చంద్రయాన్-3: ల్యాండర్‌ను సురక్షితంగా దించేందుకు కీలకమైన చివరి 15 నిమిషాల్లో ఇస్రో ఏం చేసింది?

చంద్రయాన్ 3 విజయంపై సంబరాలు

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, రాజేశ్ పెదగాడి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ ఆగస్టు 23 సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో సురక్షితంగా దిగింది.

ల్యాండింగ్ ప్రక్రియ చివరి దశ చాలా ఉత్కంఠగా, ఉద్వేగ భరితంగా సాగింది. దేశవ్యాప్తంగా మీడియా సంస్థలూ దీన్ని లైవ్ ఇచ్చాయి. బ్రిక్స్ కూటమి సమావేశాల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

ఆ చివరి నిమిషాలను ‘’15 మినిట్స్ ఆఫ్ టెర్రర్’’గా ఇస్రో మాజీ చైర్మన్ కే శివన్ చెప్పారు. 2019లో చంద్రయాన్-2 విఫలమైంది కూడా ఇక్కడే.

అందుకే ఈ చివరి దశలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రయాన్-3 మిషన్ విషయంలో, అత్యంత కీలకమైన ఆ చివరి క్షణాల్లో ఏం జరిగిందో ఇక్కడ చదవండి.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, EPA

నాలుగు దశల్లో ల్యాండింగ్

చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ ప్రక్రియ నాలుగు దశల్లో జరిగింది.

వీటిలో రఫ్ బ్రేకింగ్ ఫేజ్ మొదటి దశ.

ఆల్టిట్యూడ్ బ్రేకింగ్ ఫేజ్ రెండోది.

ఫైన్ బ్రేకింగ్ ఫేజ్ మూడోది.

టెర్మినల్ డిసెంట్ ఫేజ్ నాలుగోది.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, ISRO

సాయంత్రం 5.47 - రఫ్ బ్రేకింగ్ ఫేజ్

మొదటిదైన రఫ్ బ్రేకింగ్ ఫేజ్‌లో భాగంగా ల్యాండర్ వేగాన్ని సెకనుకు 1,680 మీటర్ల నుంచి 358 మీ.సె.కు తగ్గించారు. ఈ దశ దాదాపు 10 నిమిషాలపాటు కొనసాగింది. అప్పటికి చంద్రయాన్-3 చంద్రుడి ఉపరితలానికి 30 కి.మీ. ఎత్తులో ఉంది. ఈ దశ సమయంలో చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ అక్కడి నేలకు దాదాపు 90 డీగ్రీల కోణంలో ఉంది. అయితే, దాన్ని ల్యాండింగ్ కోసం వెర్టికల్‌గా మార్చాల్సి ఉంటుంది. గతంలో ఇక్కడే సమస్య రావడంతో చంద్రయాన్‌-2 క్రాష్ ల్యాండ్ అయిందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ గతంలో చెప్పారు.

‘‘హారిజాంటల్ నుంచి వెర్టికల్ పొజీషన్‌కు మార్చడం ఒక ట్రిక్ లాంటిది. దీన్ని చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంధనం కూడా ఎక్కువ ఖర్చు కాకుండా చూడాలి. అదే సమయంలో దూరాన్ని కూడా కచ్చితంగా అంచనా వేయాలి. దీని కోసం అన్ని అల్గారిథమ్‌లు కచ్చితత్వంతో పనిచేయాలి’’ అని సోమనాథ్ చెప్పారు.

ఈ దశలో ల్యాండర్ వేగం, దిశలను నియంత్రించేందుకు లోపల 12 ఇంజిన్లు ఏర్పాటు చేశారు.

‘‘ల్యాండర్‌లో మొదటి నాలుగు ఇంజిన్లు వేగం తగ్గించేందుకు పనిచేస్తాయి. మిగతా 8 చిన్న ఇంజిన్లు దిశను మార్చడానికి ఉపయోగిస్తారు’’ అని సోమనాథ్ చెప్పారు.

ఇదే దశలో ల్యాండర్ 7.4 కి.మీ. ఎత్తు వరకూ వచ్చింది.

చంద్రయాన్ 3

ఫొటో సోర్స్, Getty Images

సాయంత్రం 5.57 - ఆల్టిట్యూడ్ హోల్డింగ్ ఫేజ్

మొదటి దశ అనంతరం సరిగ్గా పది నిమిషాల తర్వాత నేల నుంచి 7.43 కి.మీ. ఎత్తులో ల్యాండర్ ఉన్నప్పుడు ఆల్టిట్యూడ్ హోల్డింగ్ ఫేజ్ మొదలైంది. ఇది కేవలం పది సెకన్లు మాత్రమే ఉంది. ఇందులో ల్యాండర్ 6.8 కి.మీ. వరకూ వచ్చింది. ఈ పది సెకన్లలో చంద్రయాన్ లాండర్‌ను హారిజాంటల్ (అడ్డం) నుంచి వర్టికల్ (నిలువుగా) కిందకు దిగేలా మార్చారు.

ఆల్టిట్యూడ్ హోల్డింగ్ ఫేజ్ నుంచి ఫైన్ బ్రేకింగ్ ఫేజ్‌లోకి ల్యాండర్ వెళ్లడంతో ఇస్రో మిషన్ కంట్రోల్ రూమ్‌లోని శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు కనిపించాయి. చాలా మంది సిబ్బంది గట్టిగా చప్పట్లు కొట్టారు.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, EPA

సాయంత్రం 06.01 - ఫైన్‌ బ్రేకింగ్ ఫేజ్

ఫైన్ బ్రేకింగ్ ఫేజ్‌లో ల్యాండర్ పూర్తి నిలువుగా కిందకు దిగడం మొదలైంది. ఈ దశ మూడు నిమిషాలు మాత్రమే కొనసాగింది. ఆ సమయంలో విక్రమ్ ల్యాండర్ ఎత్తు చంద్రుడి ఉపరితలానికి ఒక కి.మీ. తక్కువకు వచ్చింది. ఈ దశలోనే ల్యాండర్‌లోని కొన్ని సెన్సర్‌లు పనిచేయడం మొదలుపెడతాయి. 150 మీటర్ల ఎత్తులో నిలువుగా దిగేందుకు కింద ఏమైనా బండరాళ్లు లేదా బిలాలు ఉన్నాయేమో ఇవి పరిశీలిస్తాయి.

‘‘దీని కోసం చాలా సిమ్యులేషన్లను ఉపయోగించారు. డిజైన్లలోనూ చాలా మార్పులు చేశారు. అయితే, ఇక్కడ సెన్సర్లన్నీ విఫలమైనా ప్రొపల్షన్ వ్యవస్థ పనిచేస్తే సాఫ్ట్‌ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది’’ అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ గతంలో చెప్పారు.

ఈ దశలో ల్యాండర్ డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తూ కనిపించారు.

ఈ దశలో ల్యాండర్ వేగం సెకనుకు మూడు మీటర్లకు తగ్గించారు. ఈ దశ పూర్తయ్యే సరికి ల్యాండర్ 800 మీటర్ల ఎత్తుకు వచ్చింది.

ఇక్కడి నుంచి ఇస్రో సిబ్బంది చప్పట్లు కొడుతూనే కనిపించారు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా జాగ్రత్తగా స్క్రీన్ చూస్తూ కనిపించారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANI

6.02 - లోకల్ నావిగేషన్ ఫేజ్

చివరిదైన ఈ దశనే టెర్మినల్ డిసెంట్ ఫేజ్ అని కూడా పిలుస్తారు.

ఇది 800 మీటర్ల ఎత్తులో మొదలైంది. దీంతో చంద్రుడి ఉపరితలానికి ల్యాండర్ మాడ్యూల్ మరింత దగ్గరైంది. హారిజాంటల్, వెర్టికల్ వెలాసిటీలు దాదాపు జీరోకు వచ్చేశాయి.

మరోవైపు ల్యాండింగ్ ప్రాంతం సురక్షితంగా ఉందని సెన్సర్లు సమాచారాన్ని పంపిస్తున్నట్లు లైవ్‌లో శాస్త్రవేత్తలు చెప్పారు.

చంద్రయాన్- 3

ఫొటో సోర్స్, ANI

6.03 - విక్రమ్ సాఫ్ట్‌ ల్యాండింగ్‌పై ఇస్రో ప్రకటన

సురక్షితంగా విక్రమ్ సాఫ్ట్ ల్యాండ్ అయినట్లు సాయంత్రం 6:03 గంటలకు ఇస్రో ప్రకటించింది. దీంతో అందరి మొహాల్లో ఆనందోత్సాహాలు కనిపించాయి. మోదీ కూడా జెండా ఊపుతూ కనిపించారు. దీంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త అధ్యాయం లిఖించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)