NIN సర్వే: ఐటీ ఉద్యోగులకు గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువా? కారణాలేంటి, పరిష్కార మార్గాలేంటి...

IT

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఐటీ ఉద్యోగమంటే ఐదారంకెల జీతం.. ఏసీ గదుల్లో పనిచేసుకోవడం.. వారానికి ఐదు రోజులే పని అనుకుంటారు అంతా.

కానీ, విపరీతమైన పని ఒత్తిడి, వేళకు తినకపోవడం, గంటల తరబడి ఒకేచోట కూర్చుని లేవకపోవడంతో దీర్ఘకాలంలో గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది.

హైదరాబాద్ లోని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్)లోని శాస్త్రవేత్తల బృందం పరిశోధనలో ఐటీ ఉద్యోగులు జీవక్రియ సంబంధ సమస్యల(మెటాబాలిక్ డిజార్డర్స్)తో బాధ పడుతున్నట్లు తేలింది.

ఈ సమస్యలు దీర్ఘకాలంలో వ్యాప్తి చెందని రోగాల(నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్)కు దారి తీస్తాయని అధ్యయనంలో తేలింది.

ముఖ్యంగా షుగర్ వ్యాధి(డయాబెటిస్), హైపర్ టెన్షన్, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని తేలింది.

IT

ఫొటో సోర్స్, Getty Images

అసలు ఏమిటీ అధ్యయనం

హైదరాబాద్ జాతీయ పోషకాహార సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు అనుబంధంగా కొనసాగుతుంది.

ఈ సంస్థ ఇటీవల ఐటీ ఉద్యోగుల జీవనశైలి, ఆరోగ్య వివరాలపై అధ్యయనం చేసింది.

ఈ విషయంపై ఎన్ఐఎన్ డైరెక్టర్ ఆర్.హేమలత మాట్లాడుతూ… ‘దేశ ఆర్థిక వ్యవస్థలో ఐటీ రంగం ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తోంది.

అందులో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యం, జీవనశైలిపై ఆందోళన నెలకొంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే జరిగిన అధ్యయనాల్లో ఐటీ ఉద్యోగుల వర్క్ స్టైల్, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా మెటాబాలిక్(జీవక్రియ) కార్యకలాపాలపై ప్ర‌భావం పడుతున్నట్లు తేలింది.

ఈ అధ్యయనాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్ఐఎన్ తరఫున స్టడీ చేశాం.’’ అని చెప్పారు.

బరువు తూచే యంత్రం

ఫొటో సోర్స్, Getty Images

సర్వేలో ఏం పరిశీలించారంటే...

సర్వే చేసేందుకు హైదరాబాద్‌లోని ఐటీ సెక్టార్ లో పనిచేస్తున్న 183 మంది ఉద్యోగులను ఎంచుకుంది.

వివిధ అంశాలలో శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసింది.

బరువు, ఎత్తు, నడుము చుట్టుకొలతలు వంటివి లెక్క గట్టింది.

బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ)తోపాటు రక్త నమూనాలు సేకరించి వాటి ఫలితాలను విశ్లేషించింది.

ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో తెలుసుకున్నారు.

ముందుగా ఈ అధ్యయనంలో పాల్గొనేందుకు 359 ఉద్యోగులు రిజిష్టర్ అయ్యారు.

తర్వాత వారి వయసుల ఆధారంగా 183 మందిని ఎంపిక చేసుకున్నారు.

వీరిలో 154 మంది రక్త నమూనాలు ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు తెలిపారు.

అధ్యయన బృందంలో గవరవరపు సుబ్బారావు, పారమిత బెనర్జీ, జి.భానుప్రకాష్ రెడ్డి, హృషికేష్ పాండా, కిరణ్ కుమార్ అంగడి, తిరుపతి రెడ్డి ఉన్నారు.

వీరి పరిశోధన ఫలితాలు న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఉద్యోగుల సగటు వయసు 30ఏళ్లు

ఎన్ఐఎన్ తన అధ్యయనంలో భాగంగా సగటున 30 సంవత్సరాల వయసున్న ఐటీ ఉద్యోగులను ఎంచుకుంది.

సర్వేలో పాల్గొన్న ఉద్యోగుల వయసు 26 నుంచి 35 ఏళ్లలోపు ఉంది.

సర్వేలో భాగంగా ఐటీ ఉద్యోగుల జీవనశైలి(లైఫ్ స్టైల్)ని అధ్యయనం చేసి వారిలో వచ్చే అనారోగ్య సమస్యలు, జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులపై అధ్యయనం చేశారు.

సుబ్బారావు
ఫొటో క్యాప్షన్, శాస్త్రవేత్త సుబ్బారావు

అధ్యయనంలో ఏం గుర్తించారంటే..

ఎన్ఐఎన్ అధ్యయనంలో భాగంగా పలు కీలక విషయాలు తెలిశాయి.

46 శాతం మంది మూడు లేదా అంతకంటే ఎక్కువ మెటాబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ తో బాధ పడుతున్నట్లు తేలింది.

ఇందులో తక్కువ హై డెన్సిటీ లైపోప్రోటీన్(హెచ్డీఎల్) లెవల్స్, అధిక నడుము చుట్టుకొలత వంటివి ఉన్నట్లు గుర్తించినట్లు ఎన్ఐఎన్ శాస్త్రవేత్త, ప్రాజెక్టు లీడ్ ఇన్విస్టిగేటర్ గవరవరపు సుబ్బారావు బీబీసీతో చెప్పారు.

‘‘ఉద్యోగులు కూర్చునే సమయం కూడా కీలకమే.

వ్యాయామం తక్కువగా ఉండి ఎక్కువ సేపు కూర్చునే ఉంటే రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగి మెటాబాలిక్ సిండ్రోమ్ కు దారి తీస్తాయి.

సాధారణ పని రోజుల్లో ఐటీ ఉద్యోగులు 8 గంటల కంటే ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారు.

కేవలం 22శాతం మంది ఉద్యోగులే వారానికి కనీసం అవసరమైన 150 నిమిషాల వ్యాయామం చేస్తున్నట్లు చెప్పారు.

ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపి గుండె జబ్బులకు కారణమవుతుంది.’’ అని సుబ్బారావు అన్నారు.

ఊబకాయం

ఫొటో సోర్స్, Getty Images

మెటాబాలిక్ రిస్క్ కారణాలేమిటి?

మెటబాలిక్ సిండ్రోమ్(జీవ క్రియ సంబంధ జబ్బు)కు మూడు లేదా ఐదు రకాల అంశాలు కారణమవుతుంటాయి.

ఈ విషయంలో ఐసీఎంఆర్ కొన్ని నిబంధనలు విధించినట్లు సుబ్బారావు వివరించారు.

పురుషుల్లో నడుము చుట్టుకొలత 90 సెం.మీ. లేదా అంతకంటే తక్కువ ఉండాలి.

మహిళలలో 80 సెం.మీ. లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.

ట్రైగ్లిజరాయిడ్స్ లెవల్స్ 150 ఎంజీ/డీఎల్ లేదా అంతకంటే తక్కువ ఉండాలి.

హైడెన్సిటీ లైపొప్రోటీన్ లెవల్ పురుషుల్లో 40ఎంజీ/డీఎల్ కంటే తక్కువ.. మహిళలల్లో 50 ఎంజీ/డీఎల్ కంటే తక్కువ ఉండాలి.

బీపీ చెకింగ్

ఫొటో సోర్స్, Getty Images

బీపీ 130/85 ఉండాలి

ఈ అంశాల కొలమానం మారితే జీవక్రియ సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని చెప్పారు ఎన్ఐఎన్ మరో శాస్త్రవేత్త భానుప్రకాష్ రెడ్డి.

ఐటీలో ఎదురయ్యే సమస్యలపై మియాపూర్ కు చెందిన ఐటీ ఉద్యోగిని దేవినేని గౌతమి బీబీసీతో మాట్లాడారు.

‘‘టార్గెట్లు చేరుకునే క్రమంలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది.

ఆ క్రమంలో తిండిపై సరిగా ధ్యాస ఉండదు. ఏదో ఒకటి తినేసి పనిలోకి వెళ్లిపోవాల్సి వస్తుంది.

బీపీవో లో పనిచేసేవారు నైట్ షిఫ్టులోనూ పనిచేయాలి.

దీనివల్ల నిద్రలేమి సమస్యలు వస్తుంటాయి.

ఫలితంగా కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.

చాలా మంది ఐటీ ఉద్యోగులు ఈ తరహా సమస్యలు ఎదుర్కొంటుంటారు.’’ అని చెప్పారు.

డాక్టర్ హేమలత
ఫొటో క్యాప్షన్, డాక్టర్ హేమలత

ఇంకా ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలేంటంటే...

ఎన్ఐఎన్ అధ్యయనంలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

  • 44.02 శాతం మంది అధిక బరువుతో ఉన్నారు.
  • మరో 16.85శాతం మంది ఊబకాయం(ఒబెసిటీ) సమస్యతో బాధ పడుతున్నారు.
  • 3.89 శాతం మంది ఉద్యోగులు షుగర్ వ్యాధి(డయాబెటిక్)తో ఉన్నారు.
  • 64.93శాతం మందిలో హైపర్ డెన్సిటీ లైపోప్రోటీన్(హెడీఎల్)-సి లెవల్స్ తక్కువగా ఉన్నట్లు తేలింది.
  • 54.54శాతం మందిలో నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉంది.
  • ఈ విషయంపై ఎన్ఐఎన్ శాస్త్రవేత్త సుబ్బారావు బీబీసీతో మాట్లాడారు..

‘‘మేం చేసిన అధ్యయనంలో వయసు కీలకంగా తీసుకున్నాం.

మెటాబాలిక్ సిండ్రోమ్ తో బాధ పడుతున్న వారిలో 30 ఏళ్లకు పైబడిన ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు.

అలాగే 30ఏళ్లలోపు ఉద్యోగులలోనూ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా కనిపించాయి.

బయట తిండి తినడం, పండ్లు తక్కువగా తినడం, రోజూవారీ తినే ఆహారంలో కూరగాయల మోతాదు తక్కువగా ఉండటం వంటివి ఎక్కువగా జరుగుతున్నట్లు ఉద్యోగులు చెప్పారు.

ఒక్కోసారి పని ఒత్తిడితోనో.. మరేదైనా కారణాలతోనో భోజనం మానేస్తున్నారు.

ఇవన్నీ ఐటీ ఉద్యోగుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంటాయి.

30ఏళ్లకుపైబడిన సీనియర్ ఉద్యోగులలో పని ఒత్తిడి అధికంగా ఉంటోంది.

ఇలా అన్ని విషయాలు కలగలిపి జీవక్రియ(మెటాబాలిజం)పై ప్రభావం చూపిస్తోంది.’’ అని చెప్పారు.

మహిళా ఉద్యోగులలో మరో విధంగా ప్రభావం కనిపిస్తోంది చెప్పారు ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత.

‘’26 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న మహిళా ఉద్యోగులపై న్యూట్రిషిన్, ఫిజికల్ యాక్టివిటీ, ఒత్తడి తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

పీరియడ్స్ ఎక్కువ రోజులు రావడం జరుగుతోంది.

దీర్ఘకాలంలో వారిలోనూ డయాబెటిక్, గుండె సంబంధ వ్యాధులు వస్తున్నాయి.’’ అని చెప్పారు హేమలత.

junk food

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడు ఏం చేయాలి...

సమస్యల నుంచి బయట పడేందుకు కొన్ని సూచనలు చేశారు శాస్ర్తవేత్త సుబ్బారావు.

- ఐటీ ఉద్యోగుల జీవన శైలిలో మార్చుకోవాలి.

- పని చేసే చోట హెల్తీ ఆహారం తీసుకునేలా ఉండాలి.

- ఫిజికల్ యాక్టివిటీ(వ్యాయామం) చేయాలి.

- జంక్ ఫుడ్ జోలికి వీలైనంత వరకు వెళ్లకుండా ఉంటే మంచిది.

- ఎక్కువ సేపు కూర్చునే వీలున్నప్పుడు మధ్యలో కాసేపు బ్రేక్ తీసుకుని అటూ.. ఇటూ తిరగాలి.

- బయట తిండి తినకపోవడం మంచిది.

సుజిత్ కుమార్
ఫొటో క్యాప్షన్, సుజిత్ కుమార్

ఐటీ ఉద్యోగులలో వస్తున్న మెటాబాలిక్ సమస్యలపై అపోలో ఆసుపత్రి విజిటింగ్ కన్సల్టెంట్ డాక్టర్ బి.సుజిత్ కుమార్ బీబీసీతో మాట్లాడారు.

‘‘ఎక్కువ సేపు కూర్చుని ఉండటం వల్ల థైరాయిడ్ వంటి సమస్యలు కూడా వస్తుంటాయి.

జన్యు పరంగానూ మార్పులు వస్తున్నట్లు గుర్తిస్తున్నాం.

ఈ తరహా సమస్యలతో వచ్చే రోగుల సంఖ్య కూడా పెరిగింది. ఉదయం, సాయంత్రం చేసే వ్యాయామంతో సంబంధం లేకుండా ఎక్కువ సేపు కూర్చునే పరిస్థితి ఉంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది.

గంటకోసారి ఐదు నిమిషాలు లేచి అటూ.. ఇటూ వాకింగ్ చేస్తుండాలి.

కొన్ని కంపెనీలు నిల్చుని పనిచేసే అవకాశం కల్పించారు. అది ప్రత్యమ్నాయం కాదు. కూర్చుని, నిల్చుని.. రెండు రకాలుగా పనిచేసేలా ఉండాలి.

మారుతున్న ఆహారపు అలవాట్లతో జంక్ ఫుడ్ లో ఉండే స్టిరాయిడ్స్ నేరుగా వెళ్లి కొవ్వులోనూ, లివర్ లోనూ పేరుకుపోతున్నాయి. దీనివల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం కనిపిస్తోంది.

రెగ్యులర్ గా జనరల్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటే మంచిది.

విటమిన్ బి12, థైరాయిడ్, సీరం ఐరన్ వంటి పరీక్షల చేయించుకోవాలి.

నలబై ఏళ్లలోపు ఉంటే ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలాగే 40ఏళ్లు దాటితే పరిస్థితిని బట్టి ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి అనేది డాక్టర్ సలహా మేరకు పరీక్షలు చేయించుకోవాలి.’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)