వీర్యం, అండాలు లేకుండా తొలిసారిగా పిండం తయారీ...ఐవీఎఫ్‌ సక్సెస్ రేట్ పెంచవచ్చా?

ఎంబ్రియో మోడల్

ఫొటో సోర్స్, WEIZMANN INSTITUTE OF SCIENCE

ఫొటో క్యాప్షన్, మూల కణం నుంచి తయారైన పిండం నమూనా. ఇందులో నీలం రంగు కణాలు పిండం కాగా, పసుపు రంగు యాక్ సాక్, గులాబీ రంగు కణాలు ప్లాసెంటా
    • రచయిత, జేమ్స్ గల్లఘర్
    • హోదా, బీబీసీ హెల్త్, సైన్స్ ప్రతినిధి

వీర్యం, అండాలను ఉపయోగించకుండా అచ్చం మానవ పిండం (ఎంబ్రియో) లాంటి ఒక పదార్థాన్ని శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు.

సహజంగా గర్భంలో ఏర్పడిన 14 రోజుల పిండం ఎలా ఉంటుందో, తాము మూల కణాలను ఉపయోగించి రూపొందించిన ‘‘ నమూనా పిండం (ఎంబ్రియో మోడల్)’’ కూడా అలాగే ఉంటుందని వీజ్‌మన్ ఇన్‌స్టిట్యూట్ బృందం చెప్పింది.

ఈ పిండం హర్మోన్లను కూడా విడుదల చేసింది. ప్రయోగశాలలో చేసిన గర్భ (ప్రెగ్నెన్సీ) నిర్ధరణ పరీక్షను ఇది పాజిటివ్‌గా చూపించింది.

మానవ పుట్టుకలోని తొలి క్షణాలను అర్థం చేసుకునే ఉద్దేశంతో ఎంబ్రియో మోడల్స్‌ను రూపొందిస్తున్నారు సైంటిస్టులు .

అండంతో వీర్యం ఫలధీకరణం చెందిన తర్వాత వచ్చే మొదటి వారాలను అనేక పరిణామాలు జరిగే కాలంగా పరిగణిస్తారు.

గర్భస్రావం, పుట్టుకలో లోపాలు తలెత్తే కీలక సమయం ఇదే. కానీ, దీని గురించి పూర్తిగా అర్థం కాలేదు.

‘‘ఇదొక బ్లాక్ బాక్స్. దీనిపై మాకు పరిమిత జ్ఞానమే ఉంది’’ అని వీజ్‌మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్ జాకబ్ హన్నా బీబీసీతో చెప్పారు.

ఎంబ్రియో మోడల్

ముడి పదార్థం

పిండ పరిశోధన అనేది పూర్తిగా చట్టపరమైనది, నైతికపరమైనది, సాంకేతికపరమైనది. ఇప్పుడు సహజ పిండ అభివృద్ధిని అనుకరిస్తూ అభివృద్ధి చెందుతున్న రంగం ఒకటి ఉంది. ఇది చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.

పిండానికి సంబంధించిన ఈ పరిశోధన వివరాలను ‘నేచర్’ అనే జర్నల్‌లో ప్రచురించారు.

ప్రారంభ పిండంలో ఉద్భవించే అన్ని రకాల కీలక నిర్మాణాలను అనుకరిస్తూ పూర్తి చేసిన మొదటి పిండ నమూనా ఇదేనని ఈ పరిశోధన వివరాలను ప్రచురించిన ఇజ్రాయెల్ బృందం పేర్కొంది.

‘‘మానవ గర్భంలో సహజంగా ఏర్పడిన 14వ రోజు నాటి పిండానికి ఇది ఉదాహరణ. ఇంతకుముందు ఇలాంటి పరిశోధన జరుగలేదు’’ అని ప్రొఫెసర్ హన్నా చెప్పారు.

ఈ పిండ నమూనా పరిశోధనలో వీర్యం, అండాలకు బదులుగా ముడి పదార్థంగా మూల కణాలను వాడారు. శరీరంలో ఏదైనా కణజాలంగా మారగల సామర్థ్యాన్ని వీటికి ఆపాదించేందుకు ఈ మూలకణాలను రీప్రోగ్రామ్ చేశారు.

తర్వాత ఈ మూల కణాలను, మానవ పిండం ప్రారంభ దశలో కనిపించే నాలుగు రకాల కణాలుగా మార్చడానికి రసాయనాలను ఉపయోగించారు.

ఎపిబ్లాస్ట్ కణాలు: ఇవి పిండంగా మారతాయి

ట్రోపోబ్లాస్ట్ కణాలు: ఇవి ప్లాసెంటాగా మారతాయి

హైపోబ్లాస్ట్ కణాలు: ఇవి యుటెరస్‌లో యాక్ సాక్ ఏర్పడటానికి మద్దతుగా మారతాయి.

ఎక్స్‌ట్రాఎంబ్రియోనిక్ మీసోడెర్మ్ కణాలు

ఎంబ్రియో మోడల్

ఫొటో సోర్స్, UC DAVIS HEALTH

మొత్తం 120 కణాలను ఒక కచ్చితమైన నిష్పత్తిలో కలిపి, ఆ మిశ్రమం జరిపే చర్యను శాస్త్రవేత్తలు గమనించారు.

మానవ పిండాన్ని పోలి ఉండేలా ఏర్పడటానికి ఆ మిశ్రమంలోని 1 శాతం పదార్థం దాని ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

‘‘కణాలదే ఈ క్రెడిట్ అంతా. మనం సరైన మిశ్రమాన్ని తయారు చేసి, అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే ఆ మిశ్రమం పని మొదలుపెడుతుంది. అదొక అద్భుత విషయం’’ అని ప్రొఫెసర్ హన్నా అన్నారు.

నేను అర్ధరాత్రి వీడియో కాల్ చేసినప్పటికీ, అద్భుత నిర్మాణంగా తయారైన ఎంబ్రియో మోడల్ త్రీడీ టూర్‌ను ప్రొఫెసర్ హన్నా చూపించారు.

ప్లాసెంటాగా మారే ట్రోపోబ్లాస్ట్ కణాలను నేను చూశాను. ఈ కణాలు పిండం చుట్టూ చేరతాయి. తల్లి పోషకాలను బిడ్డకు బదిలీ చేసే రక్తంతో నిండి ఉండే ‘లకునా’ అనే క్యావిటీలను నేను చూశాను.

పిండం అభివృద్ధిలో మరో ముఖ్యమైన యాక్ సాక్‌ను కూడా నాకు చూపించారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

‘‘అర్థవంతమైన అధ్యయనం’’

శరీరంలో వివిధ రకాల కణాలు ఎలా ఏర్పడతాయి? అవయవాలు ఏర్పడే సమయంలోని దశలు, వారసత్వ లేదా జన్యుపరమైన వ్యాధులను అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలకు ఎంబ్రియో మోడల్స్ సహాయపడతాయని ఆశిస్తున్నారు.

ప్లాసెంటా కణాలు చుట్టుముట్టకపోతే పిండంలోని ఇతర భాగాలు ఏర్పడవని కూడా ఇప్పటికే ఈ అధ్యయనం చూపిస్తుంది.

ఈ నమూనాలను ఉపయోగించి కొన్ని పిండాలు ఎందుకు విఫలమవుతాయనే అంశాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఐవీఎఫ్ విజయవంతమయ్యే రేటు మెరుగు పరుగుపడుతుందనే చర్చ కూడా ఉంది.

ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్‌లో పిండం అభివృద్ధిపై పరిశోధనలు చేసే ప్రొఫెసర్ లావెల్ బ్యాడ్జ్ మాట్లాడుతూ, ‘‘ఈ పిండం నమూనాలు చాలా సహజంగా ఉన్నాయి. చాలా బాగా కనిపిస్తున్నాయి. నేను ఇంప్రెస్ అయ్యాను’’ అని ఆయన అన్నారు.

కానీ, ప్రస్తుతం ఉన్న 99 శాతంగా ఉన్న వైఫల్య రేటును మెరుగపరచాలని ఆయన చెప్పారు. ఈ నమూనాలు సరిగా పనిచేయకపోతే, సహజంగా గర్భస్రావాలు, సంతానలేమి ఎందుకు వస్తుందో అర్థం చేసుకోవడం కష్టమవుతుందని ఆయన అన్నారు.

చట్టపరంగా..

పిండం 14 రోజుల దశను దాటిన తర్వాత కూడా ఈ ఎంబ్రియో నమూనా దాన్ని అనుకరిస్తుందా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఇది చట్ట విరుద్ధం కూడా కాదు. ‘‘కొంతమంది దీన్ని స్వాగతిస్తారు. కానీ, కొంతమందికి ఇది నచ్చదు’’ అని లావెల్ బ్యాడ్జ్ అన్నారు.

సహజ పిండం లక్షణాలకు ఈ నమూనాలు ఎంతవరకు దగ్గరగా ఉంటాయనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి.

అవి సహజ మానవ పిండాలు కాదు. కేవలం పిండ నమూనాలు. కానీ, అవి మానవ పిండాలకు చాలా దగ్గరగా ఉంటాయి.

పాంపు ఫాబ్రా యూనివర్సిటీకి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పరిమెంటల్, హెల్త్ సైన్సెస్ విభాగం ప్రొఫెసర్ అల్ఫొన్సో మార్టినెజ్ అరియాస్ మాట్లాడుతూ ఇదొక కీలకమైన పరిశోధన అని అన్నారు.

‘‘మొదటిసారిగా ప్రయోగశాలలో మూల కణాల నుంచి మానవ పిండం నిర్మాణం పూర్తిగా ఏర్పడింది. ఇది నమ్మలా ఉంది. మానవ పుట్టుకకు సంబంధించిన అధ్యయనాలకు ఇది తలుపులు తెరిచింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఎంబ్రియో నమూనాలను ఉపయోగించి గర్భాన్ని పొందడం దాదాపు అసాధ్యం, అనైతికం, చట్టవిరుద్ధమని పరిశోధకులు నొక్కి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)