చంద్రయాన్-3: నాసా కెమెరాతో తీసిన ‘విక్రమ్’ ల్యాండర్ ఫోటోలు ఎలా ఉన్నాయంటే....

ఫొటో సోర్స్, NASA'S GODDARD SPACE FLIGHT CENTER
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
చంద్రయాన్-3 నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించిన ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌లు ప్రస్తుతం స్లీప్ మోడ్‌లోకి వెళ్లాయి.
చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ దిగిన ప్రదేశాన్ని గుర్తిస్తూ యూఎస్ స్పేస్ ఏజెన్సీ (నాసా) సెప్టెంబర్ 5న ఫోటోలను విడుదల చేసింది.
నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (LRO) కెమెరా నుంచి చంద్రుడిపై దక్షిణ ధృవానికి 600 కిలోమీటర్ల దూరంలో దిగిన ల్యాండర్ విక్రమ్ చిత్రాలను నాసా గడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ విడుదల చేసింది.
చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ఈ లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ కెమెరా ఇటీవలే రష్యా ప్రయోగించిన లూనా 25 ఫోటోలను కూడా పంపింది.
ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ దిగిన ప్రదేశాన్ని నాలుగు రోజుల తర్వాత ఈ ఆర్బిటర్ కెమెరా చిత్రీకరించింది. ఈ ఫోటో బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. చిత్రం మధ్యలో నల్లటి నీడ, ల్యాండర్ చుట్టూ ఉన్న వెలుగును కూడా చూడొచ్చు.
చంద్రయాన్ -3 ప్రయోగంతో చంద్రుడిపై దక్షిణ ధృవంలో స్పేస్ క్రాఫ్ట్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ అవతరించింది. అంతేకాకుండా అమెరికా, సోవియట్ యూనియన్, చైనాలతోపాటు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా నిలిచింది.

ఫొటో సోర్స్, ISRO
రోవర్ ఎప్పుడు యాక్టీవ్ అవుతుంది?
చంద్రుడిపై దిగిన క్షణం నుంచి 10 రోజుల పాటు ల్యాండర్, రోవర్‌లు సమాచారాన్ని సేకరించి పంపాయి.
“ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ లు వాటికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నాయి’’ అని ఇస్రో పేర్కొంది.
అనంతరం సెప్టెంబర్ 2వ తేదీన రోవర్ ప్రజ్ఞాన్‌ను, సెప్టెంబర్ 4వ తేదీన ల్యాండర్ విక్రమ్ ను స్లీప్ మోడ్‌లోకి పంపారు. మళ్లీ సెప్టెంబర్ 22వ తేదీన ఈ ప్రదేశంలో సూర్యరశ్మి పడే సమయానికి వాటిని మళ్లీ యాక్టివ్ చేయడానికి ప్రయత్నిస్తామని ఇస్రో తెలిపింది.
ల్యాండర్, రోవర్‌ల బ్యాటరీలు ఛార్జ్ అవడానికి సూర్యరశ్మి అవసరం. ఒకవేళ అనుకున్న తేదీన సూర్యరశ్మి పడే సమయానికి రోవర్ ప్రజ్ఞాన్ యాక్టివ్ కాకపోతే, ఇక అది శాశ్వతంగా చంద్రుడిపైనే ఉండిపోతుందని ఇస్రో పేర్కొంది.
ల్యాండర్ విక్రమ్‌ను స్లీప్ మోడ్‌లో పంపడానికి ముందు మరోసారి దానిని సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు.
“కమాండ్‌ను అనుసరించి ల్యాండర్ ఇంధనాలను మండిస్తూ, దిగిన ప్రదేశం నుంచి 40 సెంటీమీటర్లు పైకి లేచి, 30-40 సెంటీమీటర్ల దూరంలో తిరిగి సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది“ అని ఇస్రో ట్వీట్ లో తెలిపింది.
భవిష్యత్తులో చంద్రుడిపై సేకరించిన శాంపిళ్లను లేదా మనుషులను భూమి మీదకు తీసుకువచ్చేందుకు ఈ స్పేస్ క్రాఫ్ట్ వినియోగపడుతుందని ఇస్రో పేర్కొంది.
ల్యాండర్, రోవర్‌ల సమాచారాన్ని ఎప్పటికప్పుడూ తెలియజేస్తూ, అవి తీసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తోంది ఇస్రో.
“ల్యాండర్ విక్రమ్ ప్రయోగం విజయవంతం అయింది“ అని కూడా ఇస్రో తెలిపింది.
ఇవి కూడా చదవండి
- చంద్రుడిపై స్థలాన్ని కొనుక్కోవచ్చా?
- భూమి, చంద్రుడు తల్లీబిడ్డలా? లేక తోబుట్టువులా? చంద్రుడి జన్మ రహస్యం ఏమిటి?
- ముర్రా జాతి గేదెలపై 100 పెడితే 200 ఆదాయం, నాటు గేదెలకూ వీటికీ తేడా ఏంటి?
- టీచర్స్ డే- సర్వేపల్లి రాధాకృష్ణన్: ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్థాయికి..
- సనాతన ధర్మం: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం... బీజేపీ, వీహెచ్‌పీ నేతలు ఏమన్నారు, కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














