సనాతన ధర్మం: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం... బీజేపీ, వీహెచ్‌పీ నేతలు ఏమన్నారు, కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి?

ఫొటో సోర్స్, @OFFICE_OF_UDHAY
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది.
మరోవైపు ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఆయనపై తీవ్ర విమర్శలు వస్తుండగా.. మరోవైపు చాలా మంది రాజకీయ నాయకులు, యూజర్లు ఆయన మద్దతునిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.
ద్రవిడ మున్నేట్ర కళగం నేత, తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ శనివారం చెన్నైలో తేనాంపేటలో ‘తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ నిర్వహించిన ‘సనాతన ఒళిప్పు మానాడు’ (సనాతన ధర్మ నిర్మూలన) అనే సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీ లాంటిదని, దాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు.
తమిళనాడు ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్న ఉదయనిధి స్టాలిన్ సినీ రచయిత, దర్శకుడు, నటుడు కూడా.
"కొన్ని విషయాలను కేవలం వ్యతిరేకిస్తే సరిపోదు. వాటిని పూర్తిగా నిర్మూలించాలి. దోమలు, డెంగీ జ్వరాలు, మలేరియా, కరోనా వంటి వాటిని మనం వ్యతిరేకిస్తే పోవు. నిర్మూలించాలి. అలాగే సనాతనం కూడా." అన్నారాయన.
సనాతన ధర్మాన్ని అనుసరించే వారిని నిర్మూలించాలని అన్నట్లుగా కొందరు తనపై చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు ఉదయనిధి స్టాలిన్.
సనాతన ధర్మాన్ని విశ్వసించే వారిని నిర్మూలించడం గురించి తాను మాట్లాడలేదని, సనాతన ధర్మాన్ని మాత్రమే నిర్మూలించాలని అన్నానని చెప్పారు.
సనాతన ధర్మం కులం, మతం పేరుతో ప్రజలను విడదీసే సిద్ధాంతమని తాను గట్టిగా నమ్ముతున్నానని ఆయన చెప్పారు.
సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అంటే మానవత్వాన్ని, సమానత్వాన్ని కాపాడటమేనని అన్నారు.

ఫొటో సోర్స్, GETTYIMAGES
బీజేపీ ఏమంటోంది?
సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ కేవలం సిగ్గుచేటు వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. మళ్లీ అవే వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేత, మాజీ న్యాయమంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు.
‘‘ఎందుకు రెండు రోజులుగా రాహుల్ గాంధీ మౌనంగా ఉంటున్నారు? హిందువునని రాహుల్ గాంధీ చెబుతూ ఉంటారు. గోత్రాల గురించి మాట్లాడతారు. ఆలయాలు సందర్శిస్తారు.
వారు కేవలం ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారని మేం చెప్పేవాళ్లం. నిజంగానే అది రుజువైంది. ఎందుకు నితీష్ కుమార్ నిశ్శబ్దంగా ఉన్నారు? ముంబయిలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఇదే ఏకాభిప్రాయం కుదిరిందా?" అని ఆయన ప్రశ్నించారు.
‘‘ఎందుకు తేజస్వీ యాదవ్ మౌనంగా ఉన్నారు? తండ్రిని తీసుకుని సిద్ధివినాయక ఆలయ దర్శనానికి వెళ్లారు. అదంతా పైపైకి చూపించడానికేనా? ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ అహంకార సంస్థలు ఒకటిగా కలిశాయని స్పష్టమైంది.
వీరు హిందూ మతాన్ని, హిందుత్వ ఆలోచనలను వ్యతిరేకిస్తారు. వీరు కేవలం ఓట్ల కోసమే ఇదంతా చేస్తారు. వీరిది ప్రాథమికంగా హిందూ-వ్యతిరేక ఆలోచన’’ అని రవి శంకర్ ప్రసాద్ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
‘‘సమాజంలో ద్వేషాన్ని రగిలించే స్టాలిన్ కొడుకును అరెస్ట్ చేసి, జైలుకి పంపాలి. ఒకవైపు రాహుల్ గాంధీ ‘ద్వేషమనే మార్కెట్లో ప్రేమ దుకాణం’ అని చెబుతూ ఉంటే.. మరోవైపు తమిళనాడులో వారి కూటమిలోని ప్రధాన నేత సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెబుతున్నారు. ఇది జాతి వ్యతిరేక చర్య’’ అని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుశిల్ మోదీ అన్నారు.
‘‘దేశంలోని కోట్లాది మంది ప్రజల సెంటిమెంట్లను మీరు బాధపెడుతున్నారు. డీఎంకే చరిత్రంతా ఇలానే ఉంది. రాజకీయాలు చేయడం కోసమే వారు ఇక్కడికి వచ్చారు’’ అని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలకు వారు మద్దతు ఇస్తున్నారా? లేదా? అనే విషయంపై కూటమిలోని నేతలు స్పష్టంచేయాలని సుశిల్ మోదీ డిమాండ్ చేశారు.
ఒకవేళ ఇది తప్పయితే బహిరంగంగా ఖండించాలని, కాంగ్రెస్ సీనియర్ నేతల మౌనం, వారు ఉదయనిధి వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నట్లు ఉందన్నారు.

ఫొటో సోర్స్, ANI
కాంగ్రెస్ స్పందన ఏంటి?
‘‘మేం అన్ని మతాల ధర్మాలను విశ్వసిస్తాం. కాంగ్రెస్ కూడా ఈ సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది. కానీ, ప్రతి రాజకీయ పార్టీకి వారి అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరి నమ్మకాలను మేం గౌరవిస్తాం’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు.
‘‘హిందువులను దుర్భాషలాడేందుకు రాజకీయ నాయకుల్లో ఒక రేసు నడుస్తోంది. నిజమైన సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకు వేల సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కానీ, సనాతన ధర్మాన్ని నాశనం చేయలేకపోయారు. వేల సంవత్సరాల పాటు భారత్ బానిసగా ఉంది. ఈ వేల సంవత్సరాలు సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకు నిరంతరం కుట్రలు జరిగాయి’’ అని కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ తెలిపారు.
‘‘మహారాణా ప్రతాప్, గురు గోవింద్ జీ, ఛత్రపతి శివాజి మహారాజ వంటి ఎంతో మంది మహాత్ములు సనాతన ధర్మాన్ని కాపాడటంలో భాగమయ్యారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని బ్రిటీష్, మొఘలలు కలలు కనేవారు. కానీ, అది వారికి సాధ్యం కాలేదు’’ అని అన్నారు.
‘‘శతాబ్దాలుగా భారత్‌లో సనాతన ధర్మం కొనసాగుతోంది. ఎన్నో సందర్భాల్లో మనం దీన్ని చూశాం. వేలాది సంవత్సరాలుగా ఉన్న ఈ ధర్మం పాతుకు పోయింది. కొన్ని విధానాలు, ఆలోచనలు కొన్ని రోజుల మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వెళ్లిపోతాయి.
సనాతన ధర్మం.. వేదాలు, పురాణాల సంస్కృతి, సంప్రదాయం.. వాటి పరిజ్ఞానం ప్రత్యేకమైనవి. వేదాలలో ఉన్న జ్ఞాన సారాంశానికి మించి మరే గొప్ప వనరు ప్రపంచంలో లేదు’’ అని చత్తీస్‌గఢ్ డిప్యూటీ ముఖ్యమంత్రి టీఎస్ సింఘ్‌దేవ్ అన్నారు.

ఫొటో సోర్స్, @OFFICE_OF_UDHAY
సమర్థించేందుకు ప్రయత్నించిన డీఎంకే
తమ నేతను సమర్థించేందుకు డీఎంకే అధికార ప్రతినిధి శర్వణన్ అన్నాదురై ముందుకు వచ్చారు. ఉదయనిధి ప్రకటనను వక్రీకరించి సందర్భం లేకుండా వివాదాలు సృష్టిస్తున్నారని, నకిలీ వార్తలను ప్రచారం చేసేందుకు అతిపెద్ద ఫ్యాక్టరీ పనిచేస్తుందని అన్నారు.
‘‘కాంగ్రెస్ రహిత భారత్ గురించి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, ఆయన మారణహోమం గురించి మాట్లాడారా? ఎలా ఉదయనిధి మారణహోమం గురించి మాట్లాడతారు? ఇది తప్పుడు వార్త. ఆయన తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. నకిలీ వార్తలను ప్రచారం చేయడం ద్వారా ద్వేషాన్ని రెచ్చగొట్టినందుకు చట్టానికి సమాధానం చెప్పాలి’’ అని అమిత్ మాలవీయ ట్వీట్‌ను ఉద్దేశిస్తూ అన్నారు.

ఫొటో సోర్స్, GETTYIMAGES
వీహెచ్‌పీ ఏం చెప్పింది?
‘‘ఆయన భాష, ప్రకటన ఉద్దేశాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారు. అధికార దురహంకారంతో వారు నడుస్తున్నారు. ఇలా బెదిరింపులకు పాల్పడే ముందు కనీసం వారు తమ బలాన్ని కూడా లెక్కలోకి తీసుకోలేదు’’ అని విశ్వ హిందూ పరిషత్తు వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ అన్నారు.
‘‘ముస్లింలు, మిషనరీలు, బ్రిటీష్ వారి చేతుల్లో సనాతన ధర్మం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ధర్మం శాశ్వతమైనది. ఇదే గెలిచింది. మొఘలలు, బ్రిటీష్ వారు దేశం విడిచిపెట్టి పోయారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని మాట్లాడిన వారే తుడిచిపెట్టుకుపోయారు’’ అని తెలిపారు.
సనాతన ధర్మాన్ని ఎవరూ తొలగించలేరని రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వార్తా సంస్థ ఏఎన్ఐతో అన్నారు.
‘‘సనాతన ధర్మం గురించి క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. సనాతన ధర్మం శతాబ్దాల తరబడి కొనసాగుతోంది. అన్ని మతాలు, వర్గాలు దాని నుంచే ఉద్భవించాయి. భవిష్యత్తులో కూడా ఇది అలాగే ఉంటుంది, దీనిని చెరిపేయలేరు. ఉదయనిధి కాదు, ఇంకెవరు వచ్చినా ఆ పని చేయలేరు. శతాబ్దాలుగా సనాతన ధర్మమే నడుస్తోంది. చివరి వరకు ఇది కొనసాగుతుంది" అని ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఖురాన్: అందమైన చేతిరాతతో రాసిన అరుదైన మత గ్రంథాన్నిబులెట్ ప్రూఫ్ కేస్‌లో భద్రంగా కాపాడుతున్న కేప్‌టౌన్ ముస్లింలు
- హోటల్ రివ్యూలు రాస్తే డబ్బులు ఇస్తామని చెప్పి, లక్షలు కాజేస్తున్న సైబర్ దొంగలు.. ఈ మోసాన్ని ఎలా గుర్తించాలి?
- కొందరికి రాత్రి పూట ఎక్కువసార్లు మూత్రం వస్తుంది, ఎందుకు? పరిష్కారమేంటి?
- ‘తలపై పిడుగు పడి, జ్ఞాపకశక్తి కోల్పోయా. మళ్లీ మామూలు మనిషిని ఎలా అయ్యానంటే...’
- పుతిన్ అనుకూల బ్లాగర్లకు డబ్బే డబ్బు.. ఎలాగంటే..?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














