‘తలపై పిడుగు పడి, జ్ఞాపకశక్తి కోల్పోయా. మళ్లీ మామూలు మనిషిని ఎలా అయ్యానంటే...’

ఫొటో సోర్స్, SCOTT KNUDSON
పది లక్షల మందిలో ఒకరు పిడుగుపాటుకు గురవుతుంటారని చెబుతుంటారు. స్కాట్ క్నూడ్సెన్ అందులో ఒకరు.
అమెరికాలోని టెక్సస్‌కు చెందిన స్కాట్ క్నూడ్సెన్ ఒక కౌబాయ్ (పశువుల కాపరి). 2005లో ఆయన పిడుగుపాటుకు గురయ్యారు. ఆ ప్రమాదం నుంచి స్కాట్ ప్రాణాలతో బయటపడగలిగారు.
పశువుల కాపరుల కుటుంబంలో పుట్టిన అయిదో తరం వ్యక్తి స్కాట్. పశువుల కాపరిగా ఉరుములతో కూడిన వర్షాల్లో పనిచేయడం తనకు బాగా అలవాటేనని స్కాట్ చెప్పారు.
అయితే, నీలంగా ఉన్న ఆకాశం నుంచి పగటి పూట మెరుపు రావడం ఆయనెప్పుడూ చూడలేదు. మెరుపుతోపాటు వచ్చిన పిడుగు ఆయన తలను తాకింది. అది జరిగినప్పుడు ఆయన చేతుల్లో ఏడాది వయస్సున్న కూతురు హీలీతో పాటు వారికి కొన్ని అడుగుల దూరంలోనే ఆయన భార్య ట్రేసీ ఉన్నారు. ఆ రోజే హీలీ మొదటి పుట్టినరోజు.
ప్రస్తుతం హీలీ వయస్సు 19 ఏళ్లు. తమ ముగ్గురి జీవితాలను మార్చిన నాటి అసాధారణ అనుభవం గురించి స్కాట్, ట్రేసీ, హీలీ బీబీసీ రేడియో షోలో మాట్లాడారు.
‘‘నీకో సర్‌ప్రైజ్ ఉంది, పొలానికి రమ్మంటూ నా భార్య నన్ను పిలవడం నాకు బాగా గుర్తుంది. నేను అక్కడికి వెళ్లినప్పుడు చేతుల్లో హీలీతో నా భార్య అక్కడ నిల్చున్నారు. ట్రేసీ నా ట్రాక్టర్‌ను శుభ్రంగా కడిగారు. దాన్ని చూపించేందుకే నన్ను అక్కడికి పిలిచారు.
తళతళ మెరిసిపోతున్న ట్రాక్టర్‌ను చూసి నేను సంతోషిస్తున్నా. అప్పుడే హీలీని నా చేతుల్లో పెట్టింది ట్రేసీ. ఎడమ చేత్తో హీలీని నేను ఎత్తుకున్నా. నా కుడి వైపు ట్రేసీ ఉంది.
అప్పుడు ఆకాశం నీలంగా ఉంది. మాకు దూరంగా ఎక్కడో వర్షం పడుతోంది. కానీ, మేం ఉన్న చోట ఎండగానే ఉంది. మా చుట్టూ కోడిపిల్లలు, గుర్రాలు, కుక్కలు కూడా ఉన్నాయి’’ అని స్కాట్ నాటి పరిస్థితుల్ని గుర్తు చేసుకున్నారు.
తామున్న చోట ఆకాశంలోకి చూసినప్పుడు అంతా నిర్మలంగానే కనిపించిందని, ప్రమాదకరంగా ఏమీ కనిపించలేదని ట్రేసీ చెప్పారు.
కానీ, అప్పుడే ఎన్నడూ విననంత పెద్ద శబ్దాన్ని తాము విన్నామని, భారీ మెరుపును చూశామని స్కాట్ చెప్పారు.

ఫొటో సోర్స్, SCOTT KNUDSON
‘ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం’
‘‘ఆ పిడుగుపాటు ట్రేసీ ముందు సంభవించింది. పిడుగు నా తల, చేయి గుండా నా శరీరంలోకి ప్రవహించింది. నేను నేల మీద నిలబడి ఉండటం వల్ల నా చేతుల్లో ఉన్న హీలీకి దానివల్ల ఏమీ కాలేదు. అది ఆమె శరీరం చుట్టు నుంచి వెళ్లిపోయింది.
ఆ శబ్దం, కాంతికి భయపడి గుర్రాలన్నీ చెల్లాచెదురయ్యాయి. కాసేపటి వరకు అక్కడంతా గందరగోళం నెలకొంది’’ అని స్కాట్ వివరించారు.
చిన్నారి హీలీకి అప్పుడేం జరిగిందో పెద్దగా గుర్తులేదు.
కానీ, అంతటి శక్తిమంతమైన పిడుగుపాటుతో ఏడాది వయస్సున్న పాపకు ఏమీ జరగకపోవడం విచిత్రంగా అనిపిస్తోందని హీలీ అన్నారు. ఆ పిడుగుపాటు కారణంగా తనకు ఎలాంటి దుష్ప్రభవాలూ కనిపించలేదని ఆమె చెప్పారు.
పిడుగు నేరుగా తనను తగలకపోయినప్పటికీ, దాని ప్రభావం కొంత తనపై పడిందని ట్రేసీ తెలిపారు.
‘‘నా ముక్కులో షాక్ తగిలినట్లుగా అనిపించింది. కొన్ని రోజుల వరకు నేను రెప్పలు ఆర్పినప్పుడల్లా నా కళ్లలో వెలుగు (కాంతి) కనిపించేది. ఆ మెరుపు అంత బలంగా పడింది.
పిడుగుపాటుకు గురైనప్పుడు కంగారుగా మేం ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. నువ్వు బాగానే ఉన్నావా? అని స్కాట్ నన్ను అడిగారు. ‘‘నేను బాగానే ఉన్నా. కానీ, నా ముక్కులో షాక్ తగిలినట్లుగా అనిపించింది. నాకేం గాయాలు కాలేదు’’ అని స్కాట్‌కు తాను చెప్పినట్లు ట్రేసీ తెలిపారు.
ఆశ్చర్యకరంగా, పిడుగుపాటుకు గురైనప్పటికీ ఏమీ జరగనట్లుగా వారిద్దరూ తమ పనులను కొనసాగించారు.
‘‘మా రోజూవారీ పనుల్లో పడిపోయాం. ఏదో జరగరానిది జరిగినట్లుగా మాకేమీ అనిపించలేదు. కానీ, ఇంట్లోకి వెళ్లి చూసినప్పుడు విద్యుత్ పరికరాలన్నీ రీసెట్ అయినట్లుగా గుర్తించాం’’ అని ట్రేసీ చెప్పారు.
ఎండార్ఫిన్లు, అడ్రినలిన్ స్థాయులు బాగా పెరిగిపోవడం వల్ల ఏం జరిగిందో తాము గుర్తించలేకపోయామని స్కాట్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
స్కాట్ జాంబీలా కనిపించారు: ట్రేసీ
కానీ, పిడుగుపాటు లక్షణాలు బయటపడటానికి ఎక్కువ సమయం పట్టలేదు.
‘‘రోజు గడిచినకొద్దీ శరీరంలో నొప్పులు తీవ్రం కావడం మొదలైంది. అప్పుడే పిడుగుపాటుకు సంబంధించిన గాయాలు, లక్షణాలు నా శరీరంలో నేను గుర్తించాను’’ అని స్కాట్ చెప్పారు.
హీలీ బర్త్‌డే వేడుకను మరుసటి రోజు జరపాలని వారు ముందే నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగా పుట్టినరోజు వేడుక కోసం కేక్ తీసుకురావడానికి పాపను తీస్కొని ట్రేసీ పక్కనే ఉన్న పట్టణానికి వెళ్లారు.
‘‘నేను ఇంటి నుంచి బయటకు వెళ్లి దాదాపు గంటన్నర అయి ఉంటుంది. ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి స్కాట్ ఒక జాంబీలాగా కనిపించారు.
ఆయన కళ్ల కింద బాగా నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. మాట కూడా తూలుతోంది. ఒక వాక్యం పూర్తిగా మాట్లాడటానికి చాలా కష్టపడ్డారు. నిల్చోలేకపోయారు. బాగా తాగినవాడిలా ఆయన కనిపించారు.
ఆయన్ను అలా చూసి షాక్ అయ్యాను. వెంటనే ఆసుపత్రికి ఫోన్ చేయగా, ఆసుపత్రికి తీసుకురావాలని వారు చెప్పారు.
స్కాట్ పరిస్థితి సరిగ్గా లేనట్లుగా డాక్టర్లు గుర్తించారు. కానీ, ఆయనకు అసలేమైందో వారు పసిగట్టలేకపోయారు. స్కాట్ కంకషన్‌కు గురైనట్లు వారు నిర్ధరించారు. తర్వాత ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అంతా సర్దుకుంటుందని అనుకొని ఇంటికి వచ్చేశాం. కానీ, ఆసుపత్రి నుంచి బయటకు రాకుండా ఉండాల్సిందని ఆ తర్వాతే మాకు తెలిసింది’’ అని ట్రేసీ వివరించారు.
‘‘ఆ వైద్యుల పట్ల మాకు కోపం రాలేదు. ఎందుకంటే, పిడుగుపాటుకు గురైన ఒక రోగిని వారెప్పుడూ చూసి ఉండరు. పిడుగుపాటుకు గురై చనిపోయిన వారినే వారు చూసి ఉంటారు’’ అని స్కాట్ అన్నారు.
దెబ్బలు తగలడం, అవి మానిపోవడం తనకు ఎప్పుడూ జరుగుతుండేదే కాబట్టి ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు తాము వెనుకాడలేదని స్కాట్ చెప్పారు.
‘‘నేను చాలాసార్లు ఎముకలు విరగ్గొట్టుకున్నా. 60 చోట్ల ఎముకలు విరిగాయి. 9 సార్లు కంకషన్ (దిమ్మ తిరగడం)కు గురయ్యా. నా వీపు, భుజం, మోకాళ్లు, ముఖంలో మెటల్ భాగాలను అమర్చారు’’ అని స్కాట్ వివరించారు.
ఆయన పరిస్థితి అలా ఉన్నప్పటికి, మరుసటి రోజు జరగాల్సిన తన కూతురు పుట్టినరోజు వేడుకలను రద్దు చేసేందుకు ఆయన ఒప్పుకోలేదు.
రోజులు గడిచిన కొద్దీ పిడుగుపాటు ప్రభావాలు మరింత ముదిరాయని ట్రేసీ చెప్పారు. దీంతో వైద్య నిపుణులను సంప్రదించినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, SCOTT KNUDSON
బ్రెయిన్ రీసెట్
ఆయనకు ఎలాంటి చికిత్స చేయాలో వైద్యులకు తెలియలేదని ట్రేసీ చెప్పారు.
‘‘సీటీ స్కాన్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ వంటి పరీక్షలు చేసి మెదడులోని తరంగాలను పరిశీలించారు. అవి అసాధారణంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
‘ఇది ఎలాంటిదంటే, సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసి రీస్టార్ట్ చేసినట్లు’ అని స్కాట్ మెదడు పరిస్థితి గురించి వైద్యులు మాతో చెప్పారు. మెదడుకు అయ్యే ప్రతీ గాయం విభిన్నంగా ఉంటుందని వారు అన్నారు.
స్కాట్ మెదడును రీసెట్ చేయడం వల్ల ఆయన జ్ఞాపకశక్తిని కోల్పోవాల్సి వచ్చింది. చదవడం, రాయడం మళ్లీ నేర్చుకోవాల్సి వచ్చింది’’ అని ఆమె వివరించారు.
ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం, డెంటల్ ఫిల్లింగ్స్ ఊడిపోవడం వంటి విచిత్రమైన లక్షణాలను కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది.
‘‘పాప్‌కార్న్ తింటుండగా ఫిల్లింగ్స్ బయటకు రావడం మొదలైంది. చాలా కాలం పాటు గుండె దడ వేధించింది. తల పై భాగంలో తీవ్రంగా నొప్పి ఉండేది. ఇది ఏళ్ల పాటు నన్ను వేధించింది’’ అని తనపై పిడుగుపాటు ప్రభావం గురించి స్కాట్ వివరించారు.

ఫొటో సోర్స్, SCOTT KNUDSON
గురువుగా మారిన భార్య
ప్రస్తుతం తన గుండె, ఊపిరితిత్తులు సరిగ్గానే పనిచేస్తున్నాయని స్కాట్ చెప్పారు.
ఇంత జరిగినప్పటికీ తమకేదో చెడు జరిగినట్లుగా తామెప్పుడూ భావించలేదని వారు అన్నారు. ఎక్కువ సమయం ట్రేసీతోనే తాను గడిపినట్లుగా స్కాట్ తెలిపారు.
‘‘ఆమె చాలా కష్టమైన దశను ఎదుర్కొన్నారు. ఎందుకంటే పనులన్నీ ఆమె ఒక్కరే చూసుకోవాల్సి వచ్చింది. పశువుల పోషణ, ఇద్దరు పిల్లల్ని పెంచడం, నాకు చదవడం, రాయడం నేర్పించడం ఇలా అన్నింటినీ ఆమె చేశారు’’ అని స్కాట్ వెల్లడించారు.
నాటి రోజుల్ని ట్రేసీ కూడా గుర్తు చేసుకున్నారు.
చదవడం, రాయడంలో ప్రాథమిక జ్ఞానాన్ని పొందడానికి స్కాట్‌కు ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టిందని ట్రేసీ చెప్పారు.
అయితే, ఆయన జ్ఞాపకాల్లో నుంచి చెదిరిపోయిన గతాన్ని మళ్లీ గుర్తు చేయడానికే చాలా ఎక్కువ సమయం పట్టినట్లు తెలిపారు.
‘‘నేను చాలా మంచి జ్ఞాపకాలను మర్చిపోయా. నా బాల్యం చాలా గొప్పగా గడిచింది. ట్రేసీతో పెళ్లి, హీలీ పుట్టడం, తొలిసారి గుర్రపు స్వారీ చేయడం లాంటి అద్భుతమైన జ్ఞాపకాలను నేను మర్చిపోయాను.
మా సొంత ఊరికి వెళ్లినప్పుడు అక్కడి వారిని కూడా నేను గుర్తు పట్టలేకపోయాను’’ అని స్కాట్ చెప్పారు.
ఇంట్లో భద్రపరిచిన ఫోటోల సహాయంతో వాటి తాలూకూ కథలను చెబుతూ స్కాట్ జ్ఞాపకాలను పునర్నిర్మించడంలో ట్రేసీ కీలక పాత్ర పోషించారు.
ఈ రోజుకూ తనకు కొన్ని విషయాలు గుర్తున్నాయో లేవో కూడా తెలియదని స్కాట్ అన్నారు.
‘‘ఒక కథను చాలాసార్లు చెబితే ఆయనకు గుర్తుండేది. మా పెళ్లి గురించి నేను చాలా ఫోటోలు చూపిస్తూ, దానికి సంబంధించిన చాలా కథలు చెప్పాను. కాబట్టి మా పెళ్లి గురించి ఆయన కాస్త ఇప్పుడు వివరంగా చెప్పగలరు’’ అని ట్రేసీ చెప్పారు.
‘‘ఆ జ్ఞాపకాలన్నీ మళ్లీ నాకెలా తిరిగొస్తాయో తెలియదు. కానీ, అవన్నీ మళ్లీ నాకు గుర్తు రావాలని నేను కోరుకుంటున్నా’’ అని స్కాట్ అన్నారు.
తమకు జరిగిన చెడును, ఇతరుల్లో స్ఫూర్తిని నింపడం కోసం ఉపయోగిస్తున్నామని ట్రేసీ అన్నారు.
జీవితంలో ఏం జరిగినా దాన్నుంచి బయటపడొచ్చని తమ కథ ద్వారా ఇతరులకు చెప్పే అవకాశం తమకు దొరికిందని వారు అంటున్నారు.
‘‘ఇలాంటివి ఎందుకు జరుగుతాయో మనకు తెలియదు. కానీ, వాటి నుంచి పారిపోవడం కంటే వాటిని అంగీకరించాలి’’ అని ట్రేసీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి... పిల్లలు, టీనేజర్లు ఆ వలయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














