కొబ్బరి ధరలపై ఆంధ్రప్రదేశ్ రైతులు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు, ప్రభుత్వం ఏం చెబుతోంది?

కోనసీమ
ఫొటో క్యాప్షన్, కొబ్బరి ధరల పతనంపై ఆంధ్రప్రదేశ్‌ రైతుల ఆందోళన
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

కన్నకొడుకు కన్నా కొబ్బరి చెట్టు మిన్న అనే నానుడి ఎప్పటి నుంచో కోస్తా ప్రాంతంలో వాడుకలో ఉంది. అంతగా కొబ్బరి తమను ఆదుకుంటుందనే విశ్వాసం నుంచి ఈ మాట వచ్చింది. కానీ, వర్తమానంలో ఆ పరిస్థితి తారుమారవుతోంది. కొబ్బరిని నమ్ముకున్న రైతులు కష్టాల పాలవుతున్నారని కోనసీమ వాసులు చెబుతున్నారు.

సాధారణంగా పండుగల సీజన్ వచ్చిందంటే పళ్లు, పువ్వుల ధరలు అమాంతంగా పెరుగుతాయి. ఈసారి కూడా శ్రావణ మాసంలో పువ్వులు, అరటి సహా ఇతర పండ్ల ధరలు కూడా పెరిగాయి. కానీ, కొబ్బరికాయల రేట్లు మాత్రం పడిపోయాయి.

అరటి ధర అదరహో అంటుంటే కొబ్బరి ధర కుదేలవుతోందని రైతులు కలవరపడుతున్నారు. ముఖ్యంగా కోనసీమలో కొబ్బరి సాగు మీద ఆధారపడిన వారు బాధ పడుతున్నారు. కొన్ని నెలలుగా ఈ ధరలు క్రమంగా తగ్గుతూ పతనావస్థకు చేరుకోవడంతో దిగాలుగా కనిపిస్తున్నారు.

2022 ఆగస్టులో వెయ్యి కొబ్బరికాయలు రూ.12 వేలకు పైబడి ధర పలకగా, ప్రస్తుతం అది సగానికి పడిపోయింది. ఇంత అనూహ్యంగా ధరలు తగ్గడంతో సాగుదారులు సతమతమవుతున్నారు.

గతంలో కొబ్బరి ధరల పతనాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేయగా, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని చెబుతున్నారు. తక్షణమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొబ్బరి కొనుగోలు కోసం ఏర్పాట్లు చేయాలంటున్నారు.

కొబ్బరి ధరలు అంతగా పతనం కావడానికి కారణాలేంటి?

కోనసీమ

ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఏపీ

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యాన పంటల్లో కొబ్బరిసాగు ప్రధానమైనది. విస్తీర్ణం, దిగుబడి పరంగా ముందంజలో ఉంటుంది. ప్రస్తుతం కొబ్బరి ఉత్పత్తుల పరంగా ఏపీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలుస్తోంది.

ప్రధానంగా కోనసీమ, ఉద్దానం ప్రాంతాల్లో విస్తారంగా కొబ్బరి సాగవుతోంది. ఏలూరు, చిత్తూరు వంటి జిల్లాల్లోనూ పండిస్తారు.

నేషనల్ హార్టీకల్చర్ బోర్డ్ లెక్కల ప్రకారం, 2021-22 నాటికి 1.3 లక్షల హెక్టార్లలో కొబ్బరి పంట ఉంది. దేశంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ తర్వాత ఉత్పత్తిలో ఏపీది నాలుగో స్థానం. ఈ నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచే 90 శాతం కొబ్బరి ఉత్పత్తి అవుతోంది.

దేశంలో 8.25 శాతం కొబ్బరి ఏపీ నుంచి వస్తోంది. 2021-22 లో 11,27,270 టన్నుల దిగుబడి వచ్చింది.

సగటు ఉత్పాదకత పరంగా ఏపీ ముందంజలో ఉంది.

హెక్టార్‌కు సగటున ఏడాదికి ఉత్పత్తి చేసే కాయలు లెక్కగడితే, కేరళలో 7,486, కర్ణాటకలో 9,745గా ఉండగా తమిళనాడులో 14,872 గా ఉంది. ఏపీలో మాత్రం 14,997 అని 2021 నాటి కోకోనట్ బోర్డ్ లెక్కలు చెబుతున్నాయి.

కోనసీమ

కోనసీమలోనే సగం సాగు

ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి సాగు, ఉత్పత్తిలో సుమారు 50 శాతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే ఉంది. ఈ ఒక్క జిల్లాలోనే 60 వేల హెక్టార్లలో కొబ్బరి పంట ఉంది. దిగుబడులు కూడా దానికి అనుగుణంగానే ఉంటాయి.

ఉత్పాదకత పరంగా దేశంలోనే ఏపీ ముందంజలో ఉండడానికి కోనసీమ కొబ్బరి ప్రధాన కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతారు.

ముఖ్యంగా దీవిని తలపించేలా మూడు వైపులా గోదావరి, ఓ వైపు సముద్రం ఉండడంతో కోనసీమ కొబ్బరి పంటకు అత్యంత అనువైన ప్రాంతంగా అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు గుర్తించారు.

నీటిమట్టం అందుబాటులో ఉండడం, మట్టి తేలికగా ఉండటంతో కొబ్బరి వేళ్లు విస్తరించేందుకు తోడ్పడుతుందని శాస్త్రవేత్త బీవీకే భగవాన్ బీబీసీతో చెప్పారు. వాతావరణం కూడా అనుకూలంగా, సమపాళ్లలో వర్షం, ఎండ ఉండడం వల్లనే కోనసీమలో కొబ్బరి విస్తారంగా సాగవుతోందన్నారు.

కోనసీమలో ఉన్న అనుకూలత కారణంగానే దాదాపు ప్రతి ఇంటా కొబ్బరి మొక్క ఖాయం అన్నట్టుగా కనిపిస్తుంది. అలాంటి కోనసీమలో అనేక తుపాన్లు, ఇతర ప్రకృతి విపత్తులను తట్టుకుని కొబ్బరి సాగవుతోంది. కానీ, ప్రస్తుతం అటు దిగుబడులు తగ్గడం, ఇటు ధరల పతనం కారణంగా రెండు రకాలుగా నష్టపోతున్నామని రైతులు అంటున్నారు.

కోనసీమ

ఫొటో సోర్స్, Getty Images

1,300 నుంచి 650కి పడిపోయిన ధర

కొబ్బరిని నీళ్లకాయలు, టెంకాయలు, కురిడీ వంటి వివిధ రకాలుగా విక్రయిస్తారు.

తమిళనాడు, కేరళతో పోలిస్తే కోనసీమ కొబ్బరి పరిమాణంలో కొంత చిన్నగా ఉంటుందని చెబుతారు. అయినప్పటికీ, దేశీయంగా కోనసీమ కొబ్బరికి డిమాండ్ ఉండేది. రాజస్థాన్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ సహా వివిధ ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతి అయ్యేది.

ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు కోనసీమలోని అంబాజీపేట ప్రధాన వ్యవసాయ మార్కెట్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో కొబ్బరిని కొని ఎగుమతి చేస్తుంటారు. ఇటీవల ఎగుమతులు తగ్గిపోయినట్టు రావులపాలెం మండలానికి చెందిన వ్యాపారి పెచ్చెట్టి చిన్నారావు అన్నారు.

"నేను ముప్పై ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఒక్కోసారి ప్రకృతిలో వస్తున్న మార్పుల మూలంగా దిగుబడి తగ్గేది. వైరస్‌లు, నల్లి తెగులు వంటి కారణంగా ఉత్పత్తి తగ్గితే డిమాండ్ పెరిగి మంచి ధర వచ్చేది. ధర తగ్గితే ఉత్పత్తి పెరగడం వల్ల రైతుల ఆదాయానికి ఢోకా లేకుండా ఉండేది.

కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దిగుబడి లేదు, డిమాండ్ లేదు. ధర దారుణంగా పడిపోయింది. కోనసీమ నుంచి కొబ్బరి కొనేవాళ్లు కరువయ్యారు" అని ఆయన బీబీసీతో చెప్పారు.

తన అనుభవంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని చిన్నారావు అన్నారు. ఏడాదిగా ధరలు క్రమంగా పడిపోతూ వంద కాయలకు రూ.1200, రూ.1300 నుంచి ప్రస్తుతం రూ.650కి వచ్చేసిందన్నారు.

కోనసీమ

పెరిగిన సాగు వ్యయం

సగటున ఎకరా భూమిలో కొబ్బరి సాగుకి ఏడాదికి రూ.30 వేల వరకూ ఖర్చవుతోంది. ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగిపోవడంతో ఈ ఖర్చులు పెరిగిపోయాయి.

కొబ్బరికాయల దింపు కార్మికులకు కనీసంగా కాయకు రూపాయి చొప్పున ఇవ్వాలి. మొత్తంగా చెట్టు నుంచి కొబ్బరికాయలు కోసి గుట్టలుగా వేయడానికి ఒక్కో కాయకు సుమారుగా 3 రూపాయలు ఖర్చవుతుంది. కానీ, ప్రస్తుతం వ్యాపారుల నుంచి ఎండు కొబ్బరికాయకు 6 రూపాయలకు మించి ధర రావడం లేదు.

పైగా 100 కొబ్బరికాయలు కొంటే రైతులు అదనంగా 10 కొబ్బరికాయలు వ్యాపారులకు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో ఒక్కో కాయకు మూడు రూపాయలు కూడా మిగలడం లేదని రావులపాడు రైతు చీకూరి శ్రీరామ్మూర్తి అన్నారు.

"కొబ్బరి రైతుకు కోత ఖర్చులు కూడా రావడం లేదు. ధర బాగున్నప్పుడు చెట్టుకు ఏడాదికి కనీసంగా రూ.1200 వరకూ వచ్చింది. ఈ సంవత్సరం ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.550 నుంచి రూ.700 వరకు దక్కుతోంది. ఎకరా కొబ్బరి తోట ఉంటే సుమారు 60 చెట్లు ఉంటాయి. గతంలో ఎకరాకు రూ.60 వేలు ఆదాయం ధీమాగా వచ్చేది.

కోకో, బాదం వంటి అంతరపంటలతోనూ మరికొంత ఆదాయం దక్కేది. కానీ, ఈసారి ప్రధాన పంటలోనే ఆదాయం పడిపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నాం. ఒకటి రెండు నెలలు అన్ సీజన్లో అంటే ఫర్వాలేదు. కానీ, నెలల తరబడి ధరలు పడిపోవడమే తప్ప ప్రయోజనం కనిపించడం లేదు" అంటూ ఆయన వాపోయారు.

కొబ్బరి ధరల పతనం మీద ప్రభుత్వాలు స్పందించాలని ఆయన కోరారు.

కోనసీమ

అసలు సమస్య అదేనా?

కోనసీమ కొబ్బరికి 1996 తుఫాన్ తర్వాత నల్లి తెగులు వ్యాపించింది. అప్పటి నుంచి కొబ్బరి సైజు తగ్గింది. దానికి తోడు ఇటీవల వైరస్‌ల తాకిడి పెరిగింది. వాటి కారణంగా ఇక్కడి కొబ్బరికి డిమాండ్ తగ్గింది.

అదే సమయంలో, తమిళనాడు కొబ్బరి చెట్ల వయసు తక్కువ. కాబట్టి అక్కడి కాయల్లో నాణ్యత ఎక్కువగా ఉందని వ్యాపారులు నమ్ముతున్నారు. అక్కడ దిగుబడి ఎక్కువగా రావడం, ధరలు కూడా తక్కువగా ఉండడం, తమిళనాడు మార్కెట్‌కు కలిసొచ్చింది. ఫలితంగా ఏపీలో కొబ్బరి రైతులకు కష్టాలు పెరుగుతున్నాయి.

ఏపీలో దిగుబడి, ధరలు రెండూ తగ్గడంతో రైతులు నష్టపోతున్నారు. తమిళనాడులో అందుకు భిన్నంగా ఉంది. దిగుబడి పెరుగుతూ వస్తోంది. ధరలు తగ్గినా దిగుబడులు భారీగా ఉండడం వల్ల రైతుల్లో అంత ఆందోళన కనిపించడం లేదు.

గతంలో కోనసీమలోనూ ఇలాంటి పరిస్థితే ఉండేది. ధర తగ్గినా దిగుబడుల వల్ల ఉపశమనం దక్కేది. కానీ, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.

ప్రభుత్వం కనీస మద్దతు ధరకి కొబ్బరి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నప్పటికీ, ధాన్యం అమ్మిన తర్వాత రైతులకి ప్రభుత్వం సకాలంలో డబ్బులు చెల్లించని కారణంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కొబ్బరి తరలించే అవకాశాలు కూడా తక్కువేనని వ్యాపారి పి. వేంకటేశ్వర రావు అభిప్రాయపడ్డారు.

అయితే, ప్రభుత్వం మాత్రం కొబ్బరి ధరలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని చెబుతోంది.

కోనసీమ

నిల్వ సదుపాయాలు కొరవడి మరింత నష్టం

కొబ్బరి మార్కెట్లో అస్థిరత్వం సహజమే. సీజన్లను బట్టి అది మారుతూ వస్తోంది. కానీ, ఒక్కోసారి ధరలు అనూహ్యంగా పడిపోయిన సమయంలో రైతులను ఆదుకునేందుకు నాబార్డ్ జోక్యం చేసుకునేది. నాబార్డ్ ఆధ్వర్వంలోనే కొబ్బరి కొనుగోలు సెంటర్లు నిర్వహించేవారు. తద్వారా ధరల తగ్గుదలను అరికట్టే అవకాశం ఉండేది.

సామాన్య రైతులకు కొబ్బరి నిల్వ చేసుకునే సామర్థ్యం లేని కారణంగా ధరలు తగ్గిపోయినా తక్కువకే అమ్ముకోవాల్సి వస్తోంది. ఎక్కువ కాలం నిల్వ చేసుకునేందుకు అనుగుణంగా కోల్డ్ స్టోరేజీలు నిర్మించి ఉంటే కొంత ఉపశమనం దక్కేది.

అలాంటి పరిస్థితి లేనందువల్ల ఆరుబయటే కొబ్బరి కాయలు నిల్వ ఉంచాల్సి వస్తుండడంతో, అవి మొక్కలు మొలిచి పనికిరాని దశకు చేరుకుంటున్న అనుభవాలు కూడా ఉన్నాయి.

"కొబ్బరి రైతుల గోడును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మార్కెట్‌లో మాత్రం ఒక్కో కొబ్బరికాయ 20 నుంచి 25 రూపాయలకు తక్కువగా లేదు. మార్కెట్‌ మాయాజాలంతో కొబ్బరి రైతులు నలిగిపోతున్నారు. కాయకు రూ.15 ధర ఉండాలి. అయితే మార్కెట్‌లో ఆ ధర రావడం లేదు. నాబార్డ్, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.

ఏటా రూ.3 వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధి కేటాయించినట్టు చేసిన ప్రకటనలు ఆచరణలో చూపాలి. నాఫెడ్‌, ఆయిల్‌ ఫెడ్‌ రంగంలోకి దిగి రైతుల నుంచి కొబ్బరికాయలు కొనుగోలు చేయాలి" అని ఏపీ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కే శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

కొనుగోలు కేంద్రాల పేరుతో హడావిడిగా ప్రారంభోత్సవాలు చేసినా ఒక్క కాయ కూడా రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదని ఆయన ఆరోపించారు.

కోనసీమ

వ్యవసాయ మంత్రి కాకాణి ఏమన్నారు?

కొబ్బరి ధరల పతనంపై ఆంధ్రప్రదేశ్‌ రైతులు ఆందోళన బాట పట్టారు. ఏలూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఎండు కొబ్బరి కాయలను ఎదురుగా పోసి నిరసన తెలిపారు. కొబ్బరి కొనుగోలు కేంద్రాలు, కనీస ధరలు అందించాలంటూ వివిధ రూపాల్లో రైతులు ప్రభుత్వానికి నివేదించారు.

రైతుల సమస్యలపై నాబార్డ్ స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది. కానీ, అధికారులు స్పందించలేదు.

రాష్ట్రంలో కొబ్బరి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఏపీ ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.

"కొబ్బరి కొనుగోలు కేంద్రాలు తెరిచాం. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎవరికీ నష్టం జరగకుండా చూస్తాం. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో దిగుబడులు బాగా పెరిగాయి. ఫలితంగా వ్యాపారులు అటు మళ్లారు. ఫలితంగా ఏపీలో కొబ్బరి కొనుగోళ్లు మందగించాయి. సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుంది" అంటూ ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి: