భూమికి చంద్రుడు ఏమవుతాడు? బిడ్డా? లేక తోబుట్టువా?

చంద్రుడు

ఫొటో సోర్స్, MIKIELL/GETTY

    • రచయిత, డాక్టర్ టీవీ వెంకటేశ్వరన్
    • హోదా, సీనియర్ సైంటిస్ట్, సైంటిఫిక్ ప్రెస్ ఆర్గనైజేషన్

భూమిపై మానవ చరిత్రలో చంద్రుడి పాత్ర ప్రధానం. చంద్రుడిపై పరిశోధనలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

అసలు చంద్రుడు ఎలా పుట్టాడు? దీనికి సమాధానం చెప్పే ప్రయత్నంలో, శాస్త్రవేత్తలు మూడు ఘటనలు జరిగి ఉండొచ్చని ఊహిస్తున్నారు.

ఆ ఊహలు ఏమిటి?

చంద్రుడు

ఫొటో సోర్స్, Getty Images

భూమి తోబుట్టువు చంద్రుడు?

కవలలు జన్మించినట్లే, భూమితోపాటు కలిసి పుట్టిన కవల తోబుట్టువు(ట్విన్ సిబ్లింగ్) చంద్రుడు అనేది శాస్త్రవేత్తల మొదటి ఊహ.

450 కోట్ల సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థను మనం అంచనా వేస్తే, ఇప్పటిలా అప్పుడు సూర్యుడు, గ్రహాలు లాంటివి ఏవీ లేవు.

ఆ సమయంలో సౌర వ్యవస్థ ఉన్నచోట ఒక భారీ వాయు గోళం ఉంది. భారీగా అంటే ఇప్పటి సూర్యుడి కంటే వేల రెట్లు పెద్దది ఆ వాయుగోళం.

వాయు గోళం తన గురుత్వాకరణ శక్తితో తనవైపు లాక్కుని చేర్చుకున్న వాయు పదార్థాలన్నింటితో, దాని మధ్యలో సూర్యుడు ఏర్పడ్డాడు. సూర్యుని చుట్టూ ఒక ప్లానెటరీ డిస్క్ ఏర్పడింది. అందులో గ్రహాలు కూడా ఏర్పడ్డాయి.

అలా భూమి ఏర్పడుతున్న సమయంలో భూమికి పక్కనే దానితోపాటూ చంద్రుడు కూడా పుట్టాడు అనేది ఖగోళ శాస్త్రవేత్తల మొదటి ఊహ.

అంటే వారు చంద్రుడిని భూమికి కవల తోబుట్టువుగా వర్ణించారు. అయితే, ఈ ఊహలో ఒక చిన్న సమస్య ఉంది. అది ఏంటంటే- భూమి అక్షం 23.5 డిగ్రీల వాలులో తిరుగుతుంటుంది. కానీ, చంద్రుని అక్షం 6.7 డిగ్రీల వాలులో మాత్రమే తిరుగుతుంటుంది.

ఈ రెండూ ఒకేసారి పుట్టి ఉంటే రెండింటి అక్షాల వాలు దాదాపు ఒకేలా ఉండుండాలి. అక్షం వాలులో ఇంత భారీ తేడా ఉండి ఉండకూడదు. అందుకే శాస్త్రవేత్తల్లో ఇది సందేహాలు రేపింది.

చంద్రుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒక ఊహ ప్రకారం, భూమి ఏర్పడినప్పుడే, చంద్రుడు కూడా ఏర్పడ్డాడని నమ్ముతారు

భూమి ప్రియురాలే చంద్రుడు?

శాస్త్రవేత్తల రెండో ఊహ విషయానికి వస్తే, భూమి ప్రియురాలే చంద్రుడు అని కూడా చెబుతారు.

అంటే మనం ఇంతకు ముందు మొదటి ఊహలో సూర్యుడు ఏర్పడటం, దాని నుంచి గ్రహాలు, ఉల్కలు ఏర్పడటం గురించి తెలుసుకున్నాం.

అదే సమయంలో లెక్కలేనన్ని గ్రహాలు, ఉల్కలు ఏర్పడ్డాయని కూడా మనం చెప్పుకున్నాం.

అలా ఎక్కడో ఏర్పడిన చంద్రుడిని భూమి తన గురుత్వాకర్షణ శక్తితో దగ్గరగా తెచ్చుకుంది. దానిని ఆకర్షించి తన చుట్టూ తిప్పుకుంది. ఇదే శాస్త్రవేత్తల రెండో ఊహ.

మనం ఒక దగ్గర పుడితే, మన ప్రియుడు/ ప్రియురాలు వేరే ఎక్కడో పుట్టి ఉంటారు. ఎక్కడో ఇద్దరూ కలుస్తారు. పరస్పరం ఇష్టపడతారు. అలాగే ఎక్కడో పుట్టిన చంద్రుడిని భూమి తన గురుత్వాకర్షణ శక్తితో ఆకర్షించి తన చెంతకు చేర్చుకుంది అని ఊహించారు శాస్త్రవేత్తలు.

సౌర వ్యవస్థలో ఇలాంటివి మనకు కనిపిస్తాయి. అంగారక గ్రహాన్నే చూస్తే, అది తన చుట్టూ ఇద్దరు చంద్రుళ్లను తిప్పుకుంటోంది.

అంగారకుడి చుట్టూ తిరిగే ఆ రెండు ఉపగ్రహాలు కూడా సౌర వ్యవస్థలో వేరే ఎక్కడో ఏర్పడ్డాయి. అవి అనుకోకుండా అంగారక గ్రహానికి దగ్గరగా రాగానే, దాని గురుత్వాకర్షణకు ఆకర్షితులై అంగారకుడి చుట్టూ తిరుగుతున్నాయి.

చంద్రుడు

ఫొటో సోర్స్, Getty Images

అంగారకుడి చుట్టూ తిరిగే ఆ రెండు ఉపగ్రహాల్లాగే, చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాడనే శాస్త్రవేత్తల రెండో ఊహ. అయితే ఈ ఊహను అంగీకరించడంలో చిన్న సమస్య ఉంది.

చంద్రుడిపై కనిపించే రాళ్లు, మట్టి నమూనాలకు భూమిపై ఉన్న మట్టి, రాళ్లకు సారూప్యం ఉన్నట్టు తేలింది. కాబట్టి ఆ రెండూ వేర్వేరు ప్రదేశాల్లో ఏర్పడి ఉంటాయి అనడానికి అవకాశం లేకుండా పోయింది.

మనకు బాగా తెలిసిన వాయువు ఆక్సిజన్ విషయానికి వస్తే, ప్రకృతిలో ఇది మనకు 16, 17, 18 అనే మూడు ఐసోటోపుల్లో లభిస్తుంది. వీటిలో ఆక్సిజన్ 18 ఐసోటోపు, ఆక్సిజన్ 17 కంటే బరువుగా ఉంటుంది. అలాగే ఆక్సిజన్ 17 ఐసోటోపు ఆక్సిజన్ 16 కంటే బరువుగా ఉంటుంది.

బియ్యం పట్టించేటప్పుడు బియ్యం ఒకవైపు, ఊక మరోవైపు పడిపోవడం మనం చూస్తుంటాం.

అలాగే సూర్యుడి చుట్టూ ఇతర గ్రహాలు ఏర్పడినప్పుడు అధిక సాంద్రత గల ఆక్సిజన్ 18 ఐసోటోపు, సూర్యుడికి దగ్గరగా ఉండిపోయింది. సూర్యుడికి దూరంగా ఉండే ఆక్సిజన్ వాయువుల సాంద్రత తక్కువగా ఉంటుంది.

ఇప్పుడిక చంద్రుడు, భూమి విషయానికొద్దాం. ఈ రెండు గ్రహాల్లో ఆక్సిజన్ 16, 17, 18ల శోషణ రేటు, ఒకే పిండితో తయారు చేసిన ఇడ్లీల తరహాలో ఉంటుంది.

దీన్ని బట్టి చంద్రుడు ఎక్కడో ఏర్పడి భూమి వైపు ఆకర్షితుడయ్యాడనే వాదన పూర్తి ఆమోదయోగ్యం కాదని చెప్పొచ్చు.

చంద్రుడు

ఫొటో సోర్స్, Getty Images

భూమి బిడ్డే చంద్రుడు?

ఇప్పటివరకు మనం పరిశీలించిన శాస్త్రవేత్తల రెండు ఊహల నుంచి మనకు రెండు నిర్దిష్టమైన విషయాలు తెలిశాయి. అవేంటంటే చంద్రుడు, భూమి రెండింటిపైనా ఆక్సిజన్ ఐసోటోపుల సాంద్రత ఒకే విధంగా ఉంటుంది. రెండోది, భూమి అక్షం వంపు 23.5 డిగ్రీలు అయితే, చంద్రుని అక్షం వంపు 6.7 డిగ్రీలు మాత్రమే.

ఈ రెండు అంశాల ఆధారంగా చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు అనే అంశాన్ని, శాస్త్రవేత్తల మూడో ఊహ వివరిస్తుంది.

సూర్యుడు, భూమి ఏర్పడటానికి సుమారు 450 కోట్ల సంవత్సరాల ముందు సౌర వ్యవస్థ అంతటా రకరకాల పరిమాణాల్లో ఉల్కలు ఉన్నాయి.

ఉల్కలు అక్కడక్కడా అస్థిరంగా కదులుతున్నాయి. ఈ ఉల్కల్లో కొన్ని చాలా చిన్నవి అయితే, కొన్ని అంగారక గ్రహం కంటే పెద్దవిగా కూడా ఉండొచ్చు. ఆ సమయంలో పెద్ద గ్రహం ఒకటి భూమిని ఢీకొట్టింది. ఆ గ్రహానికి శాస్త్రవేత్తలు థియా అనే పేరు పెట్టారు. రెండు గ్రహాలూ ఢీకొన్నప్పుడు ఆ తాకిడితోనే నేటి భూమి, చంద్రుడు ఏర్పడ్డాయనేది మూడో సిద్ధాంతం.

సూర్యుడు, భూమి ఏర్పడిన ఆరు కోట్ల సంవత్సరాల తర్వాత ఈ ఘటన జరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

ఆ సమయంలో భూమి చాలా వేడిగా ఉంది. ద్రవ స్థితిలో, జిగటగా ఉంది.

చంద్రుడు

ఫొటో సోర్స్, Getty Images

ఆ సమయానికి అంగారకుడి సైజులో ఉన్న థియా అనే భారీ గ్రహం కూడా భూమిలాగే ఉంది. దీంతో ఆ రెండూ ఒకదాన్ని ఒకటి ఢీకొన్నప్పుడు అవి ముక్కలైపోవడానికి బదులు, తాకిడి నుంచి వచ్చిన వేడికి రెండూ కరిగి ఒక ముద్దలా మారిపోయాయి. తర్వాత రెండుగా విడిపోయాయి.

అలా విడిపోవడం వల్లే భూమి, చంద్రుడిపై ఆక్సిజన్ ఐసోటోపుల సాంద్రతలు దాదాపు ఒకేలా ఉంటున్నాయని, ఆ రెండు గ్రహాలూ ఢీకొని విడిపోవడం వల్లే భూమి అక్షానికి ఒక వంపు, చంద్రుడి అక్షానికి మరో వంపు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది మూడో ఊహ.

చంద్రుడు ఇలాగే ఏర్పడి ఉండొచ్చు అనడానికి ఎక్కువ అవకాశం ఉన్న ఈ మూడో ఊహ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.

భూమి అంతర్భాగంలో ఇనుము, నికెల్ లాంటి లోహాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ, చంద్రుడిపై అలా లేదు. ఈ వ్యత్యాసం ఎందుకు అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి.

భూమిని థియా గ్రహం వచ్చి ఢీకొట్టింది. అలా ఢీకొట్టినప్పుడు భూమి ఉపరితలంలో ఉన్నవి మాత్రమే థియా గ్రహంతో కలిశాయి. తర్వాత అవి విడిపోయి రెండయ్యాయి. ఆ సమయంలో భూమి లోపల ఉన్న ఇనుము, నికెల్ అలాగే ఉండిపోయాయి. అందుకే భూమి పై పొరలు, చంద్రుడి పైపొరలూ ఒకేలా ఉంటాయి.

చంద్రుడు

ఫొటో సోర్స్, Getty Images

ఏ ఊహకు అంగీకారం ఎక్కువ?

ఇప్పుడు మూడు ఊహలనూ మరోసారి చూద్దాం.

భూమి అక్షం, చంద్రుని అక్షానికి భిన్నంగా ఉంది.

అయితే రెండు ఉపరితలాలపై ఉన్న ఐసోటోపుల సాంద్రత మాత్రం దాదాపు ఒకేలా ఉంటుంది.

భూమి అంతర్భాగంలో ఇనుము, నికెల్ లాంటివి ఉంటే చంద్రుడిలో అలా లేవు.

ఈ మూడింటిని కలిపి విశ్లేషించినపుడు, భూమి వల్లే చంద్రుడు పుట్టాడు అనే శాస్త్రవేత్తల మూడో ఊహకు ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నాయి.

అందుకే చంద్రుడు అనేది భూమితోపాటూ పుట్టిన కవల తోబుట్టువు కాదు, భూమి తన చుట్టూ తిప్పుకొనే ప్రియురాలు కూడా కాదు, భూమి వల్ల పుట్టిన బిడ్డ అనే ఊహనే శాస్త్రవేత్తలు విస్తృతంగా అంగీకరిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, Moon Secrets: చంద్రుడు ఎలా పుట్టాడు? చంద్రుడి పుట్టుకపై ఎందుకిన్ని సిద్ధాంతాలు పుట్టాయి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)