ఇలాంటి ఒత్తిడి నడుమ సోల్‌లోని తన ఫ్లాటులో ఎలాంటి స్పందనలూ లేకుండా పడిపోయి కనిపించారు. 2019లో కే-పాప్‌స్టార్లు సులీ, ఆమె స్నేహితురాలు జూ హరాలు ఆత్మహత్యలు చేసుకున్నారు.

‘‘మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాను’’ అని ఫాతౌ చెప్పారు. చిన్న వయసులోనే ఆమె డిప్రెషన్‌కు గురయ్యారు.

‘‘కొన్నిసార్లు నేను డ్యాన్స్ చేయలేను, పాట పాడలేను.. అసలు ఇక్కడ నేనేం చేస్తున్నాను అని అనిపించేది’’ అని ఆమె చెప్పారు.

గత ఫిబ్రవరి నుంచి ఆమె మానసిక ఆరోగ్యం కోసం మందులు కూడా తీసుకుంటున్నారు. మానసిక సమస్యల కోసం వైద్యుల దగ్గరకు వెళ్లడం ఆమెకు ఇదే తొలిసారి. అయితే, ఈ ఖర్చులను ప్రస్తుతం ఆమె సంస్థే భరిస్తోంది. తనకు కావాల్సిన సంతోషాన్ని కే-పాప్ అందిస్తోందని ఆమె అన్నారు.

ప్రస్తుతం కంపెనీలు శిక్షణ తీసుకునేవారితోపాటు నిపుణులకూ వ్యక్తిగత సమయం కాస్త ఎక్కువే ఇస్తున్నాయి. కొన్ని ఆంక్షలను కూడా ఇప్పుడు సడలిస్తున్నారు.

కే-పాప్ భవిష్యత్ తరానికి తాము ప్రతీకగా మారుతామని బ్లాక్‌స్వాన్ గ్రూపు చెబుతోంది.

‘‘కాలం గడిచేకొద్దీ ప్రపంచ దేశాల్లో కే-పాప్‌కు మరింత ఆదరణ వస్తుంది. మరింత మంది విదేశీయులు దీనిలో చేరతారు’’ అని గాబీ చెప్పారు.

‘‘ఎవరైనా దీన్ని చేయగలరు. చర్మం రంగులోనే అంతా ఉంటుందని అనుకుంటే పొరపాటే’’ అని శ్రియ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)