ఆసియా కప్ 2023: పాకిస్తాన్ పేస్ అటాక్‌ను విరాట్ కోహ్లీ, రోహిత్, గిల్ చిత్తు చేస్తారా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత్ వర్సెస్ పాకిస్తాన్ అంటే చాలు క్రికెట్ ప్రపంచంలో ఓ సెన్సేషన్. ప్రపంచం దృష్టిని ఆకర్షించే ఈ ప్రత్యర్థి జట్లు ఈరోజు శ్రీలంకలోని కాండీలో ఆసియా కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో తలపడబోతున్నాయి.
రాజకీయ కారణాలతో ఇరు దేశాల మధ్య ఇటీవలి కాలంలో ఎలాంటి సిరీస్‌లు జరగలేదు. దాంతో, చాలా రోజుల తరువాత ఈ రెండు దేశాల మధ్య జరగబోయే మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ ఏడాది జరగబోయే ప్రపంచ కప్‌కు ఈ మ్యాచ్ ఒక రిహార్సల్ లాగా కనిపిస్తోంది.
ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ వేసిన బంతులకు భారత క్రికెట్ విరాట్ కోహ్లి చేసిన దూకుడు బ్యాటింగ్ ఇప్పటికీ ప్రతి ఒక్కరికీ గుర్తే.
మెల్‌బోర్న్ మైదానంలో హారిస్ వేసిన బాల్‌కు కోహ్లి కొట్టిన సిక్స్.. క్రికెట్ దిగ్గజాల మెరుపు బ్యాటింగ్‌లో ఒక భాగంగా నిలిచిపోయింది.
భారత క్రికెట్ అభిమానులు మరోసారి కోహ్లీ నుంచి ఈ మేజికల్ మూమెంట్స్‌ను కోరుకుంటున్నారు.
కానీ, హారిస్ రవూఫ్ మాత్రం విరాట్ కోహ్లీకి కానీ లేదా మరే ఇతర ఆటగాడికి కానీ ఈ అవకాశం ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, ANI
పాకిస్తాన్ బౌలర్లకు, భారత ఆటగాళ్లకు గట్టి పోటీ
నేడు(శనివారం) జరగబోయే ఈ మ్యాచ్‌ను చాలా మంది భారత బ్యాటింగ్‌కు, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్‌కు మధ్య జరిగే పోటీగా చూస్తున్నారు.
భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు ఈ సారి పాకిస్తాన్ పేస్ బౌలర్లు హారిస్ రవూఫ్, షహీన్ అఫ్రిది, నసీమ్ షాలను ఎదుర్కోనున్నారు.
వీరి బౌలింగ్ ప్రస్తుతం చాలా బలంగా ఉంది. వీళ్లను భారత బ్యాటర్లు తేలిగ్గా తీసుకోవడానికి వీలు లేకుండా చెలరేగుతున్నారు.
పాకిస్తాన్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తమ ఇన్నింగ్స్‌లో తొలి మూడు ఓవర్లను చాలా జాగ్రత్తగా ఆడాలని ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మాన్, కామెంటర్ మాథ్యూ హేడెన్ అన్నారు.
యునిటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన 2021 టీ20 ప్రపంచ కప్‌ను ఉద్దేశంగా తీసుకుని ఆయన ఈ సూచనలు చేశారు.
ఆ మ్యాచ్‌లో అఫ్రిది వేసిన తొలి బంతికే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు.
పది వికెట్ల తేడాతో భారత్ ఆ మ్యాచ్‌ను ఓడిపోయింది. ఆ తర్వాత టోర్నమెంట్‌లో మళ్లీ ఆడలేదు.
‘‘షహీన్ అఫ్రిదితో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2021లో రోహిత్‌ను అవుట్ చేసిన అఫ్రిది బాల్‌ను నేను మర్చిపోలేను. ఒకవేళ బంతిని గాల్లోనే దిశ మార్చుకునేలా స్వింగ్‌గా విసిరితే.. తొలి మూడు ఓవర్లను భారత్ చాలా జాగ్రత్తగా ఆడాలి’’ అని స్టార్ స్పోర్ట్స్‌తో మాథ్యూ హేడెన్ చెప్పారు.
పాకిస్తాన్ ఫాస్ట్ ట్రియోకి( ముగ్గురు బౌలర్లకు), భారత్ టాప్ ఆర్డర్‌కు మధ్య జరిగే మ్యాచ్‌గా దీన్ని అభివర్ణించారు.
‘‘పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు ముగ్గుర్ని భారత్ ఎదుర్కొనాల్సి ఉంది. ప్రపంచంలోనే ఇది అతి కీలకమైన మ్యాచ్. అఫ్రిది, రవూఫ్, నసీమ్ ముగ్గురు మూడు రకాల బౌలర్లు. వీరు పక్కా ప్లాన్‌తో మైదానంలో అడుగు పెట్టబోతున్నారు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
వర్షం పడుతుందా...
ఎత్తైన ప్రదేశమైన కాండీలో వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రేక్షకుల్లో కాస్త నిరాశను కలిగిస్తుంది.
మేఘామృతమైన ఆకాశం, బలమైన గాలులు పాకిస్తాన్ బౌలింగ్ ట్రియోకి సాయం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
పాకిస్తాన్ పేస్ అటాక్ విషయంలో శుభ్‌మన్ గిల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, ANI
మిడిల్ ఆర్డర్ విషయంలో సస్పెన్స్
భారత్, పాకిస్తామ్ టీమ్‌లు బ్యాటింగ్ చేసేటప్పుడు మిడిల్ ఆర్డర్‌లో ఎవరు ఆడబోతున్నారన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.
ఈ మ్యాచ్‌లో గాయం వల్ల కేఎల్ రాహుల్ ఆడలేకపోతుండటంతో, భారత్‌కు అది మైనస్‌గా ఉంది.
మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మాన్‌గా ఇషాన్ కిషాన్‌ను భారత్ క్రికెట్ జట్టు బరిలోకి దించుతుందని వార్తలు వస్తున్నాయి.
అయితే, కిషాన్ నాలుగో బ్యాటర్‌నా లేదా ఐదో బ్యాటర్‌నా అనే సందేహం కూడా నెలకొంది.
తన కెరీర్‌లో ఇషాన్ కిషాన్ ఇప్పటి వరకు ఐదవ స్థానంలో ఆడలేదు.
మిడిల్ ఆర్డర్‌లో ఆడిన కొన్ని మ్యాచ్‌లలో కిషాన్ సగటు కేవలం 22.75 మాత్రమే.
పాకిస్తాన్ బౌలర్లను తట్టుకునేందుకు భారత బ్యాటర్లు ఉన్నతంగా ఆడనున్నామని మ్యాచ్ ప్రారంభానికి ముందే విరాట్ కోహ్లి చెప్పారు.
‘‘పాకిస్తాన్ జట్టుకి బౌలింగ్ బలమని నేననుకుంటున్నాను. పాకిస్తాన్‌కు కొందరు అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. వారు ఏ సమయంలోనైనా గేమ్‌ను మార్చవచ్చు. ఈ సమయంలో, మేం కచ్చితంగా బాగా ఆడాల్సిందే.’’ అని స్టార్ స్పోర్ట్స్‌తో విరాట్ కోహ్లి అన్నారు.

ఫొటో సోర్స్, ANI
పాకిస్తాన్‌కూ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్...
పాకిస్తాన్ బ్యాటర్లు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ, సొంతంగానే వారికీ ఇతరత్రా సమస్యలున్నాయి.
ప్రపంచ కప్ 2019 తర్వాత ఇప్పటి వరకు పాకిస్తాన్ కేవలం 29 వన్డే మ్యాచ్‌లనే మాత్రమే ఆడింది. కానీ, భారత్ ఈ సమయంలో 57 మ్యాచ్‌లను ఆడింది.
ఈ ఏడాది జరిగిన వన్డే మ్యాచ్‌లలో పాకిస్తాన్ బ్యాటర్లు బాబర్ అజామ్(689 పరుగులు), ఫఖర్ జమాన్(593 పరుగులు), ఇమాముల్ హక్(361 పరుగులు) బాగా ఆడారు.
కానీ, వీరి తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్ విషయంలో మాత్రం పాకిస్తాన్ జట్టుకు బెంగ ఉంది.
ఉసామా మిర్, సౌద్ షకీల్, అఘా సల్మాన్‌లు అటుఇటుగా ఆడుతున్నారు.
ఒకవేళ పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ త్వరగా అవుట్ అయితే మాత్రం పాకిస్తాన్ ఉన్నత బ్యాటర్లుగా ఉన్న ముగ్గురిపై ఒత్తిడి పెరగనుంది.
ఈ ఒత్తిడిని వారు తట్టుకోలేకపోవచ్చు. ఇలా ఒత్తిడికి గురి కావడాన్ని మనం చాలా సార్లు చూశాం.
ఏడవ బ్యాటర్‌గా వచ్చే ఇఫ్తికార్ అహ్మద్, ఎనిమిదో ఆటగాడు షాదాబ్ ఖాన్‌లు తమ బ్యాటింగ్ నైపుణ్యాన్ని చూపించాల్సి ఉంది.
నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇఫ్తికార్ ఆటతీరు బాగుండటంతో, అతనిపై అంచనాలు పెరిగాయి.

ఫొటో సోర్స్, ANI
భారత్ బౌలింగ్ సంగతేంటి?
బౌలింగ్ విషయంలో భారత్ కంటే పాకిస్తాన్ మెరుగైన స్థితిలో ఉంది.
జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి రావడంతో భారత్ కూడా బౌలింగ్ విషయంలో కాస్త ఉత్సాహంగానే ఉంది.
బుమ్రా, షమీ, సిరాజ్‌లు పాకిస్తాన్ బ్యాటర్లకు తమ బౌలింగ్‌తో అడ్డుకట్ట వేయనున్నారు. వీరికి హార్దిక్ పాండ్యా సపోర్ట్ కూడా తోడవనుంది.
స్పిన్నర్ల ఎంపిక విషయంలో కూడా భారత జట్టు కీలకంగా వ్యవహరించనుంది.
రవీంద్ర జడేజా కూడా ఈ సారి టీమ్‌లో ఏడవ బ్యాటర్‌గా ఆడనున్నారు.
ఒకవేళ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌ను ఎంపిక చేసుకోవాల్సి వస్తే, అక్షర్ పటేల్‌కు ఎక్కువ అవకాశాలున్నాయి. ఎందుకంటే అక్షర్ పటేల్ మెరుగైన బ్యాట్స్‌మాన్‌గా ఉన్నాడు.
కానీ, కుల్దీప్ కూడా ఈ ఏడాది ఆడిన 11 మ్యాచ్‌లలో 22 వికెట్లు తీశాడు.
అక్షర్ పటేల్ కేవలం ఆరు మ్యాచ్‌లే ఆడి, మూడు వికెట్లే తీశాడు. కానీ, బ్యాటింగ్‌లో మంచి ఆటతీరు కనబర్చాడు.

భారత్ vs. పాకిస్తాన్.. ఫేవరెట్ జట్టు ఏది?
2020 టీ20 మ్యాచ్‌లో ఆడినట్లు విరాట్ కోహ్లీ ఈసారి కూడా తన బ్యాటింగ్ జోరు చూపించాలని భారత మాజీ క్రికెటర్, కామెంటర్ సంజయ్ బంగార్ అన్నారు.
ఆ మ్యాచ్‌లో 160 పరుగులను చేధించే విషయంలో కోహ్లీ, 53 బంతులకు 82 పరుగులు చేసి, భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు.
మాథ్యూ హేడెన్‌తో పాటు రవిశాస్త్రి కూడా భారత్ తన ఫేవరెట్ జట్టుగా చెబుతున్నారు.
‘‘భారత్ గెలుస్తుందనే నేనంటాను. 2011 నుంచి ఇది వారి బలమైన జట్టు. ఒక మంచి జట్టులో ఉండాల్సివన్నీ ఈ జట్టులో ఉన్నాయి. ఎంతో అనుభవమున్న ఆటగాడు ఈ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. అయితే, పాకిస్తాన్ కూడా మంచి జట్టే. వారిని ఎదుర్కోవాలంటే, భారత్ మరింత బాగా ఆడాల్సిందే’’ అని రవిశాస్త్రి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామి చనిపోతే శరీరాన్ని ఏం చేస్తారు?
- కొందరు ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే మానేస్తారెందుకు?
- కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం మంచిదా, కాదా?
- 'ఓ మై గాడ్, అది భూమి'.. ఉచితంగా స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన తల్లీకూతుళ్ల అనుభవాలు
- ఐవీఎఫ్: పిల్లలను కనాలనుకొనే జంటలకు ఉచితంగా 5 లక్షల చికిత్స.. గోవా ఈ పథకం ఎందుకు తెచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














