ఎన్టీఆర్ స్మారక నాణెం: పురందేశ్వరి సొంత డబ్బుతో తయారు చేయించారా, ఇలా ఎవరైనా నాణేల ముద్రణకు ఆర్డర్ ఇవ్వొచ్చా?

ఎన్టీఆర్ నాణెం

ఫొటో సోర్స్, SPMC

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు స్మారక నాణెం విడుదల తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే దారి తీసింది.

ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదంటూ లక్ష్మీ పార్వతి చేసిన ఆరోపణలు ఒకవైపు, అసలు ఆ నాణెం పురందేశ్వరి తన సొంత ఖర్చుతో చేశారు తప్ప అది చెల్లుబాటు అయ్యే నాణెం కాదంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు మరోవైపు.

ఈ వివాదాల మధ్యే నాణెం విడుదలైంది.

అయితే హైదరాబాద్ మింట్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రెండు రోజుల్లోనే అమ్ముడుపోయి ఔట్ ఆఫ్ స్టాక్ దశకు చేరుకుని రికార్డు సృష్టించింది ఎన్టీఆర్ బొమ్మ గల ఈ వంద రూపాయల నాణెం.

ఇంతకీ ఈ నాణెం అధికారికమా? అనధికారికమా?

స్మారక నాణేలు

ఫొటో సోర్స్, SPMC

అసలేంటీ స్మారక నాణెం?

ఏదైనా రంగంలో ప్రముఖులు, లేదా ఏదైనా సంస్థలు, ఘటనలు, కట్టడాలు, వాటి అర్థ శతాబ్ది, వజ్రోత్సవాలు, శతాబ్ది ఉత్సవాలు.. ఇలాంటి వాటికి గుర్తుగా నాణేలు విడుదల చేసే సంప్రదాయం భారతదేశంలో 60 ఏళ్లుగా ఉంది. వీటినే కమెమోరేటివ్ కాయిన్స్ అంటారు.

అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చనిపోయినప్పుడు 1964లో మొదటిసారి ఆయనపై ఇటువంటి స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఆ తరువాత 1969లో గాంధీ శత జయంతికి స్మారక నోటును విడుదల చేశారు.

నోటు విడుదల చేయడం అదే మొదటిసారి, చివరిసారి కూడా. ఇక అప్పటి నుంచి నాణేల విడుదల జరుగుతోంది.

2023 సంవత్సరంలోనే ఎన్టీఆర్ తో పాటూ మరో 11 విభిన్న నాణేలు విడుదల చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆర్బీఐ ఇప్పటివరకూ ఇటువంటి నాణేలు 350కి పైగా విడుదల చేసింది.

ఇప్పటి వరకూ మహారాణా ప్రతాప్, విజయరాజే సింధియా, అటల్ బిహారీ వాజపేయి, సర్వేపల్లి రాధాకృష్ణ, బీఆర్ అంబేడ్కర్, సుభాష్ చంద్రబోస్, ఎంజీఆర్, ఎంఎస్ సుబ్బులక్ష్మి, మదర్ థెరిసా, గురు గోవింద్ సింగ్ వంటి వారిపై ఈ నాణేలు విడుదల చేశారు.

అలాగే తంజావూరు బృహదీశ్వరాలయం, భారత పార్లమెంట్లపై కూడా నాణేలు విడుదల చేశారు. బృహదీశ్వరాలయానికి వెయ్యేళ్లు నిండినిప్పుడు వెయ్యి రూపాయల నాణెం విడుదల చేశారు.

భారతదేశం కంటే అమెరికా, యూకె, ఐరోపా దేశాల్లో ఈ నాణేలపై ఆసక్తి ఎక్కువ. ఈ నాణేలను చాలా తక్కువ సంఖ్యలో ముద్రిస్తారు. నాణేలు సేకరించే హాబీ ఉన్నవారు ఇలాంటి వాటికి డబ్బు ఖర్చు పెట్టి మరీ సేకరించి పెట్టుకుంటారు.

ఆ నాణెంపై పెట్టే డబ్బు విలువ అంటే 75, 100, 125 ఇలాంటి అంకెలతో సంబంధం లేకుండా నాణెం ధర 5 వేల రూపాయల వరకూ అమ్ముతారు.

గెజిట్

వీటిని ఎవరు ముద్రిస్తారు?

భారతదేశంలో మూడు సింహాల గుర్తు ఉన్న నాణేలు ముద్రించే హక్కు కేవలం సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థకు మాత్రమే ఉంటుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర ఆర్థిక శాఖ కింద పనిచేస్తుంది.

హైదరాబాద్‌లో సచివాలయం దగ్గర ఉన్న మింట్ కాంపౌండ్‌గా పిలుచుకునే సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఇలాంటివి కోల్‌కతా, ముంబైలలో కూడా ఉన్నాయి. ఈ సంస్థకు తప్ప మరెవరికీ ఇటువంటి నాణేలు ప్రింట్ చేసే అధికారం, హక్కు గానీ లేవు.

రోజూ వారీ డబ్బుగా వాడే నాణేలు కాకుండా మరో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సావనీర్ నాణెం, రెండు స్మారక నాణెం. సావనీర్ నాణెంపై మూడు సింహాల గుర్తు ఉండదు.

స్మారక నాణెంపై మూడు సింహాల గుర్తు ఉంటుంది. అదే అతి ముఖ్యమైన తేడా. మామూలుగా మనం రోజూవారీ డబ్బుగా వాడే నాణేలు మూడో రకం. వీటన్నింటినీ కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ, సెక్యూరిటీ ప్రెస్‌లే తయారు చేస్తాయి.

సాధారణ నాణెం: మనం రోజూవారీ డబ్బుగా వాడే చెలామణీలోని నాణేలు ఇవి. సాధారణంగా వీటిలో ఒకవైపు మూడు సింహాల గుర్తు, మరోవైపు కరెన్సీ విలువ అంటే, రూపాయి, 2 రూపాయలు అని ఉంటుంది.

అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ చెలామణీలో ఉండే నాణేల వెనుక వైపు మూడు సింహాల ముద్ర బదులు పలు చిహ్నాలు, వ్యక్తుల ఫొటోలు, నినాదాలు వేస్తారు.

సావనీర్ నాణెం: నిర్ణీత ధర చెల్లించి ఎవరైనా తమ సంస్థ, తమకు నచ్చిన వ్యక్తి బొమ్మ లేదా మరేదైనా ముఖ్యమైన సందర్భం వంటి వాటిపై నాణేలు ముద్రణ చేయించుకోవచ్చు.

చాలా విద్యాసంస్థలు తమ సంస్థ లోగోతో కూడా నాణేలు ముద్రించుకుంటాయి. వీటిని మింట్ కార్పొరేషన్ తమ సైట్లో పెట్టి అమ్ముతుంది. అలాగే యూనివర్సిటీలు ఇచ్చే మెడల్స్ కూడా ఈ కోవలోనివే. డబ్బు చెల్లిస్తే ఎవరికైనా నాణేలు చేసి ఇస్తారు. కాకపోతే ఖరీదు ఎక్కువ ఉంటుంది.

స్మారక నాణెం: ఇవి సాధారణ నాణేల్లాగా చెలామణీలో ఉండవు. అలాగని సావనీర్ నాణేల్లాగా ప్రైవేటుగా డబ్బు కట్టినంత మాత్రాన ముద్రించరు.

వీటిని భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ప్రతిపాదన మీద, ఆర్థిక శాఖ అనుమతితో మాత్రమే ముద్రిస్తారు. వీటిపై భారత ప్రభుత్వ రాజముద్ర అయిన మూడు సింహాల గుర్తు ఉంటుంది.

వీటిని సెక్యూరిటీ ప్రెస్ మాత్రమే ముద్రించాలి. దీనికోసం ఎవరూ డబ్బు కట్టక్కర్లేదు. అలాగే ఎవరికీ ఉచితంగా కూడా ఇవ్వరు.

నాణేల ముద్రణ అందరికీ కుదరదు. దానికోసం కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రతిపాదించాలి. ఆర్థిక శాఖ గెజిట్ జారీచేయాలి. అప్పుడే నాణేల ప్రక్రియ మొదలవుతుంది. వీటిని నాన్ సర్క్యులేటింగ్ లీగల్ టెండర్ అంటారు.

చట్టప్రకారం అది లీగల్ టెండరే, కానీ లావాదేవీల కోసం సర్క్యులేషన్‌లో పెట్టరు. ప్రస్తుత ఎన్టీఆర్ కాయిన్ ఈ స్మారక నాణెం కేటిగిరికి చెందుతుంది.

పురందేశ్వరి

ఫొటో సోర్స్, FACEBOOK/DAGGUBATI PURANDESWARI

ఎన్టీఆర్ నాణెం కోసం పురందేశ్వరి డబ్బు కట్టారా?

ఎన్టీఆర్ నాణేల కోసం ఎవరూ ప్రభుత్వానికి, సెక్యూరిటీ ప్రెస్‌కీ డబ్బు కట్టలేదు.

అయితే పురందేశ్వరి తన పలుకుబడి ఉపయోగించి భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఆర్థిక శాఖల నుంచి ఎన్టీఆర్ పేరిట నాణేలు త్వరగా తయారు చేసేలా ప్రయత్నం చేసినట్టు కొందరు అధికారులు బీబీసీకి చెప్పారు.

ఎన్టీఆర్ నాణెం నిమిత్తం భారత ప్రభుత్వం ఆర్థిక శాఖలోని ఎకనామిక్ ఎఫైర్స్ విభాగం 2023 మార్చి 20వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించింది.

‘‘నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల సందర్భంగా వంద రూపాయల నాణెం విడుదల చేస్తున్నట్టు’’ ఆ గెజిట్ తెలిపింది.

ప్రైవేటు వ్యక్తులు ఇలా స్మారక నాణేల కోసం ప్రయత్నం చేయడం కొత్తేమీ కాదు.

గతంలో ఎంజీఆర్ పేరిట నాణెం కోసం స్వయంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయగా, ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరిట నాణెం కోసం శ్రీ షణ్ముఖానంద ఫైన్ ఆర్ట్స్ అండ్ సంగీత సభ వాళ్లు ప్రయత్నం చేశారు.

ఇప్పుడు ఎన్టీఆర్ నాణెం కోసం ఆయన కుమార్తె పురందేశ్వరి ప్రయత్నం చేశారు.

పీవీ నరసింహారావు పేరిట కూడా ఇలాంటి స్మారక నాణెం ముద్రించాలన్న అంశం కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం.

‘‘నాణెంపై మూడు సింహాల రాజముద్ర ఉండాలి, అంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉండాలి. అది లేకుండా అయితే, ఎవరు డబ్బు కడితే వారికి నచ్చినట్టు నాణెం ముద్రించి ఇస్తాం.’’ అని సెక్యూరిటీ ప్రెస్‌కి చెందిన ఒక అధికారి బీబీసీతో అన్నారు.

నాణెం

ఫొటో సోర్స్, SPMC

నాణేల అమ్మకంలో ఎన్టీఆర్ రికార్డు

‘‘ఎన్టీఆర్ స్మారక నాణేలను తొలి విడతగా 15 వేల వరకు తయారు చేశాం. ఊహించని స్పందన వచ్చింది. మూడు కౌంటర్లలో పెట్టినవన్నీ అయిపోయాయి. దీంతో మళ్లీ కొత్త నాణేలు ముద్రిస్తున్నాం. ఇప్పటి వరకూ ముద్రించిన నాణేలతో పోలిస్తే, అమ్మకాలు ప్రారంభించిన వెంటనే అత్యధికంగా అమ్ముడుపోయిన నాణెంగా ఇది చరిత్ర సృష్టించబోతోంది. అంతేకాదు, అత్యధిక డిమాండ్ ఉన్న నాణెంగా కూడా రికార్డు సృష్టించబోతోంది’’ అని హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజేర్, ఐఒఎఫ్ఎస్ అధికారి వీఎన్ఆర్ నాయుడు బీబీసీతో చెప్పారు.

ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో మింట్ దగ్గర బారులు తీరి మరీ నాణేన్ని కొనుక్కున్నారు. ఆన్‌లైన్‌లో కూడా అమ్మకానికి పెట్టారు.

సీజీఎం నాయుడు

ఫొటో సోర్స్, SPMC

ఫొటో క్యాప్షన్, సీజీఎం నాయుడు

నాణెం తయారీ ఎలా?

‘‘ఒక నాణెం తయారీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత, ప్రతిపాదనలు పంపమని మమ్మల్ని అడుగుతారు. ముందుగా నాణేలను పేపర్‌పై డిజైన్ చేస్తాం. వాటిలో మంచిదాన్ని సీజీఎం హోదాలో నేను ఎంపిక చేస్తాను. తరువాత దానికి సంబంధించిన వారి సలహాలు, సూచనలు తీసుకుని, భాషలో ఏ తప్పూ లేకుండా, అక్షర దోషాలు లేకుండా అన్నీ సరిచూసుకుని ఆ తర్వాత క్లే, దాన్నుంచి పీవోపీ పోతలు తీస్తాం. పాజిటివ్, నెగిటివ్ ఇలా రెండుమూడుసార్లు తీసి చిన్న చిన్న తప్పులు ఉంటే సరిచేస్తాం. చివరగా లోహంతో మాస్టర్ డై తయారు చేస్తాం. అలాగే వాటిని అందంగా అమర్చడానికి ప్యాకింగ్ బాక్సులు, కవర్లు కూడా మేమే డిజైన్ చేసి తెప్పిస్తాం’’ అంటూ నాణేల తయారీకి ముందు జరిగే ప్రక్రియ వివరించారు సీజీఎం నాయుడు.

ఈ నాణేలను నాలుగు లోహాలతో తయారు చేస్తారు. వాటిలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ ఉంటుంది. తాజా ఎన్టీఆర్ నాణెం చుట్టూ 200 గీతలు ఉంటాయి. 44 మిల్లీమీటర్ల వ్యాసంతో, 35 గ్రాముల బరువుతో ఈ నాణెం ఉంటుంది.

‘‘వీటిని ఆ సొంత కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు సహా ఎవరికీ ఉచితంగా ఇవ్వం. ఒకవేళ నాణేల ముద్రణపై ఆసక్తి చూపించిన వారు, ఆ నాణేల విడుదల కార్యక్రమం ప్రభుత్వ పెద్దల దగ్గర చేయాలనుకుంటే చేయవచ్చు. ఉదాహరణకు రాష్ట్రపతి, ప్రధానుల వద్ద అయితే, వారి కార్యక్రమ సమయానికి మేమే ఆ నాణేలను అందజేస్తాం. వాటికి కూడా వాళ్లు డబ్బు కట్టాల్సిందే. ఒక్క నాణెం కూడా ఉచితంగా ఇవ్వం. అలాగే ఈ నాణేల ముద్రణ కోసం ఎవరి దగ్గరి నుంచీ ఒక్క రూపాయి తీసుకోం’’ అన్నారు వీఎన్ఆర్ నాయుడు.

స్మారక నాణెం

ఫొటో సోర్స్, SPMC

ఈ నాణేలు చెల్లుబాటు అవుతాయా?

సాధారణంగా మన దగ్గర ఉండే చిల్లర డబ్బుగా పిలిచే నాణేలు తప్ప, స్మారక నాణేలు చెల్లుబాటు కావు. నిజానికి ఈ నాణేలపై వంద, నూట యాభై రూపాయలు అంటూ ముద్రించినప్పటికీ, వాటిని సుమారు 5 వేల రూపాయలకు అమ్ముతారు.

ఇవి అలంకరణ, జ్ఞాపకం సేకరణ హాబీ కోసం, అభిమానంతో సేకరించి పెట్టుకోవడం తప్ప నేరుగా చెల్లుబాటు చేయడానికి కాదు. ఆర్బీఐ నిబంధనలూ అవే చెబుతున్నాయి.

అందుకే వీటిని నాన్ సర్క్యులేటింగ్ అంటే చెలామణీలో ఉండని లీగల్ టెండర్ అంటారు. లీగల్ టెండర్ అంటే అధికారిక కరెన్సీ అని అర్థం చెప్పుకోవచ్చు. కానీ వీటిని మాత్రం చెలామణీలో ఉండని అధికారిక డబ్బుగా చెప్పుకోవచ్చు అన్నమాట.

వంద రూపాయల నాణేన్ని రూ. 4,800 పైగా ధర చెల్లించి ఎవరు కొంటారు? అనుకోవద్దు. మింట్ సంస్థ ఇలా పదుల సంఖ్యలో నాణేలు ముద్రిస్తుంది. మిగతా వస్తువుల్లా కాకుండా వాటి ధర ఏటేటా పెరిగిపోతోంది.

‘‘ప్రభుత్వ సెక్యూరిటీ ప్రెస్ వారు సిద్ధం చేసే నాణేలన్నింటిపైనా ఏటా 10 శాతం ధర పెంచుతూ పోతాం. అవి అప్పటికప్పుడు అమ్ముడుకాకపోయినా మాకు నష్టం లేదు. ఎందుకంటే ప్రతి ఏటా వాటి ధర పెరుగుతుంది కానీ తగ్గదు’’ అన్నారు వీఎన్ఆర్ నాయుడు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)