గిరిజన యూనివర్సిటీ‌: ఏపీ ప్రభుత్వం రెండుసార్లు ఎందుకు శంకుస్థాపన చేసింది? అసలేం జరుగుతోంది?

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, ysrcp/facebook

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం, రాష్ట్రానికి కేటాయించిన గిరిజన యూనివర్సిటీకి విజయనగరం జిల్లాలోని మెంటాడలో 2023 ఆగస్టు 25న ఏపీ ప్రభుత్వం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించింది.

అయితే, ఇదే యూనివర్సిటీ కోసం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో.. విజయనగరం జిల్లా రెల్లి రెవెన్యూ పరిధిలోని అప్పన్నదొరపాలెంలో స్థలాన్ని సేకరించింది. ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి 2017 డిసెంబరులో అప్పటి రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు శంకుస్థాపన కూడా చేశారు.

తాజా శంకుస్థాపన కార్యక్రమంతో, 2017లోనే 527 ఎకరాల స్థలం కేటాయింపు జరిగి, ప్రహారీ గోడ నిర్మాణం కూడా జరిగిన చోట కాదని, వైసీపీ ప్రభుత్వం మరో చోట ఎందుకు శంకుస్థాపన చేసిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మరోవైపు, రాబోయే రోజుల్లో గిరిజన యూనివర్సిటీని మరో చోటుకు మారుస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

అసలు గిరిజన యూనివర్సిటీ పూర్తి స్థాయిలో ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది? గిరిజన యూనివర్సిటీ చుట్టూ ఎందుకు వివాదం అలుముకుంటోంది?

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, ysrcp/facebook

అసలేం జరిగింది?

సాలూరు నియోజకవర్గం దత్తి రాజేరు, మెంటాడ మండలాల్లోని 561.88 ఎకరాల్లో రూ.834 కోట్లతో గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అందులో భాగంగా, మెంటాడ మండలం చిన మేడపల్లి‌లో ఆగస్టు 25న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్సిటీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

విజయనగరం జిల్లాలోని సాలూరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. రాష్ట్ర డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పీడిక రాజన్నదొర ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇటీవల జిల్లాల పునర్విభజన సందర్భంగా రాష్ట్రంలో రెండు గిరిజన జిల్లాలుగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్రం మంజూరు చేసిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఈ రెండు జిల్లాల పరిధిలోనే ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి.

కానీ, గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన జరిగిన ప్రాంతం మైదాన ప్రాంతమైన విజయనగరం జిల్లా పరిధిలోకి వస్తోంది.

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, shiva

2017లో పరిస్థితేంటి...

విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసింది. తొలుత ఈ యూనివర్సిటీని కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ పరిధిలోని అప్పన్నదొరపాలెంలో ఏర్పా టు చేయాలనుకున్నారు.

అందుకోసం సర్వేనంబర్ 1/8 లో 526.24 ఎకరాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. యూనివర్సిటీ పనుల్లో భాగంగా స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి కేంద్రం రూ.5 కోట్లు కేటాయించింది. అప్పటి రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగరావు ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఆ పనులు పూర్తయ్యాయి.

అప్పన్నదొర పాలెంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఆ ప్రాంతంలో అవసరమైన 200 ఎకరాల భూములు ఇచ్చిన 178 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి భూమికి భూమి అప్పగించేందుకు సమీపంలోనే భూసేకరణ కూడా చేశారు.

''మా ప్రభుత్వం ఏడేళ్ల కిందటే విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని రెల్లి రెవెన్యూ పరిధి అప్పన్నదొర పాలెంలో 527 ఎకరాల్లో గిరిజన యూనివర్సిటీ పనులను ప్రారంభించింది. అందుకోసం రూ. 5 కోట్ల వ్యయంతో ముందుగా ఆ స్థలం చుట్టు ప్రహరీ నిర్మించింది'' అని టీడీపీ నాయకులు వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ తెలిపారు.

ఆ తర్వాత పూర్తి స్థాయి పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో పనులు ప్రారంభించలేకపోయామని ఆయన చెప్పారు.

గిరిజన యూనివర్సిటీని ప్రారంభించిన ఖ్యాతి టీడీపీకి దక్కుతుందనే, కుట్ర చేసి గిరిజన యూనివర్సిటీని వైసీపీ ప్రభుత్వం మరో ప్రాంతానికి తరలించిందని ఆయన ఆరోపించారు.

అయితే, భూములిచ్చిన రైతుల కోసం సేకరించిన భూమి పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో చదునుచేసి ఇస్తామని అప్పటి గనులశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు అప్పట్లో హామీ ఇచ్చారు. రైతులకు న్యాయం చేయకుండానే ప్రహరి గోడ నిర్మించడంపై కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి.

“ప్రహరీ నిర్మాణ పనుల కాంట్రాక్టును అప్పటి మంత్రుల బినామీలకే కట్టబెట్టారు. అందుకే ఆగమేఘాలపై గోడ నిర్మించారు కానీ, రైతులకు న్యాయం చేయలేదు. పైగా ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ నిర్మాణం కూడా జరగడం లేదు. రైతులు ఇచ్చిన భూములు ఏపీఐఐసీకి అప్పగించారు. ఇదెక్కడి న్యాయం.” అని ఏపీ గిరిజన జేఏసీ ఉపాధ్యక్షులు తుమ్మి అప్పలరాజు దొర బీబీసీతో అన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, ysrcp/facebook

వైసీపీ వర్సెస్ టీడీపీ

గత టీడీపీ ప్రభుత్వం సేకరించిన స్థలంలో కాకుండా గిరిజన యూనివర్సిటీని వైసీపీ మరో చోటుకు తరలించడంపై టీడీపీ నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే గిరిజన యూనివర్సిటీని మరోచోటుకు మారుస్తామని అంటున్నారు.

“గిరిజనుల కోసం నిర్మించే యూనివర్సిటీ గిరిజన ప్రాంతంలో ఉండాలి. కానీ, టీడీపీ ప్రభుత్వం గిరిజనులతో సంబంధం లేని రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగుతున్న రెల్లి రెవెన్యూ పరిధిలో దీనిని నిర్మించాలని భావించారు.

ఎందుకంటే, ఈ ప్రాంతంలోనే టీడీపీ నాయకులు, మంత్రులు, వాళ్ల బినామీలు భారీ ఎత్తున రియల్ ఎస్టేల్ వ్యాపారం చేస్తున్నారు. వారి భూముల విలువ పెంచుకోవడం కోసం గిరిజన యూనివర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. వైసీపీ ప్రభుత్వం రావడంతో వారి ఆటలు సాగలేదు” అని డిప్యూటీ సీఎం రాజన్న దొర బీబీసీతో అన్నారు.

''విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలోని గిరిజన ప్రాంతాలతో పాటు గిరిజనులు అధికంగా ఉండే ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీని నిర్మిస్తున్నాం.

కొందరు టీడీపీ నాయకులు వారు అధికారంలోకి వస్తే గిరిజన వర్సిటీని వేరే ప్రాంతానికి మారుస్తామని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్లకి ఆ అవకాశం లేకుండా మేమే అధికారంలోకి వస్తాం. రానున్న మూడేళ్లలో మా హయాంలోనే దీనిని పూర్తి చేస్తాం” అని రాజన్నదొర చెప్పారు.

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, shiva

గిరిజన యూనివర్సిటీ కోసం ప్రభుత్వ భూమి గుర్తింపు, కొంత భూ సేకరణ చేయడం వల్లే అలస్యమైందని టీడీపీ నాయకులు అంటున్నారు.

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమి ఉన్నట్లు అప్పుడు గుర్తించారు. ఈ భూమి విశాఖపట్నానికి సమీపంలో ఉండటంతో ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌ వంటి రవాణా సదుపాయాలకు అనుగుణంగా ఉందని ఇదే స్థలాన్ని అధికారులు ప్రతిపాదించారు.

ఆ తర్వాత కొందరు రైతుల నుంచి భూ సేకరణ, వారికి మరోచోట భూములు ఇచ్చే ప్రక్రియ వంటివి కొంత జరిగాయి.

“భవన నిర్మాణాలకు నిధులు సమకూరే సమయానికి ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారడంతో టీడీపీ ప్రభుత్వం సేకరించి ఇచ్చిన స్థలంలో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయాన్ని నిర్మిస్తే తెలుగుదేశం పార్టీకే పేరొస్తుందన్న భావనతో గిరిజన యూనివర్సిటీని ఏవేవో కారణాలు చెప్పి మరో చోటుకి వైసీపీ మార్చేసింది” అని టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, ysrcp/facebook

మైదాన ప్రాంతంలో గిరిజన వర్సిటీ?

రెల్లి రెవెన్యూ పరిధి మైదాన ప్రాంతమని చెప్పి, గిరిజన యూనివర్సిటీ గిరిజన ప్రాంతంలోనే ఉండాలంటూ విజయనగరం జిల్లాలోని మెంటాడలో గిరిజన యూనివర్సిటీని నిర్మిస్తున్నారు. ఇది కూడా మైదాన ప్రాంతమేనని గిరిజన సంఘం నాయకులు అప్పలరాజు దొర బీబీసీతో అన్నారు.

“జిల్లాల విభజనతో పార్వతీపురం మన్యం జిల్లాలో లేదా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో గిరిజన యూనివర్సిటీని పెట్టాలని డిమాండ్ చేశాం.

కానీ, ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ పెడుతున్న మెంటాడ మండలం విజయనగరం జిల్లాలో ఉంది. ఇది మైదాన ప్రాంతం. మరి గిరిజన యూనివర్సిటీ గిరిజన ప్రాంతంలోనే ఉండాలని వైసీపీ నాయకులు చెప్పిన మాటలకు అర్థమేంటి?” అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

గిరిజన ప్రాంతంలో నిర్మిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం మైదాన ప్రాంతంలోనే యూనివర్సిటీని నిర్మిస్తోందని, అందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యూనివర్సిటీని గిరిజన ప్రాంతంలోకి మారుస్తామని టీడీపీ నాయకులు వీరేష్ చంద్రదేవ్ అంటున్నారు.

''మెంటాడ మండలం గిరిజన ప్రాంతానికి సమీపంలోనే ఉంది. పైగా ఇది సాలూరు నియోజకవర్గంలో ఉంది. సాలూరు ఎస్టీ నియోజకవర్గం. జిల్లాల విభజనలో మెంటాడ విజయనగరం జిల్లాలోకి వచ్చిందది'' అని డిప్యూటీ సీఎం రాజన్నదొర బీబీసీతో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, shiva

ఏయూ భవనంలో తరగతులు

రాష్ట్ర విభజన తర్వాత 9 ఏళ్లకు గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన జరిగింది. కానీ, 2019 నుంచే విజయనగరంలోని ఏయూ అనుబంధ పీజీ కళాశాలలో గిరిజన యూనివర్సిటీ తరగతులు నిర్వహిస్తున్నారు. గత మూడేళ్లుగా అడ్మిషన్లు జరుగుతున్నాయి.

గిరిజన విధ్యార్థుల జీవితాలను మెరుగుపర్చే ఈ గిరిజన యూనివర్సిటీ నిర్మాణాన్ని రానున్న మూడేళ్లలో పూర్తి చేస్తామని శంకుస్థాపన సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సభలో సీఎం జగన్ అన్నారు. కేంద్రం సహకారంతో గిరిజన యూనివర్సిటీ పనులు చకచకా పూర్తి చేస్తామని గిరిజన శాఖ మంత్రి రాజన్నదొర కూడా బీబీసీతో అన్నారు.

సొంత భవనాలు లేకపోవడంతో గిరిజన యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు శంకుస్థాపన జరుపుకున్న గిరిజన యూనివర్సిటీ ఎప్పటికి పూర్తవుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందని గిరిజన సంఘం నాయకులు అంటున్నారు.

“ఈ పరిస్థితుల్లో వైసీపీ, టీడీపీ లేదా మరో రాజకీయపార్టీ ఒకరిపై ఒకరు పంతాలతో గిరిజన యూనివర్సిటీని పూర్తి కానివ్వకపోతే అది గిరిజనులకు తీరని అన్యాయం చేసినట్టు అవుతుంది.

గిరిజన యూనివర్సిటీని పార్టీలకు అతీతంగా పూర్తి చేయాలని, కేంద్రం కూడా వాటి నిర్మాణాలకు అనుగుణంగా నిధులను జాప్యం చేయకుండా కేటాయించాలి” అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అయిదో షెడ్యూల్ సాధన సమితి గౌరవ అధ్యక్షులు కె. గోవిందరావు బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి: