చేతులతో మానవ మలమూత్రాలను ఎత్తిపోసే వ్యవస్థను రేపట్లోగా నిర్మూలించడం సాధ్యమేనా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, రాక్సీ గాడ్గేకర్ చారా
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్‌లోని దాహోద్ గ్రామంలోని ఓ గుడిసెలో 21 ఏళ్ల అంజనా తన 15 రోజుల మగబిడ్డను ఊయలలో వేసింది. ఆమె తీవ్ర దు:ఖంలో ఉంది. ఆమె కళ్లు నీటితో నిండిపోయాయి.
అంజనా పక్కనే కూర్చున్న ఆమె వదిన ఓదార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె తల్లి, పెద్ద కొడుకు ప్రిన్స్‌ని చూసుకుంటోంది. ఆ చిన్నపిల్లాడికి ఇటీవల చనిపోయిన 23 ఏళ్ల తన తండ్రి ఉమేశ్ బమానియా పేరే పెట్టారు.
ఉత్తర గుజరాత్‌లోని తరాద్ పట్టణంలో జరిగిన మ్యాన్‌హోల్ ప్రమాదంలో ఉమేశ్ జీవితం విషాదంగా ముగిసిపోయింది. చిన్న కొడుకు పుట్టడానికి సరిగ్గా పది రోజుల ముందు ఈ ఘటన జరిగింది. వ్యర్థాలతో కప్పివేసి ఉన్న ఆయన మృతదేహాన్ని అగ్నిమాపక శాఖ సిబ్బంది మురుగు కాల్వ నుంచి బయటకు తీశారు. ఆ ఉద్యోగం వల్ల అతనికి వచ్చేది కేవలం 2 వేల రూపాయలు.
''నా పిల్లలను ఎలా పెంచాలి? వాళ్లకు ఎలా చదువులు చెప్పించాలి? ఇప్పుడు నా పిల్లల గతేంటి?'' అని అంజనా దీనంగా అడుగుతున్నారు. ఇప్పుడు ఆమె ఒక్కరే వారి ఆలనాపాలనా చూసుకోవాలి.
మ్యాన్‌హోల్స్‌లో దారుణ స్థితిలో ప్రాణాలు కోల్పోతున్న ఎందరో మురుగు కాల్వల కార్మికుల పరిస్థితికి ఉమేశ్ కథ నిదర్శనంగా నిలుస్తోంది.
2018 నుంచి 339 మంది మురుగు కాల్వల కార్మికులు చనిపోయారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్(ఎన్‌సీఎస్‌కే) లెక్కల ప్రకారం, 1993 నుంచి 2020 వరకు 928 మంది కార్మికులు చనిపోయారు. అత్యధికంగా తమిళనాడులో 201 మంది, గుజరాత్‌లో 161 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇలాంటి చాలా ఘటనలు నమోదు కావడం లేదని, అందువల్ల వాస్తవంగా ఏటా చనిపోతున్న కార్మికుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని పలువురు సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, AFP
చనిపోతున్న కార్మికుల వయసు ఎంత?
''సాధారణంగా ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు బాధ్యత వహించేందుకు అధికారులు సాధారణంగా ముందుకురారు. మరణించిన కార్మికులు తమ వద్ద ఉద్యోగం చేయడం లేదని పేర్కొంటూ తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. దాని ఫలితంగా, అలాంటి మరణాలను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పరిగణనలోకి తీసుకోదు. అందువల్ల అవి రికార్డుల్లో నమోదు కావు. వారికుటుంబాలకు నష్టపరిహారం కూడా అందదు'' అని ఎన్‌సీఎస్‌కే తన నివేదికలో పేర్కొంది.
ఇలాంటి ప్రమాదాల నుంచి బతికి బయటపడినా జీవితంపై పెద్దగా ఆశలు ఉండవు.
ప్రభుత్వేతర సంస్థ అయిన సఫాయి కర్మచారి ఆందోళన్(పారిశుధ్య కార్మికుల ఉద్యమం) 2017-2018 లెక్కల ప్రకారం, ఇలాంటి ఘటనల్లో చనిపోతున్న మురుగు కార్మికుల సగటు వయసు 32 సంవత్సరాలు.
ప్రభుత్వానికి నిజం తెలియడం లేదా?
2023 ఆగస్టు చివరి నాటికి మాన్యువల్ స్కావెంజింగ్ (చేతులతో మానవ మలమూత్రాలను ఎత్తిపోయడం) ఉండకూడదని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికే దేశంలోని 766 జిల్లాల్లో 639 జిల్లాలు మాన్యువల్ స్కావెంజింగ్ రహిత జిల్లాలుగా ప్రకటించుకున్నాయని, మిగిలిన జిల్లాలు కూడా అదే దిశగా పయనిస్తున్నాయని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఇటీవల పార్లమెంటుకు తెలిపింది.
అయితే, ప్రభుత్వ ప్రకటనతో సఫాయి కర్మచారి ఆందోళన్ వ్యవస్థాపక సభ్యులు బెజవాడ విల్సన్ ఏకీభవించడం లేదు. అసలు ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తనకు అనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
''మాన్యువల్ స్కావెంజింగ్ చేయిస్తున్నారా అని పోలీసులతో అడిగిస్తే, అలాంటి సందర్భంలో ఎవరు నిజం చెబుతారు. ప్రజలు భయపడి నిజం చెప్పడం లేదు. అందుకే ప్రభుత్వానికి నిజం తెలియడం లేదు. దేశంలోని ప్రతి జిల్లాలోనూ దాదాపు ఇదే తంతు నడుస్తుండడం దురదృష్టకరం'' అని బెజవాడ విల్సన్ అన్నారు. ఆయన నీతిఆయోగ్ సభ్యుడిగా కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES/SUDHARAK OLWE
పాలక బీజేపీ వాదన ఏమిటి?
గణాంకాలతో పోలిస్తే దేశంలో మాన్యువల్ స్కావెంజర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాలున్నాయి. ప్రభుత్వం వారి సంఖ్యను దాదాపు 58 వేలుగా అంచనా వేస్తోంది.
అయితే, ఈ పని రూపుమాపేందుకు ప్రభుత్వం నిజాయతీగా ప్రయత్నిస్తోందని బీజేపీ ఎస్సీ విభాగం జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య చెబుతున్నారు.
''ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా బడ్జెట్‌ను కూడా కేటాయించింది. ఉద్యోగాలు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కోసం కూడా కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. కొత్త యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు బడ్జెట్‌ను కేటాయించింది. చేతులతో మురుగును శుభ్రం చేసే విధానాన్ని పూర్తిగా నిర్మూలించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభ్యర్థించారు. కానీ, ఎక్కడైనా అది ఇంకా కొనసాగుతున్నట్టయితే కఠిన చర్యలు తప్పవు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, @BEZWADAWILSON
ఈ వృత్తిపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితేంటి?
ఈ వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు పునరావాసం కల్పించడం మరో ముఖ్యమైన అంశం. అయితే, ఈ పని కారణంగా తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన అన్ని కుటుంబాలకు పరిహారం కూడా అందలేదు.
2008లో అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ మురుగు ట్యాంక్‌లో విషవాయువుల కారణంగా రత్నాబెన్ భర్త శంభుభాయ్ ప్రాణాలు కోల్పోయారు. మాన్యువల్ స్కావెంజర్స్ పునరావాస చట్టం 2013 ప్రకారం ఆమెకు అందాల్సిన రూ.10 లక్షల పరిహారం ఇంకా అందలేదు.
''పరిహారం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసి నేను ముసలిదాన్ని అయిపోయాను. నా భర్త చనిపోయినప్పుడు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. నాకు ఉద్యోగం, పరిహారం, ఉండేందుకు ఇల్లు, పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. కానీ, ఏవీ జరగలేదు. పాత బట్టలు సేకరించి, అమ్ముకుని నా బిడ్డలను పెంచాను'' అని రత్నాబెన్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
నిధులు కేటాయించకపోవడమే మాన్యువల్ స్కావెంజర్ల పునరావాసంలో అతిపెద్ద సమస్య అని విల్సన్ ఆరోపించారు.
2017-2018 నుంచి 2022-2023 వరకూ కేంద్రం కేటాయించిన రూ.275.1 కోట్లలో ఇప్పటివరకు 242.26 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో యంత్రాల కోసం నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్(నమస్తే) పథకం కింద రూ.97.41 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అందులో భాగంగా కార్మికులకు పీపీఈ కిట్‌లు, ఆరోగ్య బీమా కూడా కల్పించనున్నట్లు పేర్కొంది.
ఈ పథకం కింద సెప్టిక్ ట్యాంక్‌లు, మురుగు కాల్వలను వంద శాతం యంత్రాలతోనే శుభ్రం చేసే ప్రక్రియ 'మెకానికల్ డీస్లడ్జింగ్' ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
అయితే, క్షేత్రస్థాయిలో అలాంటి మార్పులేవీ కనిపించడం లేదని గుజరాత్‌కి చెందిన మానవ్ గరీమా(మనిషి గౌరవం) సంస్థ కన్వీనర్ పురుషోత్తమ్ వఘేలా అభిప్రాయపడ్డారు.
''ఇప్పటికీ చాలా మున్సిపాలిటీలు, పంచాయితీలు మురుగు శుభ్రం చేసేందుకు మాన్యువల్ స్కావెంజర్లను ఉపయోగించుకుంటున్నాయి'' అని ఆయన చెప్పారు.
2021లో పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం, మురుగు కార్మికులుగా పనిచేస్తున్న వారిలో 90 శాతం మంది ‘దిగువ కులాలు’గా చెబుతున్న సమూహాలకు చెందిన వారే. మిగిలిన వారిలో ఆర్థికంగా బాగా వెనకబడిన వర్గాల్లో ఒకరైన గిరిజనులు ఉన్నారు. ఒకవేళ వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపించినా, వారి సామాజిక పునరావాసం అంత తేలిక కాదు.
ఇవి కూడా చదవండి:
- వసీలీ అర్ఖిపోవ్: అణుయుద్ధం జరగకుండా ప్రపంచాన్ని రక్షించిన రష్యన్ కమాండర్
- మోదీ, షీ జిన్‌పింగ్ భేటీలో ఏం జరిగింది... ఇక భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గుతాయా?
- పెళ్లి చేసుకుని, కొడుకును కని ఇద్దరినీ ఢాకాలో వదిలేశారంటూ ఇండియాలో ‘భర్త’పై కేసు వేసిన బంగ్లాదేశీ మహిళ
- Only Fans: పోర్న్ వీడియోలతో వేల కోట్ల లాభాలు గడించిన లియోనిడ్ రాడ్విన్స్కీ ఎవరు?
- గొడ్డు మాంసం వివాదం: నేపాలీ నగరంలో ఎందుకింత ఉద్రిక్తత ఏర్పడింది?














