‘బాయ్స్ హాస్టల్` రివ్యూ: వార్డెన్‌ని చంపింది ఎవ‌రు?

Rashmi

ఫొటో సోర్స్, facebook/rashmigautham

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

కన్నడ సినిమా అంచలంచెలుగా ఎదుగుతోంది.

కేజీఎఫ్, కాంతార లాంటి పాన్ ఇండియా విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.

తాజాగా 777 చార్లీతో జాతీయ అవార్డును అందుకుంది. ఒకప్పుడు కన్నడ సినిమాని డబ్బింగ్‌గా ఇతర భాషల్లోకి తీసుకురావడానికి పెద్ద ఆసక్తి చూపేవారు కాదు.

ఇప్పుడా పరిస్థితి మారింది. అక్కడ ఆకట్టుకున్న చిత్రాలని ఇతర భాషల్లోకి తీసుకురావడానికి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆసక్తిని చూపిస్తున్నాయి.

ఇప్పుడు ఇదే క్రమంలో ‘బాయ్స్ హాస్టల్’ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

‘హాస్టల్ హుడుగారు బేకగిద్దారే’ పేరుతో ఈ ఏడాది జులైలో కన్నడలో విడుదలైన చిత్రం అక్కడ ఆదరణ పొందింది.

ఇప్పుడు బాయ్స్ హాస్టల్ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ సంస్థలు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాయి.

మరి కన్నడలో ఆకట్టుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని ఏ మేర‌కు అలరించింది?

బాయ్స్ హాస్టల్

ఫొటో సోర్స్, Twitter/AnnapurnaStudios

హాస్టల్ లో అనుమానాస్పదం

తుంగా అనే బాయ్స్ హాస్టల్‌లో ఒక్కరాత్రిలో జరిగిన కథ ఇది.

బాయ్స్ హాస్టల్ వార్డెన్ (మంజునాథ్) చాలా కఠినమైన మనిషి.

మిలటరీ తరహా క్రమశిక్షణతో అక్కడి విద్యార్ధులకు చుక్కలు చూపిస్తుంటాడు.

అతడంటే అక్కడి విద్యార్ధులకు చెడ్డ చిరాకు. ఇలాంటి ప‌రిస్థితుల్లో మంజునాథ్ అనుమానాస్పద రీతిలో చనిపోతాడు.

తన చావుకి కారణం హాస్టల్ విద్యార్ధులే అని కొందరు పేర్లు, వాళ్ళు చేసిన పనులు గురించి ఓ ఉత్తరం కూడా రాస్తాడు.

వార్డెన్ మృతదేహాన్ని, ఆ ఉత్తరాన్ని చూసిన అక్కడి విద్యార్ధులు ఎలా స్పందించారనేదే మిగిలిన కథ.

బాయ్స్ హాస్టల్

ఫొటో సోర్స్, Twitter/AnnapurnaStudios

అల్లరే అల్లరి

ఈ కథలో ప్రత్యేకంగా కథానాయకుడు, ప్ర‌తినాయ‌కుడు అంటూ ఎవరూ వుండరు. అదే ఈ కథకు ప్రత్యేకతని తీసుకొచ్చింది.

ఒక అనుకోని సంఘటన ఎదురైతే హాస్టల్‌లోని విద్యార్ధులు ఎలా స్పందించారనేది వినోదాత్మకంగా చూపించాడు దర్శకుడు.

ఇందులో వినోదం పండే విధానం కూడా కొత్తగా వుంటుంది. హాస్టల్ వార్డెన్ ఓ ఉత్తరం రాసి అనుమానస్పద రీతిలో చనిపోతాడు.

ఆ ఉత్తరంలో పేర్లు వున్న విద్యార్ధులు పడిన కంగారు నుంచే ఇందులో వినోదం పుడుతుంది.

మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఫలానా సన్నివేశం, పాత్ర నుంచి ఫ‌న్‌ పుట్టిందనో, అదే క‌థ‌కి మూలం అనో చెప్పడానికి లేదు.

చిన్నప్పుడు క్లాస్‌లో మాట్లాడిన వారి పేర్లను బోర్డుపై ఎక్కించి పనిష్మెంట్ ఇచ్చేవారు.

ఈ సినిమాలో దాదాపుగా అలాంటి తరహలోనే ఎవరైనా తేడా చేస్తే.. వార్డెన్ రాసిన ఉత్తరంలో మిగతా వారి పేర్లు కూడా ఎక్కించేస్తామని కొందరు విద్యార్ధులు వార్నింగ్ ఇస్తూ చేసే అల్లరి భలే నవ్విస్తుంది.

బాయ్స్ హాస్టల్

ఫొటో సోర్స్, Twitter/AnnapurnaStudios

కథ, పాత్రలు.. దేనికవే

సహజంగా ఒక కథలో వినోదం కథ నుంచి, పాత్రల నుంచి, సన్నివేశాల నుంచి పుడుతుంది.

బాయ్స్ హాస్టల్‌లోని ప్రత్యేకత ఏమిటంటే.. వీటన్నిటి నుంచి వినోదం పుడుతూ రిజిస్టర్ కానీ పాత్రలు కూడా నవ్వించేస్తాయి.

పైగా ఇది ఒక జోనర్‌కి కట్టుబడి వుండదు. కాసేపు థ్రిల్లర్, కాసేపు డార్క్ కామెడీ, ఇంకాసేపు నోస్టాలజీ ఇలా జోనర్స్‌ని టచ్ చేస్తూ వెళుతున్నా పెద్దగా ఇబ్బంది రాదు.

హాస్టల్ బాయ్స్ లోని ఎనర్జీ, ఫన్‌ని చక్కగా పట్టుకున్నాడు దర్శకుడు.

అదే ఎనర్జీని తెరపై చూపడానికి ప్రయత్నించాడు.

ఈ క్రమంలో కొన్ని సన్నివేశాలు అతిగా అనిపించినప్పటికీ చాలా సన్నివేశాలు ఆ వయసులో ఒక సమస్యపై స్పందించే విధానం ఇలానే ఉంటుందని సర్ది చెప్పుకునేలా చేయడంలో మంచి ప్రతిభ చూపించాడు దర్శకుడు.

బాయ్స్ హాస్టల్

ఫొటో సోర్స్, Twitter/AnnapurnaStudios

అక్కడక్కడే తిరిగిన బాయ్స్

కొన్ని కథలకు ద్వితీయార్ధంలోనే ఇబ్బంది. తొలిసగం థ్రిల్ చేసి , ఆ థ్రిల్‌కి కారణమైన అసలు కథ చెప్పే సమయంలోనే అసలైన ఇబ్బంది వస్తుంది.

బాయ్స్ హాస్టల్ కి కూడా ఈ స‌మ‌స్య‌ ఎదురైంది.

ఇందులో కథ ఏమిటో తెలిసిపోయాక ప్రేక్షకుడి అంచనాలు తేలిపోతాయి.

తర్వాత వచ్చే కొన్ని సనివేశాల్లో వినోదం ఉన్నప్పటికీ ఈ కథని నడుపుతున్న పాత్ర రాజీవ్ (ప్రజ్వల్)లో కలిగిన నిరాశే ప్రేక్షకుడిలోనూ క‌లిగి, కొంత ఆవహిస్తుంది.

చాలా సన్నివేశాలు పునరావృతం అవుతున్న ఫీలింగ్ తెస్తాయి. సుదీర్గంగా సాగిన క్లైమాక్స్ సన్నివేశాలు కూడా విసిగిస్తాయి.

ఈ చిత్రంలో అతిధిగా చేసిన తరుణ్ భాస్కర్ పాత్ర ..‘’ఇంకో పదినిమిషాలా? ఇంత ఓపిక ప్రేక్షకులకు వుండదు’’ అని చెప్తాడు.

నిజమే.. అప్పటికే ఇది సరిపోద్ది అనే ఫీలింగ్‌లోకి వచ్చిన ప్రేక్షకుడిని ఇంకా పదినిమిషాలు బలవంతంగా కూర్చుబెట్టిన భావన కలుగుతుంది.

అందరూ హీరోలే

ఈ కథని ముందుకు నడిపే పాత్ర రాజీవ్‌ది. తన పాత్రని చాలా సహజంగా చేశాడు.

రాజీవ్ తర్వాత మరో పాత్ర పేరు చెప్పుకోవడానికి కూడా గుర్తువుండదు.

కానీ ఆ పాత్రలు చేసిన అల్లరి మాత్రం గుర్తుంటుంది. హాస్టల్‌లో ఎన్నో ప్రాంతాల, మతాలు, కులాల వారు వుంటారు.

అలాంటి పాత్రలన్నీ తీసుకొచ్చి, ప్రత్యేకమైన యాసలతో నవ్వులు పంచారు.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర మాండలికంలో డైలాగులు చెప్పే నటుడు ఆ యాసతోనే గుర్తుండిపోతాడు.

అలాగే హిందీ మాట్లాడే నటుడు కూడా. దాదాపు ఇందులో పాత్రలన్నీ హాస్టల్ వినోదాన్ని పంచాయి.

డెడ్ బాడీ పక్కన పెట్టుకొని కులాల గురించి, గర్ల్ ఫ్రెండ్స్ గురించి, పరీక్షల గురించి మాట్లాడుకునే మాటలు చాలా నవ్విస్తాయి.

ఈ సినిమాలో దర్శకుడు నితిన్ సీనియర్ విద్యార్ధి గురూజీ పాత్ర చేశాడు. ఈ కథని గంద‌రగోళం చేసి గోలగోల చేసే పాత్ర ఆయనదే.

చే గువేరా గెటప్‌లో తన గ్యాంగ్‌తో చేసిన వినోదం ఈ కథకు చాలా మలుపులని ఇచ్చింది.

అలాగే హాస్టల్ వార్డెన్‌గా చేసిన మంజునాథ్‌కి ఫుల్ మార్కులు పడతాయి. ఆ పాత్ర గురించి ఎక్కువ చెబితే ఇందులో వున్న థ్రిల్ మిస్ అవుతుంది.

ఇందులో రిషబ్ శెట్టి కూడా ఓ పాత్రలో కనిపిస్తారు. ఆయన హాస్టల్‌లో పూర్వ విద్యార్థి. ఐతే ఇది పెద్దగా రిజిస్టర్ కాదు.

ఆయన మద్యం మత్తులో వుండటంతో డబ్బింగ్ కూడా ఏదోలా వుంటుంది.

తెలుగులో ఆ పాత్ర సరిగ్గా కుదరలేదనే చెప్పాలి. అయితే ఈ పాత్ర రాకతో హాస్టల్ ఓ స్వరంగ మార్గం వుందని తెలుస్తుంది.

అది నవ్వు తెప్పించడంతో పాటు క్లైమాక్స్‌కి పనికొస్తుంది. తరుణ్ భాస్కర్ చేసిన ఎడిటర్ పాత్ర చిన్నదే అయినప్పటికీ స్క్రీన్ ప్లే మ్యాజిక్‌లో వున్న పాత్రది.

రష్మి

ఫొటో సోర్స్, Facebook/Rashmi Gautam

హీరోయిన్ అంటే అందాల ఆరబోతేనా ?

యాంకర్ రష్మి ఓ గ్లామరస్ హీరోయిన్ తరహా పాత్ర పోషించింది.

ఈ పాత్రకూ, కథకు సంబంధం లేదు. ఐతే ఇందులో ఒక సెటైర్ వుంది.

సినిమాల్లో కేవలం గ్లామర్‌కి మాత్రమే ఉపయోగించుకుకోవడానికి హీరోయిన్స్ పాత్రలని ఎలా తీర్చిదిద్దుతారో అంతర్లీనంగా ఈ పాత్రతో చూపించారు.

కొంచెం లోతుగా సినిమాని పరిశీలిస్తే.. కేవలం ఎడిటింగ్ టేబుల్ దగ్గరే ఆ పాత్ర వుంటుంది.

కథతో సంబంధం లేకుండా ఆమె సీన్లు వుంటాయి. ఎడిటర్ నచ్చినపుడు ఒకొక్క బిట్ పేర్చుకుంటూ వెళ్తాడు.

చివర్లో ఆమె పాత్రని ఉద్దేశించి.. ‘’రేపు సాంగ్ షూటింగ్ మేడమ్. ఉదయం వచ్చేయండి. మొహం ఫ్రెష్‌గా వుంటుంది’ అంటారు. దానికి కౌంటర్‌గా రష్మి.. ‘పాటలో నా మొహం ఎప్పుడు చూపించారు?’’ అంటుంది.

అర్ధం చేసుకుంటే సినిమాల్లో కేవలం గ్లామర్‌పై పరిమితమయ్యే హీరోయిన్స్‌పై దర్శకుడు వేసిన పెద్ద సెటైర్ ఇది.

కొత్త దర్శకుడి ధైర్యం

కథనం, ఎడిటింగ్, చిత్రీకరణ పరంగా చాలా కొత్త తరహ చిత్రమిది.

తన తొలి సినిమాకే రిస్క్ తీసుకున్నాడు దర్శకుడు. సినిమాలో దాదాపు సన్నివేశాలన్నీ హ్యాండ్ టు హ్యాండ్ కెమెరాతో షూట్ చేశారు.

సన్నివేశాలన్నీ చేతితో కెమెరా పట్టుకొని ఒక వీడియో తీస్తే ఎలాంటి ఎఫెక్ట్‌తో ఊగుతుంటాయో అలా వుంటాయి.

ఇందులో సీన్స్‌కి ఎడిటింగ్ లేదు. అ ఎడిటింగ్ లేకపోవడమే కొత్త తరహా ఎడిటింగ్.

ఈ సినిమా కథ రాయడం కంటే ముందు ఎడిటింగ్ రాసుకున్నాడు దర్శకుడు.

అది ఎలానో సినిమా చూస్తే అర్ధమౌతుంది. స్క్రీన్ ప్లే ఆర్డర్ కూడా కొంచెం డిఫరెంట్‌గా వుంటుంది.

ఈ కథ ఒకే హాస్టల్‌లో జరుగుతున్నా.. సీన్ ఓపెన్ చేసే విధానం కొత్తగా వుటుంది.

ఒకేచోట సినిమా జరుగుతుందనే ఫీలింగ్ ఐతే కలగదు. ఈ సినిమా మొత్తం డైలాగులే వుంటాయి. వాటి మధ్యలో మ్యూజిక్ చేయడం కష్టం.

కానీ ఆ కష్టమైన పని చాలా సమర్దవంతంగా చేశాడు అజినిష్ లోక్ నాథ్. ఎడిటర్‌కి మంచి మార్కులు పడతాయి. ఐతే ద్వితీయార్ధంలో సీన్స్ రిపీట్ అవుతున్న సంగతి దర్శకుడికి చెప్పాల్సింది.

రష్మి

ఫొటో సోర్స్, Youtube/ MRT Music

డబ్బింగ్ అంటే ఇదేరా ?

ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మొహలు వుండవు. కానీ ఎవరూ కొత్తవాళ్ళు అనిపించరు. దీనికి కారణం డబ్బింగ్.

చాలా సహజంగా తెలుగు నేటివిటికి తగట్టు డబ్బింగ్ చెప్పించారు.

కంటెంట్ యూత్ ఫుల్ ది కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన దాదాపు ప్రతి వీడియో, మీమ్ కంటెంట్‌ని డైలాగ్స్‌గా వాడేసుకున్నారు. అది సహజంగా కుదరడం విశేషం.

దాదాపు 500కి పైగా నటీనటులు హాస్టల్‌లో కనిపిస్తారు. దాదాపు వందమందికి డైలాగులు వున్నాయి.

ఇలాంటి సినిమాని డబ్బింగ్ చేయడం పెద్ద టాస్క్. ఆ పనిని చక్కగా చేశారు. ప్రతి వాయిస్ తెలుగు నేటివిటికి దగ్గరగా వుంటుంది.

కొత్త తరానికి, యూత్ ఫుల్ కంటెంట్‌ని ఆస్వాదించే ప్రేక్షకులకు నచ్చేలా వుంటుంది బాయ్స్ హాస్టల్.