‘వాసెక్టమీ’తో సెక్స్ సామర్థ్యం తగ్గుతుందా? ఇది నిజమా? మగవారు ఎందుకు వెనకాడుతున్నారు?

వాసెక్టమీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అంజలి దాస్
    • హోదా, బీబీసీ కోసం

‘‘నేను కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడిన వెంటనే ఆయనకు కోపం వచ్చింది. ఆయన నన్ను తిట్టారు. ఇప్పుడైతే దీని గురించి మాట్లాడావు కానీ, ఇంకెప్పుడూ ఈ ప్రస్తావన తీసుకురాకు’’ అని ఆయన అన్నారు.

ఈ విషయాలు చెప్పేటప్పుడు రష్మి (పేరు మార్చాం) కన్నీరు పెట్టుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆమె దిల్లీలోని ఓ సొసైటీలో వంట మనిషిగా పనిచేసేవారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరోసారి గర్భం దాల్చేందుకు ఆమె సిద్ధంగా లేరు.

అందుకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని భర్తను ఆమె అడిగారు.

‘‘నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటే వెళ్లి చేయించుకో, నన్నెందుకు మధ్యలోకి లాగుతున్నావని అన్నారు. ఇకపై దీని గురించి మాట్లాడొద్దని హెచ్చరించారు’’ అని రష్మి చెప్పారు.

తన పిల్లలకు మంచి చదువు చెప్పించాలని రష్మి అనుకున్నారు. అందుకే తను చేస్తున్న వంట పనిని కూడా మానేసి పిల్లలను చూసుకుంటున్నారు.

వాసెక్టమీ

ఫొటో సోర్స్, Getty Images

వాసెక్టమీ ఎంత మంది చేయించుకుంటున్నారు?

గణాంకాలను పరిశీలిస్తే భారత్‌లో నేటికీ కుటుంబ నియంత్రణ బాధ్యతంతా దాదాపుగా మహిళలపైనే పడుతున్నట్లు తెలుస్తుంది.

కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం, 2018 నుంచి 2019 మధ్య దేశంలో 5.16 కోట్ల మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నారు. దీనిలో వాసెక్టమీ అంటే మగవారు చేయించుకునే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కేవలం మూడు శాతం మాత్రమే.

అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ మంది మగవారు వాసెక్టమీ చేయించుకుంటున్నారు. కానీ, భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ ఆపరేషన్ చేయించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది.

ఐక్యరాజ్యసమితి 2015లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, కెనడా, బ్రిటన్, అమెరికాలలో వాసెక్టమీ రేట్లు వరుసగా 21.7 శాతం, 21 శాతం, 10.8 శాతంగా ఉన్నాయి.

అమెరికాకు చెందిన 23 ఏళ్ల కీత్ లావెస్ డిజిటల్ క్రియేటర్. ఆయనకు ఒక కూతురు ఉంది. కుటుంబ నియంత్రణ విధానంతో తన జీవిత భాగస్వామికి చేదు అనుభవం ఎదురుకావడంతో ఆయనే వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నారు.

‘‘భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలి. ఈ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అందుకే నేనే ఆపరేషన్ చేయించుకున్నా’’ అని ఆయన చెప్పారు.

అదే సమయంలో మహిళలపై పిల్లల సంరక్షణతోపాటు కుటుంబ నియంత్రణ భారం కూడా మోపకూడదని గట్టిగా నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు.

అమెరికాలోని యూటా యూనివర్సిటీలో యూరాలజీ సర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అలెగ్జాండర్ పాస్జక్ పనిచేస్తున్నారు.

‘‘మా దగ్గరకు వాసెక్టమీ కోసం వచ్చే మగవారు భార్య చెప్పడంతో ఈ ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చామని అంటుంటారు’’ అని తెలిపారు.

‘‘మహిళలకు అన్నింటిలోనూ సమానత్వం అని చెప్పే మాటలకు, వాస్తవానికీ చాలా తేడా ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.

కొంత మంది పురుషులు కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడటం కూడా చెడ్డ విషయంగా చూస్తారు. అందుకే అసలు దీనిపై మాట్లాడనివ్వరు.

వాసెక్టమీ

ఫొటో సోర్స్, Getty Images

వాసెక్టమీ అంటే ఏమిటి?

వాసెక్టమీ గురించి మాట్లాడేందుకు ఎందుకు భారత్‌లో మగవారు ముఖం చాటేస్తున్నారు? అసలు ఏమిటీ ఆపరేషన్?

దీనిపై గువాహటి అపోలో ఎక్సెల్‌కేర్ హాస్పిటల్ సీనియర్ యూరాలజిస్టు డాక్టర్ జోయ్ నారాయణ్ చక్రవర్తి మాట్లాడారు. ‘‘వాసెక్టమీ అనేది ఒక సర్జరీ. పురుషుల వృషణాల్లో వీర్యాన్ని తీసుకెళ్లే ఒక నాళాన్ని దీనిలో కట్ చేస్తారు’’ అని ఆయన చెప్పారు.

‘‘సాధారణంగా మత్తు ఇచ్చి ఈ శస్త్రచికిత్స నిర్వహిస్తారు. అయితే ఆపరేషన్ సమయంలో ఆ వ్యక్తి మేలుకొనే ఉంటారు. కానీ, ఆయనకు నొప్పి ఏమీ అనిపించదు’’ అని ఆయన వివరించారు.

ఈ ఆపరేషన్ పూర్తయ్యేందుకు 20 నిమిషాలు మాత్రమే పడుతుందని ఆయన చెప్పారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం ప్రకారం, ఈ ఆపరేషన్ 99 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుంది.

అయితే, ఈ ఆపరేషన్ విషయంలో చాలా అపోహలు ప్రజల్లో ఉన్నాయి. దీని వల్ల సెక్స్ చేసే సామర్థ్యం తగ్గిపోతుందని చెబుతుంటారు.

‘‘కానీ, ఇది అపోహ మాత్రమే. వాసెక్టమీ తర్వాత సెక్స్ చేసే శక్తి తగ్గిపోతుందని వచ్చే వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు’’ అని డాక్టర్ జోయ్ చెప్పారు.

‘‘ఈ ఆపరేషన్‌లో పురుషాంగం గట్టిపడేందుకు కారణమయ్యే రక్త నాళాలను అసలు ముట్టుకోరు. శుక్రకణాలు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వీటికి ఎలాంటి హానీ జరగదు’’ అని ఆయన చెప్పారు.

నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ‘‘వృషణాల్లో శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి. అయితే, ఇవి వీర్యంలో కలవవు. ఎందుకంటే వీర్యంలో వీటిని కలిపే నాళాన్ని ఆపరేషన్‌లో కట్ చేస్తారు. దీంతో ఇవి శరీరంలోని ద్రవాల్లో కలుస్తాయి’’ అని ఎన్‌ఆర్‌హెచ్ఎం చెబుతోంది.

వాసెక్టమీతో ఊబకాయం వస్తుందని, లేదా ఇంతకుముందులా పనిచేయలేమని చెప్పే వార్తల్లోనూ ఎలాంటి నిజమూలేదు.

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలోని యూరాలజీ విభాగం పరిశోధన ప్రకారం.. 1973లో అమెరికా సుప్రీంకోర్టు అబార్షన్ హక్కులను రద్దు చేసిన తర్వాత వాసెక్టమీ ఆపరేషన్లు పెరిగాయి.

న్యూయార్క్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, అయోవా లాంటి చాలా రాష్ట్రాల్లో 30 కంటే తక్కువ వయసున్న పురుషుల్లో వాసెక్టమీ ఆపరేషన్ల రేటు కూడా రెట్టింపయ్యింది.

వాసెక్టమీ

ఫొటో సోర్స్, Getty Images

ఎక్కడ ఆపరేషన్ చేస్తారు?

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాసెక్టమీ ఆపరేషన్ భేషుగ్గా చేయించుకోవచ్చని ముంబయిలోని హిందూజా హాస్పిటల్‌లో యూరాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ సోనీ మెహతా చెప్పారు.

‘‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ చికిత్స కోసం ఎలాంటి డబ్బులూ తీసుకోరు. కాబట్టి అక్కడ ఆపరేషన్ చేయించుకోవడం మంచిది’’ అని డాక్టర్ జోయ్ కూడా తెలిపారు.

‘‘ఒకవేళ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించుకోవాలి అనుకుంటే, అక్కడి సదుపాయాలకు అనుగుణంగా మీరు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది’’ అని ఆయన తెలిపారు.

ఈ ఆపరేషన్‌కు ముందు లేదా తర్వాత ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ- ‘‘అలాంటివేమీ ఉండవు. మధుమేహం ఉంటే చికిత్స సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే మధుమేహాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చిన తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలి’’ అన్నారు.

మూత్రపిండాలు, ప్రొస్టేట్ సమస్యలున్నవారు కూడా ఈ చికిత్స చేయించుకోవచ్చా అని అడగ్గా, ఎవరైనా ఈ చికిత్స చేయించుకోవచ్చని చెప్పారు.

ఆపరేషన్ తర్వాత సెక్స్ జీవితంపై డాక్టర్ సోనీ స్పందిస్తూ.. ‘‘ఆపరేషన్ తర్వాత ఆరు నెలల వరకూ వీర్యంలో శుక్రకణాలు ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో కండోమ్ ఉపయోగించాలి’’ అని తెలిపారు.

వాసెక్టమీ

ఫొటో సోర్స్, Getty Images

వీర్యంలో శుక్రకణాలు ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవాలి?

వీర్యంలో శుక్రకణాలు ఉన్నాయో, లేదో గుర్తించేందుకు సీమెన్ అనాలసిస్ టెస్టు చేస్తారని డాక్టర్ సోనీ చెప్పారు. ఇదే పరీక్షను స్టెరిలైజేషన్ టెస్టు అని కూడా పిలుస్తారు.

ఈ టెస్టుకు శాంపిల్ ఇచ్చే రెండు, మూడు రోజుల ముందు సెక్స్ చేయకుండా ఉండాలి. ఫలితంగా వీర్యంలో శుక్రకణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.

ఇతర ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు

వాసెక్టమీ తర్వాత మగవారి ఆరోగ్యం ప్రభావితం అవుతుందని ఏళ్ల నుంచి అపోహలు ప్రచారంలో ఉన్నాయి.

ఇలాంటి వార్తలపై నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ చాలా పరిశోధనలు చేపట్టింది. ఆపరేషన్ తర్వాత హృద్రోగాలు, ప్రొస్టేట్ క్యాన్సర్, వ్యాధి నిరోధక రుగ్మతలు లాంటివి వస్తున్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని పరిశోధనలో తేలింది.

వాసెక్టమీ తర్వాత సుఖ వ్యాధులు రాకుండా ఉంటాయా?

సుఖ వ్యాధులను వాసెక్టమీ అడ్డుకోలేదని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టంగా పేర్కొంది. వీటిని అడ్డుకునేందుకు కండోమ్ చక్కగా పనిచేస్తుంది.

చికిత్స తర్వాత మళ్లీ పిల్లలను కనొచ్చా?

కనొచ్చు. కావాలంటే వాసెక్టమీ తర్వాత మళ్లీ పిల్లలను కనొచ్చని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. అయితే, దీని కోసం ఒక సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే, అన్ని కేసుల్లోనూ ఇది వంద శాతం కచ్చితత్వంతో పనిచేయకపోవచ్చు.

వీడియో క్యాప్షన్, ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా... ఎలా తెలుస్తుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)