‘‘అందం అంటే తెల్లగా కనిపించడం’ అనే భావనను తొలగించడం కోసం నేను ఇంకా కష్టపడుతున్నా’
శరీరం రంగు కారణంగా చిన్నతనం నుంచే సాన్ రాచెల్ అనేక అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నారు. పుదుచ్చేరికి చెందిన సాన్ వయసు 23 ఏళ్లు. రంగు కారణంగా చేదు అనుభవాలను ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు తన శరీరం రంగును గర్వంగా భావిస్తున్నారు. ఈరోజు ఆమె ఒక ప్రముఖ ఫ్యాషన్ మోడల్. నలుపు రంగును పాత ప్రమాణాలతో కాకుండా సాధారణ వర్ణంగా పరిగణించేంత వరకు తాను ఈ విషయంలో ఉన్న మూస ధోరణులకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటానని ఆమె అన్నారు.
'నల్లగా ఉండడం వల్ల, నీ ప్రతిభను చాటుకోవడానికి మోడలింగే కావాలా?' అని అందరూ నన్ను అడుగుతారు
కానీ, ఒక డాక్టర్‌ను మీరెందుకు నల్లగా ఉన్నారని ఎవరూ అడగరు. ఒకవేళ టీచర్ నల్లగా ఉంటే, వారిని చదువు చెప్పొద్దంటూ ఎవరూ ఆపరు.
కేవలం అందాల పోటీల్లో, అందానికి సంబంధించిన ఉత్పత్తుల విషయంలో మాత్రమే నలుపు రంగును తక్కువగా చూస్తారు.
నల్లగా ఉన్నవారు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పుడు అందం, ఫ్యాషన్ రంగంలో ఎందుకు రాణించలేం? అని నేను అనుకున్నా.

ఫొటో సోర్స్, instagram/san_rechal_official
నా పేరు సాన్ రాచెల్. నేనొక ఫ్యాషన్ మోడల్‌ను.
ఐదేళ్లుగా మోడలింగ్ చేస్తున్నా.
మొదట్లో నాకు కాస్త అభద్రతాభావం ఉండేది. కానీ, కాలం గడిచిన కొద్దీ అదే నాకు గర్వంగా మారింది. నేను ఈ రంగాన్ని ఏలాలి అనుకున్నా.
ఇప్పటివరకు 70కి పైగా ర్యాంప్ వాక్స్ చేశాను.
కొరియోగ్రఫీ కూడా చేస్తాను.
ఇప్పుడు 'మిస్ ఇండియా' పోటీల కోసం శిక్షణ పొందుతున్నా.
నేను మోడలింగ్‌లో చేరినప్పుడు ఎవరూ నాకు మద్దతుగా నిలవలేదు.

ఫొటో సోర్స్, facebook/rechal.rechal.71619
మనం ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నామనేది పెద్ద విషయం కాదు. సున్నా నుంచి కూడా మనం మొదలు పెట్టొచ్చు.
కానీ, అడ్డంకుల్ని అధిగమిస్తూ ఉంటే మనల్ని తక్కువగా చూసినవారు, మన గురించి చెడుగా మాట్లాడినవారే కచ్చితంగా ఏదో సమయంలో మనల్ని అర్థం చేసుకుంటారు.
ప్రతిభకు, అందానికి చర్మం రంగుతో ఎలాంటి సంబంధం ఉండదు.
కానీ, చిన్నతనం నుంచే మన సమాజం చర్మం రంగును అందానికి ప్రమాణంగా పరిగణిస్తుంది.
నా విషయంలో కూడా ఇదే జరిగింది. స్కూల్లో చాలా మంది ఏడిపించేవారు. మా కుటుంబంలో వారే, మా బంధువులే నన్ను ఎగతాళి చేసేవారు.
నేను వారిని నిందించడం లేదు. ఇందులో వారి తప్పేమీ లేదు.
ఎందుకంటే మనమంతా ఈ సమాజంలో భాగంగానే పెరిగాం.

సమాజమే కాకుండా సినిమాలు, సోషల్ మీడియాలో కూడా ఇలాగే ఉంటుంది.
సినిమాలో హీరోయిన్లు ఎప్పుడూ అందంగా, ఫెయిర్‌గా ఉంటారు. ఎందుకు? నల్లగా ఉండే హీరోయిన్లు ఉండరా? ఒకవేళ నల్లగా ఉంటే, ఆమె అందంగా ఉన్నట్లు కాదా?
అందానికి సంబంధించి సమాజంలో, సినిమాల్లో పెనవేసుకుపోయిన ఇలాంటి మూస పద్ధతులు, మానసికంగా మనందరిపై చాలా ప్రభావాన్ని చూపుతాయి.
చాలా మంది ఈ విషయం గురించి బహిరంగంగా చెప్పరు.
నాలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. నలుపు రంగులో నా కంటే అందంగా ఉండే మోడళ్లు చాలా మంది ఉంటారు.
వాళ్లని నేను 'డార్క్ మోడల్స్' అని పిలవాలనుకోను. వారంతా మెలనిన్ రిచ్ స్కిన్ టోన్ ఉన్న వారు.
కానీ, వారికి గుర్తింపు లభించకపోవడానికి కారణం ఈ సమాజం.
నాకు ఉన్నటువంటి తల్లిదండ్రులు వారికి ఉండకపోవడం, నేను పెరిగినటువంటి వాతావరణంలో వారు పెరగకపోవడం కూడా కారణం కావొచ్చు.
ఈ విషయాలన్నీ చిన్నప్పటి నుంచి నాపై ప్రభావం చూపాయి.
'అందం అంటే తెల్లగా కనిపించడం' అనే భావనను తొలగించడం కోసం నేను ఇంకా కష్టపడుతున్నా.
ఏదో ఒకరోజు ఈ విషయంలో విజయం సాధిస్తా.
ఆరోజు ప్రతీఒక్కరూ నలుపు అంటే అదీ ఒక రంగేనని, అందానికి కొలమానం కాదని తెలుసుకుంటారు.
అప్పటివరకు నేను దీని గురించి మాట్లాడుతూనే ఉంటా.
ఇవి కూడా చదవండి:
- హిందీ మీడియంలో ఎంబీబీఎస్ కోర్సు... దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
- 530 కోట్ల మొబైల్ ఫోన్లు పారేయాల్సిందే, ఈ ఏడాదే..
- షీ జిన్‌పింగ్: చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీని ఎలా నియంత్రిస్తున్నారు? ‘ప్రశ్నించడానికి వీలులేని అధికారాన్ని’ ఎలా సొంతం చేసుకున్నారు?
- క్యాసినో అంటే ఏంటి, అందులో ఏం చేస్తారు... చట్టాలు ఏం చెబుతున్నాయి?
- అందం కోసం వాడే క్రీములతో అనర్థాలెన్నో
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

