మందు తాగకున్నా లివర్‌లో ఆల్కాహాల్... ఆ వైద్య విద్యార్థినికి ఎందుకిలా జరిగింది?

ఫొటో సోర్స్, MEGAN MCGILLIN
- రచయిత, ఐలీన్ మొయినాగ్
- హోదా, బీబీసీ న్యూస్
పదేళ్ల వయస్సులోనే తనకు ఆల్కాహాలిక్ లివర్ ఉందని ఒక వైద్య విద్యార్థిని అంటున్నారు.
రోయింగ్ చేస్తుండటంతో కాలేయ మార్పిడికి సమయం దొరికిందని ఆమె అన్నారు.
ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన మేగన్ మెక్‌గిలిన్ అనే యువతి 11 ఏళ్ల క్రితం సిర్రోసిస్ వ్యాధితో బాధపడ్డారు. దీనివల్ల కాలేయం సరిగా పనిచేయదు. కాలేయానికి మచ్చలు ఏర్పడుతాయి.
పిల్లలలో కాలేయ వ్యాధులు చాలా అరుదు. మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటే కాలేయం స్థిరమైన స్థితిలో ఉంటుందని లివర్ స్పెషలిస్ట్ బీబీసీతో తెలిపారు.
సిర్రోసిస్‌ను నయం చేయడం సాధ్యం కాదు. పిల్లలలో సిర్రోసిస్‌కు కారణమయ్యే చాలావరకు కాలేయ రుగ్మతలను నివారించలేం.
మేగాన్‌కు ఆ వ్యాధి ఎలా వచ్చిందో వైద్యులకు అర్థం కాలేదు. కానీ, ఆమె కాలేయం పనిచేయడం ఆగిపోవచ్చని వారు తెలిపారు.
"నాకు ఆల్కాహాలిక్ లివర్ ఉందని తెలిశాక, మొదట నాకు 18 ఏళ్ల వయసులో మార్పిడి చేస్తానని చెప్పారు. కానీ నేను ఫిట్‌గా, బాగానే ఉన్నాను" అని మేగాన్ గుర్తుచేసుకున్నారు.
"16, 17 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు 21 ఏళ్లకు నాకు ఖచ్చితంగా మార్పిడి అవసరమని చెప్పారు వైద్యులు. నవంబర్‌లో నాకు 21 ఏళ్లు వచ్చినప్పుడు, ఎలాంటి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ జరగలేదు. ఇప్పుడు వైద్యులు మార్పిడి గడువు గురించి నాకు చెప్పడం లేదు" అని అంటున్నారు మేగన్.

ఫొటో సోర్స్, MEGAN MCGILLIN
ఆటలను వదులుకోవాల్సి వచ్చింది...
సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధి పోర్టల్ హైపర్‌టెన్షన్ (సిరల్లో ఒత్తిడి)కి దారి తీస్తుంది. ప్లీహం విస్తరించడానికి కారణమవుతుంది. దీంతో ఆమె ఒకరితో మరొకరు తాకుతూ ఆడే ఆటలను వదులుకోవాల్సి వచ్చింది. మేగాన్‌కు అది చాలా పెద్ద విషయం.
దీంతో ఆమె రోయింగ్‌లోకి ప్రవేశించారు. సెకండరీ స్కూల్‌లో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు హై పెర్ఫార్మెన్స్ నార్తర్న్ ఐర్లాండ్ రోయింగ్ జట్టులో ఆడారు. దీంతో మేగాన్ ఫిట్ గా ఉండేవారు.
ఇది తనను చాలా ఫిట్‌గా ఉంచిందంటున్నారు మేగాన్.
"నేను చాలా కష్టపడ్డాను. నిరంతరం శిక్షణ పొందండటంతోనే ఇది సాధ్యమైంది. ఇది అధిక తీవ్రత కలిగిన క్రీడ కాబట్టి శారీరకంగా నన్ను జాగ్రత్తగా ఉంచుకున్నా" అని చెప్పారామె.
ఫిట్‌గా ఉండటం వల్ల తన లివర్ చాలాకాలం పాటు పని చేస్తుందని ఆమె నమ్ముతున్నారు.

పది లక్షల మందిలో ఒకరికి...
బర్మింగ్‌హామ్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్‌లో పీడియాట్రిక్ లివర్ వ్యాధుల నిపుణుడు డాక్టర్ గిరీష్ గుప్తే. రాయల్ బెల్‌ఫాస్ట్ హాస్పిటల్‌లో సంవత్సరానికి ఆరుసార్లు వచ్చి పిల్లలను చూస్తుంటారు గిరీష్.
"చిన్నారులలో కాలేయ వ్యాధి చాలా అరుదు , కాబట్టి జనాభాలో చాలామంది దీర్ఘకాలిక కాలేయ సమస్యలతో బాధపడుతున్న పిల్లల గురించి ఎప్పుడూ వినకపోవచ్చు. 10,000 మందిలో ఒకరికి కాలేయ వ్యాధి ఉండొచ్చు. కొన్ని కాలేయ వ్యాధులు మాత్రం పది లక్షల మందిలో ఒకరికి వస్తుంటాయి" అని గిరీష్ చెప్పారు.
ఇటీవలి దశాబ్దాలలో దీర్ఘకాలిక కాలేయ వ్యాధి కేసులు పెరుగుతున్నాయని, దీనికి కొంతవరకు పరీక్షలో పురోగతి కారణమని గిరీష్ అన్నారు.
పిల్లలలో కేసుల పెరుగుదలలో పర్యావరణ కారకాలు, జీవనశైలి కూడా పాత్ర పోషిస్తుందని డాక్టర్ అభిప్రాయపడ్డారు.
" కాలేయ వ్యాధి ఉన్న పిల్లలందరికీ కాలేయ మార్పిడి అవసరం లేదు. ఈ పరిస్థితులలో చాలావరకు మంచి వైద్య చికిత్సలు, ఆరోగ్యకరమైన జీవనశైలితో నియంత్రణలోకి వస్తాయి " అని ఆయన వివరించారు.
"అయితే కొంతమంది పిల్లల్లో రోజులు గడుస్తున్న కొద్దీ లివర్ చెడిపోతుంది. అలాంటి వారికి కాలేయం మార్పిడి అవసరం" అని ఆయన చెప్పారు.
"ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం, మంచి ఆహారంతో కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడం వంటివి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, అంతేకాదు మార్పిడిని ఆలస్యం చేయడం లేదా నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నమ్ముతున్నా" అని వైద్యుడు అన్నారు.

ఫొటో సోర్స్, MEGAN MCGILLIN
"ఆల్కాహాలిక్ కాలేయం"
సిర్రోసిస్ అనేది దీర్ఘకాలిక మద్యపానం వల్ల మాత్రమే వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. ఇది పెద్దలలో కూడా సంభవించవచ్చు. పిల్లలలో సిర్రోసిస్ తరచుగా పలు రకాల కాలేయ రుగ్మతల వల్ల వస్తుంది.
ఒకరోజు మేగాన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పరీక్షలు చేసిన వైద్యులు మేగాన్‌కి ఆల్కాహాలిక్ కాలేయం ఉందని ఆమె తల్లికి చెప్పారు.
"నేను ఇంతకుముందెన్నడూ మద్యం సేవించలేదు, ఆల్కాహాలిక్ లివర్ ఉందని విన్నప్పుడు నా తల్లి ఆశ్చర్యపోయింది" అని మేగాన్ బీబీసీతో తెలిపారు.
లివర్ వ్యాధి వస్తే మద్యపాన వ్యసనం కారణంగానే వచ్చిందని అందరూ అనుకుంటారని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, MEGAN MCGILLIN
'నేను తోటి వారికి కొంచెం భిన్నం'
కాలేయ వ్యాధి వచ్చిందని తెలిశాక తాను మద్యం తాగనని చెబితే మిశ్రమ స్పందనలు వచ్చాయని మేగాన్ గుర్తుచేసుకున్నారు.
తెలిసిన వారు అసలు నువ్వు ఏం చేశావు? ఇంత చిన్న వయసులో తాగడం మొదలుపెట్టావా? నీ యవ్వనంలో ఏంటా పని? అని అన్నపుడు నచ్చదని ఆమె తెలిపారు.
అయితే తన పరిస్థితి "కొంతమందికి అవగాహన కల్పించడానికి, కాలేయ వ్యాధికి మద్యంతో సంబంధం లేదని వారికి వివరించడానికి అవకాశం లభిస్తుందని" మేగాన్ అంటున్నారు.
వ్యాధిని స్వీకరించడం భయంకరమైనదని మేగాన్ అన్నారు. అయితే దానితో అలసిపోయినందున, ఇక అలాగే జీవించగలనని చెబుతున్నారు.
"బయటికి నేను సాధారణంగానే కనిపిస్తాను, సాధారణ పనులు చేస్తాను" అని ఆమె అంటున్నారు. అయితే ఇది తోటివారికి భిన్నంగా ఉంటుందని మేగాన్ తెలిపారు.
''నాకు పరిమితులు ఉన్నాయి. నేను కొన్ని చేయగలను, మరికొన్ని చేయలేను'' ఆమె చెప్పారు. ఇది తన శక్తి స్థాయిలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
మేగాన్ తన భవిష్యత్తు గురించి సానుకూలంగా ఉన్నప్పటికీ, కాలేయ వ్యాధి ఉంటే ప్లాన్ చేసుకోవడం కష్టమని ఆమె అభిప్రాయపడ్డారు
"నాకు రేపు కామెర్లు రావొచ్చు. పూర్తిగా జాండీస్ చర్మం కావొచ్చు, ఇది నా కాలేయం దెబ్బతిందనే దానికి సంకేతం" అని మేగాన్ తెలిపారు.
"అది చివరికి కాలేయ మార్పిడికి దారి తీస్తుంది"అని ఆమె అన్నారు. ''ఇది వచ్చేవారమో, 5 ఏళ్లలోనో, పదేళ్లలోనో జరగొచ్చు, నాకైతే తెలియదు'' అని చెప్పారు మేగాన్.
ఆ సమయం వచ్చినప్పుడు మరొక వ్యక్తి నుంచి ఒక అవయవాన్ని స్వీకరించడం నమ్మశక్యం కానిది కాబట్టి మార్పిడిని చేసుకోవడానికి వెనుకాడనని మేగాన్ తెలిపారు .
"అవయవ దానం నిజంగా ప్రాణాలను కాపాడుతుంది, అయితే ఇది ఇంకా భయానక నిర్ణయం కావచ్చు ఎందుకంటే ఏం జరుగుతుందో కూడా తెలియదు.మీరు అనారోగ్యంతో ఉన్నారా? మీ శరీరం కొత్త అవయవాన్ని అంగీకరిస్తుందా లేదా ఆ ఆపరేషన్ తర్వాత కొత్త వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వస్తాయా? అనేది మీకు తెలియదు, ఎందుకంటే ఇది పెద్ద శస్త్రచికిత్స" అని ఆమె అన్నారు.
"ప్రస్తుతం నా కాలేయం పని చేస్తోంది. ఇది పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు, కానీ పని అయితే చేస్తోంది. నాకు నా కాలేయమే ఉంది, నేను పుట్టినపుడు నాకున్నదది, అది నాకు ఉత్తమమైనది" అని మేగాన్ ముగించారు.
ఇవి కూడా చదవండి:
- ఎన్టీఆర్ స్మారక నాణెం: పురంధేశ్వరి సొంత డబ్బుతో తయారు చేయించారా, ఇలా ఎవరైనా నాణేల ముద్రణకు ఆర్డర్ ఇవ్వొచ్చా?
- జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్: నేషనల్ అవార్డుల్లో పుష్ప, ఆర్ఆర్ఆర్ హవా
- మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్: ఫైనల్స్ గెలిచాక స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కర్మోనాకు ఆమె తండ్రి మరణించిన సంగతి చెప్పారు...
- దగ్గు మందు మరణాలు: ‘ఇండియా ఔషధం అంటే ముట్టుకోవాలన్నా భయమేస్తోంది’
- పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్కును ఎలా అంచనా వేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














