రిలయన్స్‌: ముకేశ్ అంబానీ తరువాత ఈ లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసులు ఎవరు?

ఆకాశ్, అనంత్, ఇషా, నీతా, ముకేశ్ అంబానీల గ్రూప్ ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఆకాశ్, అనంత్, ఇషా, నీతా, ముకేశ్ అంబానీల గ్రూప్ ఫోటో
    • రచయిత, జోయా మాటీన్
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

ఎమ్మీ అవార్డు గ్రహీత ‘సక్సెషన్’ చివరి సీజన్‌ గురించి ప్రపంచమంతా గత కొన్ని నెలలుగా మాట్లాడుకుంటోంది. బిలీనియర్ మీడియా దిగ్గజం, ఆయన వారసుల చుట్టూ ఈ కథ నడుస్తుంది. కార్పొరేట్ జీవితాలను దీనిలో చూపించారు. అది టీవీ డ్రామా.

కానీ, నిజజీవితంలో కూడా ఇలాంటి కోట్లాది రూపాయల వ్యాపార దిగ్గజం వారసత్వ ప్రణాళిక ఒకటి ఇటీవల వార్తల్లో నిలిచింది.

ఆసియాలోనే అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన ముగ్గురు వారసులను రంగంలోకి దింపారు.

రిటైల్ నుంచి రిఫైనింగ్ వరకు విస్తరించి ఉన్న తన 220 బిలియన్ డాలర్ల(రూ.18,19,926 కోట్ల) కంపెనీ బోర్డులోకి వీరిని తీసుకున్నారు.

కవలలైన 31 ఏళ్ల ఇషా, ఆకాశ్ అంబానీ, 28 ఏళ్ల అనంత్‌ అంబానీలు వాటాదారుల అంగీకారం మేరకు రిలయన్స్ బోర్డులో చేరుతున్నారు.

‘‘సీనియర్ నేతల అనుభవం, కొత్త నేతల లక్ష్యాల కలయికతో రిలయన్స్ తన విజయాల పుస్తకంలో సరికొత్త, మరింత ఉత్తేజకరమైన అధ్యయనాలను లిఖించనుంది’’ అని ముకేశ్ అంబానీ ఈ వారసత్వ ప్రణాళిక సందర్భంగా ప్రకటించారు.

కార్పొరేట్ భారతం ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఈ వారసత్వ ప్రణాళికతో మూడవ తరం కుటుంబ నాయకత్వంలోకి రిలయన్స్ ఇండస్ట్రీ ప్రవేశించినట్లయింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యం ఆయిల్, టెలికాం, కెమికల్స్, టెక్నాలజీ, ఫ్యాషన్, ఫుడ్ వంటి రంగాలలో విస్తరించి ఉంది. భారత్‌ కార్పొరేట్ రంగంలో అంబానీల ఉనికి సర్వసాధారణంగా మారింది.

ప్రజలతో ముడిపడి ఉన్న అన్ని రంగాల వ్యాపారాల్లో ఈ ఫ్యామిలీ ఉంది. ఈ కార్పొరేట్ కుటుంబం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రజాకర్షణను చూరగొంటోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రస్తుతం విదేశీ సంస్థల భాగస్వామ్యంతో జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్‌లోకి కూడా అడుగు పెట్టాలని చూస్తోంది.

5జీ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను 20 కోట్లకు పైగా ఇళ్లకు అందించాలని ప్రణాళికలు రచిస్తోంది. 2000 మెగావాట్ల ఏఐ సన్నద్ధ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

సోలార్ గిగా ఫ్యాక్టరీని, విండ్ ఎనర్జీ వ్యాపారాలను లక్ష్యాలను చేరుకోవాలని రిలయన్స్ ఇండస్ట్రీ చూస్తోంది.

1970ల్లో పాపులర్ సాఫ్ట్ డ్రింక్ అయిన ‘కంపా కోలా’ను ఈ సంస్థ మళ్లీ ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఈ కోలాను గ్లోబల్‌ వేదికపైకి తీసుకెళ్లాలని రిలయన్స్ అనుకుంటోంది.

దేశంలో అతిపెద్ద టెలికాం సర్వీస్ రిలయన్స్ జియో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, దేశంలో అతిపెద్ద టెలికాం సర్వీస్ రిలయన్స్ జియో

ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా తన పిల్లల్ని తీర్చిదిద్దుతూ వచ్చారని సక్సెషన్ అడ్వయిజరీ సంస్థ టెరెన్షియా కన్సల్టెంట్స్ సందీప్ నెర్లేకర్ అన్నారు.

‘‘ముకేశ్ అంబానీ పిల్లలు అయినందున వారు వంశపారపర్యంగా ఈ వ్యాపారాల్లోకి రాలేదు. ఇది బాగా ఆలోచించి, వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం. వారసులను రంగంలోకి దింపేందుకు ఆయన చాలా సమయం తీసుకున్నారు’’ అని సందీప్ చెప్పారు.

ముకేశ్ అంబానీని ఒక నిగూఢమైన వ్యక్తిగా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే ఆయన తన గురించి ప్రజలకు పెద్దగా తెలినీయకుండా ‘లో ప్రొఫైల్’లో ఉంటారు.

కానీ, ఆయన పిల్లలు ఇందుకు పూర్తిగా భిన్నం. ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతుంటారు.

కళ్లు మిరమిట్లు గొలిపే భవంతుల్లో నివసించడం, తరచూ ప్రైవేట్ విమానాల్లోనే ప్రయాణించడం, సెలబ్రిటీలతో పార్టీలు వంటివి వీరి జీవితాల్లో భాగం.

తన తండ్రి వ్యాపారాలను చూసుకునేందుకు ముకేశ్ అంబానీ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి చదువు మధ్యలోనే వదిలేసి వచ్చారు. కానీ, అతని కవల పిల్లలు ఇషా, ఆకాశ్ అంబానీలు యేల్, బ్రౌన్‌ యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ పట్టాలు పొందారు.

కార్పొరేట్ ఈవెంట్లలో, మ్యాగజీన్ కవర్ పేజీలలో తరచూ వీరి ఫోటోలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఇద్దరూ కూడా దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందిన పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్లు హాజరయ్యారు.

లగ్జరీ ఖర్చులు, పెళ్లి వేడుకలు, ఆస్తులు వంటి పలు వాటిల్లో ముకేశ్ అంబానీతో పాటు మొత్తం కుటుంబం నిఘాలో ఉందని నెర్లేకర్ అన్నారు.

కాలేజీ చదువులు పూర్తి కాగానే, 2014లో ఆకాశ్ అంబానీ తమ గ్రూప్ టెలికాం యూనిట్ రిలయన్స్ జియో నాయకత్వ టీమ్‌లో చేరారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ క్రికెట్‌ టీమ్‌ని కూడా నిర్వహిస్తున్నారు.

రిలయన్స్ యూనిట్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మెటా ప్లాట్‌ఫామ్స్ 2020లో 5.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులను పొందేందుకు రిలయన్స్ తరఫున వ్యవహరించిన టీమ్‌లో ఆకాశ్ అంబానీ కూడా భాగమయ్యారు.

దేశవ్యాప్తంగా వేలాది పెట్రోల్ స్టేషన్లు నిర్వహిస్తోన్న రిలయన్స్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, దేశవ్యాప్తంగా వేలాది పెట్రోల్ బంకులు నిర్వహిస్తోన్న రిలయన్స్

కంపెనీ రిటైల్, ఈ-కామర్స్, లగ్జరీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడంలో ఇషా అంబానీ తలమునకలయ్యారు.

కంపెనీ ఈ-కామర్స్ యాప్‌తో, టాప్ ఇంటర్నేషనల్ లగ్జరీ బ్రాండ్లతో కలిసి భాగస్వామ్యాలను పెంచుకోవడం ద్వారా ఫ్యాషన్‌లో కంపెనీ వ్యాపారాల విస్తరణకు ఇషా అంబానీ కృషి చేస్తున్నారు.

రిలయన్స్ కోర్ వ్యాపారాల్లో ఇషా అంబానీ చాలా వేగంగా ఎదుగుతున్నారు. ఎందుకంటే, సీనియర్ నాయకత్వ బాధ్యతలను ఆమెకు అప్పగించారు.

ఇప్పటి వరకు రిలయన్స్ వ్యాపారాల్లో మహిళలు క్రియాశీలకంగా కనిపించరు. చాలా వరకు నామమాత్ర పొజిషన్లకే పరిమితమయ్యారు. కానీ, ఇషా అంబానీ మాత్రం ఇప్పుడు కీలక బాధ్యతలను చేపడుతున్నారు.

2021లో ఇషా అంబానీని ఫార్చ్యూన్ మ్యాగజీన్ ‘‘బాధ్యతల్లోకి వారసురాలు’’ అని వర్ణించింది. భారత్‌లో 21వ అత్యంత శక్తివంతమైన మహిళగా పేర్కొంది. తన తండ్రి అభిప్రాయం ప్రకారం కూడా ఆమె ఒక ఉత్సాహవంతురాలు.

తన కూతురు తాను చేసే వ్యాపార విధానాలపై తరచూ ప్రశ్నిస్తూ ఉంటుందని ముకేశ్ అంబానీ న్యూయార్క్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

తన పోర్ట్‌ఫోలియోను ‘తిరిగి మూల్యాంకనం ’ చేయాలని ఒకసారి తనకు చెప్పిందని ఆయన గుర్తుకు చేసుకున్నారు.

ఎందుకంటే తన కంపెనీల్లో కొన్ని వ్యాపారాలు ప్లాస్టిక్స్ బిజినెస్‌ల మాదిరి గ్రూప్‌ను కలుషితం చేస్తున్నాయని ఆమె అన్నారని చెప్పారు.

రిలయన్స్ ట్రెండ్స్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రిటైల్, ఫ్యాషన్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్

శిలాజ ఇంధనాల నుంచి సోలార్ ప్యానల్ తయారీని అభివృద్ధి చేసేంత వరకున్న రిలయన్స్ ఎనర్జీ వ్యాపారాలను ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ చూసుకుంటున్నారు.

అనంత్ కూడా బ్రౌన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు.

తన తల్లితో కలిసి రిలయన్స్ ఛారిటీ బోర్డులో అనంత్ పనిచేస్తున్నారు. ఐపీఎల్ సీజన్‌లో టీమ్ క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో కూడా ఆమెతో కనిపిస్తుంటారు.

వారసత్వ ప్రణాళిక రిలయన్స్ వాటాదారులందరికీ సానుకూల సంకేతాలను ఇచ్చిందని, భవిష్యత్‌లో రాబోయే వివాదాదలను ఇది నిరోధిస్తుందని బిజినెస్ స్టాండర్డ్ న్యూస్‌పేపర్‌తో మాట్లాడిన సమయంలో ఐఐఎం-ఇందోర్ డైరెక్టర్ హిమాన్షు రాయ్ తెలిపారు.

ముకేశ్ అంబానీ, ఆయన సోదరుడు అనిల్ అంబానీకి మధ్య వ్యాపారాల్లో వచ్చిన తగాదాలను ఇంకా చాలా మంది మర్చిపోలేదు.

తన తండ్రి ధీరూభాయ్ అంబానీ 2002లో మరణించిన తర్వాత కంపెనీ వ్యాపారాల విషయంలో ఇద్దరు అన్నదమ్ములకి వివాదాలు వచ్చాయి.

ఆస్తుల పంపకాలు జరగకుండా, కుటుంబ వ్యాపారాలు నిర్వహించేందుకు ఇద్దరు అన్నదమ్ములు ఎన్నో ఏళ్లుగా ముందుకు రాలేదు.

తండ్రి ఆస్తుల కోసం తన సోదరుడితో ముకేశ్ అంబానీ దాదాపు 20ఏళ్ల పాటు పోరాడాల్సి వచ్చింది.

తండ్రి ధీరూభాయ్ అంబానీ వీలునామా రాయకపోవడమే దీనికి కారణం.

చివరికి వీరి వివాదాలను తమ తల్లి పరిష్కరించారు.

ముంబైలో అంబానీ నివాసం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ముంబైలో అంబానీ ఇల్లు

గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకునేందుకు సరైన సమయంలో అంబానీ తన వారసులకు బాధ్యతలను అప్పజెప్పాలనుకున్నారని నెర్లేకర్ అన్నారు.

కరోనా మహమ్మారి తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ తమ మరణాలపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. వారికి ఏదైనా అవడానికి కంటే ముందే వ్యాపార వారసులను ప్రకటించడం, వీలునామాలు రాయడం చేస్తున్నారు.

కోల్ నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వరకు వ్యాపారాలున్న గౌతమ్ అదానీ గత ఏడాది ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగిన క్రమంలో, అంబానీ వ్యాపార సామ్రాజ్యం తన న్యాయకత్వ మార్పులను చేపట్టింది.

భారత పునరుత్పాదక శక్తి మార్కెట్‌లో ఈ ఇద్దరు నేరుగా పోటీపడుతున్నారు. వీరిద్దరి మధ్య పెరుగుతున్న పోటీని భారత వ్యాపార సర్కిల్స్ క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయి.

రిలయన్స్ తర్వాత తరం లీడర్లను సిద్ధం చేసేందుకు, మార్గదర్శకత్వం చేసేందుకు ముకేశ్ అంబానీ మరో ఐదేళ్ల పాటు కంపెనీకి ఛైర్మన్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండనున్నారు.

దీంతో, రిలయన్స్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు కావాల్సిన సమిష్టి నాయకత్వాన్ని వారు అందించనున్నారు.

ముకేశ్ అంబానీతో ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆయన టీమ్ కూడా కొత్త తరం లీడర్లను భవిష్యత్‌కు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు సాయం చేయనుందని నెర్లేకర్ చెప్పారు.

ఇక్కడి నుంచి రిలయన్స్‌ను వారు ఏ స్థాయికి తీసుకెళ్లనున్నారన్నది సమయమే చెప్పనుంది. అంటే, వచ్చే కొన్నేళ్లు రిలయన్స్‌కు ఎంతో కీలకం కాబోతున్నాయన్న మాట.

‘‘గ్రూప్‌ను నడిపిస్తున్న ముకేశ్ అంబానీ తన వారసుడిగా సరైన నాయకుడిని ఎంచుకునేందుకు ఈ ప్రణాళికను ఉపయోగించుకోనున్నారు.’’ అని నెర్లేకర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)