సెప్టెంబర్ 17: అటు అమిత్ షా, ఇటు సోనియా గాంధీ, హైదరాబాద్‌లో ఏం జరగబోతోంది?

ఫొటో సోర్స్, FACEBOOK
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీనికి మరో రెండు నెలలే సమయం ఉండటంతో ఇక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సెప్టెంబరు 17 లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు బల ప్రదర్శనకు సిద్ధమయ్యాయి.
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం.. ఇలా అన్ని ప్రధాన పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు, జాతీయ జెండాల ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రకటించాయి.
అదే రోజు బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నాయకులు తెలంగాణకు రానున్నారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా జరిగే తెలంగాణ ‘విమోచన’ ఉత్సవాలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారు.
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘విజయభేరి’ సభకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా కీలక నేతలు హాజరవుతున్నారు.
జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో ఎంఐఎం, బీఆర్ఎస్ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించుకున్నాయి.
సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడారు.
‘‘తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే సెప్టెంబర్ 17కు ప్రాధాన్యం పెరిగింది. కొందరు విమోచనం అంటారు.. మరికొందరు విలీనం అంటారు.. ఇంకొందరు విద్రోహం అంటారు.
ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారికంగా నిర్వహిస్తామని చెప్పింది. తర్వాత దాటవేస్తూ వచ్చింది. అన్ని పార్టీలు తమకు తాము చేసుకుంటూ వచ్చాయే కానీ అధికారికంగా చేయలేదు.
హైదరాబాద్ భూభాగం దేశంలో కలిసిన ప్రక్రియలో ముస్లింలకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దానివల్ల సెక్యులర్ పార్టీలు దాన్ని దాటవేస్తూ వచ్చాయి.
గత కొన్నేళ్లుగా తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంతో అధికారికంగా విమోచన దినాన్ని నిర్వహిస్తోంది.
ఇదే సమయంలో విలీనం, విమోచనం అని కాకుండా సమైక్యతా దినోత్సవం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి నిర్ణయించింది’’ అని చెప్పారు.
ప్రస్తుతం ఎన్నికల ఏడాదిలో సెప్టెంబర్ 17వ తేదీ కీలకాంశమైందని కె.శ్రీనివాస్ అన్నారు.
ఇంతకీ అన్ని పార్టీలు సెప్టెంబర్ 17ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాయి?

ఫొటో సోర్స్, FACEBOOK
విమోచనమా.. సమైక్యమా..?
సెప్టెంబర్ 17కు స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. 1948లో ఇదే రోజున హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది.
‘ఆపరేషన్ పోలో’లో భాగంగా సైనిక చర్యతో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ను గద్దె దించి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్‌లో విలీనం చేస్తున్నట్లు అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్ విలీనమైన రోజు సందర్భంగా నాలుగేళ్లుగా బీజేపీ తెలంగాణ విభాగం విమోచన దినం పేరిట ప్రత్యేక కార్యక్రమాలు చేస్తోంది.
గతేడాది కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా జరిగిన ఉత్సవాల్లో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు.
ఈ ఏడాదీ ఆ సంప్రదాయాన్ని బీజేపీ కొనసాగిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తున్నారు.
ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘‘విమోచన దినోత్సవం విషయంలో బీజేపీ రాజీ పడేది లేదు. పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కుట్ర చేస్తున్నాయి.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫునే అధికారికంగా నిర్వహిస్తాం’’ అని కిషన్ రెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, BJP
ప్రత్యామ్నాయం మేమే అంటోన్న బీజేపీ
2018 తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 12 మంది ఎమ్మెల్యేలు తమను బీఆర్ఎస్(అప్పట్లో టీఆర్ఎస్)లో విలీనం చేయాలని ప్రతిపాదించారు.
2019 జూన్‌లో విలీన ప్రక్రియ పూర్తి కావడంతో కాంగ్రెస్ తరఫున ఆరుగురు ఎమ్మెల్యేలే మిగిలి ప్రతిపక్ష హోదా కోల్పోయింది. (తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు).
ఏడుగురు ఎమ్మెల్యేలతో ఎంఐఎం రెండో అతిపెద్ద పార్టీగా కొనసాగుతూ వస్తోంది.
ఇదే సమయంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.
2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి రెండోస్థానం దక్కింది. బీఆర్ఎస్ 56 డివిజన్లలో గెలిస్తే, 48 చోట్ల బీజేపీ అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలిచారు.
తర్వాత జరిగిన పరిణామాలలో ఒక కార్పొరేటర్ చనిపోగా, మరో నలుగురు బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం బీజేపీ తరఫున జీహెచ్ఎంసీలో 43 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక విషయంలోనూ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ, పోటీ మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే సాగింది.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ నాయకులు పదేపదే ప్రకటిస్తూ వచ్చారు.
అయితే, మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి, అధ్యక్షుడి మార్పు వంటి అంశాలు బీజేపీ నేతలను కొంత ఆత్మరక్షణలో పడేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

ఫొటో సోర్స్, Telangana congress
పూర్వ వైభవం కోసం కాంగ్రెస్..
2014లో ఎన్నికలలో తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. 2018లో జరిగిన ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పరాభవం తప్పలేదు. కానీ, ఈ సారి అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాల్లో ఉంది.
ఇప్పుడు సీడబ్య్లూసీ సమావేశాలు, విజయభేరి సభలతో కాంగ్రెస్ బల ప్రదర్శనకు సిద్ధమైంది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో తెలంగాణలో పార్టీ క్యాడర్‌కు కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పవచ్చు.
గతేడాది మే నెలలో వరంగల్‌లో జరిగిన రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు డిక్లరేషన్‌ను పార్టీ ప్రకటించింది.
గత నెలలో చేవెళ్లలో జరిగిన సభలో మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది.
సెప్టెంబర్ 17న జరిగే విజయభేరిలో సోనియా గాంధీ చేతుల మీదుగా 5 గ్యారెంటీలు పేరిట కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాలను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.
దీనికి ముందుగా సెప్టెంబరు 16న కాంగ్రెస్ పార్టీలో కీలకమైన సీడబ్ల్యూసీ(కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సమావేశాన్ని నిర్వహిస్తోంది.
తెలంగాణలో తొలిసారి సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నట్లు చెప్పారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్.
‘‘సెప్టెంబరు 17ను విలీన దినోత్సవంగానే కాంగ్రెస్ జరుపుతోంది. సమైక్యత, ఏక్తా.. ఇలా ఏ పేరు పెట్టినా మా వరకు అది విలీన దినోత్సవమే.
16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ లోనే ఉంటారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులు, సీడబ్ల్యూసీ సభ్యులు తెలంగాణ వస్తున్నారు.
16వ తేదీన సీడబ్ల్యూసీ సమావేశాలు ఉంటాయి. మరుసటి రోజున 17వ తేదీన సీడబ్ల్యూసీ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో విజయభేరి సభ ఉంటుంది’’ అని అద్దంకి దయాకర్ బీబీసీతో అన్నారు.
సభ ముగిసిన తర్వాత కాంగ్రెస్ ప్రకటించిన 5 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతలు పర్యటించనున్నారు. అగ్రనేతల పర్యటనలను పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంగా మలుచుకోవాలని టీపీసీసీ భావిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
మజ్లిస్ 'తిరంగా ర్యాలీ'
తెలంగాణ విమోచన దినోత్సవానికి మజ్లిస్ పార్టీ వ్యతిరేకమనే మాటలు బీజేపీ, కాంగ్రెస్ నుంచి వినిపిస్తుంటాయి. ఈసారి అదే రోజున పాతబస్తీలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించేందుకు ఎంఐఎం పార్టీ సిద్ధమైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది.
ఈ విషయాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
‘‘సెప్టెంబర్ 17న జాతీయ సమైకత్య దినోత్సవం జరుపుకోబోతున్నాం. స్వతంత్రమైన, ప్రజాస్వామ్య భారత్‌లో ఆ రోజున పూర్వ హైదరాబాద్ రాష్ట్రం కలిసింది.
దర్గా యూసుఫైన్ నుంచి బజార్ ఘాట్ మీదుగా మాసబ్ ట్యాంకు ఈద్గా బిలాలి వరకు ర్యాలీ జరుగుతుంది. జుహర్ ప్రార్థనల తర్వాత ర్యాలీ మొదలై బిలాలి ఈద్గా వద్ద బహిరంగ సభతో ముగుస్తుంది’’ అని అసదుద్దీన్ ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎంఐఎం పార్టీ సెప్టెంబర్ 17న ఓ ప్రత్యేక కార్యక్రమం చేయడం ఇదే తొలిసారని చెప్పవచ్చు.
గతేడాది జాతీయ సమైక్యత దినోత్సవం పేరిట తిరంగా ర్యాలీ నిర్వహించినప్పటికీ, దాన్ని 17వ తేదీన కాకుండా ఒక రోజు ముందుగా 16వ తేదీన నిర్వహించింది.
విలీనం లేదా విమోచనం పేరుతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతోనే ఎంఐఎం కార్యక్రమాలు చేస్తోంది.
ఈ విషయంపై గతేడాది సెప్టెంబర్‌లో అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. సెప్టెంబర్ 17న జాతీయ సమైకత్య దినోత్సవం పేరిట కార్యక్రమాలు చేయాలని అందులో పేర్కొన్నారు. అయితే, ఆ లేఖకు కేంద్రం నుంచి స్పందన రాలేదు.

ఫొటో సోర్స్, TelanganaCMO
సమైక్యతా దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానిదే. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రతిపక్షాలు 2014 నుంచి డిమాండ్ చేస్తూ వచ్చాయి.
నిరుడు జాతీయ సమైక్యతా దినోత్సవం పేరిట రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు కార్యక్రమాలను నిర్వహించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
‘‘సెప్టెంబర్ 17, 1948న భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం అయిన రోజు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపు పరివర్తన చెందడానికి యావత్ తెలంగాణ సమాజం కృషి చేసిన రోజు. కొందరు స్వార్థ రాజకీయాల కోసం సెప్టెంబరు 17ను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలి.’’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మీడియాతో అన్నారు.
ఈ విషయంపై బీజేపీ నాయకుడు, దుబ్బాక ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు బీబీసీతో మాట్లాడారు.
‘‘కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహిస్తుండటంతోనే బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో డ్రామాలు ఆడుతున్నాయి.
విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం జరపకపోవడంతోనే కేంద్రం ముందుకొచ్చి ఉత్సవాలు జరుపుతోంది.
బీజేపీకి ఎక్కడ పొలిటికల్ మైలైజీ వస్తుందోననే భయంతో బీఆర్ఎస్, ఎంఐఎం జాతీయ సమైక్యతా దినోత్సవం అని చేస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు విలీన దినోత్సవం జరపాలని డిమాండ్ చేసి, ఇప్పుడు సమైక్యత, సమగ్రత అనడం ఏమిటి..? ఎంఐఎం కనుసన్నల్లోనే బీఆర్ఎస్ కార్యక్రమాలు చేస్తోంది’’ అని రఘునందన్ రావు అన్నారు.
అయితే, గతేడాదగి జరిగినట్టుగానే ఈ ఏడాది కూడా జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది.
ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో జాతీయ పతాకం ఆవిష్కరించనుండగా.. మంత్రులు, ప్రజాప్రతినిధులు జిల్లాల్లో జెండా ఎగురవేస్తారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: అల్విన్ కాలనీ ధరణి నగర్లో అంత ఎత్తున నురగ ఎలా వచ్చింది... అది ఎంత ప్రమాదకరం?
- కోరుట్ల: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి హత్య కేసులో ఆమె చెల్లెలు చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉమర్ షేక్ ఎలా దొరికిపోయారంటే
- ‘మీ దయవల్లే బతికున్నా, సార్’.. 9 ఏళ్ల కిందట ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారికి చేతులెత్తి మొక్కిన పేద మహిళ
- తెలంగాణలో బోర్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారు, నీటిని వాడుకున్నందుకు ఎంత చెల్లించాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














