చైనా ఆర్థిక వ్యవస్థ 'టైమ్ బాంబ్'లా పేలిపోతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిక్ మార్ష్
- హోదా, ఆసియా బిజినెస్ ప్రతినిధి
గత ఆరునెలలుగా చైనా ఆర్థిక వ్యవస్థకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. దేశ వృద్ధి రేటు తగ్గిపోవడం, రికార్డు స్థాయిలో నిరుద్యోగం, తగ్గిన విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు క్షీణించడం, కరెన్సీ బలహీనపడడం, రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో కూరుకుపోవడం వంటివి అందుకు కారణం.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థను ''టిక్కింగ్ టైమ్ బాంబ్'' (పేలిపోనున్న టైమ్ బాంబు)గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. దేశంలో అసంతృప్తి తీవ్రస్థాయిలో పెరిగిపోతోందన్నది ఆయన మాటల వెనక ఉన్న ఉద్దేశంగా చెబుతున్నారు.
అందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైతం గట్టిగానే సమాధానమిచ్చారు. తమ ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన సామర్థ్యంతో బలమైన శక్తిగా ఉందని బైడెన్ వాదనలను సమర్థంగా తిప్పికొట్టారు.
అయితే, వీరిద్దరిలో ఎవరు చెబుతున్నది నిజం? అంటే కచ్చితమైన సమాధానం దొరక్కపోవచ్చు.
ఏ సమయంలోనైనా పతనమయ్యే అవకాశం లేనప్పటికీ, భారీ సవాళ్లనే ఎదుర్కొంటోంది చైనా.

ఫొటో సోర్స్, Getty Images
రియల్ ఎస్టేట్ సంక్షోభం
సెంట్రల్ చైనాలో స్థిరాస్తి రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. కొద్దిరోజుల కిందటి వరకూ మొత్తం సంపదలో రియల్ ఎస్టేట్ రంగం వాటా మూడో వంతు.
''ఇది అస్సలు అర్థం కావడం లేదు'' అని సింగ్‌పూర్‌లోని ఐఎన్‌ఎస్‌ఈఏడీ బిజినెస్ స్కూల్లో ఎకనమిక్స్ ప్రొఫెసర్ అంటోనియో ఫటస్ చెప్పారు.
ప్రైవేటైజేషన్‌తో డెవలపర్లు దూసుకుపోవడంతో గత రెండు దశాబ్దాలుగా ఈ రంగం బాగా పుంజుకుంది. కానీ, 2020లో కరోనా మహమ్మారితో సంక్షోభం తలెత్తింది. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనాతో పాటు జనాభా తగ్గిపోవడం కూడా ఇళ్ల నిర్మాణానికి అంత కలిసిరాలేదు.
అమెరికాలో 2008 నాటి సంక్షోభ పరిస్థితులు దేశంలో తలెత్తవచ్చని భయపడిన ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల రుణ పరిమితుల్లో మార్పులు తెచ్చింది. దీంతో డెవలపర్లు బిలియన్ల మేర అప్పులు చేసి వాటిని తిరిగి చెల్లించలేదు.
ఇప్పుడు ఇళ్లకు డిమాండ్ తగ్గిపోయి ఆస్తి ధరలు దారుణంగా పడిపోయాయి. మూడేళ్లు అమల్లో ఉన్న కరోనా కఠిన నిబంధనలు ఇళ్ల యజమానులను ఆర్థికంగా దెబ్బతీశాయి. వారు పేదలైపోయారు.
''చైనాలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడింది'' అనివెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ నాటిక్సిస్ చీఫ్ ఆసియా ఎకనమిస్ట్ అలీసియా గర్సియా చెప్పారు. ''ఇంతకుముందు వరకూ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం, లేదా తక్కువ వడ్డీకి బ్యాంకులో డబ్బులు దాచుకోవడం కంటే స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని భావించేవారు'' అని ఆమె అన్నారు.
చైనాలో కోవిడ్ తర్వాత భారీగా డబ్బులు ఖర్చు చేసినట్లుగా ఇప్పుడు ఖర్చు చేసే పరిస్థితులు లేవు. అలాగే, తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితులు కూడా లేవు.
చైనాలో కఠినంగా అమలైన జీరో కోవిడ్ విధానం తర్వాత చైనీయులు విపరీతంగా ఖర్చు చేశారని గర్సియా చెప్పారు.
''ప్రయాణాలు చేశారు, ప్యారిస్ వెళ్లి, ఐఫిల్ టవర్ కొనడానికి కూడా వెనకాడలేదు. కానీ, ఇళ్ల ధరలు పతనం కావడంతో తమ ఆస్తి విలువ తగ్గిపోతోందని తెలిసి, ఇప్పుడు వీలైనంత సొమ్మును పొదుపు చేయాలని నిర్ణయించుకున్నారు'' అని ఆమె అన్నారు.
ఇళ్ల ధరలు తగ్గిపోవడమే కాకుండా, దేశంలోని పలు స్థానిక ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న రుణ సమస్యలు కూడా సమస్యను మరింత తీవ్రతరం చేశాయి.
బిలియన్ డాలర్ల సంపదలో డెవలపర్లకు భూములు అమ్మడం ద్వారా వచ్చినది మూడో వంతు ఉంటుందని అంచనా. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ భారీ లోటు భర్తీ అయ్యేందుకు కొన్నేళ్ల సమయం పడుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక నమూనాలో డొల్లతనం
రియల్ ఎస్టేట్ సంక్షోభం చైనా ఆర్థిక వ్యవస్థలోని డొల్లతనాన్ని కూడా బహిర్గతం చేసింది.
గత 30 ఏళ్లుగా చైనా రోడ్లు, వంతెనలు, ఫ్యాక్టరీలకు రైల్వే లైన్లు, ఎయిర్‌పోర్టులు, ఇళ్లు వంటి నిర్మాణాల ఆధారిత వృద్ధి రేటును నమోదు చేస్తూ వచ్చింది. కానీ, ఆయా నిర్మాణాల బాధ్యత అక్కడి స్థానిక ప్రభుత్వాలదే.
నిర్మాణాల ఆధారితమైన ఈ ఆర్థిక వృద్ధి నమూనా గాడి తప్పిందని, అలంకారప్రాయంగా మారిందనే అభిప్రాయాలు ఆర్థిక వేత్తల నుంచి వ్యక్తమవుతున్నాయి.
తాజాగా మయన్మార్ సరిహద్దు సమీపంలో యున్నాన్ ప్రావిన్స్‌లో బిలియన్ డాలర్లు వెచ్చించి కోవిడ్ - 19 క్వారంటైన్ బిల్డింగ్ నిర్మించునున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. ఇది చైనా భవన నిర్మాణ వ్యసనానికి విచిత్రమైన ఉదాహరణగా చెబుతున్నారు.
ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన అక్కడి స్థానిక ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్యక్రమాల కోసం ఈ ఏడాది భారీగా భూములు విక్రయించి నిధులు సమకూర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
అసలు విషయం ఏంటంటే, కోవిడ్ రాక ముందే భారీ నిర్మాణాలు చేయాలనుంకుంటోంది ఒక్క చైనా మాత్రమే. తద్వారా ఆ నిధులు వృథా అవుతున్నాయనే భావనలు ఉన్నాయి. దానికి బదులుగా ప్రజలకు ఉపయోగపడేలా నిధులు ఖర్చు చేసే ఇతర మార్గాలను కనుగొనాల్సిన అవసరం ఉంది.
''ప్రస్తుతం మేం ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ (పైకి వెళ్లడం లేదా కిందకి పడిపోవడానికి మధ్యస్తం)లో ఉన్నాం'' అని ప్రొఫెసర్ ఫటస్ చెప్పారు. ''పాత నమూనా పనికి రాదు. కాబట్టి వృద్ధిపై మరింత దృష్టి పెట్టేందుకు బలమైన సంస్థాగత, నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం'' అని ఆయన అన్నారు.
ఉదాహరణకు, అమెరికా, యూరప్‌కి దీటుగా చైనా తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆర్థిక రంగాన్ని ప్రోత్సహించాలనుకుంటే, మొదట చైనా ప్రభుత్వం తన నియంత్రణను తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే, ప్రైవేట్ రంగానికి భారీ ప్రయోజనాలు కల్పించాల్సి ఉంటుంది.
కానీ, వాస్తవానికి అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఆర్థిక రంగంపై మరింత పట్టుబిగిస్తోంది చైనా ప్రభుత్వం. అలాగే, విదేశీ బ్యాంకుల విధానాలను తప్పుబడుతోంది. అలీబాబా వంటి భారీ సంస్థలపై విరుచుకుపడుతోంది.
భారీగా పెరిగిపోతున్న నిరుద్యోగం రూపంలోనూ అది స్పష్టంగా కనిపిస్తోంది. చైనాలో కోట్లాది మంది చదువుకున్న యువతీయువకులు మంచి ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.
జులై లెక్కల ప్రకారం, 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువత రికార్డు స్థాయిలో దాదాపు 21.3 శాతం మంది ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు. ఆ మరుసటి నెలలోనే అధికారులు లెక్కలు ప్రచురించడం మానేస్తున్నట్లు ప్రకటించారు.
ఇంత భారీ సంఖ్యలో దేశ ప్రజలను శ్రామిక శక్తిగా మార్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఇది కఠినమైన కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థకి నిదర్శనమని ప్రొఫెసర్ ఫటస్ అన్నారు.
''ఏదైనా కొత్త వంతెన నిర్మించాలనుకున్నప్పుడు పనిచేయించేవారు, పనిచేసేవారితో వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. కానీ అప్పటికే వంతెన నిర్మించేసి ఉండి, ప్రజలు పని కోసం ఎదురుచూస్తుంటే మాత్రం పరిస్థితి గందరగోళంగా తయారవుతుంది'' అని ఫటస్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం ఏం చేస్తోంది?
ఆర్థిక వ్యవస్థ దిశ మారాలంటే రాజకీయ విధానాల్లోనూ మార్పు అవసరం. అయితే, చైనాలో అధికారంలో ఉన్న చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) మరింత బలపడడం, ఆ పార్టీపై జిన్‌పింగ్ పట్టు బిగించడం వంటివి చూస్తే అది జరిగే అవకాశం కనిపించడం లేదు. అసలు అవేవీ అవసరం లేదనే వాదనలు కూడా వచ్చే అవకాశం ఉంది.
కొన్ని విధాలుగా చూస్తే, చైనా తన విజయానికి తానే బాధితురాలు కూడా. గత కొన్నేళ్లుగా మారుతూ వస్తున్న వృద్ధి రేటుతో పోల్చితే మాత్రమే, ప్రస్తుత వృద్ధి రేటు మందగమనంగా కనిపిస్తుంది. కానీ గతంలో పోలిస్తే కాదు.
1989 నుంచి చైనా సగటు వృద్ధి రేటు 9 శాతం. కానీ, 2023లో అది 4.5 శాతంగా ఉండొచ్చని చెబుతున్నారు.
అంటే వృద్ధి రేటు భారీ స్థాయిలో పతనమైనట్టే. అయితే, అమెరికా, యూకే, ఇతర యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఇది ఎక్కువే. అందువల్ల అది అంత ఇబ్బందికరమైనది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ప్రజలు ఖర్చు చేసే సామర్థ్యాన్ని అనుసరించి పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి. కానీ, చైనాలో ఈ వినియోగదారుల నమూనాతో సంబంధం లేదు. దానిని అనవసరమైన నమూనాగానే కాకుండా, కేవలం వ్యక్తిగతమైనదిగా పరిగణిస్తారు.
వినియోగదారుడు ఒక కొత్త టీవీ కొనుగోలు చేసి, దాని సేవల కోసం సభ్యత్వం పొందడం, లేదంటే సెలవులకు విహారయాత్రకు వెళ్లేలా వినియోగదారులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు మేలు చేయొచ్చు. కానీ, చైనాకు అది పట్టించుకోవాల్సిన అవసరం లేనంత చాలా చిన్న విషయం. ఎందుకంటే, అమెరికాతో పోటీ వంటి విషయాలపైనే చైనా ఎక్కువ శ్రద్ధ వహిస్తుంది.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభివృద్ధిని కోరుకుంటారు కానీ, అదే అన్నీ కాదు. ప్రపచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యాధునిక టెక్నాలజీలు అయిన సెమీకండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ టెక్నాలజీ వంటి రంగాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ఎందుకంటే, ఇవి చైనాను ప్రపంచవ్యాప్తంగా పోటీదారుగా ఉంచడంతో పాటు ఇతరులపై తక్కువగా ఆధారపడేలా చేస్తాయి.
ఆర్థిక వ్యవస్థలోకి భారీ స్థాయిలో డబ్బును సరఫరా చేయడం కంటే రుణ పరిమితులను సడలించడం, వడ్డీ రేట్లు తగ్గించడం వంటి చిన్నచిన్న చర్యలకే చైనా ప్రభుత్వం పరిమితమైంది. ఇది ఇప్పటికే దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడడంలో ప్రభుత్వ పరిమిత ప్రతిస్పందనను తెలియజేస్తోంది.
చైనాలో పెట్టబుడులు పెట్టిన విదేశీ సంస్థలు సైతం ఇదే ఆందోళనలో ఉన్నాయి. త్వరగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నాయి. కానీ పాలకులు మాత్రం వ్యవహారాన్ని సాగదీస్తున్నారు.
చైనా బలమైన ఆర్థిక శక్తిగా ఉండొచ్చు. కాగితాలపై నంబర్లలో మరింత ఆకర్షణీయంగా కనిపించొచ్చు కానీ, చైనీయుల వార్షిక ఆదాయం ఇప్పటికీ 12,850 డాలర్లు (దాదాపు 10.6 లక్షలు) మాత్రమే.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ఎన్నికలతో ముడిపడి ఉండకపోవడం కూడా చైనాలో ఇలా సాగదీత ధోరణికి కారణమవుతోంది.
మరోవైపు, అధిక ఆదాయ దేశాల్లోని జీవన ప్రమాణాల స్థాయికి చేరేందుకు అనువైన, బహిరంగ ఆర్థిక వ్యవస్థకు ఇక్కడి రాజకీయ వ్యవస్థ అనుకూలంగా లేదని చాలా మంది ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
దేశంలో మెరుగైన పాలన, లేదా నియంత్రణ కంటే భావజాలానికే జిన్‌పింగ్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ప్రమాదముందని కూడా అంటున్నారు.
ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతున్నప్పుడు ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ, జీరో కోవిడ్ పేరుతో మూడేళ్ల కఠిన నిబంధనలు అనుభవించిన తర్వాత, ఉద్యోగం కోసం తీవ్ర ఇబ్బందులు, ఇళ్ల విలువ భారీగా పడిపోవడం వంటి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ మందగమనం అంత తేలికైన విషయమేమీ కాదు.
అలాంటప్పుడు బైడెన్ చెప్పిన ''టిక్కింగ్ టైమ్ బాంబ్'' వాదన సరైనదేమోనని కూడా అనిపిస్తుంది. ఆర్థిక వ్యవస్థ పతనం దేశ పౌరుల్లో అసంతృప్తికి కారణమవ్వొచ్చు. లేదంటే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో విదేశీ వ్యవహారాలకు సంబంధించి ప్రమాదకర నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు.
ఇవన్నీ ప్రస్తుతం ఊహాగానాలే అవ్వొచ్చు. చైనా గతంలో ఇలాంటి చాలా సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుతం చైనా నాయకత్వం మాత్రం కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోందన్నది సుస్పష్టం.
''ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై చైనా ఆందోళన చెందుతోందా?అంటే, అయ్యుండొచ్చు'' అని ప్రొఫెసర్ ఫటస్ అన్నారు.
''ఇప్పుడేం చేయాలో వారికి అర్థమైందో లేదో నాకు తెలియదు. కానీ, చైనా భవిష్యత్తుకు అవసరమైన కొన్ని విషయాలను మాత్రం వారు పట్టించుకోవడం లేదు'' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా ‘బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్’లో చేరి తప్పు చేశామని ఇటలీ ఎందుకు అంటోంది?
- సెమీ కండక్టర్: కీలకమైన చిప్‌ల తయారీలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి కాగలదా?
- INS కృపాణ్: ఆయుధాలు నింపిన ఈ నౌకను భారత్ ఎందుకు వియత్నాంకు ఇచ్చింది, చైనాపై దీని ప్రభావం ఏంటి?
- రేటింగ్, రివ్యూ, లైక్ ఫ్రాడ్స్: భారతీయుల నుంచి రూ.712 కోట్లు దోచుకున్న చైనా ముఠా, ఆ డబ్బు మిలిటెంట్ సంస్థ హిజ్బొల్లాకు ఎలా చేరింది?
- స్వార్మ్ డ్రోన్స్: చైనా, పాకిస్తాన్ బలగాలకు భారత సైన్యం వీటితో చెక్ పెట్టగలదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














