ఆదిత్య L1: ఇప్పటి వరకూ సూర్యుడిపై ఎన్ని మిషన్‌లు ప్రయోగించారు, వాటి వల్ల సాధించిందేంటి?

ఫొటో సోర్స్, EUROPEAN SPACE AGENCY
చంద్రయాన్ -3 విజయం తర్వాత, సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 మిషన్‌ను ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ( ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్) ప్రకటించింది.
సూర్యుడిపై అధ్యయనానికి భారత్ ప్రయోగిస్తున్న ఆదిత్య ఎల్1 తొలి అంతరిక్ష ఆధారిత మిషన్ అని ఇస్రో ట్వీట్ చేసింది. సూర్యుడికి భూమికి మధ్యలోని లెగ్రాంజ్ పాయింట్ 1కి సమీపంలోని హాలో కక్ష్యలోకి ఈ మిషన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఇది భూమి నుంచి సుమారు 1.5 మిలియన్ (15 లక్షలు) కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఫొటోస్ఫియర్, క్రోమోస్ఫియర్‌తోపాటు సూర్యుడి బయటి పొర కరోనాపై అధ్యయనం చేసేందుకు ఈ అంతరిక్ష నౌక ద్వారా 7 పేలోడ్‌లను ప్రయోగించబోతున్నారు.
ఇప్పటి వరకూ అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ మాత్రమే సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఉమ్మడిగా, వేర్వేరుగా స్పేస్ మిషన్‌లను ప్రయోగించాయి.
నాసా ప్రధానంగా మూడు మిషన్‌లను ప్రయోగించింది. ఎస్‌ఓహెచ్ఓ(సోలార్ అండ్ హీలియోస్ఫియరిక్ అబ్జర్వేటరీ), పార్కర్ సోలార్ ప్రోబ్, ఐఆర్ఐఎస్(ఇంటర్‌ఫేస్ రీజియన్ ఇమేజింగ్ స్పెక్టోగ్రాఫ్).
వాటితో పాటు ఎస్, విండ్, హినోడ్, సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ, ఎస్‌టీఈఆర్‌ఈఓ వంటి పలు మిషన్లను కూడా నాసా ప్రయోగించింది.
నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా ఎస్ఓహెచ్ఓ మిషన్‌ను ప్రయోగించాయి.
పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడి ఉపరితలానికి అతి సమీపంలోని కక్ష్యలో నాలుగేళ్లు పని చేసింది. ఐఆర్ఐఎస్ మిషన్ సూర్యుడి ఉపరితలం హైరిజల్యూషన్ చిత్రాలను తీసింది.
ఇప్పటి వరకూ నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ మాత్రమే సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన మిషన్‌లలో అత్యంత ప్రభావవంతమైనది. సూర్యడికి అతి దగ్గరగా వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ ఇదే.
అలాగే, సూర్యుడికి సంబంధించిన మరికొన్ని మిషన్‌లు, అవి సాధించిన విజయాలేంటో చూద్దాం.

ఫొటో సోర్స్, NASA
పార్కర్ సోలార్ ప్రోబ్, నాసా
పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడి కరోనా (సూర్యుడి చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణంలో బయటి భాగం) మీదుగా ప్రయాణించిందని 2021 డిసెంబర్ 14న నాసా ప్రకటించింది.
అక్కడి చార్జ్‌డ్ పార్టికల్స్ నమూనాల ఆధారంగా సూర్యుని అయస్కాంత క్షేత్రం గురించి సమాచారాన్ని విశ్లేషించారు.
ఒక స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడికి ఇంత దగ్గరగా వెళ్లడం చరిత్రలో ఇదే మొదటిసారి అని నాసా చెబుతోంది.
సూర్యుడి ఉపరితలం నుంచి 6.5 (65 లక్షలు) మిలియన్ కిలోమీటర్ల పరిధిలోకి ప్రయాణించేలా పార్కర్ సోలార్ ప్రోబ్‌ను రూపొందించారు. అందువల్ల ఎనర్జీ ఫ్లో, సోలార్ విండ్ గురించిన సమాచారాన్ని సేకరించగలిగింది.
అలాగే, సోలార్ కరోనాకు అతి దగ్గరగా చేరుకోవడం ద్వారా దానిపై అధ్యయనం చేయడం ఈ మిషన్ మరో ఉద్దేశం.
నిరంతరం పరిభ్రమిస్తూ ఉండే ఈ విశ్వంలో, సౌర వ్యవస్థను సూర్యుడు ఎలా నియంత్రించగలుగుతున్నాడు? అనే హీలియో ఫిజిక్స్‌లోని కీలక ప్రశ్నకు సమాధానం కనుక్కోవడమే పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రధాన లక్ష్యం.
నాసా చెప్పినదాని ప్రకారం, పార్కర్ సోలార్ ప్రోబ్‌ను 2018లో ప్రయోగించగా, మూడేళ్లలో అది తన లక్ష్యాన్ని చేరుకుంది.
2021 ఏప్రిల్ 28న సూర్యుడికి అత్యంత సమీపం వరకూ వెళ్లిన ఎనిమిదో వస్తువు (స్పేస్ క్రాఫ్ట్) ఇదేనని, ఆ సమయంలో సూర్యుడి కరోనాలోకి ప్రవేశించిందని నాసా తెలిపింది.
సోలార్ విండ్‌లో స్విచ్‌బ్యాక్‌లుగా పిలిచే డయాగ్నల్ షేప్స్(దీర్ఘచతురస్రాకారాలు) ప్రత్యేకమైనవి కావని, అవి సర్వసాధారణమని ఈ మిషన్ ద్వారా సేకరించిన డేటా తెలియజేసింది.
సూర్యుని ధ్రువాల వద్ద మాత్రమే ఇలాంటి ఆకారాలు ఉంటాయని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు నమ్ముతూ వస్తున్నారు. అయితే, ఈ డేటాతో అసలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనే కొత్త ప్రశ్న తలెత్తింది.
''అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పార్కర్ సోలార్ ప్రోబ్‌ను సూర్యడికి దగ్గరగా వెళ్లి, వెనక్కి రావడం అద్భుతం'' అని నాసా హెడ్‌క్వార్టర్స్‌లో పార్కర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న జోసెఫ్ స్మిత్ తెలిపారు.
''రానున్న రోజుల్లో సూర్యుడికి దగ్గరగా వెళ్లినప్పుడు కొత్త సమాచారం ఏమిస్తుందోనని ఎదురుచూస్తున్నాం'' అని ఆయన చెప్పారు.
కరోనా అత్యంత వేడిగా ఉండడానికి గల కారణాలు, అది సూపర్ సోనిక్ స్పీడ్‌తో విసిరే సోలార్ విండ్‌ను మరింత అధ్యయనం చేయడానికి కొత్త డేటా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అంతరిక్షంలోని కఠిన వాతావారణాన్ని అర్థం చేసుకోవడం ద్వారా భూమిపై టెలీకమ్యూనికేషన్స్ వ్యవస్థ, ఉపగ్రహాలపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలను మరింత అర్థం చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, ESA-NASA
సోలార్ ఆర్బిటర్, యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ
సోలార్ ఆర్బిటర్ మిషన్‌ను నాసా సహకారంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నిర్మించింది. హీలియోఫిజిక్స్‌పై అధ్యయనం చేయడమే ఈ మిషన్ ఉద్దేశం.
ఏడేళ్ల పాటు పనిచేసేలా 2020 ఫిబ్రవరి 9న దీన్ని అంతరిక్షంలోకి ప్రయోగించారు.
2022 మార్చి 30న సోలార్ ఆర్బిటర్ సూర్యుడికి అతి దగ్గరగా(భూమికి, సూర్యుడికి మధ్య దూరంలో మూడింట ఒక వంతు దూరం) చేరిన సమయంలో వీడియోని రికార్డ్ చేసింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆ వీడియోని విడుదల చేసింది.
ఈ స్పేస్ క్రాఫ్ట్ సాధారణంగా భూమికి, సూర్యుడికి మధ్య దూరంలో, పావు వంతు దూరంలో పరిభ్రమిస్తుంటుంది.
ఏజెన్సీ చెప్పిన వివరాల ప్రకారం,
ఆ చిత్రాలు సూర్యుడి దక్షిణ ధ్రువం వైపు తీసినవి. ఈ చిత్రాలు సూర్యుడి దక్షిణ ధ్రువం వైపు నుంచి 17 నానోమీటర్ల వేవ్‌లెంగ్త్‌తో, ఎక్స్‌ట్రీమ్ అల్ట్రవయొలెట్ ఇమేజర్ (ఈయూఐ)తో తీసినట్లు పేర్కొంది.
సూర్యుడి ధ్రువాల వద్ద ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. సూర్యుడి నుంచి ఉద్భవించే అయస్కాంత క్షేత్రాలు చాలా శక్తివంతమైనవి, కాకపోతే తక్కువ సమయం ప్రభావవంతంగా ఉండే ఈ క్షేత్రాలు ధ్రువాల్లో కలిసిపోతాయి.
దాని కారణంగా క్లోజ్డ్ అయస్కాంత క్షేత్రాలు ఏర్పడడం వల్ల ఎనర్జీ పార్టికల్స్ వృథా తక్కువ. కానీ, అవి శక్తివంతమైన అల్ట్రావయొలెట్ కిరణాలను ప్రసరింపజేస్తాయి. వాటిని చిత్రీకరించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఈయూఐని అభివృద్ధి చేశారు.
2025లో సోలార్ ఆర్బిటర్ తన కక్ష్యను కొద్దిగా మార్చుకునేందుకు వీనస్ గ్రావిటీని వినియోగించుకోనుంది. అందువల్ల స్పేస్ క్రాఫ్ట్‌లో ఏర్పాటు చేసిన పరికరాలు సూర్యుడి ధ్రువాలపై మరింత అధ్యయనం చేసే అవకాశం ఉంది.
సూర్యుడి అతివేడిని తట్టుకునేలా ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను రూపొందించారు. అందువల్ల సూర్యుడికి దగ్గరగా వెళ్లడంతో పాటు, సూర్యుడిలోని వివిధ విభాగాలను మరింత అధ్యయనం చేసేందుకు అవి ఉపయోగపడతాయి.
సూర్యుడి ప్రభావవంతమైన భాగాలను అతిదగ్గరగా చిత్రీకరించిన తొలి ఉపగ్రహం ఇదేనని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. సౌర తుఫాను ఏర్పడే ప్రక్రియను సోలార్ ఆర్బిటర్ నిశితంగా పరిశీలిస్తోంది.

ఫొటో సోర్స్, HELIOVIEWER.ORG
సూర్యుడి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు
నాసా వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, సూర్యుడు హైడ్రోజన్, హీలియంతో కూడిన ఒక ప్రకాశవంతమైన నక్షత్రం. సౌర వ్యవస్థలో మధ్యలో ఉండే సూర్యుడి వయస్సు దాదాపుగా 4.5 బిలియన్ సంవత్సరాలు.
సౌర వ్యవస్థలో అతి పెద్ద నక్షత్రం సూర్యుడు. భూమి నుంచి సూర్యుడికి దూరం దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు.
భూమితో పోలిస్తే పరిమాణంలో 1.3 మిలియన్(13 లక్షల) రెట్లు ఎక్కువ. సౌర వ్యవస్థ దాని కక్ష్యలో ఉండేందుకు సూర్యుడి గ్రావిటీయే కారణం.
అలాగే, స్పేస్ క్రాఫ్ట్ నుంచి విడిపోయిన పరికరాలు కూడా వాటి కక్ష్యలో పరిభ్రమించడంలోనూ సూర్యుడి గ్రావిటీయే కీలకం.
సూర్యుడి కేంద్రంలో(మధ్యలో) అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. అది దాదాపు 15 మిలియన్ ( 1 కోటి 50 లక్షల) డిగ్రీల సెల్సియస్.
సూర్యుడి శక్తివంతమైన కిరణాలు విశ్వమంతా వ్యాపించి, మొత్తం సౌరవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఇవి 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమిని చేరేందుకు 8 నిమిషాల సమయం పడుతుంది.
సూర్యుడి ఉపరితలం భూమి తరహాలో ఘనపదార్థం కాదు. హైడ్రోజన్, హీలియం వంటి వాయువులతో కూడి ఉండడంతో సూర్యుడిపై వేర్వేరు ప్రదేశాల్లో వేగం వేర్వేరుగా ఉంటుంది.
అత్యంత వేడి వాయువులు, శక్తివంతమైన వాయువుల కణాలైన ప్లాస్మాతో సూర్యగ్రహం ఏర్పడింది. సూర్యుడి ఒక పరిభ్రమణ కాలం భూమిపై 25 రోజులతో సమానం. ధ్రువాల వద్ద అయితే 36 రోజులతో సమానం.
సూర్యుడి ఉపరితలంపై ఫొటోస్ఫియర్, క్రోమోస్ఫియర్, కరోనా భాగాలు ఉంటాయి. సూర్యుడి చుట్టూ సోలార్ డస్ట్ రింగ్స్ అని పిలిచే చాలా ధూళి వాయువులు ఉంటాయి. వాటి ఆధారంగా సౌర వ్యవస్థ ఏర్పడి 4.6 బిలియన్ (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) సంవత్సరాలు అవుతుందని అంచనా.
ఇవి కూడా చదవండి:
- నకిలీ చంద్ర ధూళిని సైంటిస్టులు ఎందుకు తయారు చేస్తున్నారు?
- Earth Day: భూమి గుండ్రంగా లేదా? మీరు తెలుసుకోవాల్సిన 10 ఆసక్తికర విషయాలు...
- అక్కడ ఏడాది అంటే భూమిపై 84 ఏళ్లు.. ఆ సుదూర గ్రహం విశేషాలు ఇవీ
- మహిళలకు సౌకర్యంగా ఉండే స్పేస్ సూట్, అసలు వ్యోమగాములు అంతరిక్షంలో ఏం తింటారు
- చంద్రయాన్-3ను ఇస్రో ఎందుకు ప్రయోగిస్తోంది? చంద్రయాన్-2తో ఏం సాధించింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














