హైదరాబాద్: అల్విన్ కాలనీ ధరణి నగర్‌లో అంత ఎత్తున నురగ ఎలా వచ్చింది... అది ఎంత ప్రమాదకరం?

ధరణి కాలనీలో నురగ

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎక్కడైనా వానలు కురిస్తే వరద వస్తుంది. వరదల్లో వాన నీరు పారుతుంది. పెద్ద నగరాల్లో ఆ వాన నీటితో పాటూ మురుగు నీరు కలగలసి పారుతుంది. కానీ, హైదరాబాద్‌లోని ధరణి కాలనీలో మాత్రం వాన వస్తే నురగ పారుతుంది.

అవును వరదల సమయంలో మీరు ఆ కాలనీకి వెళ్తే పాత సినిమాల్లో మేఘాల మధ్య మనుషులు నడిచే సన్నివేశాలు గుర్తొస్తాయి. కానీ, అది ఇలా చెప్పుకునేంతటి సరదా విషయం కాదు. అత్యంత భయానక పరిణామం.

హైదరాబాద్ జీడిమెట్ల అల్విన్ కాలనీ సమీపంలో ధరణి నగర్ ఉంది. మంగళవారం అక్కడ వరదతో పాటూ నురగ వచ్చిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

నగరం మధ్యలో కాలనీలో అంత ఎత్తున నురగ ఎందుకు వచ్చిందన్న ప్రశ్న మొదలైంది.

నీటిపై నురగ కాలుష్యానికి సంకేతం. కాలుష్యం ఎంత తీవ్రంగా ఉంటే ఇంత నురగ వచ్చిందనే చర్చ మొదలైంది.

ధరణి కాలనీలో నురగ

ఫొటో సోర్స్, UGC

ఇదే మొదటిసారి కాదు

అల్విన్ కాలనీ దగ్గర్లోని ధరణి కాలనీని నురగ సమస్య ఎన్నాళ్ల నుంచో వేధిస్తోంది.

అక్కడ రోడ్లపైకి నురగ రావడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని సందర్భాల్లో నురగ మనిషి ఎత్తు వచ్చిన రోజులు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

మరికొన్ని కాలనీల్లో కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ ధరణి కాలనీలో మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంది.

ధరణి నగర్‌లో ఈ పరిస్థితికి ప్రధాన కారణం పరికి చెరువులో కాలుష్యమే.

పరికి చెరువు ఎల్లమ్మ చెరువుకు అనుబంధంగా ఉంటుంది. ఈ చెరువు నుంచి వచ్చే కాలువ కూకట్‌పల్లి కాలువ(నాలా)లో కలసి అక్కడి నుంచి హుస్సేన్ సాగర్‌కి వెళ్లి కలుస్తుంది.

హుస్సేన్ సాగర్ నుంచి మరో కాలువ ద్వారా ఆ నీరు మూసీలోకి వెళుతుంది.

జీడిమెట్ల ప్రాంత పరిశ్రమల కాలుష్య రసాయన వ్యర్థాలను ఆ పరికి చెరువులో కలుపుతారు అనేది బహిరంగ రహస్యం.

‘‘పైన పరికి చెరువు ఉంది. ఆ చెరువులో జీడిమెట్ల పరిశ్రమల వ్యర్థాలు నేరుగా వదుల్తారు.

కొన్ని కంపెనీలు అయితే తమ దగ్గర నుంచి నాలాల్లోకి నేరుగా పైపులైన్లు వేసేశారు.

రాత్రి పూట ఆ పైపుల్లోంచి వ్యర్థాలను వదులుతారు. మీరు వెతికినా ఆ పైపులు కనపడకుండా కాలువల్లో కిందికి పెడతారు.

లేదంటే బాత్రూం వ్యర్థాల పైపుల్లో రసాయనాలు కలుపుతారు. అవన్నీ నేరుగా నాలాలోకి, అటు నుంచి పరికి చెరువులోకి వస్తాయి.

మామూలు రోజుల్లో ఇది బయట పడదు. కానీ వానలు ఎక్కువ పడితే చెరువు నీరు బయటకు వచ్చే సమయంలో ఈ నురగ వస్తుంది’’ అంటూ బీబీసీతో చెప్పారు స్థానికుడు వెంకట్.

2017 లో నల్గొండ జిల్లా పరిధిలో రోడ్డుపైకి వచ్చిన మూసీ నది నురగ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, 2017లో నల్గొండ జిల్లా పరిధిలో రోడ్డుపైకి వచ్చిన మూసీ నది నురగ

‘అందులో దిగినా లేదా వాసన పీల్చినా జబ్బులు వస్తాయి’

‘‘ఇలా ప్రతీ ఏటా వస్తుంది. ఇక్కడ మాన్ హోల్స్ కనీసం శుభ్రం చేయడం లేదు. నీరు బయటకు రావడానికి అది ఒక కారణం.

ఇక నురగ అయితే ఒక సందర్భంలో ఇళ్ల మొదటి అంతస్తు కనపడనంత వరకూ వచ్చింది. అందులో దిగినా, లేక ఆ వాసన ఎక్కువ సేపు పీల్చినా జబ్బులు వచ్చేస్తాయి. చచ్చిపోతారు కూడా.

నేను కాలనీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ నీటిని పరీక్షించడానికి ల్యాబుకు పంపితే దానిలో రసాయనాలున్నట్లు తేలింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు.

అధికారులను గట్టిగా అడిగితే, లారీల్లో తెచ్చి రసాయనాలు కలిపేప్పుడు రెడ్ హ్యాండండ్‌గా పట్టుకోవాలి అంటూ మమ్మల్ని కాపలా కాయమన్నారు. అది ఎలా సాధ్యపడుతుంది.

లారీల్లో తెచ్చి రసాయనాలను ఆ చెరువులో కలుపుతున్నారనేది వాస్తవం. అలాంటి లారీలను పట్టుకునే ప్రయత్నం చేస్తే గుద్ది చంపేసినా పట్టించుకునేవాడు ఉండడు. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని.

వ్యక్తులుగా మేం చేయలేం. దీనిపై ఎన్నోసార్లు జీహెచ్ఎంసీ అధికారులను కలిశాం. వారు చెరువుకు రిటైనింగ్ వాల్ కట్టించారు కానీ అది చాలదు.

ఇంక బోల్డర్లు లెవెల్ చేయాలి. అసలు నురగ ఆగాలి అంటే కలుషిత పదార్థాలు చెరువులో కలవకూడదు. ఆ చెరువులో రసాయనాలు కలుస్తున్నాయన్నది నూటికి నూరు శాతం నిజం.

కానీ ఎవరు ఎలా కలుపుతున్నారనేది ఎవరూ చెప్పలేరు’ అని ధరణి నగర్ కాలనీ సంఘానికి గతంలో అధ్యక్షునిగా పనిచేసిన మహేంద్ర రెడ్డి బీబీసీతో చెప్పారు.

’’2016 నుంచీ నురగ పెరిగింది. అంతకుముందు పెద్దగా లేదు. ఎన్ని కంపెనీలు ఇక్కడ రసాయనాలు కలుపుతాయో తెలీదు కానీ మేం మాత్రం సనత్ నగర్‌లో కాలుష్య నియంత్రణ మండలి ఆఫీసులో ఫిర్యాదు కూడా చేశాం.’’ అని ఆయన వివరించారు.

పరికి చెరువు

ఫొటో సోర్స్, CR Pariki Cheruvu Parirakshana Samithi

‘డిటర్జెంట్ల వల్ల నురగ వస్తుందంటున్నారు’

‘‘అర్థరాత్రి అకస్మాత్తుగా నీరు, నురగ వస్తాయి. కేవలం నీరు వస్తే ఒక సమస్య. నురగ కూడా భారీగా వస్తుంది. దీని వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలకి చాలా ప్రమాదకరంగా ఉంది.’’ స్థానికులు బీబీసీతో చెప్పారు.

‘‘ఈ సమస్యపై ప్రభుత్వం శ్రద్ధ పెడితే తీరుతుంది. పరికి చెరువు పైన గాజుల రామారం పరిశ్రమల ప్రాంతం. అంతే కాదు ఒకప్పుడు ఇదే ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఉండేది.

హుస్సేన్ సాగర్ నుంచి కూకట్‌పల్లి వెళ్లే నాలాలో తొలగించిన అత్యంత కలుషిత మట్టిని కూడా ఇక్కడికే తరలించి పెట్టారు. అందుకే ఇది చాలా కలుషితంగా మారింది.

నాలా దగ్గర పూడిక తీసిన మట్టిలో భార లోహాలు ఉన్నాయి, వాటిని ఇక్కడ పెట్టకూడదని చెప్పిన వినకుండా అధికారులు వాటిని ఇక్కడకు తరలించారు.

గతంలో డంపింగ్ యార్డుగా ఉండడం వల్ల ఆ అవశేషాలు భూమిలో ఎంత ఇంకుతున్నాయి, ఏ స్థాయిలో వెళ్లాయి అనేది మనకు తెలియదు.

ఈ రంగంలో ప్రభుత్వం కూడా పారదర్శకంగా పనిచేయడం లేదు. ఇక పరిశ్రమలు కలిపే సంగతి మీకు తెలిసిందే.’’ అని డా. లుబ్నా షర్వత్ బీబీసీతో చెప్పారు.

సేవ్ అవర్ లేక్స్ పేరుతో హైదరాబాద్‌లో ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు డా. లుబ్నా.

‘‘అన్నిటికంటే దారుణం ఏంటి అంటే, అసలు అక్కడ ఏ రసాయనాలు కలుస్తున్నాయి, వాటి వల్ల ఎంత ప్రమాదం అనేది మాత్రం ఎవరూ అధ్యయనం చేయడం లేదు.

ఉపద్రవాలు వచ్చినా ఎవరూ మాట్లాడటం లేదు. వరదలను తట్టుకోవాలంటే చెరువుల, నాలాల రిస్టోరేషన్ చేయాలి.

కానీ నాలాకి రెండు పక్కలా లోతైన కాంక్రీట్ వాల్స్ కట్టడంతో వాటిలోకి నీరు వెళ్లి ఇంకడం లేదు. దీనివల్ల కూడా ముంపు పెరుగుతోంది.

స్ట్రాటిజక్ నాలా ప్రోగ్రామ్ కాదు, సస్టెయినబుల్ నాలా ప్రోగ్రామ్ కావాలి’’ అని కోరారు.

‘‘నిజానికి నురగ ఇక్కడే కాదు, సాగర్ నుంచి బయటకు వెళ్లే రెండు పెద్ద కాలువల్లోనూ భారీగా నురగ కనిపిస్తుంది. గోల్కొండ దగ్గర చెరువుల్లో కనిపిస్తుంది.

ఇక మూసీ నదిలోనూ, మూసీ నుంచి బయటకు వెళ్లే కాలవల్లో కూడా భారీగా నురగ చేరిపోయింది. అది ఎంత ప్రమాదమో చెప్పలేను.. కానీ ఎవరూ దానిపై స్పందించడం లేదు.

గతంలో ఒక వ్యక్తి ఈ అంశంపై పీసీబీకి ఇచ్చిన నివేదికలో డిటర్జెంట్ల వల్ల నురగ వస్తుందని రాశారు. దానికి ఆధారం ఏంటని అడిగితే ఇప్పటి వరకూ స్పందించలేదు.

అధ్యయన రిపోర్ట్ బయట పెట్టడం లేదు. ఎందుకు అంత రహస్యం? జనాలు వాడే బట్టల సబ్బులు, డిటర్జెంట్ పౌడర్, షాంపూ, బాత్రూం క్లీనర్ల వల్ల అంత నురగ వస్తే, వాటిని తయారు చేసే ఫాక్టరీల వల్ల ఎంత వస్తుంది?.. కానీ, దీనిపై పీసీబీ మాట్లాడటానికి సిద్ధంగా లేదు..’’ అని డా. లుబ్నా షర్వత్ బీబీసీతో చెప్పారు.

నురగ

ఫొటో సోర్స్, UGC

మూసీలోనూ నురగలు

హైదరాబాద్‌లోని మురుగు నీరు అంతా చివరకు మూసీ నదిలోకి వెళ్లాల్సిందే.

చెరువులు, కాలువల్లో వదిలిన వ్యర్థాలు ఏదో ఒక దారిలో మూసీలోకి వెళతాయి.

అందుకే హైదరాబాద్ దాటిన తరువాత మూసీ నదిలో కొన్ని కిలోమీటర్ల దూరం నురగలు కనిపిస్తాయి. ఏకంగా ఒక మీటరు ఎత్తులో ఇవి కనిపిస్తాయి.

వాటి ఒడ్డునే పంటలు కూడా పండుతాయి. అదే నీరు చివరగా కృష్ణా నదిలో కలుస్తుంది.

ఇళ్లలో వ్యర్థాలైతే, పరిశ్రమల వ్యర్థాలైతే మొత్తానికి రోజుకు అక్షరాలా 140 కోట్ల లీటర్ల నీరు మూసీలో కలుస్తుంది అని వాటర్ బోర్డు అంచనా.

అందులో సగం కూడా శుద్ధి చేయకుండానే కలుస్తోంది. మిగిలిన శుద్ధి కూడా సరిగా చేయడం లేదు.

ఒకటీ రెండూ కాదు.. పదుల సంఖ్య నిపుణులు, శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనాల్లో హుస్సేన్ సాగర్, మూసీ నదుల్లో భయంకరమైన కాలుష్య కారక రసాయనాలు కలుస్తున్నట్టు అనేక నివేదికలు వచ్చాయి.

2019వ సంవత్సరంలో భారత ప్రభుత్వం విడుదల చేసిన నీటి కాలుష్య నివేదికలో ముంబై తరువాత, హైదరాబాద్, భువనేశ్వర్లు అత్యధికంగా నీటి కాలుష్య నగరాలుగా తేలాయి.

పరికి చెరువు

ఫొటో సోర్స్, Naresh Kumar

ప్రపంచంలో 22వ అత్యంత కలుషిత నది మూసీ

మనుషులు వాడే మందులను తయారు చేసే ఫార్మా అండ్ డ్రగ్ కంపెనీలు దాదాపు 300కి పైగా తమ వ్యర్థాలను పరోక్షంగానో, ప్రత్యక్షంగానో మూసీలోకి వదులుతున్నాయి.

2022వ సంవత్సరంలో అమెరికాకు చెందిన ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రచురించిన జర్నల్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 258 నదులపై అధ్యయనం చేశారు.

అందులో ప్రపంచంలో 22వ అత్యంత కలుషిత నదిగా మూసీ వచ్చింది.

దాదాపు 40 రకాల ఏపీఐలు మూసీ నీటిలో లీటరుకు 12 వేల నానో గ్రాముల చొప్పున ఉన్నట్టు ఆ నివేదిక ప్రకటించింది.

ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. స్థూలంగా చెప్పాలంటే మందుల తయారీలో వాడే రసాయనాలు అన్నమాట..

మూసీ నీటిలో పెరిగే చేపల్లో, దాన్ని ఆనుకుని పండే పంటల్లో ఈ రసాయనాల, భార లోహాల అవశేషాలు కనిపిస్తున్నట్టు ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు అనేక సందర్భాల్లో నివేదికలు విడుదల చేశాయి.

కాబట్టి సమస్య ఆ కాలనీది మాత్రమే కాదు.. మిగిలిన హైదరాబాద్‌దీ, మూసీ నది పరివాహక ప్రాంతానిదీ, ఆ మూసీ కలిసే కృష్ణా నది పరీవాహక ప్రాంతానిదీ, ఆ రెండు నదుల ఆధారంగా దొరికే ఉత్పత్తులు తినేవారిదీ కూడా..

ఇదంతా ఫార్మా కంపెనీల గురించి. కానీ దానితో సమానంగా ఇతర పరిశ్రమల వ్యర్థాల సంగతి ఉంది.

ఫార్మా రంగం గురించి అధ్యయనం చేయడానికి వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఆ కాలుష్యాల గురించి విషయాలు బయటకు వచ్చాయి.

కానీ, ఇతర పరిశ్రమలు వారు ఏయే రకాల వ్యర్థాలు ఎక్కడెక్కడ ఎంతెంత కలుపుతున్నారనే లెక్కా పత్రం కూడా లేదని నిపుణులు చెబుతున్నారు.

ధరణి కాలనీలో నురగ

ఫొటో సోర్స్, Srikanth Bhattar

బెంగళూరు నగరంలో, యమునా నదిలో ఇలాంటి నురగలు

నురగ ఫాస్ఫేట్ వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ఫేట్ ఆధారిత పదార్థాలు వాడడం, అంటే బట్టలు ఉతికే డిటర్జెంట్లలో ఉండే ఫాస్ఫేట్, పరిశ్రమల వ్యర్థాల్లో ఉండే ఫాస్ఫేట్ వల్ల నురగ వస్తుందని వారు వివరించారు.

2017లో బెంగళూరు నగరంలోనూ, 2018వ సంవత్సరంలో యమునా నదిలో కూడా ఇలాంటి భారీ నురగలు కనిపించాయి.

బెంగళూరు నగరంలోని బెల్లందూరు సరస్సులో కాలుష్యం వల్ల వచ్చిన నురగ బెంగళూరు రోడ్లపైకి కొట్టుకువచ్చింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

2021వ సంవత్సరంలో దిల్లీలోని యుమునా నదిలో నురగల మధ్యే ఉత్తర భారత మహిళలు ఛట్ పూజ చేసి స్నానాలు చేసిన దృశ్యాలు పెద్ద చర్చను లేవదీశాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ధరణి కాలనీ నురగ అంశంపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)