హోటల్ రివ్యూలు రాస్తే డబ్బులు ఇస్తామని చెప్పి, లక్షలు కాజేస్తున్న సైబర్ దొంగలు.. ఈ మోసాన్ని ఎలా గుర్తించాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
రివ్యూలు రాసినందుకు వేల రూపాయలు వస్తాయని ఆశజూపి, కొందరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన సైబర్ స్కామర్ల వ్యవహారం విశాఖపట్నంలో బయటపడింది.
ఈ నేరాలను గుర్తించి పట్టుకునే సమయానికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు వంద మంది బాధితులు కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారని విశాఖపట్నం పోలీసులు తెలిపారు.
బాధితుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులతోపాటు సాప్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా ఉన్నారు. వీరంతా వీలున్న సమయంలో అదనపు ఆదాయం సంపాదించాలని పార్ట్ టైమ్ జాబ్స్ కోసం ఎదురుచూసినవారు.
వీరి అవసరాన్ని అవకాశంగా మలచుకొని, ఆశపెట్టి డబ్బులు గుంజేశాయి సైబర్ స్కామర్లు.
విశాఖకు చెందిన ఓ మహిళ ఇటీవల నగర పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఇలాంటి నేరం బయటపడింది.

ఫొటో సోర్స్, Getty Images
లింక్ వస్తుంది.. మోసం మొదలవుతుంది
మోహిత (అసలు పేరు కాదు) విశాఖలో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పుస్తకాలు చదవడం వాటికి రివ్యూలు రాయడం ఆమెకు అలవాటు. ఈ విషయం ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే అర్థమవుతుంది. దీన్నిగమనించిన సైబర్ నేరగాళ్లు ఒక పార్ట్ టైమ్ జాబ్ ఉందంటూ ఆమెకు ఒక లింక్ పంపారు.
“లింక్ చూసిన నేను క్లిక్ చేస్తే ఒక వాట్సప్ గ్రూప్‌కు తీసుకెళ్లింది. ఆ గ్రూపులో ఒక మహిళ మెసేజ్‌ల ద్వారా పరిచయం చేసుకుని హోటల్ రివ్యూస్ రాస్తే, ఒక్కో రివ్యూకు రూ.150 ఇస్తామని చెప్పారు. అప్పటికే రివ్యూలు రాయడం అలవాటున్న నేను సరే అన్నాను. రోజుకు 25 రివ్యూలు రాయాల్సి ఉంటుందని చెప్పారు. దానికి ఒప్పుకున్నాను.” అని మోహిత బీబీసీతో చెప్పారు.
తాను ఈ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఎలా మోసపోయిందీ ఆమె బీబీసీకి వివరించారు.
“తొలిరోజు వాళ్లు ఇచ్చిన హోటల్స్‌కు రివ్యూస్ రాసినందుకు దాదాపు రూ.800 వచ్చాయి. వాటిని నేను విత్ డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత రోజు మరికొంత. ఇలా ఆరు రోజుల వరకు రివ్యూలకు డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత మీరు రూ.1000 కడితే మరో గ్రూపులోకి తీసుకుని వెళ్లి ఎక్కువ రివ్యూలు ఇస్తాం. మీకూ ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆ డబ్బు కడితే రివ్యూలు పెంచారు. నాకూ ఎక్కువ డబ్బులు వచ్చాయి” అని మోహిత చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మీరు ఇంత బాగా రాస్తారని అనుకోలేదు’
అలా రోజు రివ్యూలు రాస్తూ డబ్బులు సంపాదిస్తున్నా, వాటిని విత్ డ్రా చేసుకునేందుకు ఒక ప్రత్యేకమైన బటన్ ఒకటి స్క్రీన్‌పై కనిపిస్తుంది. అందులో మనం ఎంత సంపాదిస్తున్నామో, మన అకౌంట్లో ఎంత డబ్బు ఉందో కూడా చూపిస్తుంటుంది. మూడు రోజుల తర్వాత ఒకామె మోహితకు ఫోన్ చేశారు.
“మీరు రాస్తున్న రివ్యూలను చూస్తున్నాను. మీరు చాలా బాగా రాస్తున్నారు. ఇంత బాగా రాస్తారని మేం అసలు ఊహించలేదు. మిమ్మల్ని వీఐపీ గ్రూపులో చేరుస్తాం. మీ నుంచి మాకు మంచి రివ్యూస్ వస్తాయనే నమ్మకం ఉంది. మీకూ అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి. కాకపోతే అది పది మంది మాత్రమే ఉండే ప్రీపెయిడ్ గ్రూప్. డబ్బులు కట్టిన వారికే ఎక్కువ డబ్బులు వచ్చే రివ్యూలు, టాస్కులు ఇస్తామని చెప్పారు. కాకపోతే ఈ గ్రూపు నుంచి ఎవరు విత్ డ్రా అయినా మిగతా వారికి కూడా డబ్బులు రావు’’ అని ఆ మహిళ తనతో చెప్పినట్లు మోహిత వెల్లడించారు.
‘‘నేను సరేనని రూ. 50 వేలు కట్టాను. నేను కట్టిన డబ్బులు, వాళ్లు ఇచ్చిన డబ్బులతో కలిపి నా అకౌంట్లో రూ. 60 వేలు చూపించింది. దానిని విత్ డ్రా చేసుకుందామంటే, స్క్రీన్ పైన ఉండే విత్ డ్రా బటన్ పని చేయడం లేదు” అని చెప్పారు మోహిత.

ఫొటో సోర్స్, UGC
ఆ డబ్బు విత్ డ్రా కావాలంటే....
‘‘డబ్బులు విత్ డ్రా చేసుకునే బటన్ పేరు వెల్ఫేర్ టాస్క్ బటన్. అది ఎన్నిసార్లు నొక్కినా పని చేయడం లేదు. ఆ విషయాన్ని గ్రూప్ మేనేజ్ చేసే ఆమెకు చెప్తే...ఆ బటన్ పని చేయాలంటే మరికొన్ని టాస్కులని పూర్తి చేయాలని చెప్పింది. అది పూర్తి చేసినా డబ్బులు విత్ డ్రా అవ్వడం లేదు. నా అకౌంట్లో డబ్బులు పెరుగుతున్నట్లు మాత్రం చూపిస్తుంది. ఎందుకు విత్ డ్రా కావడం లేదంటే...ఏదో తప్పు జరిగిందని, మరికొంత డబ్బు చెల్లిస్తే విత్ డ్రా చేయవచ్చనీ చెప్పారు. నాకు అనుమానం వచ్చి డబ్బులు వేయడం మానేసి, నేను ఈ టాస్కుల నుంచి బయటకు వచ్చేస్తానని చెప్పాను” అని మోహిత వివరించారు.
అయితే, ఈ గ్రూపులోంచి బయటకు రావాలంటే గ్రూపు సభ్యులే అభ్యంతరం వ్యక్తం చేశారని మోహిత వెల్లడించారు.
“మా గ్రూపులోని సభ్యులు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. మీరు విత్ డ్రా అయితే మాకు డబ్బులు రావు. ఇప్పటివరకు మేం ఈ గ్రూపులో లక్షల రూపాయలు సంపాదించాం. మీ వల్ల మాకు ఆ డబ్బులు రాకుండా పోతాయి. మీరు విత్ డ్రా అయితే మాకు ఆత్మహత్యే గతి అంటూ దాదాపు బెదిరించినట్లే మాట్లాడేవారు. అలా నేను డబ్బులు విత్ డ్రా కాకపోయినా వాళ్లిచ్చిన రివ్యూ టాస్కులు కొంటూ రూ. 8.5 లక్షలు పొగొట్టున్నాను. పూర్తిగా మోసపోయానని అర్ధమై పోలీసులను ఆశ్రయించాను” అని మోహిత చెప్పారు.
హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తున్న మరో మహిళ కూడా ఇదే తరహాలో మోసపోయారు. వీరిద్దరూ పోలీసులను ఆశ్రయించారు.

ఇది కోట్ల రూపాయల మోసం: పోలీసులు
హోటల్ రివ్యూస్ పేరుతో మొదలు పెట్టి, ఆ తర్వాత రకరకాల టాస్కులు ఇస్తూ, ప్రజల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్ల గ్యాంగులో ఇద్దర్ని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరిపై ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడింది.
“విశాఖలో హోటల్ రివ్యూస్, టాస్క్ గేమ్స్ పేరుతో జరిగిన సైబర్ మోసాలకు సంబంధించి 2022లో 66 కేసులు, 2023 ఏడాదిలో 72 కేసులు నమోదయ్యాయి. ఈ నేరాల్లో 2022లో 2 కోట్లు, 2023లో 9 కోట్ల రూపాయలు కాజేశారు. ఒక రివ్యూ రాస్తే 150 రూపాయలు ఇస్తాం అని మొదలు పెడతారు. ఆ తరువాత టెలిగ్రాం గ్రూప్లోకి తీసుకొని వెళ్తారు. తర్వాత పెద్ద టాస్కుల పేరుతో ట్రాప్‌లోకి లాగుతారు. 2 వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు లాగేస్తారు” అని విశాఖపట్నం పోలీసు కమిషనర్ త్రివిక్రమ వర్మ చెప్పారు.
ఇలా మోసం ద్వారా బాధితుల నుంచి కాజేసిన సొమ్మును బిట్ కాయిన్స్ గా మారుస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ నేరంలో ఇద్దరినీ అరెస్ట్ చెయ్యగా....వారిని మలేసియా నుంచి కంట్రోల్ చేస్తున్నట్టు గుర్తించామని సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు.

హోటల్స్ రేటింగ్స్ పేరుతో కూడా...
హోటల్ రివ్యూస్ పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలపై మాట్లాడేందుకు బీబీసీ టీం విశాఖ సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్‌ను కలిసేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లింది. ఆ సమయంలో ఒక బాధితుడితో ఆయన మాట్లాడుతున్నారు. ఆయనతో బీబీసీ కూడా మాట్లాడింది.
“నేను హార్డ్‌వేర్ ఇంజినీర్‌ను. పార్ట్ టైమ్ జాబ్ కావాలంటే క్లిక్ చేయండంటూ నా ఫోన్‌కు చాలా లింకులు వస్తుంటాయి. ఒక రోజు ఒక లింక్ క్లిక్ చేశాను. అది ఒక గ్రూపుకి తీసుకుని వెళ్లింది. మీకు హోటల్స్ రేటింగ్ ఇవ్వమని లింకులు వస్తాయి. వాటికి మీరు రేటింగ్స్ ఇస్తే మీకు పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ డబ్బులుగా మారుతాయి అని మేసేజ్ పంపారు. ఆ తర్వాత ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్ లో రేటింగ్ ఇస్తే ఒక రోజులో నాకు రూ. 800 వచ్చాయి. ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటే రూ.10 వేలు డిపాజిట్ చేయమన్నారు. రూ.10 వేలు డిపాజిట్ చేస్తే 5 వేలు కలిపి 15 వేలు ఇచ్చారు” అని బాలాజీ బీబీసీతో చెప్పారు.
“ఆ తర్వాత రోజు రూ.20 వేలు ఇస్తే టాస్కులు ఇచ్చి రూ. 30 వేలు ఇచ్చారు. అలా నన్ను ఒక్కో గ్రూపు పేరుతో తీసుకుని వెళ్లి మొత్తం రూ. 5 లక్షలు కట్టించుకున్నారు. ముందు నా అకౌంట్లో కనిపించే సొమ్మును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఆ తర్వాత ఆ ఆప్షన్ పని చేయడం మానేసింది. ఇక అనుమానంతో నేను డబ్బులు కట్టడం మానేసి సైబర్ క్రైమ్ పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వచ్చాను” అని బాలాజీ తెలిపారు.

‘జీఎస్టీ కూడా కట్టమంటారు’
ఈ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని, ఇక మేం ఈ టాస్క్ లు చేయలేమని చెప్పి గ్రూపులో నుంచి వెళ్లిపోదామనుకునే వారిని జీఎస్టీ పేరుతో కూడా మోసం చేస్తారని సీఐ భవానీ ప్రసాద్ చెప్పారు.
“మీ డబ్బులు విత్‌డ్రా కాకపోవడానికి కారణం మీరు ఒక టాస్క్ లో తప్పుడు బటన్ నొక్కారు. అందుకే విత్ డ్రా కాలేదు. మేం దానిని సరి చేస్తాం. మీ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే 30 శాతం జీఎస్టీ కట్టాలి అని చెప్తారు. ఇది కూడా నిజమేనని నమ్మి తన అకౌంట్లో రూ. 93 లక్షలు కనిపిస్తున్న ఒక వ్యక్తి జీఎస్టీ కట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ ఎందుకో అనుమానం వచ్చి మమ్మల్ని ఆశ్రయించారు” అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, HYDERABAD CITY POLICE
మోసపోకుండా ఎలా జాగ్రత్త పడాలి?
ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో సీఐ భవానీ ప్రసాద్ వివరించారు.
- ఫోన్‌కు వచ్చే ప్రతి లింక్ ని ఓపెన్ చేయకూడదు.
- గేమ్స్, టాస్కులు పేరుతో డబ్బులు ఇస్తామంటే అది ఫేక్ అని భావించాలి.
- ఒక గ్రూపు నుంచి మరో గ్రూపుకు మారుస్తున్నారంటే అదొక ట్రాప్ అని గుర్తించాలి.
- మనల్ని గ్రూపుల్లో చేర్చి రీఛార్జ్, అప్‌గ్రేడ్ పేరుతో డబ్బులు కట్టమన్నారంటే అది మోసమని అర్ధం చేసుకోవాలి.
- లింక్ రూపంలో తెలియని వారి నుంచి వచ్చే గ్రూపులో జాయిన్ కాకూడదు.
- ఏదైనా సంస్థ పేరుతో మీకు జాబ్ మెసేజ్ వస్తే...ఆ సంస్థల అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి సమాచారం తెలుసుకోవాలి.
విశాఖలో రోజుకు దాదాపు 30 సైబర్ నేరాల కేసులు వస్తుంటే, అందులో 6 నుంచి 8 వరకు హోటల్ రివ్యూస్ పేరుతో జరిగే కేసులేనని భవానీ ప్రసాద్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి... పిల్లలు, టీనేజర్లు ఆ వలయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















