మోదీ, జిన్‌పింగ్‌ ఏం చర్చించారు? ఇక భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గుతాయా?

మోదీ-జిన్‌పింగ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రధాని మోదీ భేటీ తర్వాత లద్దాఖ్‌లోని (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాలు చర్యలు ముమ్మరం చేశాయి. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించేందుకు రెండుదేశాలు అంగీకరించాయి.

గల్వాన్ ఘర్షణల తర్వాత రెండు దేశాలు వేల సంఖ్యలో సైన్యాన్ని బోర్డర్‌లో మోహరించాయి. అప్పటి నుంచి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

2020లో జరిగిన ఆ గొడవ తర్వాత, తూర్పు లద్దాఖ్‌లో వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సరిహద్దు వెంబడి భారత్ తమ భూభాగంగా భావించే పలు ప్రాంతాల్లోకి చైనా ఆర్మీ చొచ్చుకొచ్చింది.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రధాని మోదీ బుధవారం సమావేశమైనప్పటికీ రహస్యంగా ఉంచారు. ఈ సమావేశం గురించి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు.

''చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన సమావేశంలో భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలోని లద్దాఖ్‌లో ఎల్ఏసీ వెంబడి వివాదాస్పద విషయాలపై ప్రధాని మోదీ తన ఆందోళన తెలియజేశారు'' అని వినయ్ చెప్పారు.

''భారత్ - చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వచ్చేందుకు సరిహద్దు ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడం అవసరమని, అలాగే, ఎల్ఏసీకి కట్టుబడి ఉండడంతో పాటు దానిని గౌరవించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ప్రస్తావించారు'' అని అన్నారు.

ఎల్ఏసీ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు, బోర్డర్‌లో ఉద్రిక్తతలను తగ్గించేలా తమ అధికారులకు సూచనలు చేసేందుకు ఇరువురు నేతలు నిర్ణయానికి వచ్చినట్లు భారత విదేశాంగ కార్యదర్శి తెలిపారు.

ఇదిలా ఉంటే, ప్రధాని మోదీ వినతి మేరకే జిన్‌పింగ్ సమావేశమయ్యారని చైనా అధికార ప్రతినిధి శుక్రవారం బీజింగ్‌ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

జిన్‌పింగ్-మోదీ

ఫొటో సోర్స్, Getty Images

''ఇరుదేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ఇతర అంశాలపై రెండు దేశాల నేతల మధ్య లోతైన, స్పష్టమైన చర్చలు జరిగాయి. ఇరుదేశాలు పరస్పర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని, బోర్డర్‌ను గౌరవించాలని షీ జిన్‌పింగ్ సూచించారు'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

''అక్కడ శాంతి నెలకొల్పేందుకు ఉమ్మడిగా వివాదం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది'' అని ఆ ప్రకటనలో తెలిపారు.

అయితే, లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు తగ్గించి, శాంతిని నెలకొల్పేందుకు ఇరుదేశాల మిలటరీ కమాండర్ల మధ్య ఆగస్టు 13, 14న జరిగిన 19వ విడత చర్చలు కూడా విజయవంతం కాకపోవడంతో ఇరుదేశాల అధినేతలు భేటీ అయ్యారన్న సంగతిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

గత వారం ఇరుదేశాల ఉన్నత సైనికాధికారుల మధ్య రెండు రోజులపాటు విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. అయినా, చర్చలకు సంబంధించి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

అయితే, దెప్సాంగ్, దెమ్‌చౌక్‌లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి సైన్యాన్ని తగ్గించేందుకు, వారిని దశలవారీగా వెనక్కి రప్పించేందుకు ఉన్నత స్థాయి సైనికాధికారులు చర్యలు జరిగినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని సైనికవర్గాలు తెలియజేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. బఫర్ జోన్ ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరిందని, ఇరుదేశాల అధినేతల ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

భారత్‌లో జరుగుతున్న జీ20 సమ్మిట్‌లో సెప్టెంబర్ 9, 10న జరగనున్న సమావేశాలకు హాజరయ్యేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిల్లీ రానున్నారు. ఒకవేళ లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వెంబడి సైనిక బలగాలను ఉపసంహరించుకునే ఒప్పందం ఉంటే, జిన్‌పింగ్ రాకకు ముందు ఆ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

ఇండియా చైనా బోర్డర్

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పటికే లద్దాఖ్‌లోని వాస్తవ పరిస్థితులను మోదీ ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. సరిహద్దు వెంబడి భారత భూభాగంలోని చాలా ప్రాంతాన్ని చైనా సైన్యం ఆక్రమించిందని ఆరోపిస్తున్నాయి.

మరోవైపు, చైనాతో ఉద్రిక్తత విషయంలో ప్రభుత్వం మౌనం వహిస్తోందని విమర్శకులు భావిస్తున్నారు.

సరిహద్దు వివాదం కారణంగా భారత్, చైనా వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్‌లోని చైనా కంపెనీలపై నియంత్రణకు, పెట్టబడుల ఆమోదానికి ప్రభుత్వం కమిటీని కూడా నియమించింది.

ఇప్పటికే భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల విస్తరణ, పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలు కూడా మరింత కఠినతరమయ్యాయి.

చైనీస్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, నిపుణులు భారత్‌కు వచ్చేందుకు వీసాలు పొందడం కూడా కష్టతరంగా మారింది. చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై పన్నులు కూడా భారీగా పెరిగాయి. జోహెన్నెస్‌బర్గ్ సమావేశం తర్వాత ఇరుదేశాల మధ్య నెలకొన్న ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తగ్గే అవకాశాలున్నాయి.

బోర్డర్‌లో ఉద్రిక్తతలను ఇరుదేశాలూ తాత్కాలికంగా తగ్గించినప్పటికీ, తూర్పు నుంచి పడమర వరకూ ఉన్న సరిహద్దు వివాదానికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఈ దీర్ఘకాలిక వివాదం ఇరుదేశాలకు పెద్ద సవాల్ అని, ఇది ఎప్పటికప్పుడు ఉద్రిక్తతల రూపంలో అది కనిపిస్తుందని చెబుతున్నారు.

ఇండియా చైనా బోర్డర్

ఫొటో సోర్స్, Getty Images

సానుకూల సంకేతాలు

''ప్రస్తుతానికి దీన్ని కేవలం అవకాశం, అంచనాగానే చూడాల్సి ఉంటుంది'' అని చైనా వ్యవహారాల నిపుణులు డాక్టర్ అల్కా ఆచార్య అన్నారు.

''క్షేత్రస్థాయిలో మార్పు రాకపోతే పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించదు. భారత్ డిమాండ్లకు, చైనా వ్యవహారశైలికి మధ్య చాలా తేడా ఉంది. ఇరుదేశాల అధినేతల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగడం సానుకూలాంశమే. కానీ, ఆ చర్చలు ఒప్పందం వరకూ వస్తేనే సరిహద్దు వివాదానికి పరిష్కారం లభిస్తుంది'' అని ఆమె చెప్పారు.

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే జోహెన్నెస్‌బర్గ్ సమావేశం కచ్చితంగా సానుకూల సంకేతమేనని దిల్లీ యూనివర్సిటీ చైనీస్ ఎఫైర్స్ ప్రొఫెసర్ డాక్టర్ రీతూషా తివారి అభిప్రాయపడ్డారు.

''లద్దాఖ్ సరిహద్దు వివాదంపై ఆర్మీ ఉన్నతాధికారుల మధ్య జరుగుతున్న విస్తృత స్థాయి చర్చల్లో భాగంగా, ఆగస్టులో జరిగిన చర్చల అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అందులో ఇరువైపుల నుంచి సానుకూల దృక్పథం వ్యక్తమైంది'' అని ఆమె బీబీసీతో చెప్పారు.

''జీ 20 సమ్మిట్‌లో భాగంగా సెప్టెంబర్‌లో జరగనున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని మోదీ భేటీ కూడా కీలకం. ఒకవేళ ఇద్దరూ సమావేశమైతే ఎంతోకొంత పురోగతి సాధ్యమైనట్లు భావించొచ్చు'' అని అన్నారు.

''గల్వాన్ ఘర్షణలు, కోవిడ్ మహమ్మారి తర్వాత చైనాపై ప్రపంచవ్యాప్తంగా కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడింది. అందులో భారత్‌‌ది ప్రథమ స్థానం. ఎందుకంటే, గల్వాన్‌కి ముందు చైనాకి భారత్ వ్యతిరేకం కాదు.

ఆ సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. భారత్‌తో సరిహద్దు వివాదానికి వెంటనే చైనా ముగింపు పలికితే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిపోతాయి. అది చైనాకి ఆర్థికంగానూ కలిసొచ్చే అంశం'' అని రీతూషా చెప్పారు.

ఇవి కూడా చదవండి: