వేరొకరితో జీవిస్తోందని భార్యను దుస్తులు విప్పించి ఊరేగించిన భర్త - రాజస్థాన్‌లో అమానుషం

ఫొటో సోర్స్, RAJASTHAN POLICE
రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఓ మహిళను వివస్త్రను చేసి గ్రామంలో తిప్పిన ఘటన సంచలనం సృష్టించింది.
దుస్తులు విప్పి మహిళను ఊరేగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ ఘటన ఆగస్టు 31 జరగ్గా, సెప్టెంబర్ 1న ఈ వీడియో గురించి తమకు తెలిసిందని పోలీసులు చెబుతున్నారు.
ప్రతాప్‌గఢ్ జిల్లా గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతం.
ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు 30 బృందాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు, మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఘటన జరిగిన రెండు రోజులు గడిచినా, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారని జాతీయ మహిళా కమిషన్ విమర్శించింది.
"రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిన సంఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఒక మహిళను వేధించి, వివస్త్రను చేసి వీడియో కూడా తీశారు. సంఘటన జరిగి రెండు రోజులు గడిచాయి, కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇది సరికాదు’’ అని మహిళా కమిషన్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించింది.
దోషులను తక్షణమే అరెస్టు చేసి, వారిని సంబంధిత సెక్షన్ల కింద విచారించాలని రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ ఆదేశించారు. ఐదు రోజుల్లో దీనికి సంబంధించి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అసలేం జరిగింది?
ప్రతాప్‌గఢ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బుడానియా ఈ కేసు గురించి బీబీసీతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ‘‘ఈ ఘటన ఆగస్టు 31న జరిగింది, మాకు సెప్టెంబర్ 1న ఈ వీడియో గురించి సమాచారం అందింది.’’ అని అన్నారు.
‘‘ప్రతాప్‌గఢ్‌లోని ధరియావాడ్‌లో ఈ ఘటన జరిగింది. నిందితులు వెంటనే దాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయలేదు. దీనికి కారణం, ఆ ప్రాంతంలో దాదాపు పది కిలోమీటర్ల మేర ఇంటర్నెట్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోవడమే. నిందితులు శుక్రవారం నాడు నెట్‌వర్క్ ఉన్న ప్రాంతానికి వచ్చాక వీడియోను పోస్ట్ చేశారు. అది వైరల్‌గా మారింది’’ అని అమిత్ బుడానియా వెల్లడించారు.
ఈ వైరల్ వీడియోలో, నిందితుడు మహిళ దుస్తులను బలవంతంగా విప్పుతున్నట్లు కనిపిస్తుండగా, అలా చేయవద్దంటూ ఆ మహిళ వేడుకుంటోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళను నగ్నంగా ఊరేగించారు. ఆమె దుస్తులు విప్పుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరూ వారించలేదు. అక్కడ చేరిన జనంలో మహిళలు కూడా ఉన్నారు. వారు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
ఈ ఘటన వీడియో బయటకు రావడంతో శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో డీజీపీ ఉమేష్ మిశ్రా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
దీనిపై పోలీసులు చర్యలు చేపట్టినట్లు, ఘటనా స్థలానికి క్రైమ్ ఏడీజీని పంపినట్లు తెలిపారు.
నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, ఏడుగురిని అరెస్టు చేశామని డీజీపీ ఉమేష్ మిశ్రా శనివారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపారు.
"మహిళ భర్త కన్హా గమేటి, అతని సహచరులు సూరజ్, వేణియా, నేతు, నాథు, మహేంద్రలు ఆ మహిళలను మోటార్ సైకిల్‌పై బలవంతంగా తీసుకొచ్చి వివస్త్రను చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది." అని పోలీసులు వెల్లడించారు.
"ఈ సంఘటనపై ధరియావాడ్ సర్కిల్‌లోని కేసరియావాడ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది." అని ధరియావాడ్ డిఎస్పీ ధన్‌ఫూల్ మీణా బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, AFP
వివాహేతర సంబంధమే కారణం
ఈ ఘటనకు కారణాలను ధరియావాడ్ డీఎస్పీ ధన్‌ఫూల్ మీనా వివరించారు.
‘‘విచారణలో ‘నాతా’ వ్యవహారం కూడా ఉంది. ఈ మహిళకు రాజా అనే వ్యక్తితో ఇంతకు ముందు వివాహం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుత కేసులో నిందితుడైన కన్హా గమేతీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కన్హాను కూడా విడిచిపెట్టి శివ అనే వ్యక్తితో కలిసి జీవిస్తోంది. ఆ కోపంతో కన్హా అతని బంధువులు ఈ ఘటనకు పాల్పడ్డారు.’’అని వెల్లడించారు.
రాజస్థాన్‌లోని కొన్ని గిరిజన ప్రాంతాలలో ‘నాతా’ వ్యవస్థ ప్రబలంగా ఉంది. ఈ ఆచారం ప్రకారం, వివాహిత తన భర్తను వదిలి మరే వ్యక్తితోనైనా కలిసి జీవించవచ్చు. పురుషుడు కూడా మహిళ సమ్మతితో ఆమెను భర్త నుంచి వేరు చేసి తన భార్యగా చేసుకోవచ్చు.
బాధిత మహిళ గర్భవతి అని మీడియా కథనాలు పేర్కొన్నాయి. కానీ, వైద్య పరీక్షల తర్వాతే మహిళ గర్భవతా కాదా అన్నది తేలుతుందని పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బుడానియా తెలిపారు.

ఫొటో సోర్స్, THINKSTOCK
వీడియో వైరల్
ఈ ఘటనపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను ఎస్పీ అమిత్ బుడానియా వివరించారు. ‘‘ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేశాం. వారిలో కొందరు పారిపోవడానికి ప్రయత్నించి గాయపడ్డారు. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించాం. ప్రధాన నిందితుడు కన్హా, అతని స్నేహితులు వేణియా, నాథూలను అరెస్టు చేశాం. ఈ నిందితులందరూ బాధిత మహిళ అత్తమామల కుటుంబానికి చెందినవారు. మొత్తం 10 మంది నిందితుల పేర్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం." అని ఆయన వెల్లడించారు.
ఐపీసీతోపాటు, ఐటీ యాక్ట్‌లోని కొన్ని సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
ఈ కేసు విచారణపై బన్స్‌వారా రేంజ్ ఐజీ ఎస్.పరిమళ మీడియాతో మాట్లాడారు. ‘‘30 పోలీసు బృందాలను ఏర్పాటు చేశాం. ఈ ఘటనలో ఎంతమంది ప్రమేయం ఉందనే దానిపై విచారణ జరుపుతున్నాం. నిందితులందరికీ కఠిన శిక్షలు పడేలా చేస్తాం’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఘటనపై రాజకీయాలు
ఇటీవల మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన అంశంపై బీజేపీని కాంగ్రెస్ ఇరుకున పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లోని జరిగిన ఘటనపై బీజేపీ దూకుడు పెంచింది.
‘‘రాజస్థాన్‌లో మహిళను వివక్షను చేసిన ఘటన దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. రాజస్థాన్‌లో ప్రభుత్వం పని చేయడం లేదు’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆయన రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కూడా స్పందించారు. ‘‘ధరియావాడ్‌లో ఓ గర్భిణిని బహిరంగంగా వివస్త్రను చేసిన వీడియో వైరల్ అవుతున్న విషయం అధికారులకు కూడా తెలియదు’’ అని అన్నారు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని వసుంధర రాజె ప్రజలకు ఎక్స్ (ట్విటర్) ద్వారా విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ సంఘటనపై స్పందిస్తూ, నాగరిక సమాజంలో ఇలాంటి నేరగాళ్లకు చోటులేదని, ఈ ఘటనకు పాల్పడిన వారిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపి వీలైనంత త్వరగా శిక్ష పడేలా చూస్తామని ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














