చంద్రుడిపై స్థలాన్ని కొనుక్కోవచ్చా?

చంద్రుడు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పెదగాడి రాజేశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చంద్రయాన్-3 విజయం తర్వాత అందరి దృష్టీ చంద్రుడిపై పడుతోంది. అసలు చంద్రుడు ఆవాసానికి అనుకూలంగా ఉంటాడా, అక్కడ ఆక్సిజన్ దొరుకుతుందా? అని చాలా మంది ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు.

అయితే, కొంతమంది చంద్రుడిపై ఇప్పటికే స్థలాన్ని కూడా కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి.

ఇంతకీ చంద్రుడిపై స్థలాన్ని ఎవరు అమ్ముతున్నారు? ఇలా అక్కడి స్థలాలను కొనుక్కోవడం చట్టబద్ధమేనా? వీటిని కొనుగోలు చేసినవారు ఏం అంటున్నారు? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

చందమామపై నేల రిజిస్ట్రేషన్

ఫొటో సోర్స్, Raajeevvv

‘మేర్ ఇంబ్రియంలో ఐదు ఎకరాలు’

చంద్రుడిపై స్థలాన్ని కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న వారిలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త, న్యూమరాలజిస్టు 50 ఏళ్ల రాజీవ్ కూడా ఒకరు.

న్యూయార్క్‌కు చెందిన ‘ద లూనార్ రిజిస్ట్రీ’ నుంచి 2002లో ఆయన ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు బీబీసీతో చెప్పారు. చంద్రుడిపై ‘మేర్ ఇంబ్రియం’ పరిసరాల్లో రూ.7,000తో ఐదు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. ‘మేర్ ఇంబ్రియం’ చంద్రుడి ఉత్తరార్ధ గోళంలో ఉంటుంది.

ద లూనార్ రిజిస్ట్రీ ఒక ఇంటర్నేషనల్ అడ్వొకసీ గ్రూప్. చంద్రుడిపై ఆవాసాల ఏర్పాటు, పరిశోధనలు, ప్రైవేటైజేషన్ కోసం పనిచేస్తున్నట్లుగా సంస్థ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

రాజీవ్

ఫొటో సోర్స్, Raajeevvv

ఫొటో క్యాప్షన్, చంద్రుడిపై స్థలాన్ని కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న వారిలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త, న్యూమరాలజిస్టు 50 ఏళ్ల రాజీవ్ కూడా ఒకరు

ప్రకటనలతో...

అసలు ఇలా కొనుగోలు చేయాలనే ఆలోచన తనకు ఎలా వచ్చిందో రాజీవ్ బీబీసీతో చెప్పారు. ‘’20 ఏళ్ల క్రితం నేను పనిచేస్తుండగా ఇంటర్నెట్‌లో ఒక ప్రకటన కనిపించింది. దానిలో చంద్రుడిపై స్థలాన్ని అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. మొదట్లో నేను దాన్ని నమ్మలేదు. కానీ, కాస్త సమాచారం తెలుసుకున్న తర్వాత ఐదు ఎకరాల స్థలాన్ని కొన్నాను’’ అని ఆయన చెప్పారు.

ఎందుకు దీన్ని కొనుగోలు చేశారో కూడా ఆయన బీబీసీతో చెప్పారు. ‘‘ఆ స్థలం మానవాళికి మేలు చేస్తుందని నేను కొనుగోలు చేశాను. నేను అక్కడికి వెళ్లలేనని నాకు తెలుసు. కానీ, 50 లేదా 100 ఏళ్ల తర్వాత అక్కడ మనుషులు ఆవాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అప్పుడు మా నిధులు, స్థలాలు ఉపయోపడతాయి’’ అని ఆయన అన్నారు.

లలిత్ మొహతా

ఫొటో సోర్స్, Lalit Mohata

ఫొటో క్యాప్షన్, టెక్ నిపుణుడు 46 ఏళ్ల లలిత్ మొహతా కూడా చంద్రుడిపై రెండు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు

మరోవైపు బెంగళూరుకు చెందిన టెక్ నిపుణుడు 46 ఏళ్ల లలిత్ మొహతా కూడా ఇలానే చంద్రుడిపై రెండు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు.

2006లో ద లూనార్ రిజిస్ట్రీ నుంచి రూ.3000తో రెండు ఎకరాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు.

ఎందుకు ఈ స్థలాన్ని కొనుగోలు చేశారో ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘నేను చంద్రుడిపై ప్రస్తుతం జీవించలేనని నాకు తెలుసు. కానీ, చంద్రయాన్-3 లాంటి ప్రయోగాలతో భవిష్యత్‌లో అక్కడ ఆవాసాలు సాధ్యపడతాయనే ఆశలు చిగురిస్తున్నాయి. అక్కడ ఆవాసాలు ఏర్పడేటప్పుడు మా భూమి ఉపయోగపడొచ్చు’’ అని ఆయన అన్నారు. దీన్ని ఒక లాంగ్‌టర్మ్ ఇన్వెస్టిమెంట్‌గా ఆయన చెప్పారు.

మరోవైపు జమ్మూకశ్మీర్‌కు చెందిన 49 ఏళ్ల వ్యాపారవేత్త రూపేశ్ మాసన్ కూడా ఇలానే చంద్రుడిపై స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తాజాగా మీడియాతో వెల్లడించారు. ఇదివరకు కూడా చాలా మంది చంద్రుడిపై స్థలాలు కొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వీరిలో చాలా మంది లూనార్ రిజిస్ట్రీ నుంచే కొనుగోలు చేశారు.

చందమామపై ల్యాండ్ రిజిస్ట్రేషన్

ఫొటో సోర్స్, Raajeevvv

ఎవరు విక్రయిస్తున్నారు?

లూనార్ రిజిస్ట్రీ పూర్తి పేరు ‘ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ’ (ఐఎల్ఎల్ఆర్). ఇది 1999లో ఏర్పాటైంది.

2019 జులైనాటికి ప్రపంచ వ్యాప్తంగా 3,26,000 మంది చంద్రుడిపై 1.25 మిలియన్ ఎకరాల స్థలాల కోసం తమ దగ్గర రిజిస్టర్ చేసుకున్నారని ఐఎల్ఎల్ఆర్ చెబుతోంది.

అయితే, చంద్రుడికి ఓనర్‌గా తమని తాము భావించడం లేదని, కేవలం ‘లిమిటెడ్ ల్యాండ్ క్లెయిమ్స్’నే తాము రిజిస్టర్ చేస్తున్నామని తమ వెబ్‌సైట్‌లోనే సంస్థ పేర్కొంది.

అసలు దేని ఆధారంగా ఇలాంటి రిజిస్ట్రేషన్‌లు చేయిస్తున్నారో తెలుసుకునేందుకు సంస్థను బీబీసీ సంప్రదించింది. కానీ, వార్త రాసే సమయానికి ఈ-మెయిల్స్‌కు, కాల్స్‌కు ఎలాంటి స్పందనా రాలేదు.

చంద్రుడిపై నేల

ఫొటో సోర్స్, getty Images

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

చంద్రుడు సహా ఇతర ఖగోళ వస్తువులపై ఐక్యరాజ్యసమితిలోని సభ్య దేశాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

‘యునైటెడ్ నేషన్స్ ట్రీటీస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆన్ అవుటర్ స్పేస్‌’గా పిలిచే ఈ ఒప్పందంపై భారత్ సహా 100కుపైగా దేశాలు సంతకం చేశాయి.

‘‘చంద్రుడు సహా అంతరిక్షంలోని సహజ వనరులన్నీ మానవాళి మొత్తానికి చెందుతాయి. ఏ దేశమూ తన శక్తిని ఉపయోగించి లేదా ఇతర మార్గాల్లో ఈ సంపదను సొంతం చేసుకోవాలని ప్రయత్నించకూడదు’’ అని ఈ ఒప్పందంలోని ఆర్టికల్ 2 చెబుతోంది.

అయితే, 1967నాటి ఈ ఒప్పందంలో ప్రైవేటు వ్యక్తులకు చంద్రుడిపై హక్కులు ఉండవని ఎక్కడా పేర్కొనలేదని చెబుతూ, అమెరికాకు చెందిన డేనిస్ హోప్ అనే వ్యక్తి ఇలానే ఒకప్పుడు చంద్రుడిపై స్థలాలను విక్రయానికి పెట్టారని, దీని ద్వారా ఆయన భారీగా డబ్బులు కూడా సంపాదించారని గతంలో మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇలా ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థల నుంచి చంద్రుడిపై స్థలాలను కొనుగోలు చేయడంతో డబ్బులు వృథా తప్పితే మరేమీ ఉండదని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్ రఘునందన్ కుమార్ చెప్పారు.

‘‘అంతరిక్ష సంపద మానవాళి మొత్తానికి చెందుతుందని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. అయితే, అందులో కొన్ని లూప్‌హోల్స్‌ను పట్టుకొని ప్రైవేటు వ్యక్తులకు చెందొచ్చు కదా అంటున్నారు. అసలు మానవాళికి చెందే ఆస్తిని ఒక ప్రైవేటు సంస్థ లేదా వ్యక్తులు ఎలా విక్రయించగలరు?’’ అని ఆయన ప్రశ్నించారు.

మహేశ్ బాబు

ఫొటో సోర్స్, Facebook/Mahesh Babu

‘‘మహేశ్ పేరు మీద ఇలానే నక్షత్రం కొన్నారు’’

సినీ నటుడు మహేశ్ బాబు పేరు మీద కూడా ఇటీవల ఆయన అభిమానులు ఒక నక్షత్రం కొన్నట్లు వార్తలు వచ్చాయని ఎన్ రఘునందన్ చెప్పారు. ‘‘మహేశ్ బాబు పుట్టిన రోజుకు ఆయన అభిమానులు నక్షత్రం కొని గిఫ్ట్ ఇచ్చినట్లు ఆ వార్తల్లో రాశారు. ఇదివరకు షారూఖ్ ఖాన్‌కు కూడా ఇలానే అభిమానులు గిఫ్ట్ ఇచ్చారు. ఇలాంటి వార్తలు ఈ మధ్య తరచూ కనిపిస్తున్నాయి’’ అని రఘునందన్ చెప్పారు.

‘‘చంద్రుడిపై మొదట కాలు మోపిన దేశాలే అసలు ఎలాంటి హక్కులూ ఉన్నాయని చెప్పడం లేదు. కాబట్టి ఇలా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు చేసే రిజిస్ట్రేషన్లకు ఎలాంటి చట్టబద్ధతా ఉండదు. వీటి వల్ల డబ్బులు వృథా’’ అని ఆయన అన్నారు.

రఘునందన్ వాదనతో ఉస్మానియా యూనివర్సిటీ ఆస్ట్రానమీ ప్రొఫెసర్ శాంతి ప్రియ కూడా ఏకీభవించారు.

‘‘ఇంటర్నేషనల్ స్పేస్ ట్రీటీ ప్రకారం విడివిడిగా వ్యక్తులకు అంతరిక్ష సంపదపై హక్కులు ఉండవు. దేశాల విషయంలోనూ అంతే. అది అందరి సంపద’’ అని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, 50 ఏళ్ల నాటి అపోలో మిషన్ చిత్రాలకు స్పష్టమైన ఆకృతి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)