ఇస్లాం: 200 ఏళ్ళనాటి ఖురాన్‌ను దొంగిలించేందుకు మూడు విఫలయత్నాలు... ఏంటి దీని ప్రత్యేకత?

ఇస్లాం
    • రచయిత, మొహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ న్యూస్, కేప్‌టౌన్

డచ్ వలస వాదులు 200 ఏళ్ల కిందట ఆఫ్రికా దక్షిణ భూభాగానికి పంపించిన ఇండోనేషియన్ ఇమామ్ తన చక్కని చేతిరాతతో ఖురాన్ గ్రంథాన్ని రాశారు. ఆ రాత ప్రతిని కేప్‌టౌన్‌ ముస్లింలు భద్రంగా దాచి ఉంచారు. బొకాప్ జిల్లాలోని ఓ చారిత్రక మసీదులో ఉన్న ఈ ఖురాన్‌ను కేప్‌టౌన్‌ ముస్లింలు జాగ్రత్తగా కాపాడుతున్నారు.

80ల మధ్యలో మసీదు పునరుద్ధరణ పనుల్లో భాగంగా బిల్డర్లు ఔవాల్ మసీదు అటకను పగల కొట్టేటప్పుడు అటక మీద ఓ పేపర్ బ్యాగ్ ఉండటాన్ని చూశారు.

తువన్ గురుగా, మాస్టర్ టీచర్‌గా పేరు పొందిన అబ్దుల్లా ఇబ్న్ కాదీ అబ్దుస్ సలామ్ ఈ ఖురాన్ రాశారని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. 1780లో డచ్‌ వలస పాలనలో ఇండోనేషియాలోని టిడోర్ ఐలండ్ నుంచి ఆయనను కేప్‌టౌన్‌కు రాజకీయ ఖైదీగా తరలించారు. ఆ సమయంలోనే ఆయన ఈ ఖురాన్‌ను రాశారు. డచ్ వలస వాదులకు వ్యతిరేక ఉద్యమంలో చేరినందుకే ఆయనను రాజకీయ ఖైదీగా శిక్షించారు.

“అది బాగా మురికిపట్టి ఉంది. వందేళ్లకు పైగా ఆ అటక మీద ఏముందో ఎవరూ చూసినట్లు లేదని” మసీదు కమిటీ సభ్యుడు కేసిమ్ అబ్దుల్లా బీబీసీతో చెప్పారు.

తువన్ గురు రాసిన మత గ్రంథాలు ఉన్న పెట్టెను కూడా బిల్డర్లు గుర్తించారు. ఖురాన్‌లో పేజీలు విడి ప్రతులుగా వేటికవే ఉన్నాయి. రచనా క్రమాన్ని సూచించేందుకు ఆ పేజీల మీద అంకెలు కూడా లేవు. అంచుల వద్ద చిరిగిపోయిన ఒకటి రెండు పేజీలు మినహా, ఆశ్చర్యకరంగా అవన్నీ చక్కగా ఉన్నాయి.

అరబిక్‌ లిపిలో చక్కని చేతి వ్రాతతో ఎరుపు, నలుపు ఇంకుతో రాసిన ఈ రచనలన్నీ మంచి స్థితిలో ఉన్నాయి.

1694 నాటి వారసత్వంగా వచ్చిన విలువైన కళాఖండాలలో ఒకటైన ఈ ఖురాన్‌ను కాపాడుకోవాలని స్థానిక ముస్లిం సమాజం తపిస్తోంది. అయితే, ఖురాన్‌లోని 6000లకు పైగా శ్లోకాలు రాసి ఉన్న పేజీలను సరైన క్రమంలో అమర్చడమే వారికి సవాలుగా మారింది.

కేప్‌టౌన్ ముస్లిం న్యాయ మండలి అధ్యక్షుడు దివంగత మౌలానా తహా కరణ్ స్థానిక ఖురాన్ పండితులతో కలిసి ఈ పని చేపట్టారు. ఈ పేజీలను వరుసలో అమర్చి దాన్ని బైండింగ్ చెయ్యడానికి వారికి మూడేళ్లు పట్టింది.

అప్పటి నుంచి ఈ ఖురాన్‌ను ఔవల్ మసీదులో ప్రదర్శనకు ఉంచారు. దక్షిణాఫ్రికాలోని ఈ మసీదు 1794లో తువాన్ గురు స్థాపించిన మొదటి మసీదుగా గుర్తింపు పొందింది.

అమూల్యమైన ఈ గ్రంథాన్ని దొంగింలించేందుకు మూడుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో కమిటీ ఈ గ్రంథాన్ని భద్రపరిచేందుకు పదేళ్ల క్రితం ఫైర్, బుల్లెట్ ప్రూఫ్ కేసింగ్ తయారు చేయించింది.

ఇస్లాం

ఫొటో సోర్స్, Getty Images

తువాన్ గురు తాను రాసిన ఐదు కాపీలను రాబిన్ ఐలండ్‌లో బందీగా ఉన్నప్పుడు రాసి ఉంటారని ఆయన జీవిత కథ రాసిన రచయిత షఫీక్ మోర్టన్ అభిప్రాయపడ్డారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా 1960-1980 మధ్య ఇదే జైలులో ఉన్నారు. ఆయన విడుదల తర్వాత కూడా ఈ జైలు కొనసాగింది.

ఈ కాపీల్లో ఎక్కువ బాగం ఆయన 80-90 ఏళ్ల మధ్య వయసులో ఉన్నప్పుడు రాసినట్లు నమ్ముతున్నారు. అరబిక్ ఆయన మాతృభాష కాకపోయినా, ఇంత చక్కగా రాయడం అక్షరాలా ఓ అద్భుతమే.

తువాన్ గురు రెండుసార్లు రాబెన్ ఐలండ్‌లోని జైలులో ఉన్నారనేది మోర్టన్ చెబుతున్న మాట. మొదటి సారి ఆయన 69వ ఏట, 1780 నుంచి 1781 వరకు, రెండోసారి 1786 నుంచి 1791 వరకు జైలులో గడిపారు.

“తన చుట్టూ ఉన్న బానిసలలో ఆత్మ విశ్వాసం పెంచడానికి ఆయన ఖురాన్ రాశారని నేను నమ్ముతున్నాను. తాను ఖురాన్ రాస్తే , దానితో ప్రజల్లో బానిసత్వంపై అవగాహన కల్పించవచ్చని, అదే సమంయలో వారికి గౌరవాన్ని నేర్పించవచ్చని ఆయన భావించారని” మోర్టన్ చెప్పారు.

“మీరు డచ్ కాలం నాటి గ్రంథాలలో కాగితాలను పరిశీలించినట్లైతే తువాన్ గురు ఉపయోగించిన కాగితాలు కూడా అలాగే ఉన్నాయని గుర్తించవచ్చు. ఇది బహుశా అదే కాగితం. “

“ఆయన పెన్నుల విషయానికొస్తే ఆయన వెదురుతో తనకు కావల్సిన పెన్నులను తయారు చేసుకుని ఉండవచ్చు. వలస పాలకుల నుంచి ఎరుపు, నలుపు రంగు సిరా తీసుకోవడం తేలికే.”

దక్షిణాఫ్రికా ఇస్లామిక్ చరిత్ర అధ్యాపకులు షేక్ ఒవైసీ కేప్ టౌన్‌లో చేతిరాత ఖురాన్‌లపై విస్తృత పరిశోధన చేశారు.

అప్పటి డచ్ కాలనీలో ముస్లిం ఖైదీలు, బానిసలు ఇస్లాంను సంరక్షించుకోవాల్సిన అవసరమే తువాన్ గురుని ఖురాన్ రాసేలా ప్రోత్సహించి ఉండవచ్చని ఒవైసీ భావిస్తున్నారు.

వారు ముస్లిం బానిసలకు బైబిల్ బోధిస్తూ క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు తువాన్ గురు ఖురాన్ కాపీలను రాసి పిల్లలకు వాటిని బోధిస్తూ గుర్తుంచుకునేలా చేశారు.

ఇది మత సంరక్షణ, వలసవాద మత మార్పిడులపై పోరాటానికి నిదర్శనం. కేప్‌టౌన్‌కు ఖైదీలు, బానిసలుగా తీసుకువచ్చిన వారి విద్యా ప్రామాణికతను ఇది సూచిస్తుంది.

ఇస్లాం

ఫొటో సోర్స్, Getty Images

తువాన్ గురు.. మా రిఫత్ వల్ ఇమన్ వల్ ఇస్లాం (విశ్వాసం, మతం వల్ల జ్ఞానం) పేరుతో 613 పేజీల అరబిక్ పుస్తకాన్ని రాశారు.

ఇస్లామిక్ విశ్వాసాలకు మార్గం చూపేదిగా భావించే ఈ పుస్తకం కేప్‌టౌన్ ముస్లింలకు విశ్వాసం గురించి బోధించడానికి వందేళ్లకు పైగా ఉపయోగంలో ఉంది.

ఇప్పటికీ మంచి స్థితిలో ఉన్న ఈ పుస్తకం తువాన్ గురు వారసులైన రయప్ కుటుంబం ఆధీనంలో ఉంది. కేప్‌టౌన్‌లోని జాతీయ గ్రంథాలయంలో దీని నమూనా ఉంది.

తన విశ్వాసం గురించి గుర్తుపెట్టుకోగలిగే ప్రతీ దాని గురించి ఆయన రాశారు. దానిని ఇతరులకు బోధించడానికి వచనంగా ఉపయోగించారు అని షేక్ ఒవైసీ చెప్పారు.

తువాన్ గురు చేతి రాతతో ఉన్న ఐదు కాపీలలో మూడు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఔవల్ మసీదులో ఉన్నదాన్ని పక్కన పెడితే మిగతా రెండు ఆయన ముని మనవరాలి దగ్గర, ఇతర కుటుంబ సభ్యుల వద్ద ఉన్నాయి.

ఈ ఖురాన్‌కు దాదాపు వంద నమూనాలను తయారు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వాటిలో ఒక దాన్ని ఇస్లాంలో పవిత్రంగా భావించే వాటిలో మూడో స్థానంలో ఉన్న జెరూసలేంలోని అల్ అక్సా మసీదు గ్రంథాలయానికి అందజేశారు. మరి కొన్నింటిని ఈ ప్రాంతాన్ని సందర్శించిన ప్రముఖులకు అందించారు.

దక్షిణాఫ్రికాలోని అల్ జమా అనే ముస్లిం రాజకీయ పార్టీ నాయకుడు గనీఫ్ హెండ్రిక్స్, 2019 మేలో పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ నమూనాలలో ఒకదాన్ని ఉపయోగించారు.

తువాన్ గురుని రాజకీయ ఖైదీగా దక్షిణ ఆఫ్రికాకు పంపించడం ద్వారా అక్కడ ఇస్లాం వ్యాప్తికి తాము పరోక్షంగా సహకరించామనే విషయాన్ని డచ్ వారు పూర్తిగా గ్రహించలేదు. ప్రస్తుతం కేప్‌టౌన్‌ జనాభాలో ముస్లింలు 46 లక్షల మంది ఉన్నారు. నగర జనాభాలో వీరిది 5శాతం.

ఆయన కేప్‌టౌన్ వచ్చినప్పుడు ఇస్లాం పరిస్థితి ఘోరంగా ఉందని , తాను చేయాల్సింది ఎంతో ఉందని తువాన్ గురు గుర్తించారని మోర్టాన్ చెప్పారు.

ఆఫ్రికాలో ముస్లిం సమాజానికి ఎలాంటి గ్రంథాలు లేవు. వారు సాంస్కృతికంగా తమకు వచ్చిన వారసత్వం వల్లనే ముస్లింలుగా ఉన్నారు.

ముస్లిం సమాజం మనుగడ సాగించడానికి, ప్రస్తుతం మనం చూస్తున్నగౌరవనీయమైన సమాజంగా అభివృద్ధి చెందడానికి ఆయన రాసిన మొదటి ఖురానే కారణమని నేను చెబుతాను.

ఇవి కూడా చదవండి: