నత్తల జిగురు, తేనెటీగ విషం ఉన్న ఫేస్‌క్రీములు వాడితే కొరియన్ అమ్మాయిల్లా నున్నగా కనిపిస్తారా?

నత్తలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మహాలక్ష్మి.టి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సోషల్ మీడియాలో చాలా ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. ఆహారం, బట్టలు, మీమ్స్, పాటలు, డ్యాన్స్ ఇలా ఏదైనా కావచ్చు. తొందరగా కనెక్ట్ అవుతున్నారు జనం. ఇపుడు యువతకు కొరియన్ ట్రెండ్ పట్టుకుంది. బీటీఎస్, బ్లాక్ పింక్ పాప్ బ్యాండ్‌లు, కొరియన్ పాటలు, బట్టలు, కె-డ్రామాలు, వాటిలో నటించే నటీనటులు యువతలో బాగా ప్రాచుర్యం పొందారు.

ఇది ఎంతవరకు వచ్చిందంటే కొరియన్ల మాదిరి చర్మం కావాలని, వారి బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగించడం ప్రారంభిస్తున్నారు.

కొరియన్ల స్కిన్ ఎలా మెరిసిపోతుందో చూడండంటూ సోషల్ మీడియాలో చాలామంది ఇండియన్స్ ముఖ్యంగా దక్షిణాది యువతులు చర్చించుకుంటున్నారు.

కొరియన్ చర్మ సంరక్షణ ఉత్పత్తుల గురించి తెలుసుకుంటున్నారు.

ఇంతకీ కొరియన్లు ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులను వాడితే మనం కొరియన్ లాంటి స్కిన్ పొందవచ్చా?

ఇది భారత వాతావరణానికి అనుకూలంగా ఉంటుందా? దీని గురించి చర్మ వైద్యులు ఏమంటున్నారు?

చర్మం

ఫొటో సోర్స్, Getty Images

కొరియన్ల చర్మం ఎందుకు మెరుస్తుంది?

ఎక్కువగా మొటిమలు, మచ్చలు లేని చర్మం కొరియన్ల సొంతం. కొరియన్ల అందం వారి చర్మ సంరక్షణ, పర్యావరణం, ఆహారం, జన్యుశాస్త్రం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది.

అలాగే కొరియన్ల చర్మం సాగే గుణంతో చల్లని, పొడి వాతావరణానికి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి వారి చర్మ సంరక్షణ ఉత్పత్తులు ప్రధానంగా కొరియన్ల అవసరాల ఆధారంగా రూపొందించారు.

ముఖ్యంగా కొరియన్లు తమ చర్మాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అంటే వారు టోనింగ్, క్లెన్సింగ్, ఎసెన్స్ స్ప్రే, స్లీపింగ్ మాస్క్ వంటి చర్మ సంరక్షణ కోసం రోజూ 10 నుంచి 20 విధానాలను అనుసరిస్తారు.

ఇది కాకుండా సహజ పద్ధతులను పాటిస్తారు. ముఖ్యంగా పుచ్చకాయలోని ఎర్రటి భాగానికి, తొక్కకు మధ్య గల తెల్లటి భాగాన్ని (తొక్క) మెరుగైన చర్మం కోసం తమ ముఖానికి అద్దుతారు.

స్త్రీలతో సమానంగా కొరియన్ పురుషులు కూడా తమ చర్మ సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు.

కొరియన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఇంతకీ కొరియన్ సౌందర్య ఉత్పత్తులలో ఏమేం ఉన్నాయి?

కొరియన్ సౌందర్య ఉత్పత్తులలో సహజ పదార్ధాలతో కూడినవే ఎక్కువ. అవి చర్మానికి కలిగే నష్టాలకు చికిత్స చేయడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, మృత కణాలను పునరుద్ధరించడం, ఇతర చర్మ వ్యాధులను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు.

కొరియాలో బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఉపయోగించే కొన్ని పదార్థాలను పరిశీలిస్తే..

  • నత్త ద్రవం

ఈ రోజుల్లో, అనేక బ్యూటీ కంపెనీలు నత్త ద్రవం ఆధారంగా తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ఇది వింటే మీరు ఆశ్చర్యపోవచ్చు.

నత్తలు స్రవించే స్పష్టమైన, సన్నని, జిగట ద్రవం చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడానికి సహాయపడుతుందని వారు నమ్ముతారు.

ఈ ద్రవాన్ని వయస్సు, లింగంతో సంబంధం లేకుండా ఉపయోగిస్తారు కొరియన్లు.

  • తేనెటీగల జిగురు

తేనెటీగల నుంచి లభించే ఈ రెసిన్‌ని ఆంగ్లంలో ప్రొపోలిస్ అంటారు. పుప్పొడి అనేది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధం. ఇది ముడుతలను తగ్గించే లక్షణాలతో పాటు మొటిమల బారిన పడే చర్మం, బ్రేక్‌అవుట్‌లకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల, పుప్పొడి చర్మానికి కలిగే నష్టాలను నియంత్రిస్తుంది.

పుప్పొడి చర్మంపై సున్నితమైన మెరుపును వదులుతుంది. ఇది క్రమం తప్పకుండా అప్లై చేస్తే చర్మంలోని మృతకణాలను తొలగించి యవ్వన రూపాన్ని ఇస్తుందని కొరియన్లు నమ్ముతారు.

వీడియో క్యాప్షన్, కొరియన్ల మాదిరి చర్మం కావాలని, కొందరు వారి బ్యూటీ ఉత్పత్తులు వాడటం మొదలుపెడుతున్నారు.
  • ముత్యం

కొరియన్ బ్యూటీ ఉత్పత్తులలో ముత్యాలు చాలా కాలంగా ముఖ్యమైన పదార్ధంగా ఉన్నాయి.

ముత్యాలు మొటిమలను తొలగించడంలో ఉపయోగపడతాయని చెబుతారు. అలాగే ముఖంపై విస్తరించిన రంధ్రాలను తగ్గిస్తాయని, చర్మం వృద్ధాప్యం బారిన పడకుండా నివారిస్తుందని విశ్వసిస్తారు.

  • తేనెటీగ విషం

తేనెటీగ విషం ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. తేనెటీగలు బెదిరినప్పుడు వాటిని స్రవిస్తాయి. అనేక చర్మ సంరక్షణ సంస్థలు సీరమ్స్, మాయిశ్చరైజర్స్ వంటి ఉత్పత్తులకు తేనెటీగ విషాన్ని వాడతాయి.

ఈ పదార్థాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో వాపును తగ్గించే లక్షణాలు ఉంటాయి. యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను అందిస్తుంది, ముడతలను తగ్గిస్తుంది.

అదే విధంగా వెదురు, యుసా (ఒక రకమైన పండు), సెంటెల్లా ఆసియాటికా, బిర్చ్ సాప్ వంటి అనేక పదార్థాలు కొరియన్ సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.

సౌందర్య

ఫొటో సోర్స్, SOUNDARYA

కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడిన మహిళలు ఏమంటున్నారు?

“నేను రెండేళ్లుగా కొరియన్ బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నా. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తుంటాయి. వీటిని అమ్మేషాపులు బెంగళూరులో ప్రత్యేకంగా ఉన్నాయి. అక్కడికి వెళ్లి కూడా కొంటుంటాను. ఇప్పటి వరకు చర్మానికి సంబంధించి సమస్యలేవీ ఎదురుకాలేదు. అలాగే చర్మంలో పెద్దగా మార్పు కూడా లేదు’’ అని కోయంబత్తూరుకు చెందిన మోడల్, సోషల్ మీడియాలో బ్యూటీ బ్లాగర్ సౌందర్య అన్నారు.

కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడితే ఆశించినంత మార్పు కనిపించడం లేదని చెన్నైకి చెందిన కాలేజీ విద్యార్థిని కృష్ణ ప్రియ అంటున్నారు.

“నేను కొన్నేళ్లుగా కొరియన్‌ సిరీస్‌లు చూస్తున్నా. అప్పటి నుంచి వారి చర్మ గుణంపై ఆసక్తి పెరిగింది. మొదట సోషల్ మీడియా ద్వారా కొరియన్ బ్యూటీ ఉత్పత్తులను చూశా. వెంటనే ఆన్‌లైన్‌లో సీరం కొనుగోలు చేసి, ఉపయోగించాను. మిర్రర్ స్కిన్ అని వెబ్‌సైట్‌లో చెప్పడం వల్ల కొన్నా. అయితే, అది ఆశించిన విధంగా పని చేయలేదు” అని కృష్ణ ప్రియ చెప్పారు.

మరో విద్యార్థి హర్షిణి మాట్లాడుతూ “నేను ఆన్‌లైన్‌లో రూ.1,500 పెట్టి కొరియన్ ఫేస్ వాష్ కొన్నా. కానీ, అది ఆశించిన ఫలితాలివ్వలేదు. అందుకే మళ్లీ కొనలేదు’’ అని తెలిపారు.

మేకప్

ఫొటో సోర్స్, Getty Images

చర్మ వైద్యులు ఏమంటున్నారు?

“కొరియన్ ప్రజలు తమ చర్మంపై చాలా శ్రద్ధ చూపుతారు. అయితే, ఆ దేశంతో పోలిస్తే భారతీయుల చర్మం, వాతావరణంలో తేడా ఉంటుంది” అని కాస్మోటాలజిస్ట్, డెర్మటాలజిస్ట్ కార్తీక అంటున్నారు.

“యువత ఎక్కువగా కొరియన్ డ్రామాలు (K-Dramas) చూస్తున్నారు. అందులోని పాత్రల మాదిరిగానే తమ ముఖాలు ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, దేశాన్ని బట్టి వాతావరణం మారుతూ ఉంటుంది.

కొరియాలో పొడి వాతావరణం ఉంటుంది. కాబట్టి అక్కడ నివసించే వ్యక్తుల చర్మంలో తేమ లేకుండా ఉంటుంది. భారత వాతావారణంలో ఎండాకాలం, వానాకాలం, చలికాలం దేనికదే ప్రత్యేకం. అందుకే వేడి, దుమ్ము, కాలుష్యం మొదలైనవి సీజన్లను బట్టి మారుతుండటం వల్ల చర్మంలో మార్పు ఉంటుంది. మనం కరోనా వచ్చాకే మాస్క్‌ వినియోగించాం. అయితే కొరియన్ ప్రజలు కాలుష్యం, దుమ్ము నుంచి తమ ముఖాలను రక్షించుకోవడానికి చాలా ఏళ్లుగా మాస్క్‌లను ఉపయోగిస్తున్నారు. అలాగే, వారు తమ చర్మాన్ని కాపాడుకోవడానికి రోజూ 10 నుంచి 20 ప్రోడక్ట్స్‌ను ఉపయోగిస్తారు. భారతీయులకు ఆ అలవాటు ఎక్కువగా లేదు’’ అని అన్నారు.

ఆన్‌లైన్ రివ్యూలు చదవడం కంటే వాటి మన శరీరానికి ఏవి పనికొస్తాయో తెలుసుకుని బ్యూటీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం మంచిదని కూడా ఆమె సూచిస్తున్నారు.

“ఏదైనా బ్యూటీ ప్రొడక్ట్ మీ చర్మానికి వాడేముందు చర్మవ్యాధి నిపుణుల సలహా తీసుకోండి. ఎందుకంటే ఆ పదార్థాలు మన చర్మానికి సరిపోతాయో లేదో తెలుసుకోవాలి’’ అని చెబుతున్నారు కార్తీక.

ఆరోగ్యకరమైన చర్మానికి మొదటి మెట్టు హెల్తీ డైట్ అంటున్నారామె. సరైన మోతాదులో నీరు తాగడం, పండ్లు, కూరగాయలు తినడం ఆరోగ్యకరమైన చర్మానికి బాటలు వేస్తాయని డాక్టర్ కార్తీక అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ ‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.)