గీతిక శ్రీవాస్తవ: పాకిస్తాన్‌లో భారత హైకమిషన్ బాధ్యతలు తొలిసారి మహిళ చేతికి.. ఆమె నేపథ్యం ఏమిటి?

గీతిక శ్రీవాస్తవ

ఫొటో సోర్స్, @GITIKASRIVASTAV

స్వాతంత్ర్యం తరువాత తొలిసారి పాకిస్తాన్‌లోని తన హైకమిషన్ కార్యాలయాన్ని భారత్ ఒక మహిళ చేతికి అప్పగించింది.

2005 బ్యాచ్ ఇండియన్ ఫారన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి అయిన గీతిక శ్రీవాస్తవను ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో చార్జ్ డీఅఫైర్స్(సీడీఏ) హోదాలో నియమించారు.

ఇప్పటివరకు అక్కడ ఆ హోదాలో పనిచేస్తున్న ఎం.సురేశ్ కుమార్ స్థానంలో గీతికను నియమించారు.

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్‌ల మధ్య దౌత్య సంబంధాలు పరిమితంగానే ఉండడంతో పాకిస్తాన్‌లో భారత హైకమిషన్‌లో కానీ, భారత్‌లో పాకిస్తాన్ హైకమిషన్‌లో కానీ హైకమిషనర్లు లేరు.

హైకమిషనర్ బాధ్యతలను సీడీఏలే చూస్తున్నారు. సీడీఏలు జాయింట్ సెక్రటరీ ర్యాంక్ అధికారులు.

ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్ బాధ్యతలను ఓ మహిళ చేతికి అప్పగించడం ఆసక్తికరంగా మారింది.

గీతిక శ్రీవాస్తవ ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

గీతిక తన శిక్షణ కాలంలో విదేశీ భాషను నేర్చుకునే క్రమంలో చైనాకు చెందిన మాండరిన్ భాషను నేర్చుకున్నారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వార్తాపత్రిక తన కథనంలో పేర్కొంది.

2007 నుంచి 2009 మధ్య కాలంలో గీతిక బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో జూనియర్ డిప్లొమాట్ హోదాలో పనిచేశారు.

అనంతరం కోల్‌కతాలోని రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసులోనూ ఆమె పనిచేశారు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ‘ఇండియన్ ఓషన్ రీజనల్ డివిజన్’కు ఆమె డైరెక్టర్‌గా పనిచేశారు.

Geetika Srivastava

ఫొటో సోర్స్, @GITIKASRIVASTAV

1947 నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్‌లో భారత హైకమిషన్ ఎప్పుడూ పురుషుల చేతిలోనే ఉంది. పాకిస్తాన్‌లో ఇండియా మిషన్‌కు ఇంతవరకు 22 మంది హెడ్‌లు వ్యవహరించగా వారంతా కూడా పురుషులే.

పాకిస్తాన్‌లో భారత్‌కు చివరి(ప్రస్తుతానికి) హైకమిషనర్‌గా పనిచేసిన అజయ్ బిసారియా 2019 వరకు ఆ పదవిలో ఉన్నారు. 2019లో భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత పాకిస్తాన్ ఆయన్ను తమ దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా కోరింది. దాంతో ఆయన తిరిగి భారత్‌కు వచ్చేశారు.

అయితే, గతంలోనూ కొందరు మహిళా దౌత్యవేత్తలను పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్‌లో నియమించినప్పటికీ వారిలో ఎవరికీ మొత్తం బాధ్యతలు అప్పగించలేదు. ఇలా మహిళకు కమాండ్ అప్పగించడం ఇదే తొలిసారి.

గీతిక త్వరలోనే ఇస్లామాబాద్‌ వెళ్లి బాధ్యతలను స్వీకరించనున్నారు.

మరోవైపు పాకిస్తాన్ కూడా భారత్‌లోని తన హైకమిషన్‌లో సీడీఏను నియమించింది. సాద్ అహ్మద్ వారిచ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. న్యూయార్క్‌లో యునైటెడ్ నేషన్స్ మిషన్‌లో ఆయన గతంలో పనిచేశారు.

సాద్‌కు ముందు దిల్లీలోని పాక్ హైకమిషనర్ కార్యాలయంలో సీడీఏగా పనిచేసిన సల్మాన్ షరీఫ్ గత నెలలో పాక్‌ వెళ్లిపోయారు.

భారత్‌లో పాకిస్తాన్ హైకమిషన్

ఫొటో సోర్స్, Getty Images

సీడీఏ పాత్ర ఏమిటి?

దౌత్య వ్యవహారాలకు సంబంధించిన వియెన్నా ఒప్పందం ప్రకారం సీడీఏ రెండు దేశాల మధ్య దిగువ స్థాయిలో సంబంధాలు నెరిపే అధికారి.

రాయబారి గైర్హాజరీలో ఆ దేశంలో బాధ్యతలను సీడీఏ చూసుకుంటారు. ప్రస్తుతానికి భారత్‌లో పాకిస్తాన్ హైకమిషనర్, పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్ లేనందున రెండు దేశాలలోనూ సీడీఏలే హైకమిషన్ బాధ్యతలు చూస్తున్నారు.

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు సీడీఏలను నియమిస్తారు.

భారత్, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణమే ఉంది. దీనికి కారణం కశ్మీర్ అంశం.

అయితే, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఈ నాటివి కావు. వీటికి సుదీర్ఘ చరిత్ర ఉంది.

2016లో రెండు దేశాలూ పరస్పరం తమ దౌత్యవేత్తలను ‘పెర్సోనా నాన్ గ్రాటా’గా ప్రకటించాయి. వారు తమ దేశంలో అవసరం లేదు అన్న అర్థంలో ఈ ప్రకటన చేస్తారు.

అనంతరం 2018లో రెండు దేశాలూ తమ దేశాల దౌత్యవేత్తను అవతలి దేశం వేధిస్తోందనే ఆరోపణలు చేసుకున్నాయి.

రెండు దేశాల మధ్య తొలి నుంచి శత్రుత్వం ఉన్నప్పటికీ కొన్నిసార్లు సంబంధాలు పెంచుకునే ప్రయత్నాలూ రెండు దేశాల వైపు నుంచీ జరిగాయి.

భారత్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగి అదే స్థితి కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి: