పశ్చిమ బెంగాల్ హింస: కేంద్ర బలగాలను భారీగా మోహరించినా పంచాయతీ ఎన్నికల్లో అంత మంది ఎందుకు చనిపోయారు?

కేంద్ర భద్రత బలగాలు

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, ప్రభాకర్ మణి తివారీ
    • హోదా, బీబీసీ హిందీ కోసం కోల్‌కతా నుంచి

భారీగా కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజు పెద్దయెత్తున హింసాత్మక ఘటనలు జరిగాయి.

రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు, తగలబెట్టడాలు, దొంగ ఓట్లు, బూత్ కేప్చరింగ్ భారీగా జరిగాయి. 2018 పంచాయతీ ఎన్నికలతో పోల్చితే ఈసారి ఇలాంటి ఘటనలు మరింత ఎక్కువయ్యాయి. 2018 నాటి పంచాయతీ ఎన్నికలలో పోలింగ్ రోజున 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈసారి పోలింగ్ రోజుహింసలో వివిధ పార్టీలకు చెందిన 13 మంది మరణించినట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. అయితే, ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని, మొత్తం 17 మంది చనిపోయారని అనధికారిక లెక్కలు చెప్తున్నాయి.

బాంబు దాడులు, తుపాకీ కాల్పుల కారణంగానే వీరిలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్దసంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.

డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

శనివారం(జులై 8) సాయంత్రం ఐదు గంటల వరకు 66.28 శాతం పోలింగ్ నమోదైంది.

ఈ ఎన్నికల ఫలితాలు జులై 11న వెలువడనుండగా ఆ తరువాత మరో 10 రోజుల పాటు పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా కేంద్ర భద్రత బలగాలను మోహరించాలని కోల్‌కతా హైకోర్టు జులై 6న చెప్పింది. బహుశా హింస జరగొచ్చన్న అంచనాలతోనే కోర్టు ఈ జాగ్రత్త సూచించి ఉండొచ్చు.

పోలింగ్ రోజున జరిగిన ఈ హింస కారణంగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ హింసకు కారణం మీరంటూ మీరంటూ పార్టీలు నిందించుకుంటున్నాయి.

ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అయితే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తోంది.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ లేఖ రాశారు.

Fire

ఫొటో సోర్స్, ANI

పోలింగ్ అనంతరం పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ సిన్హా విలేఖరులతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణే తమ పని అని, శాంతిభద్రతల విషయం జిల్లా అధికారులు, పోలీసులకు సంబంధించిన వ్యవహారమని చెప్పారు.

అయితే, భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ భారీగా హింస చోటుచేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సున్నితమైన ప్రాంతాలలో బలగాలను మోహరించలేదని విపక్ష బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం ఆరోపిస్తున్నాయి. ఈ కారణంగానే హింస జరిగిందని ఈ పార్టీలు ఆరోపించాయి.

అయితే, రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ సిన్హా విలేకరులతో మాట్లాడినప్పుడు కేంద్ర భద్రతా దళాలు ముందే చేరుకుని ఉంటే ఇంత హింస జరిగేది కాదని, పోలింగ్ రోజైన శనివారం మధ్యాహ్నానికి 660 కంపెనీల కేంద్ర బలగాలు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని ఆయన అన్నారు.

నిజానికి కోల్‌కతా హైకోర్ట్ సూచన ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ 822 కంపెనీల బలగాలు కావాలని కేంద్ర హోం శాఖను కోరింది.

కేంద్ర బలగాల పహారా మధ్య ఎన్నికలు నిర్వహించడంపై చివరి నిమిషం వరకు కోర్టులో వాదనలు సాగాయని, సుప్రీంకోర్టు వరకు కూడా ఇది వెళ్లిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇంతకుముందు ఎన్నికలు జరిగినప్పుడు 22 కంపెనీల బలగాలను మాత్రమే కేంద్రం నుంచి కోరారని చెప్తున్నారు.

పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఆ తరువాత కమిషన్ కేంద్రాన్ని 800 కంపెనీల బలగాలు పంపించాలని కోరింది. అయితే, కేంద్రం 660 కంపెనీలను పంపించింది.

శుక్రవారం రాత్రి, శనివారం పోలింగ్ మొదలైన తరువాత సుమారు 300 కంపెనీలు రాష్ట్రానికి చేరాయి.

రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ సమీరన్ పాల్ మాట్లాడుతూ.. ‘‘కేంద్ర బలగాల మోహరింపులో ఎన్నికల సంఘం జాప్యం చేసిందన్న ఆరోపణలున్నాయి. దీంతోపాటు సున్నితమైన పోలింగ్ కేంద్రాలు ఏవనేది గుర్తించడం కూడా ఆలస్యమైంది. చివరి నిమిషం వరకు వీటిని గుర్తించలేదు. వీటన్నిటి ఫలితమే ఈ హింస’’ అన్నారు.

కూచ్ బిహార్‌లో ధ్వంసమైన పోలింగ్ బూత్

ఫొటో సోర్స్, ANI

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి హింసాత్మక ఘటనలు, తగలబెట్టడాలు, బూత్ కేప్చరింగ్‌లపై ఫిర్యాదులు వచ్చాయి. ఏడు జిల్లాలలో ఎక్కువగా ఇలాంటివి జరగ్గా, అన్నిటికంటే అధికంగా ముర్షీదాబాద్‌లో జరిగాయి.

ముర్షీదాబాద్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఘర్షణలు మొదలయ్యాయి. ఈ జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో అయిదుగురు మరణించారు. కూచ్‌బిహార్, దిన్‌హాటాలలోనూ తీవ్రమైన హింసాత్మక ఘటనలలో ఇద్దరు మరణించారు. కోల్‌కతాకు ఆనుకునే ఉన్న దక్షిణ దీనాజ్‌పుర్‌ జిల్లాలోని భాంగడ్‌లో వేర్వేరు హింసాత్మక ఘటనల్లో పది మందికి పైగా గాయపడ్డారు.

మాల్దా, తూర్పు బర్దవాన్ జిల్లాలలో రెండేసి మరణాలు రికార్డయ్యాయి. నదియా జిల్లాలో బుల్లెట్ గాయాలతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

నదియాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు జరగడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.

ఆందోళనలు

ఫొటో సోర్స్, SANJAY DAS

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల హింస అనేది వేళ్లూనుకుందని, దాన్ని పూర్తిగా అరికట్టడం అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు.

సీనియర్ జర్నలిస్ట్ తపస్ ముఖర్జీ మాట్లాడుతూ- ‘‘బెంగాల్‌లో ఎన్నికల హింస ఈనాటిది కాదు. 1980, 1990ల కాలంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ఇంకా ఈ రాష్ట్రంలో ఉనికిలో లేనప్పుడు అప్పటికి ప్రభావవంతంగా ఉన్న లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీల మధ్య కూడా ఘర్షణలు, హింస జరిగేవి’’ అన్నారు.

ప్రతిపక్షాల నుంచి పాలక పక్షానికి గట్టి సవాళ్లు ఎదురైనప్పుడంతా ఇలాంటి హింస చెలరేగుతుందని చరిత్ర చెప్తోందన్నారు.

మొదట్లో లెఫ్ట్, కాంగ్రెస్.. ఆ తరువాత తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్.. ఇప్పుడు బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య ఘర్షణలకు ఇదే కారణమన్నారు.

ఇప్పుడు బీజేపీ బలం పుంజుకోవడం, సీపీఎం, కాంగ్రెస్‌ల కూటమి పోగొట్టుకున్న పట్టును తిరిగి సాధించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలతో చరిత్ర పునరావృతమవుతున్నట్లు కనపిస్తోందన్నారు తపస్ ముఖర్జీ.

police

ఫొటో సోర్స్, ANI

హింస అనంతరం పార్టీలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకోవడం ప్రారంభించాయి. ఓటర్లకు భద్రత కల్పించడంలో కేంద్ర భద్రత బలగాలు విఫలమయ్యాయని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించగా, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపీ అంటోంది.

మమతా బెనర్జీ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి శశి పాంజా తాజా ఘటనలపై శుక్రవారం ఉదయం ట్వీట్ చేస్తూ- ‘‘నిన్న రాత్రి నుంచి హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం కుట్ర పూరితంగా కేంద్ర బలగాలు కావాలని కోరాయి. తృణమూల్ కాంగ్రెస్ వారిని చంపుతున్నారు. మరి, వారంతా(కేంద్ర బలగాలు) ఎక్కడున్నారు?’ అన్నారు.

కాంగ్రెస్ పశ్చిమబెంగాల్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ టీఎంసీ గూండాలు బూత్‌లు కబ్జా చేశారని, చివరకు ప్రజాభిప్రాయాన్ని కూడా దోచుకున్నారని అన్నారు.

హైకోర్టు ఆదేశించినా కేంద్ర భద్రతా దళ సిబ్బందిని సక్రమంగా మోహరించడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం ఆరోపించారు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది.

Rajiv Sinha

ఫొటో సోర్స్, SANJAY DAS

అసెంబ్లీలో విపక్ష నేత శుభేందు అధికారి మాట్లాడుతూ- ‘‘పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ పాలనలో స్వేచ్ఛ, నిష్పాక్షికమైన ఎన్నికలు ఎండమావి లాంటివి. రాష్ట్రపతి పాలన పెడితేనే స్వేచ్ఛాయుత పరిస్థితులలో ఎన్నికలు జరుగుతాయి’’ అన్నారు.

విలేఖరులతో ఆయన మాట్లాడుతూ- రాజీవ్ సిన్హాను ఎన్నికల కమిషనర్ పోస్ట్‌లో నియమించి తప్పు చేశారన్నారు.

ఇంతగా హింసకు కారణమైన ఈ ఎన్నికలలో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందనేది అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.

జులై 11న వెలువడనున్న ఫలితాల కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

ఈ ఎన్నికల ఫలితాలు రానున్న పార్లమెంటు ఎన్నికలపై చూపిస్తాయని విశ్లేషకులు చెప్తున్నారు.

వీడియో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్ హింస: పంచాయతీ ఎన్నికల్లో అంత మంది ఎందుకు చనిపోయారు?

ఇవి కూడా చదవండి: