హెయిర్ ఫాల్: మీ జుట్టు రాలిపోతోందా, ఆడవాళ్లకు పోనీ టెయిల్ మంచిది కాదా?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ ప్రతిభా లక్ష్మి
    • హోదా, బీబీసీ కోసం...

ఈ రోజుల్లో ఆడవాళ్లు, మగవాళ్లు అన్న తేడా లేకుండా, అందరూ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య జుట్టు రాలిపోవడం. మన దేశంలో పురుషుల్లో 50%, మహిళల్లో 40% మంది, తమ యాభై ఏళ్ల నాటికి జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభంలో జుట్టు రాలడం ఎక్కువగా కనిపిస్తుంది.

ఒక మనిషి తలపై సగటున ఉండే 1,00,000 నుంచి 1,50,000 వెంట్రుకల్లో రోజుకు 80 - 100 వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ సంఖ్యలో వెంట్రుకలు రాలిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది.

జుట్టు రాలడం అనేది ముఖ్యంగా రెండు రకాలు.

స్కారింగ్ అలొపేసియా (Scarring alopecia), నాన్ స్కారింగ్ అలొపేసియా (non scarring alopecia).

స్కారింగ్ అలొపేసియాలో వెంట్రుకల కుదుళ్లు పూర్తిగా నాశనమవుతాయి. దీంతో మళ్లీ అక్కడ జుట్టు మొలిచే అవకాశం ఉండదు.

నాన్ స్కారింగ్ అలొపేసియాలో కుదుళ్లు ఆరోగ్యంగానే ఉంటాయి కాబట్టి, మళ్లీ అక్కడ వెంట్రుకలు మొలిచే అవకాశం ఉంటుంది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

జుట్టు రాలిపోవడానికి కారణాలు

అధికంగా జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవి వ్యక్తిపరమైనవి లేదా వాతావరణ సంబంధిత కారణాలు ఉండొచ్చు. వ్యక్తిగత కారణాల్లో జన్యు పరమైన, లేదా ఆరోగ్య సంబంధిత కారణాలు ఉండే అవకాశం ఉంది.

జుట్టు రాలడానికి కొన్ని కారణాలు మన నియంత్రణలో ఉండవు. అందులో ప్రధానమైనది జన్యుపరంగా కలిగే బట్టతల.

అలాగే, పురుషుల్లో సాధారణంగా కనిపించే హార్మోన్ల వల్ల కలిగే ఆండ్రాయిడ్ అలొపేసియా(android alopecia), మహిళల్లో కూడా అరుదుగా కనిపించే అవకాశం ఉంది.

ఎక్కువ శాతం మహిళల్లో, ప్రసవానంతరం హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల జుట్టు రాలుతుంది.

థైరాయిడ్ సమస్య, లేదా మహిళల్లో సహజంగా జరిగే హార్మోన్ల మార్పుల వల్ల కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఉంది.

కొన్ని రకాల మందుల వల్ల, లేదా చికిత్సా విధానాల వల్ల కూడా జుట్టు రాలుతుంది. అందులో అందరికీ బాగా తెలిసినవి, క్యాన్సర్‌కి ఇచ్చే కీమో థెరపీ (chemotherapy), రేడియో థెరపీ (radiotherapy).

దాదాపు అన్ని రకాల ఆటో ఇమ్యూన్ సమస్యల కారణంగానూ జుట్టు రాలే సమస్య ఉత్పన్నమవ్వొచ్చు. ఆ సమస్యలు జీవితాంతం ఉండేవి. క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటూ ఉంటే మాత్రమే అదుపులో ఉంటాయి.

కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్, లేదా దురద కలిగించే డ్యాండ్రఫ్ వంటి సమస్యల వల్ల కూడా జుట్టు రాలుతుంది.

తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్లకు గురైన కొద్దిరోజుల తర్వాత అధికంగా జుట్టు రాలడానికి అవకాశం ఉంది. అయితే, ఇది కొన్ని రోజులకు తగ్గిపోతుంది.

విటమిన్ B12 లోపం వల్ల కూడా జుట్టు పెరగకపోయే ప్రమాదం ఉంది.

జుట్టు రాలడం అనేది చాలా సాధారణ సమస్యగా కనిపించినా, అది ఆ వ్యక్తిని మానసికంగా చాలా ప్రభావితం చేస్తుంది. అదే పెద్ద సమస్య.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

నివారణ మార్గాలు

జుట్టు బాగా పెరగడానికి, ముందుగా రక్త హీనతకు గురవకుండా చూసుకోవాలి.

విటమిన్ B12 సరిపడా ఉందో లేదో సరిచూసుకోవాలి.

మాంసకృత్తులు (protein) అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

జుట్టు రాలకుండా చికిత్సా విధానాలు

జుట్టు రాలడాన్ని అరికట్టడం అన్ని సందర్భాల్లోనూ అంత సులువు కాదు. ముందుగా జుట్టు రాలిపోవడానికి కచ్చితమైన కారణం తెలుసుకుని, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది.

థైరాయిడ్ లేక రక్తహీనత, విటమిన్ B12 లోపం, లేక ఆటో ఇమ్యూన్ ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో పరీక్షలు చేయించి నిర్ధరించుకోవాలి.

ప్లాస్మా తీసి ఇంజెక్షన్‌గా ఇచ్చే ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా (PRP), లేక హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ( hair transplant) వంటివి చాలా సహనంతో, ఖర్చుతో కూడుకున్న చికిత్సా విధానాలు. ఇవి సామాన్యులకు అందుబాటులో ఉండవు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ముఖ్యమైన జాగ్రత్తలు

కనీసం వారానికి రెండు సార్లు గోరువెచ్చటి కొబ్బరి నూనెతో తలకు మర్దనా చేసి, తలస్నానం చేయాలి.

షాంపూ తరుచుగా మార్చకూడదు. జుట్టు ఆరడానికి డ్రయ్యర్లు వాడడం మంచిది కాదు.

దుమ్ము, ధూళిలో బయటకు వెళ్లేప్పుడు జుట్టు పొడిబారి రాలిపోకుండా తలను కప్పుకోవడం మంచిది.

జుట్టు విరబోసుకోవడం, లేదా ఒక బాండ్‌తో గట్టిగా ముడివేసి ( pony / plait) వదిలేయడం మంచిది కాదు. అల్లుకుంటే మేలు.

తాత్కాలిక అందం కోసం తరచూ హెయిర్ స్టైల్ చేయడం, జెల్ లేదా స్ప్రేలు వాడడం వల్ల కూడా జుట్టు దెబ్బతిని రాలిపోయే అవకాశాలు ఎక్కువ.

నల్లని పొడవాటి, ఒత్తయిన జుట్టు మనిషికి అందం అనేది ఒకప్పటి భావన. కానీ, పొడుగ్గా ఒత్తుగా జుట్టు ఉన్న వాళ్లు కూడా చిన్నగా కత్తిరించుకుంటున్న ఈ రోజుల్లో, లేని దాని కోసం బాధపడకుండా, ఉన్న దాన్ని కాపాడుకుంటూ సంతోషంగా ఉండడమే ముఖ్యం.

ఇవి కూడా చదవండి: