కొందరికి రాత్రి పూట ఎక్కువసార్లు మూత్రం వస్తుంది, ఎందుకు? పరిష్కారమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనా ఇసాబెల్ కోబో క్యున్కా, ఆంటోనియో సాంపిట్రో క్రెస్పో
- హోదా, ద కన్వర్జేషన్
రాత్రిపూట సరిగా నిద్రపోలేకపోతున్నామంటూ మా ఫ్రెండ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం విన్నాను.
వృద్ధాప్యంలో ఉన్నందున వారు బాత్రూం వెళ్లడానికి రాత్రిపూట చాలాసార్లు నిద్రలోంచి లేస్తారు. నిద్ర సరిగా లేకపోవడవ వల్ల వారు ఉదయం అలసిపోతారు.
ఈ రకమైన ఫిర్యాదులు చాలా సాధారణం. రాత్రిపూట సరిగా నిద్రపోలేని ఈ పరిస్థితిని ‘‘అడల్ట్ నాక్టూరియా’’ అని పిలుస్తారు.
ఒక రాత్రిలో మూత్ర విసర్జన కోసం కనీసం రెండుసార్లు నిద్రలేచే అవసరం ఏర్పడటాన్ని అడల్ట్ నాక్టూరియాగా ఇంటర్నేషనల్ కాంటినెన్స్ సొసైటీ నిర్వచించింది.
నిద్రను, నాణ్యమైన జీవనాన్ని ప్రభావితం చేసే ఈ సమస్య, వయస్సు పెరుగుతున్నకొద్దీ సర్వసాధారణంగా వస్తుంది.
70 ఏళ్లు పైబడిన ప్రతీ అయిదుగురిలో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. చిన్న వయస్సులో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఈ సమస్య ఎవరికైనా రావొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
నాక్టూరియాకు కారణాలు
నాక్టూరియాకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. 1. బ్లాడర్ సామర్థ్యం తగ్గిపోవడం, 2. మూత్రం అధికంగా ఉత్పత్తి కావడం.
మూత్రం ఉత్పత్తిలో పెరుగుదలను పాలీయూరియా అని పిలుస్తారు.
మొదటి కేసు గురించి మాట్లాడుకున్నట్లయితే, బ్లాడర్ అనేది ఒక అవయవం. దాని సామర్థ్యం 300-600 మిల్లీ లీటర్ల మధ్య ఉంటుంది. బ్లాడర్ సామర్థ్యం రెండు కారణాల వల్ల తగ్గిపోతుంది. మొదటిది శరీర నిర్మాణపరమైన మార్పు. పురుషుల్లో మామూలుగా ప్రోస్టేట్ హైపర్‌ట్రోఫీ కారణంగా, మహిళల్లో ఒబెసిటీ, పెల్విక్ ప్రొలాప్స్ కారణంగా బ్లాడర్ సామర్థ్యం తగ్గిపోతుంది.
ఓవరాక్టివ్ బ్లాడర్ సిండ్రోమ్, సిస్టిటిస్, ఇన్‌ఫెక్షన్లు వంటి ఫంక్షనల్ సమస్యల వల్ల కూడా ఇది జరుగుతుంది.
ఇక పాలీయూరియా విషయానికొస్తే, ‘యాంటీడయూరెటిక్ హార్మోన్’ కారణంగా సాధారణంగా మూత్రం ఉత్పత్తి తక్కువగా జరుగుతుంది. కానీ, మన వయస్సు పెరిగే కొద్దీ రాత్రిపూట ఈ హార్మోన్ విడుదల తగ్గిపోతుంది. మూత్రం ఉత్పత్తి పెరగడానికి ఇది ప్రధాన కారణం.
దీనితో పాటు డయాబెటిస్, సిరల పనితీరు క్షీణించడం, గుండె వైఫల్యం, సాయంత్రం వేళల్లో ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్, పొగాకు తీసుకోవడం వల్ల కూడా మూత్రం అధికంగా ఉత్పత్తి అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ఔషధాల వల్ల కూడా...
కొన్ని రకాల ఔషధాలు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాల వల్ల కూడా బ్లాడర్ పనితీరు మారిపోతుంది. మూత్రం ఉత్పత్తి అధికం అవుతుంది. ఆ ఔషధాలు ఏంటంటే,
డయూరెటిక్స్: శరీరంలో ద్రవాల నిలుపుదల, బీపీని తగ్గించే చికిత్సలో వాడతారు.
యాంటీకోలినెర్జిక్స్: ఓవరాక్టివ్ బ్లాడర్ సిండ్రోమ్ చికిత్సలో ఈ ఔషధాలను ఉపయోగిస్తారు.
కాల్షియం చానెల్ బ్లాకర్స్, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ వంటి అధిక రక్తపోటు నివారణ చికిత్సలో వాడే మందులు.
కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్స్. సెరెటోనిన్ వంటి ఔషధాలు యాంటీడయూరెటిక్ హార్మోన్ చర్యలను అడ్డుకుంటాయి.
బైపోలార్ డిజార్డర్ చికిత్సలో వాడే లిథియమ్ ఔషధం కూడా బ్లాడర్ పనితీరుపై ప్రభావం చూపుతుంది.
అయితే, పైన పేర్కొన్న ఔషధాలను వాడే అందరూ నాక్టూరియాకు గురవ్వరనే విషయాన్ని గుర్తించడం ముఖ్యం.
ఒకవేళ ఎవరికైనా నాక్టూరియా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే, వైద్యులను తప్పకుండా సంప్రదించాలి. ఇలా చేయడం వల్ల వైద్యులు మందులు మార్చడం లేదా ప్రత్యామ్నాయ చికిత్స చేయడానికి వీలవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
5 నివారణ చర్యలు
నాక్టూరియాకు అనేక కారణాలు ఉన్నందున వ్యక్తిని బట్టి దీనికి చికిత్స చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన కొన్ని ప్రాథమిక చిట్కాలను ఇక్కడ చూద్దాం.
- జీవనశైలిలో మార్పులు: పడుకోవడానికి 4-6 గంటల ముందు ద్రవాలు తీసుకోవడం తగ్గించాలి. రాత్రిపూట ఆల్కహాల్, కెఫిన్ తీసుకోవడం, స్మోకింగ్ చేయడం మానేయాలి. అధిక బరువు ఉంటే బరువు తగ్గించుకోవాలి. పడుకోవడానికి ముందు మూత్రవిసర్జన చేయడం, పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేయడం మంచిది.
- ఒకవేళ డయాబెటిస్, గుండె వ్యాధులు వంటి వాటి వల్ల నాక్టూరియా వస్తుంటే వాటికి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా నాక్టూరియా లక్షణాలను తగ్గించుకోవచ్చు. వైద్య నిపుణుల సలహాలను పాటించడం చాలా ముఖ్యం.
- డయూరెటిక్స్, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ వంటి చికిత్సల షెడ్యూళ్లను సవరించుకోవాలి. వీటికి సంబంధించి వైద్య నిపుణులను సంప్రదించాలి. చికిత్సల్లో సర్దుబాటు చేయడం ద్వారా వైద్యులు దుష్ప్రభావాలను తగ్గించగలరు.
- మూత్రవిసర్జన నియంత్రణలో పెల్విక్ ఫ్లోర్ ట్రీట్‌మెంట్, ఫిజికల్ థెరపిస్టులతో బ్లాడర్ ట్రెయినింగ్ వంటివి ఉపయోగపడతాయి.
- కొన్నిసార్లు వ్యక్తిగత మూల్యాంకనం తర్వాత వైద్యులు, నాక్టురల్ పాలీయూరియా చికిత్స కోసం మందులను సిపార్సు చేయవచ్చు.
(అనా ఇసాబెల్ కోబో, యూనివర్సిటీ ఆఫ్ కాస్టిలా లా మచా (యూసీఎల్‌ఎం)లో ప్రొఫెసర్. ఆంటోనియో సాంప్రిటో ఒక యూరాలజీ స్పెషలిస్ట్. కాస్టిలా లా మంచా హెల్త్ సర్వీస్‌లో ఆంటోనియో పనిచేస్తున్నారు.)
ఇవి కూడా చదవండి:
- సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి... పిల్లలు, టీనేజర్లు ఆ వలయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














