హైదరాబాద్‌: ఇళ్ళల్లోని సామాన్లు బయట పడేస్తున్న వర్షాలు... జనం బేజారు

వీడియో క్యాప్షన్, హైదరాబాద్‌లో భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం... నిట మునిగిన నివాసాలు
హైదరాబాద్‌: ఇళ్ళల్లోని సామాన్లు బయట పడేస్తున్న వర్షాలు... జనం బేజారు

హైదరాబాద్‌లో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, మైసమ్మగూడ వంటి ప్రాంతాల్లో నీరు నిలిచింది.

లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. కొన్ని చోట్ల ఇళ్ళల్లోని సామాన్లు వర్షం నీటిలో కొట్టుకుపోయాయి.

కొన్ని కాలనీల్లో మొదటి అంతస్తు వరకూ నీళ్లు చేరాయి. మైసమ్మగూడ ప్రాంతంలో ఇంజినీరింగ్ కాలేజీలు ఎక్కువగా ఉంటాయి. అక్కడి విద్యార్థులు ఎక్కువగా ప్రవేటు అపార్టుమెంట్లలో హాస్టళ్ళలో నివసిస్తుంటారు.

ఓ హాస్టల్ మొదటి అంతస్తు వరకూ నీళ్లు చేరడంతో జేసీబీలు, ట్రాక్టర్లతో అందులోని విద్యార్థులను బయటకు తీసుకురావాల్సి వచ్చింది.

హైదరాబాద్ వర్షాలు

పంజాగుట్ట నుంచి కేపీహెచ్‌బీ వెళ్లే రహదారిపై కూడా చాలా చోట్ల నీరు నిలిచిపోయింది.

యూసఫ్ గూడలోనూ వరద ప్రభావం కనిపించింది. పోలీసు, మున్సిపల్ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

చాలా చోట్ల నాలాలు పొంగి పొర్లుతున్నాయి.

ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువుల్లోకి వరద నీరు వస్తుండడంతో, రిజర్వాయర్ల గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు.

హైదరాబాద్ వర్షాలు

పారిశ్రామిక వాడలకు సమీపంలో ఉన్న ప్రాంతాలలోని నాలాల్లో నురగ ప్రవాహం కనిపిస్తోంది.

కూకట్‍పల్లి, ఆల్విన్ కాలనీ పరిధిలో ఉన్న పరికి చెరువు భారీ వర్షాలకు పొంగిపోయింది. అక్కడ నాలా నుంచి నురగతో పాటు తీవ్ర దుర్వాసన వస్తోంది.

ఈ నాలా జీడిమెట్ల వైపు నుంచి వస్తుంది. అక్కడ పరి‌‍శ్రమల వ్యర్థాలు, కెమికల్ నీటిని నాలాలోకి నేరుగా విడిచిపెడుతుండటంతో వర్షాలకు నీటి ఉధృతి కారణంగా నురగా వస్తుంటుందని స్థానికులు చెబుతున్నారు.

రసాయనాలతో నీరు కలుషితం కావడం వల్ల ఈ నురగ ఏర్పడుతోందని జేఎన్టీయూ జలవనరుల విభాగం ప్రొఫెసర్ ఎంవీఎస్ఎస్ గిరిధర్ చెప్పారు.

పరిశ్రమల రసాయన వ్యర్థాలు నాలాలోకి వదలడంతో ఇలా జరుగుతుందన్నారు.

ఈ నురగ వల్ల వీధిలో నడవలేకపోతున్నామని స్థానికులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి: