ఉదయనిధి స్టాలిన్: సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకు వివాదంగా మారాయి?

ఫొటో సోర్స్, ANI
సనాతన ధర్మంపై చేసిన కామెంట్లతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ వివాదంలో చిక్కుకున్నారు.
తీవ్ర విమర్శలు రావడంతో ఆయన తన ప్రకటనపై క్లారిటీ కూడా ఇచ్చారు.
మరోవైపు ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్న వారు కూడాపెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
ఉదయనిధి స్టాలిన్ శనివారం చెన్నైలో తేనాంపేటలో ‘తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ నిర్వహించిన ‘సనాతన ఒళిప్పు మానాడు’ (సనాతన ధర్మ నిర్మూలన) అనే సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీ లాంటిదని, దాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు.
తమిళనాడు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేస్తున్న ఉదయనిధి స్టాలిన్ సినీ రచయిత, దర్శకుడు, నటుడు కూడా.
"కొన్ని విషయాలను కేవలం వ్యతిరేకిస్తే సరిపోదు. వాటిని పూర్తిగా నిర్మూలించాలి. దోమలు, డెంగీ జ్వరాలు, మలేరియా, కరోనా వంటి వాటిని మనం వ్యతిరేకిస్తేపోవు. నిర్మూలించాలి. అలాగే సనాతనం కూడా." అన్నారాయన.
‘‘మనం చేయాల్సిన మొదటి పని సనాతనాన్ని రూపుమాపడం. సనాతనం అనే మాట సంస్కృతం నుండి వచ్చింది. ఈ మాటకు అర్థం శాశ్వతమైనది అంటే ఎప్పటికీ మారనిది. దానిని ఎవరూ మార్చలేరు, ప్రశ్నించలేరు. కానీ, సనాతనం ప్రజలను కులం పేరుతో విడదీస్తుంది." అని అన్నారు
ఆయన ప్రసంగం వీడియో వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో దానిపై విమర్శలు, సమర్ధనలు, వాదనలు కనిపించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
విమర్శించిన బీజేపీ
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను బీజేపీ నేత అమిత్ మాలవీయ ఖండించారు. ఉదయనిధి ప్రసంగం వీడియో క్లిప్‌ను ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేస్తూ ‘‘ఆయన సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగీలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాకుండా నిర్మూలించాలని చెప్పారు. ఆయన ఉద్దేశం ఏంటంటే....దేశంలో సనాతన ధర్మాన్ని అనుసరించేవారు 80% మంది ఉన్నారు. వారందరినీ నిర్మూలించాలని’’ అని మాలవీయ అన్నారు.
"ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమిలో డీఎంకే కేలకమైన మిత్రపక్షం. చాలాకాలంగా కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తోంది. ముంబయిలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఇదే ఏకాభిప్రాయం కుదిరిందా?" అని ఆయన ప్రశ్నించారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై .. ఉదయనిధి స్టాలిన్ మీదా, ఆయన కుటుంబంపైనా విరుచుకుపడ్డారు.
‘‘మీరు, మీ తండ్రి లేదా మీ పార్టీ సిద్ధాంతకర్తలు ఇలాంటి ఆలోచనలను క్రైస్తవ మిషనరీల నుంచి తీసుకున్నారు. ఆ మిషనరీల ఆలోచన ఏంటంటే, మీలాంటి హానికరమైన భావజాలాన్ని ప్రోత్సహించగల వ్యక్తులను సృష్టించడం." అని అన్నారు.
సనాతన ధర్మాన్ని ఎవరూ తొలగించలేరని రామజన్మభూమి చీఫ్ మహంత్ ఆచార్య సత్యేంద్ర దాస్ వార్తా సంస్థ ఏఎన్ఐతో అన్నారు.
"సనాతన ధర్మం శతాబ్దాల తరబడి కొనసాగుతోంది. అన్ని మతాలు, వర్గాలు దాని నుంచే ఉద్భవించాయి. భవిష్యత్తులో కూడా ఇది అలాగే ఉంటుంది, దీనిని చెరిపేయలేరు. ఉదయనిధి కాదు, ఇంకెవరు వచ్చినా ఆ పని చేయలేరు" అని ఆయన అన్నారు.
"సనాతనం అనే మాటలను ఉదయ నిధి అర్ధం చేసుకోలేకపోయారు. అందుకే దాన్ని నిర్మూలించాలని మాట్లాడుతున్నాడు. అతను చెప్పింది పూర్తిగా తప్పు." అని అన్నారు సత్యేంద్ర దాస్.

ఫొటో సోర్స్, @Amitmalviya
వివరణ ఇచ్చిన ఉదయ నిధి
సనాతన ధర్మాన్ని అనుసరించేవారిని నిర్మూలించాలని అన్నట్లుగా కొందరు తనపై చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు ఉదయనిధి స్టాలిన్.
సనాతన ధర్మాన్ని విశ్వసించే వారిని నిర్మూలించడం గురించి తాను మాట్లాడలేదని, సనాతన ధర్మాన్ని మాత్రమే నిర్మూలించాలని అన్నానని చెప్పారు. సనాతన ధర్మం కులం, మతం పేరుతో ప్రజలను విడదీసే సిద్ధాంతమని తాను గట్టిగా నమ్ముతున్నానని ఆయన చెప్పారు.
"నేను నా ప్రకటనకు కట్టుబడి ఉన్నాను. సనాతన ధర్మం కారణంగా అణగారిపోయిన ప్రజల ప్రతినిధిగా నేను ఈ విషయాలు చెప్పాను. సనాతన ధర్మంపై పెరియార్, అంబేద్కర్ చేసిన లోతైన కృషిని, సనాతనం ధర్మంవల్ల కలిగే దుష్ఫలితాలను మీకు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
“నేను నా ప్రసంగంలోని కీలకమైన భాగాన్ని రిపీట్ చేస్తున్నాను. కోవిడ్-19, డెంగీ, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందినట్లే, అనేక సామాజిక దురాచారాలు వ్యాప్తి చెందడానికి సనాతనం కారణమని నేను నమ్ముతున్నాను. నా వాదనలపై ఇటు న్యాయస్థానంలోనైనా, అటు ప్రజా న్యాయస్థానంలోనైనా పోరాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అని వ్యాఖ్యానించారు.
సనాతన ధర్మాన్ని అనుసరించే వారిని నిర్మూలించాలని తానెప్పుడూ పిలుపునివ్వలేదని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
విమర్శలు-సమర్ధనలు
ఉదయనిధి ప్రసంగాన్ని కోర్టులో సవాల్ చేస్తామని లీగల్ యాక్టివిజంతో సంబంధం ఉన్న లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ వెల్లడించింది.
‘‘వేరొకరి ప్రోద్బలంతో సనాతన ధర్మాన్ని దూషించే వారిని దోమల్లా తుడిచిపెట్టేందుకు న్యాయపరమైన అవకాశాలను వెతుకుతాం. ఉదయనిధిని క్షమించం'' అని అబ్జర్వేటరీ పేర్కొంది.
దీనిపై ఉదయనిధి స్పందిస్తూ చట్టపరమైన ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
‘‘కాషాయ గ్రూపుల బెదిరింపులకు భయపడబోం. మేము పెరియార్, అణ్ణాదురై, కలైంజ్ఞర్ అనుచరులం. ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలో మేం సామాజిక న్యాయం, సమానత్వ సమాజ స్థాపన కోసం పోరాడుతాం. సనాతన ధర్మాన్ని ద్రవిడ భూమి నుండి తొలగించాలనే మా సంకల్పం నుంచి ఎప్పటికి వెనక్కి తగ్గబోము.’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, @Udhayastalin
సోషల్ మీడియాలో చర్చ
బీజేపీ నేతలు, పలువురు సోషల్ మీడియాలో ఉదయనిధిపై తీవ్ర విమర్శలు చేస్తుంటే, కొందరు మాత్రం ఆయనకు మద్ధతుగా నిలిచారు.
ఉదయనిధి స్టాలిన్ పై అమిత్ మాలవీయ చేసిన ట్వీట్‌కు సీనియర్ జర్నలిస్ట్, ‘సెంటర్ ఫర్ బ్రాహ్మణ స్టడీస్’ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ దిలీప్ మొండల్ బదులిచ్చారు.
‘‘ఇక్కడ నరమేధం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. సనాతనాన్ని తుడిచివేయడం గురించి ఉదయనిధి మాట్లాడారు. అతను సైద్ధాంతిక పోరాటం గురించి అంటే శాస్త్రార్థం గురించి మాట్లాడుతున్నాడు" అని రాశారు.
ఈ విషయంపై అమిత్ మాలవీయను చర్చకు ఆహ్వానించిన ఆయన, హిందుత్వంపై సావర్కర్ పుస్తకాన్ని మరోసారి చదవాలని సలహా ఇచ్చారు.
"భారతదేశంలోని ప్రతి జిల్లాలో దేవుళ్లు మారతారు. కొందరు శాఖాహారులైతే, మరికొందరు జంతు బలి లేకుండా పూజలు చేయరు. ఇవన్నీ భారతీయ సంప్రదాయాలు. వాటి మధ్య పోటీ ఉంది. ఇవి మీకు అర్ధం కాకపోతే కనీసం సావర్కర్ హిందూత్వ గురించి రాసిన పుస్తకాన్ని చదవండి.’’ అని సూచించారు.
మరోవైపు, ఉదయనిధి ప్రకటనను వక్రీకరించి సందర్భం లేకుండా వివాదాలు సృష్టిస్తున్నారని డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఉదయనిధిలాంటివారిని లక్షల మందిని చూసింది సనాతన ధర్మం: చిలుకూరి బాలాజీ ప్రధానార్చకులు
ఉదయనిధి వ్యాఖ్యలపై హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు.
ఉదయనిధి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను తాను చూశానని.. సనాతన ధర్మాన్ని ఆయన మలేరియా, డెంగీలతో పోల్చారని, సనాతన ధర్మాన్నినాశనం చేయాలని అనడం చూశామని చెప్పారు.
అయితే, సనాతన ధర్మం ఇంతవరకు ఇలాంటి లక్షల మందిని చూసిందని.. సనాతన ధర్మం కాలపరీక్షకు తట్టుకుని నిలిచిందని చెప్పారు.
భయంకరమైన చొరబాట్లు, విధ్వంసాలను కూడా ఎదుర్కొని నిలిచిందని.. సనాతన ధర్మాన్ని ఆచరించేవారిపై దాడులూ జరిగాయని.. అయినా ఇంకా ఈ దేశంలో సనాతన ధర్మం ఉందని ఆయన అన్నారు.
ద్రవిడ భావజాల అసలైన అర్థాన్ని ఉదయనిధి స్టాలిన్ తెలుసుకోవాలని తాను కోరుకుంటున్నానన్నారు.
ఉదయనిధిలాంటివారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పి సనాతన ధర్మాన్ని గౌరవించేవారిని ఎన్నుకోవాలని ఆయన తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















