పిల్లలకు రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఎలా వస్తుంది? లక్షణాలు ఏమిటి? చికిత్స ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలో నాలుగు కోట్ల మంది రుమాటిక్ హార్ట్ డిసీజ్(ఆర్‌హెచ్‌డీ) బారిన పడుతున్నారు, ప్రతి ఏటా మూడు లక్షల మంది ఈ వ్యాధితో చనిపోతున్నారు.
వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రకారం, బాల్యంలో వచ్చే ఈ వ్యాధి వైకల్యానికి దారి తీస్తుంది, కొన్ని సార్లు ప్రాణాలు కూడా తీస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.
గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్-2019 నివేదిక ప్రకారం, 5 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో 1.5 లక్షల కంటే ఎక్కువ రుమాటిక్ హార్ట్ డిసీజ్ కేసులు నమోదయ్యాయి, ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లల సంఖ్య ఏడు లక్షల కంటే ఎక్కువ.
ఇటీవల, దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), రామ్ మనోహర్ లోహియా వైద్యులు ఈ వ్యాధిపై పరిశోధన చేశారు.
ప్రపంచంలోని కేసుల్లో 20 నుంచి 25 శాతం భారత్ నుంచే వస్తున్నట్లు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ దినేష్ యాదవ్ చెప్పారు.
ఈ వ్యాధికి చికిత్స కోసం ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తన వద్దకు వచ్చే 30 మంది పిల్లలను పరిశోధన కోసం తీసుకెళ్లినట్లు ఆయన బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిశోధన ఏం చెబుతోంది?
"ప్రపంచంలో 20-25 శాతం కేసులు భారతదేశం నుంచి ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలనుకున్నాం. మన జన్యువుల కారణంగా ఇలా జరుగుతోందా? మా పరిశోధనలో శాంపిల్ సైజ్ తక్కువైనప్పటికీ రుమాటిక్ ఫీవర్ కేసుల్లో ఇది అవసరం. మేం పరిశోధించిన పిల్లల్లో కొంత హ్యూమన్ ల్యుకోసైట్ యాంటిజన్ కామన్‌గా ఉంది. ఈ జన్యువు ఉన్న వారిలో రుమాటిక్ జ్వరం వచ్చే అవకాశం ఉంది’’ అని డాక్టర్ దినేష్ యాదవ్ వివరించారు.
వైద్యులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ వ్యాధి ఎక్కువగా 5-18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ముదిరితే గుండె వాల్వ్ దెబ్బతినడం ప్రారంభమవుతుంది.
స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ అని పిలిచే ప్రత్యేక రకం బ్యాక్టీరియా వల్ల పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీని వల్ల జ్వరం వస్తుందని, తర్వాత అది రుమాటిక్ జ్వరంగా మారుతుందని డాక్టర్ దినేష్ యాదవ్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
రుమాటిక్ జ్వరం, హార్ట్ డిసీజ్ లక్షణాలు ఏమిటి?
రుమాటిక్ జ్వరం లక్షణాలు:
- గొంతు మంట
- జ్వరం
- మోకాళ్లు, మోచేతులు, మణికట్టులో నొప్పి
- అలసట
- ఊపిరి పీల్చుకోవడంలో అలసట
రుమాటిక్ హార్ట్ డిసీజ్(ఆర్‌హెచ్‌డీ) లక్షణాలు:
- శ్వాస తీసుకోవడంలో ఎక్కువ వేగం
- దగ్గు
- ఛాతీ నొప్పి
- కీళ్ల నొప్పి
- అలసట
- పొట్ట, చేతులు, కాళ్లలో వాపు
వైద్యులకు సవాలు విసురుతున్న వ్యాధి
ఈ వ్యాధి సోకిన చిన్నారులు మొదట తమ అనారోగ్య సమస్యల గురించి ఏమీ చెప్పడం లేదని, కొన్ని రోజుల తర్వాత ఈ వ్యాధి గుండెపై ప్రభావం చూపిస్తోందని డాక్టర్ దినేష్ యాదవ్ తెలిపారు.
"ఈ వ్యాధిలో శ్వాస సరిగా తీసుకోలేనప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. వేగంగా శ్వాస తీసుకోవడం అంటే గుండె రక్తాన్ని పంప్ చేయలేకపోతోందని, గుండె దెబ్బతినడం మొదలైందని అర్థం. దాని ప్రభావం ఊపిరితిత్తులపై పడుతుంది. అందువల్ల ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీ నొప్పి వస్తుంది” అని ఆయన వివరించారు.
వైద్యులకు ఈ వ్యాధి పెద్ద సవాలు విసురుతోంది.
ఎందుకంటే, డాక్టర్లు తమ వద్దకు వచ్చిన పేషంట్లను రుమాటిక్ జ్వరం లక్షణాల గురించి అడిగినప్పుడు, వాళ్లు అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. అయితే అది రుమాటిక్ జ్వరంగా మారడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.
రుమాటిక్ జ్వరంగా మారిన తర్వాత గుండె వాల్వ్ చిక్కిపోయిందని లేదా లీక్ అవుతోందని తర్వాత తెలుస్తుంది. ఇది యువకుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. అందుకే దీన్ని పెద్ద సవాలుగా చూడాల్సి వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
గర్భధారణ సమయంలో రుమాటిక్ హార్ట్ డిసీజ్
‘‘ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు పరిశుభ్రత పాటించని ప్రాంతాలలో కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది’’ అని డాక్టర్ దినేష్ యాదవ్ చెబుతున్నారు.
భారతదేశంలో ఈ కేసులు తగ్గాయని చెబుతున్నప్పటికీ, పశ్చిమ దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న పేద దేశాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి ఆఫ్రికా దేశాలు, మిడిల్ ఈస్ట్, ఆగ్నేయాసియా, పశ్చిమ పసిఫిక్ దేశాలలో కనిపిస్తుంది.
వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రకారం, మగవారి కంటే ఆడపిల్లలు, మహిళల్లో రుమాటిక్ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువ.
గర్భధారణ సమయంలో వచ్చే గుండె సమస్యల్లో రుమాటిక్ గుండె జబ్బులు ప్రమాదకరంగా మారుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
చికిత్స ఏమిటి? నివారణ ఎలా?
ఈ వ్యాధి కారణంగా గర్భిణులకు గుండెపోటు, క్రమరహిత హృదయ స్పందన లేదా అరిథ్మియా ప్రమాదం పొంచి ఉంటాయి. ఈ వ్యాధిని తీవ్రంగా పరిగణించాలని, క్రమం తప్పకుండా మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ వ్యాధికి మొదట యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారని డాక్టర్ దినేష్ వివరించారు. అదే సమయంలో, పరిస్థితి తీవ్రంగా ఉంటే, పెన్సిలిన్ ఇంజెక్షన్ కూడా ఇస్తారు.
రుమాటిక్ హార్ట్ డిసీజ్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రభుత్వాలు ఔషధాల లభ్యతపై దృష్టి పెట్టడంతోపాటు ఈ వ్యాధి వ్యాప్తిని నివారించేలా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్, వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.
2018లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాలు రుమాటిక్ ఫీవర్, రుమాటిక్ హార్ట్ డిసీజ్‌పై జెనీవాలో ఒక అంతర్జాతీయ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి.
రుమాటిక్ జ్వరం, రుమాటిక్ గుండె జబ్బులను అంతర్జాతీయంగా ప్రాధాన్యమున్న ఆరోగ్య అంశాలుగా తొలిసారిగా గుర్తించారు.
ప్రాథమిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, వ్యాధి మూలాల్లోకి వెళ్లడం, ప్రజలకు మందులు, అవసరమైన టెక్నాలజీ అందుబాటులో ఉంచడం, ఇతర సిఫార్సులను ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసింది.
రుమాటిక్ హార్ట్ డిసీజ్‌కు సంబంధించి అనేక సవాళ్లు ఉన్నాయని, దీనితో పోరాడేందుకు ప్రభావిత దేశాలు చేయాల్సింది చాలా ఉందంటున్నారు నిపుణులు.
వైద్యుల పరిశోధన చిన్నదని, రీసర్చ్ పెద్దయెత్తున జరగాల్సి ఉందని, వ్యాధిపై బాగా పోరాడటానికి అది తోడ్పడుతుందంని వారు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
- స్వలింగ వివాహానికి నేపాల్ సుప్రీంకోర్టు ఓకే చెప్పినా... చట్టబద్ధంగా రిజిస్టర్ చేయడానికి ఒప్పుకోని జిల్లా కోర్టు
- చంద్రయాన్ 3: స్పేస్ క్రాఫ్ట్స్, శాటిలైట్లపై కనిపించే బంగారు రంగు కవరింగ్ ఏమిటి?
- మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్: ఫైనల్స్ గెలిచాక స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కర్మోనాకు ఆమె తండ్రి మరణించిన సంగతి చెప్పారు...
- దగ్గు మందు మరణాలు: ‘ఇండియా ఔషధం అంటే ముట్టుకోవాలన్నా భయమేస్తోంది’
- పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్కును ఎలా అంచనా వేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














