కొందరు ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే మానేస్తారెందుకు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, ఆదర్శ్ రాఠోడ్
- హోదా, బీబీసీ హిందీ కోసం
దిల్లీ శివారు గురుగ్రామ్‌లోని ఓ కన్సల్టింగ్ స్టార్టప్‌లో కరణ్ సింగ్ 2020లో ఉద్యోగంలో చేరారు. కరణ్‌కు అదే తొలి ఉద్యోగం.
తన మొదటి ఉద్యోగంపై ఎంతో సంతోషించిన ఆయన కొద్ది వారాలకే రాజీనామా చేశారు.
ఆ ఉద్యోగం ఎందుకు మానేయాల్సివచ్చిందో కరణ్ చెప్పారు. ఆఫీసుకు సంబంధించిన కొన్ని పనుల్లో తాను కన్‌ఫ్యూజ్ అయ్యాయని, ఆ తరువాత ఆఫీసులో వాతావరణం చెడినట్లుగా అనిపించిందన్నారు కరణ్.
‘‘ఒక క్లయింట్ ఆగ్రహించడంతో మీటింగ్ నిర్వహించారు. ఆ సమస్యను పరిష్కరించడానికి బదులు గందరగోళం సృష్టించాడు. దాంతో టీమ్‌లో సభ్యులు ఒకరినొకరు దూషించుకోవడం ప్రారంభించారు’’ అని చెప్పారు కరణ్.
‘‘ఆ తరువాత ఓ సీనియర్ రాజీనామా చేశారు. ఆఫీసులో వాతావరణం మరింత ఆందోళనగా మారిపోయింది. అక్కడికి కొద్ది రోజులలోనే నేను కూడా మానేశాను’’ అని చెప్పారు కరణ్.
చాలా మంది వ్యక్తిగత, వృత్తిగతమైన ప్రాధాన్యాల విషయంలో లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారని, చేస్తున్న ఉద్యోగంలో సంతోషంగా లేకపోతే మానేయడానికి ఏ మాత్రం వెనుకాడరని పరిశీలకులు చెప్తున్నారు.
చేరిన కొద్దిరోజులకే ఉద్యోగం మానేయడానికి చాలా కారణాలుంటాయి..
- మేనేజర్ల పర్యవేక్షణ బాగా ఎక్కువగా ఉండడం.
- రిక్రూట్‌మెంట్ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం.
- ఆఫీసులో వాతావరణం బాగుండకపోవడం.
- కంపెనీలో నియమనిబంధనలు నచ్చకపోవడం.
అమెరికా లేబర్ మార్కెట్‌ను పరిశీలించే ‘బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్’ ప్రకారం ఆ దేశంలో ఉద్యోగుల సగటు పదవీకాలం నాలుగేళ్లు.
అయితే, నిరుడు సెప్టెంబర్‌లో లింక్డ్‌ఇన్ చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. చాలా మంది ఉద్యోగులు ఏడాదిలోపే మానేస్తున్నారని తేలింది. ఇలాంటి కేసులు 2021 ఆగస్ట్‌లో మొదలై 2022 మార్చ్ నాటికి గరిష్ఠ స్థాయికి చేరినట్లు ఆ అధ్యయనం వెల్లడించింది.
అసంతృప్తి చెందుతూ ఒకే ఉద్యోగంలో కొనసాగే కంటే వేరే ఉద్యోగం వెతుక్కోవడం మంచిదనే అభిప్రాయానికి వస్తున్నారు చాలా మంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకిలా?
చాలా మంది ఇలా తక్కువ సమయంలోనే ఉద్యోగాలు మానేయడానికిగల కారణాలను దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)కు చెందిన ‘అటల్ బిహారీ వాజపేయీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే ‘వానికీ జోశీ లోహానీ’ వివరించారు.
ఉద్యోగంలో సానుకూలతలను చూస్తారని, దాన్నే వర్క్ ఫ్యామిలీ ఎన్‌రిచ్‌మెంట్ అనొచ్చని లొహానీ అన్నారు. కుటుంబం సుసంపన్నం అయ్యేలా చేస్తున్న ఉద్యోగం వల్ల పొందే ఫలితాలు.. అది డబ్బు కావొచ్చు, లేదంటే సానుకూల వైఖరి కావొచ్చు ఏదైనా కావొచ్చన్నారు.
‘‘ఆఫీసులో సంతోషంగా ఉండడం, అలాగే ఇంటికి హ్యాపీగా వెళ్లడం, కావాల్సినప్పుడు సెలవులు దొరకడం వంటివన్నీ ఉంటే ఆ ఉద్యోగం బాగున్నట్లు.. అలాంటి ఉద్యోగంలో కొనసాగాలనుకుంటారు’’ అని చెప్పారు లోహానీ.
ఆమె చెప్పిన రెండో కారణం.. కుటుంబ జీవితం, ఉద్యోగ జీవితాల మధ్య సమతౌల్యం లేకపోవడం.
ఇలాంటి పరిస్థితిలో ఉద్యోగిపై పని భారం ఉంటుంది. ఆ ఒత్తిడి ఇంటివరకు చేరుతుంది. పని భారం వల్ల కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేరు. ఈ సంఘర్షణ వల్ల కలిగే ఇబ్బంది చేస్తున్న ఉద్యోగం వల్ల వచ్చే ఆర్థిక లాభం కంటే పెద్దదైపోయినప్పుడు, ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేయాలనుకుంటారని లొహానీ చెప్పారు.
అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ ‘క్వెస్ట్రన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’కు చెందిన మోషీ కోహెన్ దీనిపై మాట్లాడుతూ- ‘‘సాధారణంగా ఉద్యోగులు, కంపెనీ మధ్య ఒక సామాజిక ఒప్పందం ఉంటుంది. కానీ, ఇప్పుడది ఉండడం లేదు. ఉద్యోగుల బాగోగులను కంపెనీలు ఇప్పుడు పట్టించుకోవడం లేదు’’ అన్నారు.
‘‘ఉద్యోగులు కూడా కంపెనీ తమను తాత్కాలికంగా నియమించుకుందన్న భావనలో ఉంటున్నారు. తమను ఎప్పుడైనా తొలగించొచ్చని అనుకుంటుంటారు. అందుకే సంస్థ పట్ల నిబద్ధత చూపించరు. కొత్త ఉద్యోగాల కోసం నిత్యం చూస్తుంటారు’’ అన్నారు కోహెన్.
ఇప్పుడు వర్క్ ఫ్రం హోం, రిమోట్ వర్కింగ్ వంటివి పెరిగాయి. దీంతో తమ ఉద్యోగులు సరిగా పనిచేస్తున్నారో లేదో అని మేనేజర్లు రకరకాలుగా నిఘా పెడుతున్నారు. ఇది మేనేజర్, ఉద్యోగుల మధ్య దూరం పెంచుతోంది అన్నారు కోహెన్.
కొందరు ఉద్యోగులు ఇలాంటి పరిస్థితులకు లొంగరు. చేస్తున్న ఉద్యోగం తమకు అనుకూలంగా లేకపోయినా, అక్కడి వాతావరణం బాలేకున్నా వెంటనే మానేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
నచ్చకపోతే వెంటనే మానేయడం సరైందేనా?
చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేకపోయినా కొనసాగడం కంటే బాగా ఆలోచించుకుని వీలైనంత వేగంగా మానేయడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.
కాలిఫోర్నియాలోని పెపర్డైన్ గ్రాజియానో బిజినెస్ స్కూల్‌లో బిహేవియరల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బాబీ థామ్సన్ మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులు బాగులేవు.. అవి మార్చడం తమ వల్ల సాధ్యం కాదు అనుకున్నప్పుడు ఉద్యోగం వదిలేయడం అనేది మంచి పనే’’ అన్నారు.
నచ్చకపోయినా అలాంటి ఉద్యోగంలో ఎక్కువ కాలం కొనసాగడం వల్ల ఆ లోగా ఇతర మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందని బాబీ థామ్సన్ చెప్పారు.
తాను కొత్తగా మరో ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు పాత ఉద్యోగం అంత తొందరగా ఎందుకు మానేశావంటూ కొత్త కంపెనీలు తనను అడిగాయని కరణ్ చెప్పారు.
అంతేకాదు, మధ్య తరగతి నుంచి వచ్చేవారు ఉద్యోగాలను మానేయడం అంత సులభం కాదనీ అన్నారు కరణ్.
పాత ఉద్యోగం మానేసిన తరువాత ఇంటర్వ్యూలకు వెళ్లడం ప్రారంభించానని, నెల రోజుల్లోనే నోయిడాలో కొత్త ఉద్యోగం దొరికిందని, ఈ ఉద్యోగం బాగుందని, ఆఫీస్ వాతావరణం కూడా బాగుందని కరణ్ చెప్పారు.
అయితే, అన్ని కేసులలోనూ ఇలా జరగపోవచ్చు. ఒక్కో రంగంలో ఒక్కోలా ఉంటుందని అందరికీ ఒకేలాంటి అవకాశాలు, వెంటవెంటనే కొత్తగా మంచి అవకాశాలు వస్తాయని చెప్పలేమని లోహానీ అన్నారు.
టెక్స్‌టైల్, టెలికమ్యూనికేషన్ వంటి రంగాల్లో ఉద్యోగం అంత తొందరగా మానేయరని, ఐటీ, మార్కెటింగ్, కన్సల్టెన్సీలలో ఉద్యోగాలు త్వరగా మానేస్తుంటారని, ఈ రంగాల్లో కొత్త అవకాశాలు పుష్కలంగా ఉంటాయని లోహానీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కంపెనీలు ఏం చేయాలి?
అదే సమయంలో కంపెనీలు మంచివి కావని కూడా చెప్పడానికి లేదన్నారు లోహానీ. ఉద్యోగులు తొందరగా మానేస్తుండడం కంపెనీలకు నష్టం కలిగిస్తుందని చెప్పారు.
కొందరు తమ జీవితంలో కోరుకున్నవన్నీ త్వరత్వరగా పొందాలనుకుంటారని, అలాంటి ‘షార్ట్ టెర్మిస్ట్’లు తమ అవసరాలు, కోరికల ప్రకారం ఉద్యోగాలు మారుతుంటారని చెప్పారు కోహెన్.
‘‘ఉద్యోగం మానేయడానికి భయపడొద్దు. అయితే, కొంతకాలం ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంతేకానీ, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు’’ అంటారు కోహెన్.
కంపెనీలు తమ వద్ద ఉద్యోగులు ఎంతకాలం ఉంటున్నారన్న నిలకడ రేటు(రిటెన్షన్ రేట్), మానేస్తున్న రేటు(ఆట్రిషన్ రేట్) బేరీజు వేసుకోవాలి. ఆట్రిషన్ రేటు ఎక్కువగా ఉంటే ఉద్యోగుల నిలకడ కోసం మానవీయ విధానాలు అమలు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు లోహానీ.

ఫొటో సోర్స్, Getty Images
మానేయాల్సిన పరిస్థితులొస్తే ఏం చేయాలి?
ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే కంపెనీ గురించి ప్రతికూల అంశాలు కనిపించడం, పనిచేసేచోట వాతావరణం సరిగా లేకపోవడం వంటివి ఎదురైతే ఏం చేయాలి?
ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలో బాబీ థామ్సన్ సలహా ఇస్తున్నారు. ఉద్యోగం వీడే ముందు కాస్త ఆలోచించాలంటున్నారు ఆయన.
ఉద్యోగులు ఉన్నతాధికారులతో తమ పని, బాధ్యతలు వంటివన్నీ చర్చించి, సమస్య ఏంటో దానిపై మాట్లాడాలని, ఇతర సభ్యులతో సంబంధాలు మెరుగుపర్చుకోవాలని, అవసరమైతే కెరీర్ కోచ్ సాయం తీసుకుని దృక్పథం మార్చుకోవడానికి సహాయం తీసుకోవచ్చని సూచించారు.
అయితే, వ్యక్తులకు కూడా అన్నీ తెలుసని, నిర్ణయాలు తీసుకోవడంలో వారికి ఉండే సామర్థ్యాలపై తనకు నమ్మకం ఉందని, ఉద్యోగం మానేయడం వల్ల కలిగే పరిణామాలన్నీ ఆలోచించాకే మానేస్తారని బాబీ థామ్సన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














