ఆంధ్రప్రదేశ్: స్కూల్ పిల్లలకు ఇచ్చిన ట్యాబ్స్‌తో సమస్యలేంటి... టీచర్ల అసంతృప్తికి కారణమేంటి?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
"డిజిటల్ లెర్నింగ్ కోసం ఉచితంగా ట్యాబ్స్ అందిస్తున్నాం. ఈ ట్యాబ్ లలో ఎప్పుడయినా సమస్యలు వస్తే వెంటనే అందుబాటులో ఉన్న సచివాలయంలో అందించాలి. మూడేళ్ల వారంటీ ఉంది. వారం రోజుల్లో సరిచేస్తారు. లేదంటే కొత్తది ఇస్తారు." – ఇవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాటలు.
2022 డిసెంబర్ 21 న బాపట్లలో జరిగిన కార్యక్రమంలో ఈ ట్యాబ్‌ల పంపిణీ ప్రారంభిస్తూ సీఎం చెప్పిన మాటలవి.
ఆచరణ అందుకు భిన్నంగా ఉంది. అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లలో అనేకం మూలన పడ్డాయి. సకాలంలో వాటిని సరిచేసే యంత్రాంగం కనిపించడం లేదు.
కొన్ని సిస్టమ్ లోపాల కారణంగా సమస్యలు ఎదుర్కొంటుంటే, మరికొన్ని విద్యార్థుల అత్యుత్సాహంంతో పని చేయని స్థితికి చేరుకున్నాయి.
కానీ, వాటిని సకాలంలో బాగుచేసేందుకు అవకాశం కనిపించడం లేదన్నది క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న మాట.
ఎందుకిలా జరుగుతోంది? ప్రభుత్వం ఏం చేస్తోందనే దాన్ని బట్టి భవిష్యత్తులో ఈ ట్యాబ్ ల ద్వారా లభించే ప్రయోజనం ఆధారపడి ఉంటుంది.

ఆరంభ కష్టాలు...
అందరికీ సమాన సామర్థ్యం ఉండకపోవచ్చు. కానీ, అందరికీ సమాన అవకాశాలు దక్కాలన్నదే తమ విధానమని చెబుతూ ఏపీలో ట్యాబ్ ల పంపిణీకి శ్రీకారం చుట్టింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.
ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వాటిని ఉచితంగా అందించారు. బైజూస్ కంపెనీ రూపొందించిన కంటెంట్‌ని అందులో అప్‌లోడ్ చేసి ఇచ్చారు.
విద్యార్థికి 8వ తరగతిలో అందించిన ట్యాబ్‌ను 10వ తరగతి వరకూ వినియోగించుకోవాల్సి ఉంటుంది. తరగతిలో చెప్పే పాఠాలతో పాటుగా ఆఫ్‌లైన్‌లో కూడా ఆడియో, వీడియో కంటెంట్ సహకారంతో నాణ్యమైన విద్యాభ్యాసానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెప్పింది.
వాటికోసం రూ.686 కోట్లు వెచ్చించింది రాష్ట్ర ప్రభుత్వం. 4,59,564 మంది విద్యార్థులకు ఈ ట్యాబ్‌లు పంపిణీ చేశారు. వారితో పాటు 8వ తరగతికి పాఠాలు చెప్పే 59,176 మంది టీచర్లకూ ఇచ్చారు.
ఒక్కో ట్యాబ్ విలువ రూ.12,800 కాగా, కంటెంట్‌తో కలిపి విలువ రూ.32 వేలు అని ఏపీ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది.
ఇపుడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ట్యాబ్‌ల వినియోగం విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.
ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ అందుకు తగ్గట్టుగా పర్యవేక్షణ కరువయ్యిందనే అభిప్రాయం అటు ఉపాధ్యాయుల నుంచి కూడా వినిపిస్తోంది.

వినియోగానికి దూరంగా మూడోవంతు...
ట్యాబ్‌ల సద్వినియోగం విషయంలో తగిన అవగాహన లేకపోవడం, ఇతర సాంకేతిక సమస్యలు కలిసి దాదాపుగా మూడోవంతు ట్యాబ్‌లు మూలనపడ్డాయి.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి, అల్లూరి జిల్లాలోని అడ్డతీగల, బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం పాఠశాలల్లో బీబీసీ వివిధ సందర్భాల్లో పరిశీలించగా మూడోవంతు విద్యార్థుల దగ్గర ట్యాబ్‌లు కనిపించలేదు. ఒక్కో స్కూల్లో ఒక్కో స్థాయిలో ఇలాంటి సమస్యలున్నాయని టీచర్లు అంటున్నారు.
"సమస్యలు చాలా ఉన్నాయి. కొందరు విద్యార్థులు రెగ్యులర్ గా ట్యాబ్ లు తీసుకురావాలని చెబుతున్నా నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు ఇంటికెళ్లిన తర్వాత వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. సరైన టెక్నికల్ నాలెడ్జ్ లేని ఉపాధ్యాయులను బురిడీ కొట్టించి, గేమింగ్, ఇతర సోషల్ మీడియా యాప్స్ కూడా డౌన్‌లోడ్ చేసేస్తున్నారు. వాటిని టీచర్లకు కనిపించకుండా హైడ్ మోడ్‌లో పెడుతున్నారు. దాని మూలంగా ట్యాబ్ ల వల్ల ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతోంది. ఆన్‌లైన్ గేమ్స్ వల్ల కొన్ని త్వరగా చెడిపోతున్నాయి" అంటూ ఉపాధ్యాయుడు ఎన్ రవిబాబు బీబీసీతో అన్నారు.
ట్యాబ్‌లు ఇచ్చినప్పుడు ఎటువంటి ఇతర యాప్స్ డౌన్‌లోడ్ కాకుండా లాక్ చేసినట్టు చెప్పినా గానీ వాటిని తీయించి, ఇతర అవసరాలకు ట్యాబ్స్ వాడకం పెరిగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

స్పందించేవాళ్లే లేరు...
పనిచేయని ట్యాబ్ లు వెంటనే సచివాలయాలకు అందించాలని అధికారులు చెప్పినప్పటికీ ఆచరణలో అది కనిపించడం లేదని అత్యధికులు అంటున్నారు.
చివరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలతో స్యామ్‌సంగ్ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళితే వారు కూడా స్పందించడం లేదని చెబుతున్నారు.
"సచివాలయంలో చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. కానీ సాఫ్ట్‌వేర్, హార్డ్ వేర్ సమస్యలు ఎదురైతే వారు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. పిల్లలంతా ట్యాబ్ లు వాడాల్సిందేనని ప్రభుత్వం అంటోంది. ఆ బాధ్యత కూడా ఉపాధ్యాయుల మీదే పెడుతోంది. పిల్లలు ట్యాబ్స్ తీసుకురాకపోతే టీచర్ల మీద చర్యలు తీసుకుంటున్నారు. చివరకు సచివాలయాలు కాకుండా స్యామ్‌సంగ్ సెంటర్లకు తీసుకెళ్లి ట్యాబ్‌లు సరిచేయించాలని ఆదేశాలు వచ్చాయి. అయితే, అక్కడికి వెళితే పట్టించుకోవడం లేదు" అని రాజమహేంద్రవరంలోని ఆనంద్ నగర్ మునిసిపల్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఆర్ భాగ్యలక్ష్మి తెలిపారు.
విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్ వారం రోజుల్లో సరిచేసి అందిస్తామనే మాటలకే పరిమితమయ్యారని, కనీసం ఉపాధ్యాయులకు ఇచ్చిన ట్యాబ్‌లు పనిచేయకపోయినా వాటిని సరిచేసే వాళ్లు కనిపించడం లేదని ఆమె అంటున్నారు.

లక్ష్యం మంచిదే అయినా...
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసి అందించిన ట్యాబ్ ల పనితీరు మీద తగిన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అంటున్నారు.
ట్యాబ్ ల వినియోగం మీద ఉపాధ్యాయులకు ఇచ్చిన శిక్షణ కూడా అక్కరకు రావడం లేదు. ముఖ్యంగా ట్యాబ్‌లను విద్యార్థులు తమ వెంట తీసుకెళ్లే వెసులుబాటు ఉండటంతో సులువుగా అవి పక్కదారి పడుతున్నాయనే వాదన కూడా ఉంది.
"లక్ష్యం మంచిదయితే సరిపోదు. దానికి తగ్గట్టుగా ప్రయత్నం ఉండాలి. ట్యాబులిచ్చి చేతులు దులుపుకున్నారు. సెక్యూరిటీ ప్యాచ్ ఉందని చెప్పారు కానీ ఎక్కడా అది పనిచేయడం లేదు. స్క్రీన్ పగిలిపోయి కొన్ని, ఇతర కారణాలతో మరికొన్ని మరుగునపడ్డాయి. లక్ష్యం పూర్తిగా నెరవేరాలంటే వాటి వినియోగం మీద దృష్టి పెట్టాలి. తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే వందల కోట్లు దారిపోసిన తర్వాత ఎందుకూ కొరగాని రీతిలో మిగిలిపోతుంది" అని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర రావు అభిప్రాయపడ్డారు.
తొలి ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యలు సరిచేయాలని ఆయన అన్నారు. బైజూస్ సంస్థ కేవలం కంటెంట్ అప్‌లోడ్ చేసి చేతులు దులుపుకోవడం కాకుండా వాటి పర్యవేక్షణ బాధ్యత కూడా తీసుకున్నందున కాంట్రాక్ట్ సంస్థ బాధ్యత నెరవేర్చేలా చూడాలని ఎమ్మెల్సీ ఐవీ కోరారు.

నెలరోజులుగా పనిచేయడం లేదు...
ప్రభుత్వం అందించిన ట్యాబ్ లు సకాలంలో సరిచేసేవాళ్లు లేకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
"మాకు స్మార్ట్ ఫోన్ కూడా లేదు. కానీ, బడిలో మా అబ్బాయికి ట్యాబ్ ఇచ్చారు. దాంతోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఏం చేస్తున్నావంటే చదువుకుంటున్నానని చెప్పేవాడు. మాకు తెలియదు కదా ఏం చేసేవాడో. నెల క్రితం పనిచేయడం లేదన్నాడు. టీచర్లు కూడా ప్రస్తుతానికి ఏమీ చేయలేం అన్నారట. ఇంట్లోనే ఉంది. అలాంటి వాటిని వెంటనే బాగు చేసేలా చూస్తే పిల్లలకు బాగుంటుందని అనుకుంటున్నాం" అని అనకాపల్లి జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన కామిశెట్టి సత్తిబాబు అన్నారు.
ట్యాబ్‌లో చాలా ఆటలుంటాయని చెప్పేవాడని, ఇప్పుడు అవి లేకపోవడంతో తమను ఫోన్ కొనమని ఒత్తిడి చేస్తున్నాడని ఆయన బీబీసీతో అన్నారు. కుర్రాడికి ఫోన్ కొనే స్తోమత తమకు లేదని తెలిపారు.
సాంకేతిక, ఇతర సమస్యలతో ఆగిపోతున్న ట్యాబ్‌ల విషయంపై ప్రభుత్వ స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌తో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయాన్ని కూడా సంప్రదించింది. అయితే అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి
- చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్లు భూమి లోపల నీటి జాడను పసిగడతాయా... సైన్స్ ఏం చెబుతోంది?
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామి చనిపోతే శరీరాన్ని ఏం చేస్తారు?
- చంద్రయాన్ -3: ఇస్రోకు ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటి వరకు ఏం సమాచారం ఇచ్చింది?
- వీర్యం ఉత్పత్తికి కారణమయ్యే ‘వై క్రోమోజోమ్’ రహస్యాలను ఛేదించారు.. పురుషుడు నిర్వీర్యం అవుతాడా?
- టెరీ గౌ: ఈ ‘ఐఫోన్’ బిలియనీర్ తైవాన్ అధ్యక్షుడు కాగలరా? చైనాను ఎదుర్కోగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














