భారత్‌లో ఆహార ధరల పెరుగుదల ప్రపంచానికి కూడా సమస్య కాబోతుందా?

ఆహార ద్రవ్యోల్బణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కూరగాయలు కొంటున్న మహిళ (ఫైల్ ఫొటో )
    • రచయిత, నిఖిల్ ఇనాందార్
    • హోదా, బీబీసీ న్యూస్, ముంబయి

ప్రపంచ వ్యవసాయ వాణిజ్యంలో కీలకమైన భారత్‌లో నెలకొన్న అస్థిర వాతావరణ పరిస్థితులు, గత శతాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా ఆగస్టు నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా నిత్యవసరాల ధరలు దాదాపు 11 శాతం మేర పెరిగాయి.

ఒక్క టమాటా ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, దేశీయ మార్కెట్‌లో ఉల్లిపాయలు ధర క్రమంగా పెరుగుతోంది. ఈ త్రైమాసికంలో జూన్ నుంచి పెరుగుతున్న ధర ప్రస్తుతం గరిష్ట స్థాయికి చేరింది. ఇక పప్పుల ధరలు కూడా ఈ సంవత్సరం మొదటి రోజులతో పోలిస్తే 20 శాతానికి పైగా పెరిగాయి.

కేవలం జులై నెలలోనే సాధారణ శాఖాహార భోజనం ధరలు మూడింతలు పెరిగాయని, భారత్‌లో ''కర్రీ ప్రాబ్లమ్'' అంటే కూరల సమస్య ఉందని కొందరు ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు, వచ్చే వేసవిలో అతిపెద్ద సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆహార ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అనేక చర్యలు చేపట్టింది.

అందులో భాగంగానే 2022 మేలో గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది. అలాగే, బాస్మతి మినహా మిగిలిన రకాల బియ్యం ఎగుమతులను కూడా నిలిపివేస్తున్నట్లు గత నెలలో ప్రకటించింది. ఉల్లిపాయల ఎగుమతులను తగ్గించేందుకు ఆర్థిక శాఖ ఏకంగా 40 శాతం ఎగుమతి సుంకం విధించింది.

ఈ ఏడాది పంచదార ఉత్పత్తి తగ్గనున్న నేపథ్యంలో ''చక్కెర ఎగుమతులపై కూడా నిషేధం విధించే అవకాశం ఉంది'' అని కేర్‌ఎడ్జ్ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ రజ్నీ సిన్హా అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం ఆ దిశగా మరిన్ని చర్యలు తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించినప్పటికీ దేశీయంగా బియ్యం ధరలపై ఎలాంటి ప్రభావం కనిపించకపోవడంతో ''ప్రభుత్వం మరింత సమగ్రంగా నిషేధాన్ని అమలు చేసే అవకాశం ఉంది'' అని గ్లోబల్ బ్రోకరేజ్ నోమురా ఇటీవల తన నివేదికలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో, దేశీయంగా ఎలాగైనా ధరలను తగ్గించాలన్న భారత్ దూకుడుతో, ప్రపంచానికి ఆహార ద్రవ్యోల్బణాన్ని ఎగుమతి చేసే ప్రమాదం ఉందా?

ఆహార ద్రవ్యోల్బణం

ఫొటో సోర్స్, Getty Images

ముఖ్యంగా బియ్యం, చక్కెర, ఉల్లిపాయల విషయంలో ఈ పరిస్థితి తలెత్తవచ్చని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐఎఫ్‌పీఆర్ఐ) అంచనా వేస్తోంది. గత దశాబ్దకాలంలో 40 శాతం ఎగుమతులతో బియ్యం ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. చక్కెర, ఉల్లిపాయల ఎగుమతుల్లో రెండోస్థానంలో ఉండడమే అందుకు కారణం.

ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్-ఎఫ్‌ఏఓ) బియ్యం ధరల ఇండెక్స్ జులైలో 2.8 శాతం పెరిగింది. 2011 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధికం. భారత్ ఎగుమతులను నిషేధించిన బియ్యం రకాల ధరల ప్రభావంతోనే ఇది జరిగింది. ఈ ప్రభావం ఇతర ప్రాంతల నుంచి ఎగుమతి అవుతున్న బియ్యం ధరలపై పడిందని ఎఫ్‌ఏవో తెలిపింది.

''గత నెలలో భారత్ నిషేధం విధించిన తర్వాత, థాయ్ బియ్యం ధరలు 20 శాతం పెరిగాయి'' అని ఐఎఫ్‌పీఆర్‌ఐలో సీనియర్ రీసెర్చ్ ఫెలో జోసెఫ్ డబ్ల్యూ గ్లాబర్ బీబీసీతో చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 18 ''హంగర్ స్పాట్స్'' (ఆహార కొరత) ప్రాంతాల్లో ఆహార అభద్రతను పెంచే అవకాశం ఉందని, ముఖ్యంగా ప్రపంచంలోని పేదలపై దీని ప్రభావం పడొచ్చని ఎఫ్‌ఏవో, ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం(వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్) అంచనా వేసింది.

ఆసియా, ఆఫ్రికా దేశాల్లో కోట్లాది మంది తీసుకునే కేలరీలతో కూడిన ఆహారంలో బియ్యం ప్రధానమైనది. ఆయా మార్కెట్లకు అతిపెద్ద బియ్యం సరఫరాదారు భారత్.

ఆసియా, సహారా ఎడారి ప్రాంత ఆఫ్రికా దేశాలకు దిగుమతి అవుతున్న బియ్యంలో దాదాపు 50 శాతం ఒక్క భారత్‌ నుంచే దిగుమతి చేసుకుంటున్నాయని, కొన్నిదేశాల్లో అది 80 శాతం వరకూ ఉందని ఐఎఫ్‌పీఆర్‌ఐ చెబుతోంది. వియత్నాం, థాయ్‌లాండ్, పాకిస్తాన్ నుంచి వచ్చే బియ్యంతో దానిని భర్తీ చేయడం అంత సులువు కాదని తెలిపింది.

''పెరిగిన ఆహార ధరలతో పాటు దిగుమతి పన్నులు ఎక్కువగా ఉండడం, విదేశీ మారక ద్రవ్యం వంటి ఇతర సమస్యలు కూడా బిల్లుల చెల్లింపులపై ప్రభావం చూపడంతో పాటు ఆయా దేశాల్లో ద్రవ్యోల్బణానికి దారితీసేందుకు కారణమయ్యే అవకాశం ఉంది'' అని ఎఫ్‌ఏవో మార్కెట్స్ అండ్ ట్రేడ్ డివిజన్‌లో సీనియర్ ఆర్థిక వేత్త ఉపాలి గల్కెటి చెప్పారు.

ఆహార ద్రవ్యోల్బణం

ఫొటో సోర్స్, Getty Images

అయితే, భారత్‌ నిర్ణయాల వల్లే ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు పెరిగాయని చెప్పలేం. యుక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ (ప్రపంచ దేశాలకు ధాన్యం ఎగుమతుల కోసం నల్ల సముద్రం గుండా ఓడల ప్రయాణానికి చేసుకున్న ఒప్పందం) రద్దు కావడం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర వాతావరణ పరిస్థితులు అందుకు కారణంగా నిలుస్తున్నాయి.

మార్కెట్‌ను పరిశీలిస్తే ''గత సంవత్సరం మధ్య నుంచి అంతర్జాతీయ ఆహార ధరల్లో కనిపించిన తగ్గుదల ధోరణిని మార్చేశాయి'' అని గల్కెటి బీబీసీకి చెప్పారు.

చైనా సహా కొన్ని దేశాల్లో మందగమనం ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల నుంచి డిమాండ్ లేకపోవడం కూడా అంతర్జాతీయ ఆహార ధరలపై ప్రభావం చూపుతోంది.

చమురు, ధాన్యం ధరలు తక్కువగా ఉండడం వల్ల 2022తో పోలిస్తే 2023 ఆహార ధరల సూచీ సగటు తక్కువగా ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉందని, ఆహార మార్కెట్లపై అది చూపించే ప్రభావాన్ని బట్టి భవిష్యత్ ధరలు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇలాంటి అనిశ్చితి నేపథ్యంలో, నిత్యవసరాల ఎగుమతులపై నిషేధాన్ని వెనక్కి తీసుకోవాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) సహా పలువర్గాల నుంచి భారత్‌కు వినతులు వస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం తలెత్తడానికి దోహదపడడమే కాకుండా, ''ఎగుమతులను నిషేధించడం వల్ల ఆధారపడదగిన ఎక్స్‌పోర్టర్ కాదన్న అపఖ్యాతి, అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ నేపథ్యంలో రైతులకు మంచి ధరలు రాకుండా చేసిందన్న ప్రతికూల అంశాలు కూడా ఉంటాయి'' అని విశ్లేషకులు నోమురా చెప్పారు.

వాణిజ్య ఆంక్షలు కూడా ధరలు భారీగా పెరగడం లేదా తగ్గేలా చేయగలవు. ''ఉదాహరణకు, 2015-16లో పప్పు ధాన్యాల కొరతతో ధరలు విపరీతంగా పెరగడంతో భారత్ ఇతర దేశాల నుంచి భారీగా దిగుమతులు చేసుకుంది. ఆ తర్వాత రుతుపవనాలు సరైన సమయంలో రావడం, దేశీయంగా ఉత్పత్తి పెరగడంతో 2017-18‌లో ధరలు పడిపోయాయి''.

ఆహార ద్రబ్యోల్బణం

ఫొటో సోర్స్, Getty Images

''సరఫరాదారుల అస్థిరమైన నిర్ణయాలు ధరలను ప్రభావితం చేస్తే, దిగుమతిదారులు ఇతర విశ్వసనీయ భాగస్వాములను వెతుక్కునే అవకాశం ఉంది'' అని గ్లాబర్ వంటి వారు హెచ్చరిస్తున్నారు.

ఎక్కువ దేశాలు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తుండడం వల్ల ఈ ముప్పు పెరుగుతోందని, ఇది ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తుందని ఎఫ్‌ఏవో అంటోంది.

అయితే, వాస్తవ రాజకీయాలు, ఆహార స్వయం సమృద్ధిని సాధించాలనే భావన భారత్‌ నిర్ణయాలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని, మరీముఖ్యంగా రాజకీయంగా సున్నితమైన ఈ సమయంలో వాటి ప్రభావం ఉందని కొందరు అంటున్నారు.

గతంలో ఉల్లిధరల పెరుగుదల వంటి విషయాలు భారత్‌లో ఎన్నికల్లో ఓటమికి కూడా దారితీశాయి. ఆహార ధరలు పెరగడం భారతీయుల ఖర్చును కూడా ప్రభావితం చేస్తుంది.

ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆరుసార్లు వడ్డీ రేట్లను పెంచింది. అలాగే, వాణిజ్య ఆంక్షలు విధించింది కూడా. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ముందు ఇలాంటి పరిమితమైన మార్గాలే ఉన్నాయి.

''అన్ని దేశాలు ద్రవ్యోల్బణాన్ని నియంత్రిండంపైనే దృష్టి పెట్టాయి. ప్రపంచ ప్రయోజనాల గురించి ఆందోళన చెందడం కంటే ముందు భారత్ దేశీయ ప్రయోజనాలను చూసుకోవాలని చెబుతాను'' అన్నారు సిన్హా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)