చర్మానికి సరిపడే సరైన సన్‌స్క్రీన్, క్లెన్సర్, మాయిశ్చరైజర్‌లను ఎలా ఎంచుకోవాలి

స్కిన్ కేర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అనూజా వైద్య లాఠీ
    • హోదా, బీబీసీ కోసం

సుశాంత్ నా ఎదురుగా కూర్చున్నాడు. అతడి మొహంపై చాలా పింపుల్స్, మచ్చలు కనిపిస్తున్నాయి. డిప్రెషన్‌తో అతడు బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఎందుకు వచ్చారో చెప్పండని అతడిని నేను అడిగాను. ‘‘నాకు మొదట కొంచెం తక్కువే పింపుల్స్ ఉండేవి. అయితే, సెలబ్రిటీ ఒకరు యూట్యూబ్‌లో సూచించడంతో ఒక క్రీమ్ కొనుక్కున్నాను. అది రాసుకున్న తర్వాత పింపుల్స్ చాలా ఎక్కువయ్యాయి’’ అని అతడు చెప్పాడు.

ఆ క్రీమ్ వాడిన తరువాత అతడి సమస్య పరిష్కారం కావడానికి బదులుగా మరింత తీవ్రమైంది.

మన శరీరంలో చర్మం చాలా ముఖ్యమైనది. అయితే, అందరి చర్మం ఒకేలా ఉండదు. ఇక్కడ వయసు, జీవనశైలి, ఎండలో ఎంతసేపు గడుపుతున్నారు? ఎలాంటి ప్రాంతంలో జీవిస్తున్నారు? వ్యాయామం చేస్తున్నారా? మీ స్కిన్ ఏ రకం? లాంటి చాలా అంశాలు ప్రభావం చూపిస్తుంటాయి. మనం తీసుకోవాల్సిన చర్యలు కూడా వీటిపైనే ఆధారపడి ఉంటాయి.

అందుకే సుశాంత్‌లా ప్రయోగాలు చేయకూడదు. ఇన్‌స్టా సెలబ్రిటీలు, ప్రకటనల్లో చూపించే క్రీములన్నీ మొహానికి రాసుకోకూడదు.

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. అంతేకాదు, ఎలాంటి ప్రాడెక్టులు ఎంచుకోవాలి, ఎప్పుడు వైద్యుల దగ్గరకు వెళ్లాలి.. లాంటి అంశాలపై మనకు అవగాహన ఉండాలి.

స్కిన్ కేర్‌లో మూడు విషయాలను ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. వీటిలో మొదటది సన్‌స్క్రీన్, రెండోది క్లెన్సర్, మూడోది మాయిశ్చరైజర్. మరి వీటిని ఎలా ఎంచుకోవాలి?

స్కిన్ కేర్

ఫొటో సోర్స్, Getty Images

సన్‌స్క్రీన్ లోషన్

ముందుగా సన్‌స్క్రీన్ లోషన్ గురించి మాట్లాడుకుందాం.

ఇక్కడ ముందుగా సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావయలెట్ కిరణాల గురించి చెప్పుకోవాలి. ఈ కిరణాలు నేరుగా మన చర్మంపై పడుతుంటాయి. వీటి వల్ల

  • స్కిన్ బర్న్ లేదా స్కిన్ ఇరిటేషన్
  • సన్ అలెర్జీ
  • టానింగ్.. అంటే చర్మం నల్లగా అయిపోవడం

వంటి చాలా చర్మ సమస్యలకు అల్ట్రావయలెట్ కిరణాలు కారణం అవుతుంటాయి. అందుకే చర్మానికి తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్‌ను రాసుకోవాలి.

ఎక్కువసేపు ఇలా ఎండలో గడపడంతో ముఖంపై మడతలు కూడా పడతాయి. దీని వల్ల వయసు పైబడినట్లుగా అనిపిస్తుంది.

అందుకే సన్‌స్క్రీన్ చాలా ముఖ్యం. అయితే, దీన్ని ఎంచుకునే, రాసుకునే విషయంలో చాలా ప్రశ్నలు మనల్ని వెంటాడుతుంటాయి.

బయటకు వెళ్లిన ప్రతిసారీ సన్‌స్క్రీన్ రాసుకోవాలా? యువత కూడా దీన్ని రాసుకోవాలా? అసలు ఎలాంటి సన్‌స్క్రీన్ రాసుకోవాలి? లాంటి ప్రశ్నలు దీనిలో ఉంటాయి.

ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం.

మీరు 20ల వయసులోనే సన్‌స్క్రీన్‌ను రాసుకుంటే, వయసు పైబడే ఛాయలు కాస్త ఆలస్యంగా వస్తాయి. అంటే మీరు ఎక్కువకాలం ఆరోగ్యవంతమైన, యవ్వనంతో కనిపించే చర్మంతో జీవిస్తారు.

భారత్‌లో జీవించే వారి చర్మంలో మెలనిన్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల మనం ఎండలో గడిపినప్పటికీ అంత త్వరగా చర్మం పాడుకాదు. అయినప్పటికీ మనం కూడా సన్‌స్క్రీన్ రాసుకోవాలి. ఎందుకంటే ఈ క్రీమ్‌ల వల్ల టానింగ్ నియంత్రణలో ఉంటుంది.

స్కిన్ కేర్

ఫొటో సోర్స్, Getty Images

సరైన సన్‌స్క్రీన్ ఎంచుకోవడం ఎలా?

మీకు ఆయిల్ స్కిన్ ఉంటే జెల్ బేస్ సన్‌స్రీన్ ఎంచుకోవాలి.

అదే డ్రై స్కిన్ ఉంటే లోషన్ లేదా క్రీమ్ బేస్ సన్‌స్క్రీన్ ఎంచుకోవాలి.

ఇక్కడ ఎస్‌పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ గురించి గుర్తుపెట్టుకోవాలి. సన్‌స్క్రీన్ బాటిల్స్‌పై మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది.

మన ఇండియన్ స్కిన్‌కు ఎస్‌పీఎఫ్ 15 నుంచి 40 మధ్య ఉండే క్రీమ్ అయితే సరిపోతుంది.

సన్‌స్క్రీన్ ఎప్పుడు రాసుకోవాలి?

వీలైతే రోజూ సన్‌స్క్రీన్ రాసుకోవాలి. కానీ, రాత్రి కాదు. ఉదయమే రాసుకోవాలి.

ఉదయం 8-9 నుంచి సాయంత్రం 5-6 వరకూ మొహంపై సన్‌స్క్రీన్ ఉంటే మంచిది.

మీరు బయట పనిచేయాల్సి వచ్చినా లేదా ఎండలో ఎక్కువసేపు గడపాల్సి వచ్చినా మీతోపాటు సన్‌స్క్రీన్ లోషన్‌ను కూడా తీసుకెళ్లండి.

ముఖ్యంగా జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్‌లు ఉండే సన్‌స్క్రీన్ ఎంచుకుంటే మంచిది.

కేవలం మొహంపై మాత్రమే కాదు, చెవులు, మెడ, చేతులకూ సన్‌స్క్రీన్ రాసుకోవాలి.

స్కిన్ కేర్

ఫొటో సోర్స్, Getty Images

క్లెన్సర్‌ను ఎలా రాసుకోవాలి?

ముఖానికి సబ్బు రాసుకోవాలా? లేదా ఫేస్‌ వాష్? ఇది చాలా మందిని వెంటాడే ప్రశ్న.

ఏదైనా రాసుకోవాచ్చు. కానీ, వీటిని వాడే ముందు కొన్ని విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.

రోజుకు రెండు సార్లు మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఆయిల్ స్కిన్ లేదా పింపుల్స్ లాంటి సమస్యలుంటే తరచూ ముఖాన్ని కడుక్కోవడం మంచిది. కానీ, ఇలా కడుక్కోవడంతో చర్మంపై మృదువైన రక్షణ కవచంలా ఉండే పొర పాడవుతుందని అనిపిస్తే వెంటనే ఆపేయండి.

ఎందుకంటే ఇలా అయితే, పింపుల్స్ మరిన్ని పెరగొచ్చు. కాబట్టి ఈ విషయంలో చర్మం రకాన్ని బట్టి మనమే నిర్ణయం తీసుకోవాలి.

సాధారణంగా అయితే, మనకు ముఖానికి సరిపడే క్లెన్సర్‌తో రెండుసార్లు వాష్ చేసుకోవడం మంచిది.

ఏ సబ్బు వాడాలి?

మీకు సబ్బు వాడాలి అనిపిస్తే, ఔషధ గుణాలున్న సబ్బులను ఎంచుకోండి. ముఖ్యంగా యాక్నే మెడికేషన్ ఉండే సబ్బును ఎంచుకోవాలి. మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీఫంగల్ సబ్బును ఎంచుకోవాలి.

అయితే, హాస్పిటల్‌లో ఉపయోగించే యాంటీ-బాక్టీరియల్ సోప్‌లను ముఖానికి రాసుకోవద్దు. ఎందుకంటే చర్మానికి రక్షణ కల్పించే మంచి బ్యాక్టీరియాకు ఆ సోప్‌లు హానిచేస్తాయి.

అందుకే పీహెచ్ తక్కువగా ఉండే సోప్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ స్కిన్ పీహెచ్‌కు సరిపడే సోప్ అయితే మేలు. ఆ సబ్బులు రంగు లేదా ఘాటు సువాసనలు లేకపోతే మంచిది.

స్కిన్ కేర్

ఫొటో సోర్స్, Getty Images

ఫేస్‌ వాష్ వాడేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

ఫేస్‌ వాష్‌లలో రెండు రకాలు ఉంటాయి. వీటిలో మొదటిది ఫోమింగ్, రెండోది నాన్-ఫోమింగ్.

మీకు ఆయిల్ స్కిన్ ఉంటే ఫోమింగ్ ఫేస్ వాష్ మంచిది. అయితే కొన్నిసార్లు వీటిలో పీలింగ్ ఏజెంట్లు, యాసిడ్లు కూడా కలుపుతుంటారు. ఇలాంటి ఫేస్‌ వాష్‌లను రాసుకున్న తర్వాత ఎండలోకి వెళ్తే ఇరిటేషన్ కలగొచ్చు. కాబట్టి ఇలాంటి వాటితో సాయంత్రం వాష్ చేసుకుంటే మంచిది.

మీ స్కిన్ కాస్త పొడిగా ఉన్నా లేదా వయసు 30లు లేదా 40లలో ఉన్నా మాయిశ్చరైజ్డ్ బేస్ ఫేస్‌ వాష్‌లను ఎంచుకోవాలి. లేదా నాన్ ఫోమింగ్ రకమైనా ఫర్వాలేదు.

ఇక్కడ మహిళలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేకప్‌తో రాత్రిపూట అసలు పడుకోకూడదు. క్లెన్సర్‌తో మొహాన్ని శుభ్రం చేసుకున్నానే పడుకోవాలి.

స్కిన్ కేర్

ఫొటో సోర్స్, Getty Images

మాయిశ్చరైజర్ ఎలా రాసుకోవాలి?

మాయిశ్చరైజర్‌ను రోజూ రాసుకోవాలా? ఇది కూడా చాలా మంది అడిగే ప్రశ్న.

అవును. తప్పకుండా మాయిశ్చరైజర్‌ను రోజూ రాసుకోవాలి.

అది కూడా మీ చర్మానికి సరిపడే మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. ఆయిల్ స్కిన్ ఉంటే వాటర్ బేస్ మాయిశ్చరైజర్ ఎంచుకోండి. ఆయిల్ స్కిన్‌తోపాటు పింపుల్స్ ఎక్కువగా ఉంటే ఆక్వా బేస్ జెల్ ఎంచుకోండి.

అదే పొడి చర్మం ఉంటే.. కాస్త అమోలియంట్స్ ఎక్కువగా ఉండే మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి.

రోజూ రెండు పూటలా మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.

ఉదయం స్నానం చేసిన తర్వాత మూడు నుంచి ఐదు నిమిషాల్లో మాయిశ్చరైజర్ రాసుకుంటే వెంటనే ఇది చర్మంలోకి వెళ్తుంది. పైగా ఎక్కువసేపు కూడా ఉంటుంది. మీకు ఎక్కువసేపు రక్షణ కూడా ఉంటుంది.

రాత్రి కూడా పడుకునే ముందు ముఖాన్ని కడుక్కొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

స్కిన్ కేర్

ఫొటో సోర్స్, Getty Images

జీవన శైలి...

చర్మం ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించేది జీవన శైలి.

జీవనశైలి, చర్మం మధ్య చాలా గట్టి సంబంధం ఉంటుంది. ఆరోగ్యకర జీవన శైలి అంటే అసలు ఏం చేయాలి? ఇది కూడా చాలా మంది అడిగే ప్రశ్న. దీనికి సమాధానం వ్యాయామం, సంతులిత ఆహారం.

రోజూ వ్యాయామం చేయాలి. మీ ఉద్యోగం కూర్చొని చేసేదైతే మరింత ఎక్కువ వ్యాయామం చేయాలి.

ఆ తర్వాత సంతులిత ఆహారం కూడా తీసుకోవాలి. ఇక్కడ కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్‌లు, ప్రోటీన్లు అన్నీ తగినంత ఉండేలా చూసుకోవాలి.

షుగర్స్‌ను వీలైనంత తగ్గించుకుంటే మంచిది. ఎంత ఎక్కువ షుగర్ తీసుకుంటే అన్ని ఎక్కువ పింపుల్స్ వస్తాయి. పైగా వయసు పైబడితే వచ్చే ముడతలు కూడా పెరుగుతాయి. బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా పెరుగుతుంది.

అలానే జంక్ ఫుడ్స్‌ కూడా తగ్గించాలి. మరోవైపు డెయిరీ, బేకరీ ఉత్పత్తులు కూడా చర్మంపై పింపుల్స్‌కు కారణం అవుతాయి. అందుకే కేక్‌లు, పేస్ట్రీలు తగ్గించుకోవాలి.

ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పాటిస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంటే ఇక్కడ చర్మ సమస్యలేమీ రావని కాదు. ఎందుకంటే అందరికీ చర్మ సమస్యలు ఉంటాయి. కానీ, ఈ ముప్పులను మనం తగ్గించుకోవాలి. సమస్య తీవ్రమైనట్లు అనిపిస్తే, వెంటనే వైద్యులను ఆశ్రయించాలి.

(రచయిత వైద్యురాలు, ఈ కథనం స్థూలమైన అవగాహన కోసమే)

వీడియో క్యాప్షన్, యాంటీ బయాటిక్స్: ప్రాణాలు కాపాడడమే కాదు, ప్రాణాలు తీస్తాయి కూడా...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)