ఇస్రో: దేశం గర్వించేలా ఎదిగిన ఈ సంస్థ 60 ఏళ్ల కథ ఇదీ...

ఫొటో సోర్స్, SPACE INDIA/FACEBOOK
- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ కావడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ, ఈ సంస్థ ఇక్కడివరకూ చేరుకోడానికి 60 సంవత్సరాల క్రితమే తన ప్రయాణం మెదలుపెట్టింది. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ఇన్నేళ్లకు చందమామను అందుకోగలిగింది. సూర్యుడివైపు వడివడిగా అడుగులు వేస్తోంది.
ఇస్రో చరిత్ర 1960లలో స్వతంత్ర భారతదేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో మొదలైంది. 1957 అక్టోబరు 4న సోవియట్ యూనియన్ అంతరిక్షంలోకి మొదటి ఉపగ్రహం స్పుత్నిక్‌ను ప్రయోగించడంతో ప్రపంచం దృష్టి అంతరిక్ష పరిశోధన వైపు మళ్లింది.
ఆ సమయానికి పదేళ్ల వయసుతో ఎన్నో కష్టాల్లో ఉన్నా భారతదేశం కన్ను కూడా దానిపై పడింది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నవీన భారతదేశాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారిత దేశంగా అభివృద్ధి చేయాలని భావించారు.
ఆ సమయంలో భారతదేశంలో అణుశక్తి రంగంపై ప్రధానంగా దృష్టిపెట్టారు. 1961లో అదే రంగంలో అంతరిక్ష శాస్త్రాన్ని కూడా అధ్యయన విభాగంగా చేర్చాలని కేంద్రం నిర్ణయించింది.

ఫొటో సోర్స్, ISRO/TWITTER
భారతదేశానికి రాకెట్ లాంచ్ టెక్నాలజీ
ఆ సమయంలో డాక్టర్ హోమీభాభా అణు ఇంధన శాఖకు అధిపతిగా ఉన్నారు. తర్వాత ఆరు నెలలకు 1962 ఫిబ్రవరిలో భారత జాతీయ అంతరిక్ష పరిశోధన కమిటీ (INCOSPAR) అటామిక్ ఎనర్జీ విభాగంలో ఒక ప్రత్యేక విభాగంగా ఏర్పడింది. దానికి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ చీఫ్ అయ్యారు.
ఇతర దేశాలతో కలిసి అంతరిక్ష పరిశోధనలో పాల్గొనడం, శాంతి కోసం అంతరిక్ష విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో అన్వేషించడం అప్పట్లో ఆ విభాగం లక్ష్యాలు.
ఆ సమయంలో అంతరిక్షంలోకి ప్రయోగించడానికి రాకెట్లను అభివృద్ధి చేయడం గురించి చాలా దేశాలు సీరియస్‌గా దృష్టిపెట్టాయి. దీంతో భారతదేశం కూడా చిన్న స్థాయిలో ఆ ప్రయత్నం ప్రారంభించింది.
ఒకసారి Incospar ఒక రాకెట్ లాంచ్ పరీక్షించడానికి నిర్ణయించింది. తిరువనంతపురం సమీపంలోని తుంబాలో ఇందుకోసం లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ ప్రయత్నంలో పలువురు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. 1962లో తుంబా లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే రాకెట్ లాంచ్‌కు సాంకేతిక పరిజ్ఞానం అవసరం.
ఆ కాలంలో అధునాతన రాకెట్ టెక్నాలజీని కలిగిన దేశాలు, దానిని అత్యంత రహస్యంగా ఉంచాయి. మరోవైపు 'ఇంటర్నేషనల్ ఇండియన్ ఓషన్ ఎక్స్‌పెడిషన్, 'ఇంటర్నేషనల్ సోలార్ పీస్ ఇయర్ సర్వే' ముమ్మరం అయ్యాయి.
వీటికి అవసరమైన వాతావరణ డేటాను నిల్వ చేయడానికి జియోమాగ్నెటిక్ కోర్ దగ్గర లాంచ్ ప్యాడ్ అవసరం.
ఈ పరిస్థితిలో దక్షిణ భారతదేశం అనువైన ప్రదేశం అని, అక్కడ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చని ఐక్యరాజ్యసమితికి భారత్ ఒక ప్రతిపాదన సమర్పించింది.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న యువ శాస్త్రవేత్తలు ఆర్.అరవముతన్, రామకృష్ణారావు, ఎ.పి.జె.అబ్దుల్ కలాంను శిక్షణ కోసం నాసాకు పంపారు.
రాకెట్ ప్రయోగం, ట్రాకింగ్ టెక్నాలజీలో శిక్షణ పొందడమే వారి లక్ష్యం అయినప్పటికీ, నాసాలో శిక్షణ వారిని నిరాశపరిచింది.
అయితే, వారిని స్వయంగా పరికరాలను నిర్వహించడానికి అనుమతించారు. అది ఈ యువ శాస్త్రవేత్తలకు కొంతవరకు అనుకూలమైనది.

ఫొటో సోర్స్, ISRO
విజయానికి మొదటి అడుగు
1963లో NASA భారతదేశానికి Nike-Apashe రాకెట్‌ను ఇవ్వడానికి ముందుకొచ్చింది. తొలి రాకెట్‌ను నవంబర్ 1963 నవంబర్ 21న తుంబా నుంచి ప్రయోగించారు. అంతరిక్షంలో భారత్ సాధించిన విజయానికి ఇదే మొదటి అడుగు.
1964లో ఒక అద్భుతం జరిగింది. అమెరికా ప్రయోగించిన ఉపగ్రహం ద్వారా అమెరికా అంతటా టోక్యో ఒలింపిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేశారు.
అంతరిక్ష పరిశోధనలో పెట్టుబడి పెట్టడం వల్ల మానవాళి సమస్యలను నిజంగా పరిష్కరించవచ్చని ఆ క్షణంలోనే గ్రహించారు.
ఆ తర్వాత రష్యా నుంచి ఎం-100 రాకెట్లు, ఫ్రాన్స్ నుంచి సెంటార్ రాకెట్లను దిగుమతి చేసుకుని ప్రయోగించింది భారత్ .
1965లో తుంబాలో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ (SSTC)ని ఏర్పాటు చేశారు. రాకెట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ గ్రూప్ ఏర్పడింది.
ఈ విభాగాలు రాకెట్ ప్రయోగం, ఉపగ్రహలకు ప్రతి దశలోనూ అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశాయి.

ఫొటో సోర్స్, ISRO
ఇంకోస్పర్ నుంచి ఇస్రో వరకూ
1968లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ తుంబా అంతరిక్ష కేంద్రాన్ని ఐక్యరాజ్యసమితికి అంకితం చేశారు. 1969లో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ - ఇస్రో ఏర్పడింది. దీనిని డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కిందకు తీసుకువచ్చారు.
ఆ తర్వాత 1972లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన ఇస్రోను డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రధానమంత్రికి మాత్రమే జవాబుదారీ అయిన స్పేస్ కమిషన్ కూడా రూపొందించబడింది.
జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశ అంతరిక్ష పరిశోధనా యాత్ర ప్రారంభమైనప్పటికీ, దానికి బలమైన పునాదులు వేసింది మాత్రం ఇందిరా గాంధీనే.
1966 నుంచి 77 వరకు, తర్వాత 1980 నుంచి 84 వరకు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ అంతరిక్ష పరిశోధనలపై ఎంతో ఆసక్తి కనబరిచారు.
జూలై 1970లో, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అప్పటికి రాబోయే పదేళ్లపాటు అంతరిక్షం, అణుశక్తిలో ఏమేం చేయాలనే దానిపై ప్రభుత్వానికి ఒక కార్యాచరణ ప్రణాళిక నివేదికను సమర్పించారు.
దీని ప్రకారం, 1970లలో ఇస్రో ప్రధాన లక్ష్యం ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఒక రాకెట్‌ను అభివృద్ధి చేయడం. అలాగే, వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించగలిగే ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ (INSAT)ని రూపొందించడానికి ఒక ప్రణాళిక రూపొందించారు.

ఫొటో సోర్స్, ISRO
ముందు నిలిచిన సతీష్ ధావన్
1971 డిసెంబర్‌లో విక్రమ్ సారాభాయ్ మరణానంతరం ఎలక్ట్రానిక్స్ కమిషన్‌లో ఉన్న ఎం.జి.కె.మీనన్‌ను ఇస్రో చైర్మన్‌గా నియమించారు. అయితే, ఆ సమయంలో ఐఐఎస్సీకి డైరెక్టర్‌గా ఉన్న సతీష్ ధావన్ దానికి సరిపోతారని మీనన్ భావించారు. అమెరికాలో చదువుకోడానికి వెళ్లిన సతీష్ ధావన్ తిరిగి దేశానికి రాగానే, ఆయనకు ఇస్రో బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.
ఆయన రెండు షరతులు విధించాడు. ఒకటి ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని బెంగళూరుకు మార్చడం. రెండవది, IISC డైరెక్టర్‌గా కొనసాగడానికి కూడా ఆయన్ను అనుమతించాలి.
ఈ రెండు షరతులను ప్రభుత్వం ఆమోదించింది. సతీష్ ధావన్ నాయకత్వంలోని సాగిన పరిశోధనలు భారత అంతరిక్ష చరిత్రలో అత్యంత ముఖ్యమైనది.
అదే సమయంలో, భారత్ మొదటిసారి తన సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆర్యభట్ట అని పేరు పెట్టిన ఈ ఉపగ్రహాన్ని 1975 ఏప్రిల్ 19న సోవియట్ యూనియన్ నుంచి కాస్మోస్ 3M రాకెట్ ద్వారా ప్రయోగించారు.
ఇది భారత అంతరిక్ష యాత్రలో మరో మైలురాయిగా నిలిచింది. భారత్, రష్యాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
ఈలోపు ఇస్రో తమ సొంత రాకెట్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు కొనసాగాయి. 1979 ఆగస్టులో స్వయం నిర్మిత రాకెట్‌ను ప్రయోగించాలనే ప్రయత్నం విఫలమైంది.
కానీ, 1980 జూలై 18న SLV-3ని విజయవంతంగా ప్రయోగించింది.. దీని ద్వారా రోహిణి-1 అనే 35 కిలోల ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయంతో భారత్ తన సొంత రాకెట్, ఉపగ్రహాలను అభివృద్ధి చేసి, వాటిని పర్యవేక్షించగలిగే వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న ఆరో దేశంగా అవతరించింది.
అప్పట్లో అమెరికా, రష్యా, చైనా, యూరప్‌లోని కొన్ని దేశాలకు మాత్రమే ఆ టెక్నాలజీ ఉండేది.
భారత్ తర్వాత టెలీకమ్యూనికేషన్ ఉపగ్రహాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. 1981, జూన్ 19న ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్ పెరిమెంట్ (APPLE) అనే ప్రయోగాత్మక టెలీకమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు.
ఈ సమయంలో ఇస్రో నిర్వహణ నిర్మాణం కూడా మారిపోయింది. కేంద్రీకృత విధానానికి బదులుగా, ఎన్నో శాఖలను రూపొందించారు. రాకెట్ల నిర్మాణానికి, ప్రయోగించడానికి, ఉపగ్రహాల నిర్మాణానికి డైరెక్టర్లను నియమించారు. ఇది ప్రతి విభాగం వేరువేరుగా త్వరగా పనిచేసే వీలు కల్పించింది.
సతీష్ ధావన్ ఇస్రో ఛైర్మన్‌గా ఉన్న సమయంలో 1972-84 మధ్యకాలంలో సంస్థ చాలా అభివృద్ధి సాధించింది. అదే సమయంలో భారత్ అంతరిక్ష పరిశోధనలో ముఖ్యమైన దేశంగా మారింది. సతీష్ ధావన్ ఇస్రోలో ఎక్కువ కాలం పనిచేసిన చీఫ్‌గా రికార్డులకక్కారు.
1983 నాటికి రాకెట్ల ద్వారా 40 కిలోల బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించగలమని భారత్ నిరూపించింది. అయితే అది సరిపోదని త్వరలోనే అర్థమైంది. దాంతో 150 కిలోల ఉపగ్రహాలను మోసుకెళ్లే లాంచింగ్ వెహికల్స్ తయారు చేయాలని ఇస్రో నిర్ణయించింది.
అభివృద్ధి చేసిన ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ASLV ద్వారా 150 కిలోల బరువున్న ఉపగ్రహాలను, 400 కి.మీ. ఎత్తులో కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, 1987, 1988లో ఈ ప్రయోగాలు విఫలమయ్యాయి.

ఫొటో సోర్స్, ISRO
PSLV- ఇస్రోను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన వెహికల్
తర్వాత, 1992 మే 20న , మూడవ ప్రయోగంగా ఇస్రో ASLV-T3 ద్వారా SROSS అనే 105 కిలోల ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అయితే, తర్వాత స్థాయికి చేరుకోవడానికి ఇది సరిపోలేదు. మరింత బరువైన ఉపగ్రహాలను వివిధ కక్ష్యల్లో ప్రవేశపెట్టేందుకు ఇంకా అధునాతన రాకెట్లు అవసరమయ్యాయి. దీంతో భారత్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV అభివృద్ధి ప్రయత్నాలను ప్రారంభించింది.
భారతదేశం అంతరిక్ష ప్రయాణాన్ని ఎంతో ఎత్తులకు తీసుకెళ్లిన ఘనత పీఎస్ఎల్వీకే దక్కుతుంది. 1993 సెప్టెంబర్ 20న ప్రయోగించిన మొదటి పీఎస్‌ఎల్‌వీ విఫలమైనప్పటికీ, 1994 అక్టోబర్‌లో ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ విజయవంతమైంది. PSLV తర్వాత 25 ఏళ్ల పాటు ఇస్రోకు అత్యంత విశ్వసనీయమైన లాంచింగ్ వెహికల్‌గా మారింది. దాదాపు 95 శాతం పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు తమ మిషన్లను విజయవంతంగా పూర్తి చేశాయి.
ఇక్కడ పిఎస్‌ఎల్‌వి సాధించిన మూడు విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఒకటి 2008లో చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్-1. రెండోది 2013లో ప్రారంభించిన మార్స్ ఆర్బిటర్ స్పేస్‌క్రాఫ్ట్. మూడోది 2017 ఫిబ్రవరిలో 104 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించడం.
ఈలోపు ఇస్రో క్రయోజెనిక్ ఇంజన్లను అభివృద్ధి చేసే ప్రయత్నాలను కూడా మొదలుపెట్టింది. క్రయోజెనిక్ ఇంజన్లు చాలా క్లిష్టమైనవి. వీటిలో హైడ్రోజన్, ఆక్సిజన్లను ఇంధనంగా ఉపయోగిస్తారు. అత్యంత శీతల పరిస్థితులలో ఇవి ద్రవంగా మారుతాయి కాబట్టి, ఫ్యూయెల్ ట్యాంక్‌ను అలాంటి శీతల ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగిన పదార్థంతో తయారు చేయాలి. అదే సమయంలో, ఇంజిన్ ఉష్ణోగ్రత 2,000 డిగ్రీలు దాటుతుంది.
ఆ సమయంలో అభివృద్ధి చెందిన దేశాలేవీ ఈ సాంకేతికతను అందించకపోయినా, సోవియట్ యూనియన్ ఇస్రోకు సాయం చేయడానికి ముందుకు వచ్చింది. పెద్ద మొత్తానికి కుదిరిన ఈ ఒప్పందంలో సోవియట్ మూడు క్రయోజెనిక్ ఇంజన్లు, సాంకేతికతను భారత్‌కు అందిస్తుందని పేర్కొంది.
కానీ, ఆ తర్వాత కొన్నేళ్లకే సోవియట్ యూనియన్ కుప్పకూలడంతో రష్యా ఆ సాంకేతికతను అందించడానికి ఇష్టపడలేదు. తర్వాత భారత్ ఇచ్చిన డబ్బుకు 6 క్రయోజెనిక్ ఇంజన్లు మాత్రమే అందించగలమని చెప్పింది. అయితే, సాంకేతికతను అందించడానికి నిరాకరించింది.
ఆ తర్వాత భారతే సొంతంగా క్రయోజెనిక్ ఇంజన్లను తయారు చేయాలని నిర్ణయించుకుంది. 2010 ఏప్రిల్ 15న ప్రారంభించిన మొదటి క్రయోజెనిక్ ఇంజిన్ విఫలమైంది.
అనంతరం 2014, 2015 నుంచి వరుసగా GSLV రాకెట్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. భారతదేశం ప్రస్తుతం 4 టన్నుల బరువును అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు.

ఫొటో సోర్స్, ISRO
చంద్రునిపై భారత్ ముద్ర
1990 నాటికి, భారతదేశం చంద్రుడుపైకి ఉపగ్రహాలు పంపించడం గురించి చెబుతూ వచ్చింది. తర్వాత ఇస్రో దీనికి సంబంధించిన వివరణాత్మక ప్రణాళికను కేంద్ర ప్రభుత్వానికి కూడా సమర్పించింది. కేంద్రం అనుమతితో చంద్రయాన్-1 ప్రాజెక్టు పుట్టింది. మయిల్‌స్వామి అన్నాదురై ఈ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
చంద్రయాన్-1 2008, అక్టోబర్ 28న ప్రయోగించారు. అది చంద్రుడి చుట్టూ తిరుగుతూ అక్కడి నుంచి సమాచారాన్ని ప్రసారం చేయడం ప్రారంభించింది. కానీ, చంద్రయాన్ 1 రెండేళ్లు పనిచేసేలా ఇస్రో రూపొందించింది. అయితే, 2009 ఆగస్టు 29న అంటే 312 రోజుల తర్వాత చంద్రయాన్ 1 ఆర్బిటర్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి.
కాకపోతే, చంద్రయాన్ వన్ ఒక కీలకమైన ఆవిష్కరణకు కేంద్రంగా నిలిచింది. చంద్రునిపై నీటి జాడల్ని చంద్రయాన్ 1లో ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ గుర్తించింది. ఈ విజయం అంతరిక్ష శక్తులలో భారత్ ప్రొఫైల్‌ను బాగా పెంచింది.

ఫొటో సోర్స్, ISRO
అంగారకుడికి భారత్ ప్రయాణం
2007లో ఇస్రో చీఫ్ మాధవన్ నాయర్ అంగారకుడిపైకి ప్రోబ్‌ను పంపాలని ప్రతిపాదించారు. ఈ పథకాన్ని 2012 స్వాతంత్ర్య దినోత్సవం రోజున అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటించారు. అంగారక గ్రహానికి సంబంధించి అమెరికా, ఐరోపా దేశాలు చేసిన ప్రయత్నాలతో పోలిస్తే, ఇదొక సాంకేతిక ప్రయోగం.
మార్స్ ఆర్బిటర్ మిషన్ - MOMను 2013 నవంబర్ 5న ప్రారంభించారు. MOM 2013 నవంబర్ 30న భూమి గురుత్వాకర్షణ పరిధి దాటి వెళ్లి, 2014 సెప్టెంబర్ 24న అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. అంటే, భూమిని విడిచిపెట్టిన 298 రోజుల తర్వాత మార్స్ కక్ష్యలోకి ప్రవేశించింది. తొలి ప్రయత్నంతోనే అంగారకుడిపై ప్రయోగాల్లో విజయవంతమైన దేశంగా భారత్ అవతరించింది.

ఫొటో సోర్స్, ISRO
చంద్రయాన్ 2, 3: ఓటమిల తర్వాత విజయం
చంద్రయాన్-1 తర్వాత చంద్రయాన్-2 ప్లాన్ చేశారు. కానీ, ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి సమస్యలతో సతమతమయ్యింది. రష్యన్ ఫెడరేషన్ సహకారంతో 2014లో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించారు.
చంద్రయాన్ 2లో భాగంగా చంద్రుని కక్ష్యలో ఉండే ఉపగ్రహంతోపాటు చంద్రుని ఉపరితలంపై ల్యాండర్, రోవర్‌ను ప్రయోగించాలని ప్రాజెక్ట్ ప్లాన్ చేసింది. అయితే, రష్యా నిర్ణీత సమయంలోపు పరికరాలను డెలివరీ చేయకపోవడంతో, ఇస్రో వాటిని తామే సొంతంగా సిద్ధం చేయాలని నిర్ణయించింది.
మరోవైపు ఇస్రో 2019లో చంద్రయాన్-2ను ప్రయోగించడానికి సిద్ధమైంది. ఈ రాకెట్ 2019 జూలై 15న చంద్రయాన్‌ను మోసుకెళ్లడానికి సిద్ధమైంది. కానీ, చివరి క్షణంలో రాకెట్‌లో చిన్నపాటి లోపం తలెత్తడంతో ఆ ప్రయోగాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత జూలై 22న చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించారు. 'ప్రజ్ఞాన్' రోవర్‌తో కూడిన 'విక్రమ్ ల్యాండర్' సెప్టెంబర్ 6న చంద్రుడిపై దిగడానికి సిద్ధమైంది.
అయితే, ల్యాండింగ్‌కు 2.1 కి.మీ దూరంలో ఉండగానే విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండయ్యింది. కానీ ఈ ప్రాజెక్టులో పంపిన ఆర్బిటర్ మాత్రం ఇంకా పనిచేస్తూనే ఉంది. అందుకే చంద్రయాన్ త్రీలో ఆర్బిటర్ పంపించలేదు. ఇప్పుడు చంద్రయాన్ త్రీ ల్యాండర్ కూడా చంద్రయాన్ 2 ఆర్బిటర్‌తోనే కమ్యూనికేట్ చేస్తోంది.
2023 జులై 14న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ త్రీ... ఆగస్ట్ 23న విజయవంతంగా చంద్రుడిపై ల్యాండయ్యింది. ఈ విజయంతో చంద్రుడి దక్షిణ ధ్రువంలో ల్యాండైన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై దిగిన ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌లు ఇస్రోకి ఎంతో విలువైన సమాచారం అందించాయి.
చంద్రుడిపై ప్రయోగాలు సక్సెసవ్వడంతో ఇస్రో సెప్టెంబర్ 2న ఆదిత్య L1 ప్రయోగంతో సూర్యుడిపై పరిశోధనలకు సిద్ధమైంది. గగనయాన్ ప్రాజెక్ట్ ద్వారా మానవ సహిత అంతరిక్ష యాత్రకు కోసం చురుగ్గా పనిచేస్తోంది.
మరోవైపు భారత్ కూడా చిన్నపాటి లాంచింగ్ వెహికల్స్ కూడా అభివృద్ధి చేస్తోంది. వీటిని ప్రయోగించేందుకు తమిళనాడులోని కులశేఖరపట్టణంలో ఒక లాంచ్ ప్యాడ్ నిర్మిస్తున్నారు. ఈ మధ్య కాలంలో, పరిశోధన, నిఘా, టెలీకమ్యూనికేషన్‌తో సహా వివిధ ప్రయోజనాల కోసం ఇస్రో వందలాది ఉపగ్రహాలను ప్రయోగించింది.
ఇస్రో ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన అంతరిక్ష సంస్థల్లో ఒకటి. 1980లలో దశకంలో, అంతరిక్ష పరిశోధన కోసం మరింత భారీ స్థాయిలో వాణిజ్య అవకాశాలు గుర్తించారు.
తర్వాత 1992లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు వ్యాపార సంస్థల కోసం యాంట్రిక్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా, ఇస్రో ఇప్పటి వరకు 33 కంటే ఎక్కువ దేశాలకు సంబంధించిన 350 ఉపగ్రహాలను ప్రయోగించింది.
1960లలో చాలా చిన్న స్థాయిలో ప్రారంభమైన భారతదేశ అంతరిక్ష ప్రయత్నాలు ఇప్పుడు చంద్రయాన్-3 విజయంతో పతాక స్థాయికి చేరుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
- అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం నాసా ఆడిన నాటకమా? కుట్ర సిద్ధాంతకర్తల వాదనలు ఏమిటి? వాటికి నాసా జవాబులు ఏమిటి?
- చంద్రుడిపై సల్ఫర్, ఆక్సిజన్ కనుగొన్న ప్రజ్ఞాన్ రోవర్.. ఇస్రో ప్రకటన
- చంద్రయాన్ -3: ఇస్రోకు ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటి వరకు ఏం సమాచారం ఇచ్చింది?
- వీర్యం ఉత్పత్తికి కారణమయ్యే ‘వై క్రోమోజోమ్’ రహస్యాలను ఛేదించారు.. పురుషుడు నిర్వీర్యం అవుతాడా?
- టెరీ గౌ: ఈ ‘ఐఫోన్’ బిలియనీర్ తైవాన్ అధ్యక్షుడు కాగలరా? చైనాను ఎదుర్కోగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














