కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం మంచిదా, కాదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫాతిమా పహ్రీన్
- హోదా, బీబీసీ హిందీ కోసం
చాలా మంది ఖాళీగా కూర్చుని ఉన్నప్పుడు కాలు ఊపడం మనం చూస్తుంటాం. కొంతమంది అసలు విరామం లేకుండా కాళ్లు కదిలిస్తూనే ఉంటారు. కాళ్లు ఊపడం దరిద్రం అంటూ మన చిన్నతనంలో తల్లిదండ్రులు, టీచర్లు కోప్పడిన సందర్భాలు కూడా ఉంటాయి.
కాళ్లు అదే పనిగా ఊపుతుంటే చేస్తున్న పని మీద దృష్టి నిలవదని కూడా అంటుంటారు.
కానీ, ఇంకొక విషయం కూడా ఉంది. ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు కూడా కొంతమంది ఇలా చేస్తారట. ఇలా చేయడాన్ని ఇంగ్లీష్‌లో ఫిజెటింగ్ అంటారు.
ఫిజెటింగ్ పై అంతకుముందు ఉన్న వాదనకు భిన్నమైన అభిప్రాయాన్ని సరికొత్త అధ్యయనం వెల్లడించింది.
ఆరోగ్యకరమైన బరువుకు, ఒత్తిడిని అధిగమించేందుకు, ఎక్కువ కాలం జీవించేందుకు ఫిజెటింగ్ సాయపడుతుందని తాజా అధ్యయనం తెలిపింది.
‘‘ఒకే ప్రదేశంలో నిరంతరం కూర్చుని ఉండటం అంత మంచిది కాదు. కానీ, కూర్చుని ఉన్న సమయంలో కాళ్లకు ఖాళీ లేకుండా నిత్యం కదుపుతూ ఉండటం మీ ఆరోగ్యంపై ఉన్న ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు’’ అని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌లో న్యూట్రిషనిస్ట్‌గా పనిచేసే జానెత్ కాడే బీబీసీ ప్రొగ్రామ్ ది ఇన్‌ఫినిటీ మంకీ కేజ్‌లోని ఒక ఎపిసోడ్‌లో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిజెటింగ్ అంటే ఏమిటి?
ఫిజెటింగ్ అంటే నరాల నిరంతర చలనంగా పేర్కొనవచ్చు. కానీ, ఫిజెటింగ్‌ను శరీరంలో భాగమైన ఒక రిథమిక్ మూవ్‌మెంట్‌గా, మెదడు నియంత్రించే పనిగా మాయో క్లినిక్‌లోని మెడిసిన్ ప్రొఫెసర్, ఇప్సేన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ జేమ్స్ లెవాయిన్ అభివర్ణించారు.
ఫిజెటింగ్‌పై ఫోర్టిస్ హెల్త్‌కేర్ నేషనల్ మెంటల్ హెల్త్ ప్రొగ్రామ్ ఛైర్మన్ డాక్టర్ సమీర్ పారిఖ్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫిజెటింగ్‌ను మంచి లేదా చెడు కేటగిరీ కింద చూడటం సరైంది కాదని అన్నారు.
కొన్నిసార్లు ఇలా కాలు ఊపడమనేది మీ పనితీరును తగ్గించి, తప్పులు చేసే అవకాశాన్ని పెంచుతుందని బీబీసీతో చెప్పారు.
శారీరక అనారోగ్యానికి ఒక లక్షణంగా కూడా డాక్టర్ పారిఖ్ తెలిపారు.
‘‘కొంతమంది వ్యక్తులకు ఫిజెటింగ్ ప్రయోజనకరంగా నిలవవచ్చు. కానీ, దీన్నే ఆధారంగా చేసుకుని ఫిజెటింగ్‌ను ప్రయోజనకరమనో లేదా ఏదైనా ఒక వ్యాధికి సంకేతంగా మాత్రం మనం చెప్పలేం’’ అని అన్నారు.
ఫిజెటింగ్‌పై విడుదలైన తాజా అధ్యయనంతో ముంబైకి చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ రుక్షిదా సయ్యిదా కూడా పూర్తిగా ఏకీభవించలేదు.
పిల్లలు ఆడుకునేందుకు సమయం దొరక్కపోయినా లేదా ఆడుకునేందుకు అవసరమైన స్థలం లేకపోయినా.. వారి యాక్టివిటీని ఫిజెటింగ్ రూపంలో చేస్తారని బీబీసీతో జరిపిన సంభాషణలో చెప్పారు.
ఫిజెటింగ్‌ను మనం పలు విధాలుగా చూడొచ్చు. కొందరికి ఇది సాధారణ అలవాటుగా ఉంటే.. కొందరికి ఇది కొన్ని వ్యాధుల లక్షణాలను సూచించేదిగా ఉంటుంది. కొన్నిసార్లు ఫిజెటింగ్ మంచి ఉత్పాదకతకు సూచనగా కూడా చెప్పొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఊబకాయానికి విరుగుడా?
ప్రపంచవ్యాప్తంగా 1975 నుంచి ఊబకాయం కేసులు మూడింతలు పెరిగాయి. దీనికి ఒక కారణం మనం పనిచేసే విధానం.
గంటల తరబడి చైర్‌లోనే కూర్చుంటూ ఉండటం వల్ల, మన శరీరంలోని మెటాబాలిజం తగ్గిపోతుంది. ఇది బ్లడ్ షుగర్‌ను, రక్తపోటును నియంత్రించే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. శరీరంలోని కొవ్వును కరిగించేందుకు కూడా అడ్డంకిగా మారుతుంది.
ఒకే దగ్గర కూర్చుని ఉండటం కంటే నిత్యం కదులుతూ ఉండటం వల్ల బరువు తగ్గేందుకు ఫిజెటింగ్ సాయపడుతుందని ఆధారాలున్నాయి.
సన్నగా ఉండే వ్యక్తులు ఎక్కువ ఫిజెటింగ్ చేస్తూ మన ఆఫీసుల్లో కనిపిస్తుంటారని లెవాయిన్ తన అధ్యయనంలో గుర్తించారు.
ఆఫీసుల్లో లావుగా ఉన్న వారి కంటే సన్నగా ఉన్నవారు ఎక్కువగా కదులుతూ ఉంటారని, ప్రతి రోజూ రెండు గంటల పాటు వారి సీట్లలో కదులుతుంటారని లెవాయిన్ అధ్యయనం తెలిపింది.
ఫిజెటింగ్ మాదిరి మన కాళ్లను పదేపదే కదుపుతూ ఉండటం వల్ల మన శరీరంలోని అదనపు బరువును తగ్గించుకోగలమని పరిశోధకులు చెప్పారు.
ఎలాంటి కదలిక లేకుండా ఒకే దగ్గర కూర్చునే వారి కంటే ఫిజెటింగ్ చేసే వారు 29 శాతం ఎక్కువ కేలరీలను కరిగిస్తున్నారని ఒక అధ్యయనం గుర్తించింది.
కాళ్లను ఊపే 24 మంది వ్యక్తుల్లో ఎనర్జీ స్థాయిలపై ఒక చిన్న అధ్యయనం చేపట్టారు. శరీర ఎనర్జీ స్థాయులను సమతౌల్యం చేసుకునేందుకు ఫిజెటింగ్ సాయపడుతుందని ఇది సూచించింది.
కేవలం బరువు పెరగకుండా నియంత్రించుకోవడమే కాకుండా, ఫిజెటింగ్ వల్ల మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీ బ్రెయిన్‌కి కూడా ఇది ప్రయోజనకరంగా నిలవనుంది.
ఫిజెటింగ్ ఊబకాయాన్ని తగ్గించగలదని, కానీ, ఏ డాక్టర్ మీకు ఇది చేయాలని సూచించరని డాక్టర్ సయ్యిదా చెప్పారు.
ఫిజెటింగ్‌కు, శారీరక వ్యాయామాలకు చాలా తేడా ఉందన్నారు. వర్కింగ్ అవుట్‌కు ఫిజెటింగ్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదనే విషయంలో అనుమానమే అక్కర్లేదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిజెటింగ్‌తో ఎక్కువ కాలం జీవించవచ్చా?
ఫిజెటింగ్ వల్ల ఎక్కువ కాలం జీవించవచ్చనే దానికి సరైన ఆధారాలు లేవు. కానీ, నిరంతర ఒత్తిడి మన జీవన కాలాన్ని తగ్గిస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒకేచోట కదలకుండా ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల గుండె జబ్బులు రెండింతలు పెరుగుతాయని నిపుణులు చెప్పారు. డయాబెటీస్, ఊబకాయం, ఒత్తిడి, ఆందోళన ప్రమాదాలు కూడా పెరుగుతాయి. వీటిని తగ్గించడంలో ఫిజెటింగ్ కొంత సాయ పడుతుండొచ్చు.
42 మంది వ్యక్తులపై ఒక అధ్యయనాన్ని చేపట్టారు. జాబ్ ఇంటర్వ్యూ లాంటి ఒక వాతావరణంలో వారిని కూర్చోబెట్టారు. ఇద్దరి వ్యక్తుల్ని ఎదురెదురుగా కూర్చోబెట్టి కొన్ని టాస్క్‌లను ఇచ్చి, వారి బ్రెయిన్ మానిపులేషన్ ఏ విధంగా పనిచేస్తుందో చూశారు.
పదే పదే పెదాలు కొరుక్కుంటూ లేదా వారి ముఖాలను పదే పదే తాకడం, కాళ్లు కదపడం వంటి ఫిజెటింగ్ ప్రవర్తన ఉన్నవారు తక్కువ ఒత్తిడితో ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది.
కూర్చున్నప్పుడు కాళ్లను కదపడం మీ కాళ్లలోని ధమనులను రక్షిస్తుందని తాజా అధ్యయనం గుర్తించింది. ఇది ధమనుల్లో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు సాయపడుతుందని తెలిపింది.
ఫిజెటింగ్‌ను అంతకుముందు ఎంత చెడుగా ప్రచారం చేసినప్పటికీ, మీ ఆరోగ్యానికి ఈ యాక్టివిటీ ప్రయోజనం చేకూర్చాలంటే తరచూ మీరు దీన్ని చేయాలి.
ఒకే దగ్గర, ఒకే పద్ధతిలో కూర్చోవడాన్ని మీరు తగ్గించాలి. ఫిజెటింగ్ ఈ విషయంలో మీకు సాయం చేస్తుంది. మీ ఆరోగ్యంపై ఇది ప్రభావాన్ని చూపుతుంది.
‘‘సహజంగా ఈ యాక్టివిటీ చేసేలా మీరు మీ శరీరానికి అలవాటు చేస్తే, మీరు మరింత ఆరోగ్యకరంగా, సంతోషకరంగా, ఎక్కువ కాలం జీవించవచ్చు’’ అని లెవాయిన్ చెప్పారు.
ఫిజెటింగ్ మీ ఆరోగ్యానికి హానికరమా లేదా అనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని డాక్టర్ సమీర్ పారిఖ్, డాక్టర్ రుక్షిదా సయ్యిదా అంటారు.
ఎవరైనా ఫిజెటింగ్ చేస్తుంటే, వారిపై ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చడం మాత్రం తప్పని వారన్నారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో టేకు చెట్లు ఎందుకు ఎండి పోతున్నాయి?
- ఫుకుషిమా రియాక్టర్: అణు వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలిన జపాన్, ఈ నీటి వల్ల చేపలు చచ్చిపోతాయా, మనుషులకు ప్రమాదమెంత?
- కుక్కలు మనుషులకు ఎలా దగ్గరయ్యాయి? ఒకప్పటి పెంపుడు జంతువులైన తోడేళ్లు ఎందుకు దూరమయ్యాయి?
- తిరుపతి జిల్లా: దళితులను గొల్లపల్లి గుడిలోకి రానివ్వలేదా? ఇది తెలుగు దళితులతో తమిళ దళితుల పోరాటమా?
- విశాఖపట్నం - అమెరికన్ కార్నర్: యూఎస్ వెళ్లాలనుకునే వారికి ఉచితంగా సేవలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














