చంద్రుడిపై స్థావరం: అంతరిక్షంలో ఎక్కువ కాలం జీవించేందుకు న్యూక్లియర్ ఫ్యుయెల్ సెల్స్

చంద్రుడిపై వ్యోమగాములు

ఫొటో సోర్స్, ROLLS ROYCE

    • రచయిత, పీటర్ గిల్లీబ్రాండ్, రాబ్ థామస్
    • హోదా, బీబీసీ న్యూస్

చంద్రుని మీద వ్యోమగాములు ఎక్కువకాలం జీవించి ఉండేందుకు అవసరమైన ఇంధనాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

నాసా నేతృత్వంలోని ఆర్టెమిస్ ప్రోగ్రామ్ 2030 నాటికి చంద్రుని మీద ఒక ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని కూడా భావిస్తోంది.

చంద్రుని మీద జీవం మనుగడ సాగించేందుకు అవసరమైన శక్తిని బాంగర్ యూనివర్సిటీ న్యూక్లియర్ ఫ్యుయల్ సెల్స్ రూపంలో డిజైన్ చేసింది. ఇవి గసగసాల పరిమాణంలో ఉంటాయి.

నిజానికి ఇదొక పెద్ద సవాలని, అదే సమయంలో ఉత్సాహాన్నిచ్చే ప్రయత్నమని ఈ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సైమన్ మిడిల్‌బర్గ్ అన్నారు.

ప్రొఫెసర్ మిడిల్‌బర్గ్
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ మిడిల్‌బర్గ్

అంగారకుడిని చేరుకోవడానికి ఒక గేట్ వేగా భావిస్తున్న చంద్రుడి మీద ఆధునిక సాంకేతికతకు అవసరమైన వనరులు ఎన్నో ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

చంద్రుని వద్ద కొంతకాలం ఉండగలిగితే అక్కడి నుంచి ఇతర గ్రహాలకు వెళ్ళడానికి వీలవుతుందని వారు ఆశిస్తున్నారు.

బాంగర్ యూనివర్సిటీ న్యూక్లియర్ ఫ్యూచర్స్ ఇనిస్టిట్యూట్ ప్రయోగశాలలోకి వెళ్ళడానికి ప్రత్యేక అనుమతి పొందిన బీబీసీ అక్కడ ఇంధన వనరుల శాస్త్రవేత్తలతో మాట్లాడింది.

ఇంధన పరిశోధనలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఈ విద్యా సంస్థ రోల్స్ రాయిస్, యూకే స్పేస్ ఏజెన్సీ, నాసా, లాస్ ఆలమోస్ నేషనల్ లేబరేటరీస్‌ల భాగస్వామ్యంతో తన కృషిని కొనసాగిస్తోంది.

కొత్తగా అభివృద్ధి చేసిన ఇంధనాన్ని రాబోయే కొన్ని నెలల్లో పరీక్షిస్తామని ప్రొఫెసర్ మిడిల్‌బర్గ్ చెప్పారు.

చంద్రుని మీద ఉష్ణోగ్రత కనిష్ఠ స్థాయికి -248 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంటుంది. అక్కడ వేడిని పెంచే వాతావరణం లేకపోవడమే అందుకు కారణం.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన భారత్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపి చరిత్ర సృష్టించిన భారత్

బాంగర్ యూనివర్సిటీ పరిశోధకులు అత్యల్ప పరిమాణంలో ఉండే న్యూక్లియర్ ఇంధనం సెల్స్‌ను ట్రిసోఫ్యుయెల్‌ అని అంటున్నారు.

దీన్ని ఇటీవలే వారు తమ భాగస్వామ్య సంస్థలకు పరిశోధన నిమిత్తం పంపించారు.

ఈ ట్రిసోఫ్యుయెల్‌ను రోల్స్ రాయిస్ తయారు చేసిన మైక్రో న్యూక్లియర్ జెనరేటర్‌కు శక్తిని ఇచ్చేందుకు ఉపయోగిస్తారు.

“చిన్న కారు సైజులో ఉండే ఈ జెనరేటర్‌ను ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. రాకెట్లో కూడా అమర్చవచ్చు” అని మిడిల్‌బర్గ్ అన్నారు.

ఈ ఇంధనాన్ని రకరకాల మాధ్యమాలలో పరీక్షించి, చివరగా 2030లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న మూన్ బేస్ మీదకు రాకెట్లో పంపిస్తారు.

“వాటిని రాకెట్లో అంతరిక్షంలోకి ఎంత వేగంతోనైనా పంపించవచ్చు. అప్పటికీ అవి చంద్రుడి మీదకు చేరుకున్న తరువాత సురక్షితంగా పని చేస్తాయి” అని మిడిల్‌బర్గ్ వివరించారు.

డాక్టర్ ఫైలిస్ మకురుంజే
ఫొటో క్యాప్షన్, డాక్టర్ ఫైలిస్ మకురుంజే

ఇటీవలే, భారత్ తన చంద్రయాన్ మిషన్‌ను విజయవంతంగా చంద్రుని మీదకు పంపించింది. చంద్రుని దక్షిణ ధ్రువం మీద విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా కాలు మోపింది.

ప్రజ్ఞాన్ రోవర్ ఓ విడత తన విధుల్ని కూడా విజయవంతంగా నిర్వహించింది. చంద్రుని మీద నీటి జాడలను గుర్తించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యాలలో ఒకటి.

నీటి జాడలు ఉన్నట్లు రుజువైతే చంద్ర మండలం మానవ నివాసానికి యోగ్యంగా ఉండే అవకాశం ఉంది.

కాగా, బాంగర్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన న్యూక్లియర్ ఫ్యుయెల్ సెల్స్‌ను భూమి మీద కూడా ఎడారి వంటి ప్రాంతాల్లో ఉపయోగించవచ్చని ప్రొఫెసర్ మిడిల్‌బర్గ్ చెప్పారు. ఈ కృషిని తాము అంతర్జాతీయంగా ముందుకు తీసుకువెళ్తామని అన్నారు.

డాక్టర్ ఫైలిస్ మకురుంజే నేతృత్వంలో బాంగర్ టీమ్ ఈ సరికొత్త ఇంధనాన్ని రాకెట్లను మండించేందుకు కూడా ఉపయోగించాలని చూస్తున్నారు.

“ఇది చాలా శక్తిమంతమైనది. అత్యధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనితో సుదూరంగా ఉన్న గ్రహాలను కూడా చేరుకోవడానికి వీలవుతుంది” అని ఆమె అన్నారు.

ఈ కొత్త టెక్నాలజీ అంగారకుడిపైకి వెళ్లేందుకు కచ్చితంగా సమయాన్ని తగ్గించనుందని మకురుంజే అన్నారు.

‘‘న్యూక్లియర్ థర్మల్ ప్రొపల్షన్‌తో నాలుగు నుంచి ఆరు నెలల్లో అంగారకుడిపైకి వెళ్లొచ్చు. ప్రస్తుతం దీనికి తొమ్మిది నెలలకు పైగా పడుతోంది’’ అని ఆమె చెప్పారు.

చంద్రుడు

ఫొటో సోర్స్, GETTY IMAGES

2030లో చంద్రుడిపై స్థావరాలు

చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ప్రపంచం పరుగు తీసే దిశగా ఈ ఇంధనం ఉపయోగపడుతుందని భౌగోళిక రచయిత, జర్నలిస్ట్ టిమ్ మార్షల్ అన్నారు.

‘‘2030 కాలంలో చంద్రుడిపై స్థావరాలు నెలకొల్పుతారని నేను విశ్వసిస్తున్నాను. బహుశా ఒకటి చైనాది, మరోకటి అమెరికాది ఉండొచ్చు’’ అన్నారు.

‘‘ నేను చాలా నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే, ఒకవేళ ఇది అతిపెద్ద పురోగతి అయితే, ఈ శక్తిమంతమైన దేశాలు అక్కడకు వెళ్లకుండా ఉండలేవని నేను అనుకుంటున్నా’’ అని చెప్పారు.

‘‘చైనా తొలి ఇటుకతో 2028లో అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు చూస్తోంది. అలా స్థావరం ఏర్పాటు చేసే తొలి దేశం బహుశా చైనాయే అవుతుందని చెప్పవచ్చు. 2030 ప్రారంభంలోనే ఇరు దేశాలు చంద్రుడిపై స్థావరాలను ఏర్పాటు చేస్తాయి’’ అని తెలిపారు.

21వ శతాబ్దపు సాంకేతికలు ఉపయోగించే టైటానియం, లీథియం, సిలికాన్, ఐరన్, ఇంకా ఎన్నో రకాల ఖనిజాలు అక్కడున్నాయని భావిస్తున్నారు.

‘‘ఈ ఖనిజాలు అక్కడ ఏ స్థాయిలో ఉన్నాయో తెలియనప్పటికీ, చాలా కంపెనీలు మాత్రం ఆర్థికంగా అత్యధిక ప్రయోజనం చేకూర్చేంత ఖనిజాలు అక్కడున్నాయని భావిస్తున్నాయి’’ అని మార్షల్ చెప్పారు.

కాలం చెల్లిపోతున్న అంతరిక్ష చట్టాలను ఉదహరిస్తూ, అంతరిక్షం ఆర్థిక ప్రయోజనాలు తెర ముందుకు వస్తుంటే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుందని హెచ్చరించారు.

“అంతరిక్ష ఒప్పందంలోని నియమాలను 1967లో రాసుకున్నారు. 50 ఏళ్ళ నాటి ఈ ఒప్పందంలో ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం ప్రస్తావన లేదు. స్పేస్ రేస్ గురించిన వివరాలు లేవు. ముఖ్యంగా, అందులో వాణిజ్యపరమైన కోణం అసలే లేదు. ఎందుకంటే, అప్పట్లో దాన్ని ఒక దేశం సూచించినట్లుగానే రాయడం జరిగింది” అని మార్షల్ వివరించారు.

ఈ నిబంధనలు కొత్తగా రాసుకుని, ఐక్యరాజ్యసమితి ఆమోదం పొందకపోతే, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తారు. దానివల్ల చాలా ప్రమాదాలు ఎదురవుతాయని కూడా ఆయన అన్నారు.

అంతరిక్ష శోధనకు సంబంధించిన మార్గదర్శకాలు అమల్లో లేకపోతే, చట్ట నియంత్రణ లేని పోటీ నెలకొంటుంది” అని మార్షల్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, న్యూక్లియర్ ఫ్యుయెల్ సెల్స్: చంద్రునిపై ఎక్కువ కాలం నివాసం వీటితో సాధ్యమవుతుందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)