భారత్ నుంచి కోళ్ల అక్రమ రవాణా... ఆపేయాలని వార్నింగ్ ఇచ్చిన నేపాల్

ఫొటో సోర్స్, DLS
- రచయిత, వినితా దహాల్
- హోదా, బీబీసీ న్యూస్ నేపాల్
భారత్ నుంచి నేపాల్‌కి అక్రమంగా తరలిస్తున్న కోళ్లు, కోడి మాంసం విషయంలో ఆ దేశ పశుసంవర్ధక విభాగం సీరియస్ హెచ్చరికలు జారీ చేసింది.
చికెన్‌ను కొనే ముందు లేదా వండే ముందు.. ఇదెంత ఆరోగ్యకరమైనది, ఎంత శుభ్రమైనదో వినియోగదారులు తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని నేపాల్ పశుసంవర్ధక సేవా విభాగం ఇటీవల జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది.
అక్రమంగా తరలిస్తున్న చికెన్ చాలా వరకు ఆరోగ్యానికి హానికరమని, వినియోగానికి తగినది కాదని తన ప్రకటనలో తెలిపింది.
పశువుల నుంచి మనషులకు వచ్చే ‘జూనోటిక్’ వ్యాధులకు కారణమవుతుందని కూడా హెచ్చరించింది.
భారత్ నుంచి అక్రమంగా తరలిస్తున్న కోళ్లు ఫారానికి చేరుకోక ముందే చనిపోతున్నాయని, వాటిని కోసి, ఆ తర్వాత ప్యాక్ చేసి, ప్రజలకు విక్రయిస్తున్నారని నేపాల్ హోమ్ మంత్రిత్వ శాఖ గతవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పశుసంవర్ధక సేవా విభాగం తెలిపింది.
నేపాల్‌లోని కాఠ్మాండు, ఇతర పెద్ద నగరాల మార్కెట్లకు రవాణా అయిన తర్వాత చనిపోయిన ఈ కోళ్లను కోసి, వాటిని ప్యాక్ చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారని పశుసంవర్ధక విభాగానికి చెందిన యానిమల్ క్వారంటైన్ డివిజన్(యానిమల్ క్వారంటైన్ మహాశాఖ) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రేరణ సేధాయ్ భట్టారాయ్ తెలిపారు.
కోడి మాంసం విషయంలో నేపాల్ ఆత్మనిర్భర్ సాధించింది. కానీ, భారత్‌లో కోళ్ల మాంసం ధరలు తగ్గినప్పటి నుంచి నేపాల్ దిగుమతులను నిషేధించింది.
ధరల్లో మార్పులు వచ్చే సరికి, భారత్ నుంచి నేపాల్‌కు కోళ్ల అక్రమ రవాణ పెరుగుతుందని వర్తకదారులు తెలిపారు.
వర్తకదారుల ప్రకారం, భారత్, నేపాల్‌ల మధ్య కేజీ చికెన్ ధరల్లో రూ.50 నుంచి రూ.110 వరకు తేడా ఉంది.
నేపాల్‌లో భారత చికెన్‌ను భారతీయ కరెన్సీ ప్రకారం కేజీ రూ.150 నుంచి రూ.180కు, నేపాల్ కరెన్సీ ప్రకారం రూ.340 నుంచి రూ.400కు కొనుగోలు చేసి, విక్రయిస్తున్నారు.
చికెన్ అక్రమ రవాణాను ఆపివేయాలని నేపాల్ హచెరీ ఇండస్ట్రీ అసోసియేషన్, నేపాల్ దాణా అసోసియేషన్ డిమాండ్ చేశాయి.
దీనివల్ల వార్షికంగా రూ.1.5 ట్రిలియన్ పెట్టుబడులు ప్రమాదంలో పడతాయని ఇవి చెప్పాయి.

ఫొటో సోర్స్, CHIRANJIV YADAV
నేపాల్, భారత్ సరిహద్దుల్లో అక్రమ రవాణా
నావల్‌పూర్, కపిల్‌వాస్తు, రూపాందేహిలు అక్రమ రవాణా ప్రాంతాలుగా ఉన్నప్పటికీ, మదేశ్ ప్రాంతంతో ఉన్న సరిహద్దు గుండానే పెద్ద మొత్తంలో చికెన్ అక్రమంగా రవాణా అవుతోంది.
తూర్పు నుంచి పశ్చిమం వరకున్న సరిహద్దు గుండా కోళ్లను అక్రమంగా దేశంలోకి తరలిస్తున్నారని డాక్టర్ సేధాయ్ చెప్పారు.
రాత్రి వేళ్లలో సైకిళ్లు లేదా బైకులపై బతికున్న కోళ్లను కట్టుకుని, వాటిని ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండానే అక్రమంగా నేపాల్‌కి తరలిస్తున్నట్లు తాము గుర్తించామని ఈ విభాగం తెలిపింది.
బైకులపై తరలించే కోళ్లలో సుమారు 90 శాతం దారిలోనే చనిపోతున్నాయని, మిగిలినవి పంజరాల్లోకి వెళ్తున్నాయని సేధాయ్ అన్నారు.
‘‘కోళ్ల పంజరాలను పరిశీలించేందుకు నేను వెళ్లినప్పుడు, అక్కడ అక్రమంగా తరలించిన కోళ్లు ఉన్నాయి. అవన్నీ చనిపోయి ఉన్నాయి. చనిపోయిన ఈ కోళ్లను కోసి, ప్యాక్ చేస్తున్నట్లు గుర్తించాం. వీటిని కఠ్మాండు వంటి పెద్ద నగరాలకు తరలిస్తున్నారు’’ అని సేధాయ్ చెప్పారు.
పశుసంవర్ధక విభాగం ఫిర్యాదు మేరకు భారత్ నుంచి అక్రమంగా నేపాల్‌కు తరలిస్తోన్న కోళ్ల దిగుమతులను ఆపివేయాలని హోమ్ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చట్టవిరుద్ధంగా నిర్వహణలో ఉన్న, ప్రమాణాలను పాటించని కోళ్ల ఫారాలు, హాచెరీలు, కోల్డ్ స్టోర్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
కస్టమ్స్, తనిఖీలు కఠినంగా ఉండాలని చెప్పింది.

ఫొటో సోర్స్, MOH'S
పట్టుకున్న చికెన్‌ను ఏం చేస్తున్నారు?
భారత్ నుంచి అక్రమంగా తరలిస్తోన్న చికెన్‌ను నియంత్రించేందుకు, పశుసంవర్ధక విభాగానికి చెందిన క్వారంటైన్ చెక్ పోస్ట్, పోలీసు విభాగాలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి.
చెక్ పోస్ట్ బైపాస్ గుండా పెద్ద మొత్తంలో చికెన్ అక్రమంగా మార్కెట్లోకి సరఫరా అవుతుందని చాలా మంది అధికారులు, వ్యాపారవేత్తలు చెబుతున్నారు.
అక్రమంగా తరలిస్తోన్న చికెన్‌ను పట్టుకున్నప్పుడు, పోలీసుల సాయంతో దాన్ని క్వారంటైన్ డిపార్ట్‌మెంట్ నాశనం చేస్తుంది.
పోలీసుల సాయంతో గత ఏడాది 35,500 బాయిలర్ కోళ్లను, 71,500 కోడిపిల్లల్ని, 4 వేల కేజీల కోడి మాంసాన్ని, 1,50,000 గుడ్లను పట్టుకుని, ధ్వంసం చేసినట్లు యానిమల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ స్టాటస్టిక్స్ తెలిపాయి.
ఫ్రెష్ చికెన్ మాదిరి అక్రమంగా తరలించిన మాంసం ఉండదని, ఇది ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.
వీటి వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ఈ దిగుమతి చేసిన కోళ్ల వల్లే నేపాల్‌లోకి బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు వస్తున్నాయని సేధాయ్ భట్టారాయ్ తెలిపారు.
చనిపోయిన కోళ్ల మాంసాన్ని తినడం అనారోగ్యమని వారు చెప్పారు.

ఫొటో సోర్స్, DLS
తాజా కోడి మాంసాన్ని గుర్తించడమెలా?
‘‘చూస్తే మనం అది అప్పటికే చనిపోయిన కోడి మాంసమని గుర్తించవచ్చు. కోడి చెస్ట్ నీలం లేదా నల్ల రంగులోకి మారుతుంది. తాజాది అయితే కోడి చెస్ట్, శరీర రంగు ఎర్రగా ఉంటుంది. తాజా కోడి మాంసం స్కిన్ కలర్ ఎప్పుడూ తెల్లగానే ఉంటుంది’’ అని సేధాయ్ భట్టారాయ్ తెలిపారు.
కోళ్లను, కోడి మాంసాన్ని పరిశీలించేందుకు నేపాల్‌లో 8 క్వారంటైన్ ఆఫీసులను, 28 క్వారంటైన్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
కానీ, తగినంత మంది ఉద్యోగులు లేకపోవడంతో ఇవన్న నిరంతరాయంగా పని చేయడం లేదు.
పార్సాలోని పలు చెక్‌పోస్టుల గుండా అక్రమంగా తరలిస్తోన్న బతికున్న కోళ్లను, చనిపోయిన కోళ్లను, కోడి మాంసాన్ని జప్తు చేసినట్లు పార్సా మానిటరింగ్ ఆఫీసర్ నిర్మల్ బుధాతోకి చెప్పారు.
పార్సాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ అక్రమ తరలింపు కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నాయని బుధాతోకి చెప్పారు.
ఓపెన్ బోర్డర్స్ కావడంతో వీటిని ఆపడం కాస్త సవాలుగానే ఉన్నట్లు తెలిపారు.
పార్సాలోని నిచుతా, మఝారియా, రంగ్‌పూర్, మనవా, దాకిలా వంటి ప్రాంతాల్లో భారత చికెన్ ఎక్కువగా అమ్ముడుపోతున్నట్లు చెప్పారు.
అక్రమ రవాణా కారణంతో తన చికెన్ ఫామ్‌ని మూసివేసుకోవాల్సి వచ్చిందని 12 ఏళ్లుగా పతేర్వా సుగౌలి రూరల్ మున్సిపాలిటీలో చికెన్ ఫామ్ నడుపుతోన్న రామ్జీ యాదవ్ చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కోళ్ల పరిశ్రమ రైతులకు నష్టాలు
‘‘గ్రామంలో భారత చికెన్‌ను అమ్ముతున్నట్లు కనిపిస్తోంది. నాలాంటి చాలా మంది కోళ్ల పెంపకదారులు ప్రమాదంలో పడ్డారు. ప్రతి ఏడాది లక్షల్లో నష్టం వస్తుంది. కొందరు ఫౌల్ట్రీ రైతులు వారి కోళ్ల ఫారాలను మూసివేశారు.’’ అని రామ్జీ యాదవ్ చెప్పారు.
సరిహద్దుల్లో రాకపోకలు తక్కువగా ఉండే సమయాలలో అంటే తెల్లవారుజామున లేదా మిట్ట మధ్యాహ్నం భారత్ నుంచి నేపాల్‌కు ఈ కోళ్లను అక్రమంగా తేలిగ్గా తరలిస్తున్నారని తెలిపారు.
చికెన్ అక్రమ రవాణా వల్ల భారీగా నష్టాలు మూటకట్టుకున్న పౌల్ట్రీ రైతులు మూడేళ్ల క్రితం వీటి అక్రమ తరలింపును ఆపేందుకు సరిహద్దుల్లో తమ నిఘాను పెంచారు.
యానిమల్ సర్వీసు కింద క్వారంటైన్ స్టాఫ్, సెక్యూరిటీ ఏజెన్సీలు పటిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టాలని, కఠినమైన చట్టాలు రూపొందించాలని నేపాల్ లేయర్స్ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ పోఖరేల్ చెప్పారు.
ప్రస్తుతం అమలవుతోన్న చట్టం చాలా పాతదని, జరిమానాలు, శిక్షలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని వర్తకదారులు తెలిపారు. ఈ చట్టానికి సవరణ చేయాల్సి ఉందన్నారు.
యానిమల్ సర్వీసెస్ యాక్ట్ ప్రకారం, చెక్‌పోస్టుల గుండా వ్యాధి సోకిన పశువులను, పశు పదార్థాలను అక్రమంగా తరలిస్తే రూ.25 వేల వరకు జరిమానా విధించే ప్రొవిజన్ ఉంది.
అదేవిధంగా ప్రభుత్వం నిషేధించిన పశువులను, పశు పదార్థాలను అక్రమంగా తరలిస్తే రూ.10 వేల వరకు జరిమానా విధించే నిబంధన కూడా ఉంది.
ఇవి కూడా చదవండి:
- మోదీ, షీ జిన్‌పింగ్ భేటీలో ఏం జరిగింది... ఇక భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గుతాయా?
- విశాఖ మేయర్ చాంబర్‌కు 100 మీ. దూరంలోని ‘బస్ బే’ ప్రారంభానికి ముందే ఎందుకు కూలిపోయింది?
- విడాకులు తీసుకోవడం ఎలా? ఏయే కారణాలతో అడగొచ్చు?
- ‘స్టాటిక్ షాక్’ అంటే ఏమిటి? హ్యాండ్ షేక్ ఇచ్చినా షాక్ కొట్టినట్లు ఎందుకు అవుతుంది?
- ఆదిత్య L1: సూర్యుడిపై పరిశోధనకు సెప్టెంబరు 2న ఇస్రో ప్రయోగం.. దీని లక్ష్యం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














