ఐవీఎఫ్: పిల్లలను కనాలనుకొనే జంటలకు ఉచితంగా 5 లక్షల చికిత్స.. గోవా ఈ పథకం ఎందుకు తెచ్చింది?

సంతాన రేటు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తల్లిదండ్రులు కావాలనే జంటల కోసం గోవా ప్రభుత్వం ఉచితంగా ఐవీఎఫ్ చికిత్సలను అందిస్తోంది. భారత్‌లో ఇలా ప్రభుత్వమే ఉచితంగా ఐవీఎఫ్ అందుబాటులోకి తీసుకురావడం ఇదే తొలిసారి.

ఈ విషయంపై గోవా ఆరోగ్య మంత్రి విశ్వజీత్ రాణె బీబీసీతో మాట్లాడారు. గోవా మెడికల్ కాలేజీలో ఉచిత ఐవీఎఫ్ చికిత్సల కోసం దాదాపు వంద జంటలు రిజిస్టర్ చేసుకున్నట్లు ఆయన చెప్పారు. దీని కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులను ఉపయోగించబోతున్నట్లు ఆయన తెలిపారు.

అసిస్టెట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ) కిందకు ఐవీఎఫ్ వస్తుంది. ఏఆర్‌టీలో పిల్లలను కలిగించేందుకు టెక్నాలజీ సాయాన్ని తీసుకుంటారు.

మహిళల ప్రత్యుత్పత్తి హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా 2021లో ఏఆర్‌టీ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఏఆర్‌టీ బిల్లులో ఐవీఎఫ్ టెక్నిక్‌లను కూడా ప్రస్తావించారు. దీనిలో భాగంగా మహిళ అండాశయం నుంచి అండాలను సేకరించి ల్యాబ్‌లో వీర్యంతో కలుపుతారు. ఫలదీకరణం తర్వాత, పిండాన్ని మహిళల గర్భాశయంలో ప్రవేశపెడతారు.

సంతాన రేటు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులను ఈ పథకం కోసం ఉపయోగించబోతున్నట్లు గోవా ఆరోగ్య మంత్రి విశ్వజీత్ రాణె తెలిపారు.

గోవా ఆరోగ్య మంత్రి ఏం చెప్పారు?

తాను గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఐవీఎఫ్‌తో తమకు ఎలాంటి చెడు అనుభవాలు ఎదురయ్యాయో అక్కడి ప్రజలు తమకు వివరించేవారని గోవా ఆరోగ్య మంత్రి విశ్వజీత్ రాణె చెప్పారు.

అయితే, ఈ సమస్య కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితంకాదని ఆయన వివరించారు.

‘‘అలాంటి జంటలతో మేం మాట్లాడాం. గోవా నుంచి పుణె వరకూ ఏటా 200 నుంచి 300 జంటలు ఇలాంటి ఐవీఎఫ్ చికిత్సలను ఆశ్రయిస్తున్నాయి. కొన్ని కుటుంబాలు తాము దాచుకున్న డబ్బులన్నీ దీనిపైనే ఖర్చు చేస్తున్నాయి. కానీ, కొంతమంది వైద్యులు వారిని మోసం చేస్తున్నారు’’ అని ఆయన చెప్పారు.

‘‘దీని వల్ల తల్లితండ్రులు కావాలనే వారి కల అలానే మిగిలిపోతోంది. అలాంటి చాలా మంది తమ ఆవేదనను మాతో పంచుకున్నారు. అందుకే ఏ జంటా ఇలాంటి వేదన అనుభవించకూడదని మేం తాజా నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆయన తెలిపారు.

గోవాలో సంతాన రేటు ఎలా ఉంది?

సంతాన రేటు

బయట ఐవీఎఫ్ చికిత్స కోసం ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువే ఖర్చు అవుతోంది. గోవా ప్రభుత్వం ఉచితంగా ఈ చికిత్సను అందించబోతున్నట్లు చెబుతోంది. దీనికి నిధులు ఎక్కడి నుంచి కేటాయిస్తారు?

దీనిపై మంత్రి మాట్లాడుతూ.. ‘‘సగటున ఐవీఎఫ్ టెక్నాలజీ కోసం ఆరున్నర నుంచి తొమ్మిది లక్షల వరకూ ఖర్చు అవుతోంది. దీని కోసం వంద శాతం సీఎస్‌ఆర్ నిధులను ఉపయోగించుకుంటాం. మౌలిక వసతుల కల్పనకు ఆ నిధులు తోడ్పడతాయి. మా తరఫు నుంచి వైద్యులు చికిత్సలు అందిస్తారు’’ అని ఆయన తెలిపారు.

2011 జనాభా లెక్కల ప్రకారం, గోవా జనాభా 14,58,545. అయితే, 2020 నాటికి హోవార్డ్ పాపులేషన్ అంచనాల ప్రకారం ఇది 16.5 లక్షలకు చేరుకుంది.

సంతాన రేటు
సంతాన రేటు

ఫొటో సోర్స్, TWITTER@YURIALEMAO9

ఫొటో క్యాప్షన్, ఈ పథకాన్ని క్షేత్ర స్థాయిలో ఎలా అమలు చేస్తారో చూడాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు యూరీ అలెమావో అన్నారు.

ప్రతిపక్షాలు ఏం చెబుతున్నాయి?

ఈ విషయంపై గోవాలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు యూరీ అలెమావో బీబీసీతో మాట్లాడారు. పిల్లల్లేని జంటల జీవితాల్లో సంతోషాన్ని నింపడం మంచి చర్యేనని, అయితే, ఈ పథకాన్ని క్షేత్ర స్థాయిలో ఎలా అమలు చేస్తారో చూడాలని ఆయన అన్నారు.

‘‘ఇలాంటి చాలా పథకాలను రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, వీటి కోసం నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తుందో చూడాలి. అది కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఇలాంటి పరిస్థితుల్లో..’’ అని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.

‘‘గోవాకు రూ. 28,000 కోట్ల అప్పు ఉంది. రాష్ట్ర జనాభా 14 లక్షల కంటే ఎక్కువే ఉంది. ఇప్పుడు మీరు తలసరి అప్పులను తీసుకోండి. ఒక్కొక్కరిపై ఎంత భారం పడుతుందో తెలుస్తుంది. ప్రభుత్వం ఇలానే కొత్త పథకాలను తీసుకొస్తూ పోతోంది. కానీ, ఇక్కడ క్యాన్సర్‌ను కనిపెట్టే ఒక్క స్క్రీనింగ్ మెషీన్ కూడా లేదు. అలాంటప్పుడు ఇలాంటి పథకాలను ఎలా అమలు చేస్తారు?’’ అని ఆయన ప్రశ్నించారు.

సంతాన రేటు

ఫొటో సోర్స్, Getty Images

గోవాలో సంతాన రేటు పడిపోవడానికి కారణాలు

ఆర్థిక సర్వే 2022-23 ప్రకారం, గత ఐదేళ్లలో గోవాలో సంతాన రేటు పడిపోతూ వచ్చింది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం, గోవాలో ప్రస్తుత సంతాన రేటు 1.3గా ఉంది.

పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ డేటా ప్రకారం.. బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి గోవా 9.1 శాతం నిధులను కేటాయిస్తోంది. మిగతా రాష్ట్రాలతో పోల్చిచూసినప్పుడు ఇది చాలా ఎక్కువగా కనిపిస్తోంది.

అయినప్పటికీ, గత ఐదేళ్లలో గోవాలో సంతాన రేటు పడిపోతూ వస్తోందని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్) చెబుతోంది.

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కింద పనిచేసే ఐఐపీఎస్ ఈ సంతాన రేటు 1.6 కంటే తక్కువ ఉండటం మంచిదికాదని పేర్కొంది. సాధారణంగా ఇది 2.1గా ఉండాలని సంస్థ చెబుతోంది.

ఎన్ఎఫ్‌హెచ్ఎస్-4 (2015-16) సమాచారం ప్రకారం భారత్ సంతాన రేటు 2.2 అయితే. ఎన్ఎఫ్‌హెచ్ఎస్-5 (2019-2021) నాటికి ఇది 2.0కు తగ్గింది.

బిహార్, మేఘాలయ, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్, మణిపుర్ లాంటి రాష్ట్రాల్లో సంతాన రేటు ఎక్కువగానే ఉంది. అయితే, సిక్కింలో కనిష్ఠంగా ఇది 1.1గా ఉంది.

గోవాలో సంతాన రేటు తక్కువగా ఉండటానికి గల కారణాలను ఐఐపీఎస్ అధికారి బీబీసీకి వివరించారు. ‘‘రాష్ట్రంలో ప్రజల అక్షరాస్యత కాస్త ఎక్కువగా ఉంటుంది. చిన్న కుటుంబంతో వచ్చే ప్రయోజనాలు ఇక్కడ ప్రజలకు బాగా తెలుసు. అదే సమయంలో గర్భ నిరోధకాల వాడకం కూడా ఇక్కడ ఎక్కువ. మరోవైపు ఇక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం కూడా ఎక్కువ’’ అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 9 మార్గాలు

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందా?

దీనిపై ఐఐపీఎస్ అధికారి బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘గోవాలో ప్రస్తుతం సంతాన రేటు 1.3గా ఉంది. అంటే ఇక్కడ వంద మంది మహిళలకు 130 మంది పిల్లలు పుడుతున్నారు. అంటే ఎక్కువ మంది ఒక బిడ్డకే జన్మనిస్తున్నారు. కొందరు ఇద్దరికి, మరికొందరు ముగ్గురికి జన్మనిస్తున్నారు. సగటున తమ జీవిత కాలంలో ఒక మహిళ ఎంత మందికి జన్మనిస్తుందనే దానిపై సంతాన రేటు ఆధారపడి ఉంటుంది’’ అని చెప్పారు.

సంతాన రేటు పడిపోవడంతో అక్కడి జనాభాతోపాటు ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని ఆయన వివరించారు.

‘‘జనాభా తగ్గిపోవడంతో పనిచేసేవారి సంఖ్య తగ్గుతుంది. అదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి’’ అని ఆయన తెలిపారు.

గోవా ప్రభుత్వ తాజా పథకంతో జంటలకు మేలు జరుగుతుందని, అయితే, మిగత రాష్ట్రాలు కూడా ఇలాంటి పథకాలను తీసుకొస్తాయాలేదో చూడాలని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర జనాభా, బడ్జెట్, మౌలిక సదుపాయాలు లాంటి చాలా అంశాలపై ఈ విషయం ఆధారపడి ఉంటుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)