ఇండియా-భారత్: గత వందేళ్లలో ప్రపంచంలోని అనేక దేశాలు పేర్లు ఎలా మార్చుకున్నాయంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశం పేరును ఇండియా అని కాకుండా అధికారికంగా భారత్ అని మారుస్తారంటూ ఊహాగానాలు, ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. జీ 20 సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ఇస్తున్న విందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలో ఆ మేరకు రాష్ట్రపతిని ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొనడంతో ఈ చర్చ మొదలైంది.
బీజేపీ నాయకులు, జాతీయవాద భావజాలంలో ఉండే వివిధ రంగాలకు చెందినవారు దీనికి మద్దతు పలుకుతుండగా.. ఇప్పటికే అంతర్జాతీయంగా ఇండియా అనే పేరు విస్తృతంగా వాడుకలో ఉండడంతో ఇప్పుడు దాన్ని మార్చడం అనాలోచిత చర్య అంటున్నారు కాంగ్రెస్, ఇతర విపక్ష నాయకులు.
వీరేంద్ర సెహ్వాగ్ వంటివారు మరో అడుగు ముందుకేసి వచ్చే నెలలో ప్రారంభం కానున్న క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై భారత్ అని రాయాలని సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇండియా పేరు మారుస్తారా? లేదా?.. ఇది ఊహాగానమా? వాస్తవమా? అనేది పక్కన పెడితే అసలు ఒక దేశం పేరు మార్చడమనేది కొత్తేమీ కాదు. గతంలో ఇలా పేరు మార్చుకున్న దేశాలు చాలా ఉన్నాయి.
తాజాగా చూసుకుంటే 2023లో మైక్రోనేసియా పేరును ‘ఫెడరల్ స్టేట్ ఆఫ్ మైక్రోనేసియా’గా మార్చారు.
అంతకుముందు 2022 చివర్లో టర్కీ తన పేరును తుర్కియేగా మార్చుకుంది.
ఐక్యరాజ్య సమితి (ఐరాస) కూడా ఆ పేరు మార్పును ఆమోదించింది.
దాంతో ప్రపంచ దేశాలన్నీ అప్పటి నుంచి ఆ దేశాన్ని తుర్కియేగానే పేర్కొంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
గత శతాబ్ద కాలంలో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తమ పేర్లను మార్చుకున్నాయి.
కొన్ని దేశాల పేర్లు స్వల్పంగా మారితే మరికొన్ని దేశాల పేర్లు అసలు అంతకుముందు పేరుతో ఏమాత్రం సంబంధం లేనంతగా మారాయి.
ఇతర దేశాల నుంచి స్వాతంత్ర్యం పొందడంతో పేరు మార్చుకున్నవి కొన్నయితే.. ఒక పెద్ద దేశం వేర్వేరు దేశాలుగా విడిపోవడం వల్ల కొత్త పేర్లతో ప్రపంచానికి పరిచయమైనవి మరికొన్ని.
అలా కాకుండా రాజకీయ కారణాలు, జాతీయవాద భావనలతో పేర్లు మార్చుకున్న దేశాలు మరికొన్ని.

ఫొటో సోర్స్, Getty Images
2000 సంవత్సరం తరువాత పేరు మారినవి..
2001
కామురోజ్: ప్రస్తుత శతాబ్దంలో పేరు మార్చుకున్న తొలి దేశం కామురోజ్. 2001లో దీని పేరును ‘యూనియన్ ఆఫ్ కామురోజ్’గా మార్చారు. ఆగ్నేయ ఆఫ్రికా దేశమైన ఇది మూడు దీవుల సమూహం.
హిందూ మహాసముద్రంలో మడగాస్కర్‌కు ఎగువన ఉంటుంది. ఆఫ్రికా మెయిన్‌లాండ్‌లోని మొజాంబిక్, టాంజేనియాలు దీనికి సమీపంలో ఉంటాయి. కామురో ఐలాండ్స్‌గా పిలిచే ఈ మూడు దీవుల సమూహంలో ప్రధానమైనది కామురోజ్ ద్వీపం. రాజధాని మొరోనీ ఇక్కడే ఉంటుంది.
ఈ దేశం పేరును అంతకుముందు 1978లోనూ ఓసారి మార్చారు. 1975లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత ‘ఫెడరల్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ కామురోజ్’గా మార్చారు. 98 శాతం సున్నీ ముస్లింలు ఉండడంతో అప్పట్లో ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మార్చినప్పటికీ 2001లో మళ్లీ ‘యూనియన్ ఆఫ్ కామురోజ్’గా మార్చారు. ప్రస్తుతం ఐరాసలోనూ ఇదే పేరు నమోదై ఉంది.
2002
2002లో రెండు దేశాల పేర్లు మారాయి.
తైమూర్ లెస్టె: ఇండోనేసియా నుంచి స్వాతంత్ర్యం పొందిన ఈస్ట్ తైమూర్ ‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ తైమూర్ లెస్ట్’గా మారింది.
ఆగ్నేయాసియా ప్రాంతంలోని తైమూర్ ద్వీపంలో ఉంది ఇది. తైమూర్ ద్వీపంలోని తూర్పు ప్రాంతం ఇండోనేసియా నుంచి స్వాతంత్ర్యం పొంది ‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ తైమూర్ లెస్టె’గా అవతరించగా పశ్చిమ ప్రాంతం మాత్రం ఇంకా ఇండోనేసియా పాలనలోనే ఉంది.
బహ్రైన్: అదే ఏడాది బహ్రైన్ పేరు కూడా మారింది. అప్పటి వరకు ‘స్టేట్ ఆఫ్ బహ్రైన్’గా ఉన్నది ‘కింగ్‌డమ్ ఆఫ్ బహ్రైన్’గా మారింది.
పర్షియన్ గల్ఫ్‌లో సౌదీ అరేబియా, కతర్‌ల మధ్య ఉన్న చిన్న దేశం ఇది.
2006
మాంటెనీగ్రో:సెర్బియా, మాంటెనీగ్రోలు కలిసి ‘రిపబ్లిక్ ఆఫ్ మాంటెనీగ్రో’గా మారింది. అనంతరం 2007లో మళ్లీ మాంటెనీగ్రోగా పేరు మారింది.
ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి ‘దేశాల అధికారిక పేర్లు’ డాక్యుమెంట్లో కూడా మాంటెనీగ్రోగానే ఉంది.
2009
రిపబ్లిక్ ఆఫ్ బొలీవియా పేరు ‘ప్లూరినేషనల్ స్టేట్ ఆఫ్ బొలీవియా’గా మారింది.
2011
యూనియన్ ఆఫ్ మియన్మార్ పేరు ‘రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మియన్మార్’గా మార్చారు. 1948లో స్వాతంత్ర్యం పొందిన బర్మా పేరు 1989లో ‘యూనియన్ ఆఫ్ మియన్మార్’గా మారగా 2010లో ‘రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మియన్మార్’గా మారింది.
2011
సౌత్ సూడాన్ ‘రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్’గా మారింది.
అదే ఏడాది ‘గ్రేట్ సోషలిస్ట్ పీపుల్స్ లిబియన్ అరబ్ జమాహిరియా’ పేరు లిబియాగా మారింది. ఆ తరువాత 2017లో ‘స్టేట్ ఆఫ్ లిబియా’గా మారింది.
2012
సురినామ్ దేశం పేరు సురినామ్‌గానే ఉన్నా స్పెల్లింగ్‌లో చివర్లో E చేర్చారు. దాంతో అప్పటి వరకు Surinamగా ఉన్నది Surinameగా మారింది.
2013
బుర్కినా ఫాసో: పశ్చిమ ఆఫ్రికాలోని దేశం బుర్కినా ఫాసో. అప్పటివరకు రిపబ్లిక్ ఆఫ్ బుర్కినాఫాసోగా ఉన్న పేరును బుర్కినా ఫాసోగా మార్చారు.
ఈ దేశం ఒకప్పటి పేరు అప్పర్ వోల్టా. 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత 1984లో బుర్కినా ఫాసోగా మారింది. అనంతరం రిపబ్లిక్ ఆఫ్ బుర్కినా ఫాసోగా మారి మళ్లీ బుర్కినా ఫాసోగా మారింది.
అనంతరం రిపబ్లిక్ ఆఫ్ బుర్కినా ఫాసోగా అనంతరం బుర్కినా ఫాసోగా మారింది.
2013-14
ఆఫ్రికాకు పశ్చిమంగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండే ఈ ద్వీపాల సమూహానికి 1975లో పోర్చుగల్ నుంచి స్వాతంత్ర్యం వచ్చింది.
ఆ తరువాత కేప్ వెర్డిగా వ్యవహరించేవారు. 2014లో కేబో వెర్డీగా మార్చారు.
2016
చెక్ రిపబ్లిక్ పేరును వ్యవహారికంలో చెకియాగా మార్చారు. అయితే, అధికారిక పత్రాలలో రాజ్య నామం(స్టేట్ టైటిల్)గా చెక్ రిపబ్లిక్‌గానే కొనసాగుతోంది.
2017
లిబియా పేరు ‘స్టేట్ ఆఫ్ లిబియా’గా మార్చారు. అంతకుముందు లిబియన్ అరబ్ జమ్హారియా అనే పేరు ఉండేది. 1969కి ముందు కింగ్‌డమ్ ఆఫ్ లిబియా అనేవారు. 1969లో లిబియన్ అర్బ్ జమ్హారియాగా మారింది.
2018
ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలో ఉన్న చిన్న దేశం ఇది. ఉత్తరం వైపున తప్ప మిగతా అన్ని వైపులా దక్షిణాఫ్రికా సరిహద్దుగా ఉన్న దేశం ఇది. ఉత్తరాన మొజాంబిక్ ఉంటుంది.
2019
మాసిడోనియా: 2019లో దీని పేరు ‘నార్త్ మాసిడోనియా’గా మార్చారు.
2022
ఐస్‌లాండ్ పేరు ‘రిపబ్లిక్ ఆఫ్ ఐస్‌లాండ్’ నుంచి ఐస్‌లాండ్‌గా మార్చారు.
తుర్కియే: అప్పటివరకు ‘ది రిపబ్లిక్ ఆఫ్ టర్కీ’గా ఉన్న దేశం పేరును ‘ది రిపబ్లిక్ ఆఫ్ తుర్కియే’గా మార్చారు. ఈ పేరు మార్పుపై ఐరాస సెక్రటరీ జనరల్‌కు 2022 మే 26న ఆ దేశం దరఖాస్తు చేసుకోవడంతో పరిశీలించి ఆమోదించినట్లు ఐరాస పేర్కొంది.
2023
మైక్రోనేసియా పేరు ‘ఫెడరల్ స్టేట్ ఆఫ్ మైక్రోనేసియా’గా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
20వ శతాబ్దంలో పేరు మారిన కొన్ని దేశాలు
1997
సమోవా: పశ్చిమ సమోవా పేరు సమోవాగా మారింది.
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో: ఇదే సంవత్సరం జైర్ దేశం ‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో’గా మారింది.
1994
పలావు: ఈ దేశం పేరు ‘రిపబ్లిక్ ఆఫ్ పలావు’గా మారింది. కరోలిన్ దీవుల్లో భాగమైన పలావు 1994లో పూర్తి స్వాతంత్ర్యం పొందింది.
1993
ఎరిట్రియా: ఇథియోపియా నుంచి స్వాతంత్ర్యం పొందిన ఎరిట్రియా రాష్ట్రం ఎరిట్రియా దేశంగా అవతరించింది.
1992
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో పేరు రిపబ్లిక్ ఆఫ్ కాంగోగా మారింది.
(డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనే దేశం వేరు. ఈ రెండు దేశాలూ సెంట్రల్ ఆఫ్రికాలో పక్కపక్కనే ఉంటాయి)
1990-92
- యుగోస్లేవియా విడిపోవడంతో ఈ కాలంలో కొత్త దేశాలు ఏర్పడ్డాయి.
- బోస్నియా అండ్ హెర్జ్‌గోవినా
- రిపబ్లిక్ ఆఫ్ క్రొయేషియా
- రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా
- సెర్బియా అండ్ మాంటినీగ్రో
- రిపబ్లిక్ ఆఫ్ స్లొవేనియా
1990-91
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో కొత్త దేశాలు ఏర్పడ్డాయి.
- రిపబ్లిక్ ఆఫ్ అర్మేనియా
- రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్
- రిపబ్లిక్ ఆఫ్ బెలారూస్
- రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా
- జార్జియా
- కజక్‌స్తాన్
- కిర్గిజ్‌స్తాన్
- రిపబ్లిక్ ఆఫ్ లాత్వియా
- రిపబ్లిక్ ఆఫ్ లిథువేనియా
- రిపబ్లిక్ ఆఫ్ మాల్డోవా
- రష్యా
- రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్
- తుర్క్‌మెనిస్తాన్
- యుక్రెయిన్
- రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images
1990
నమీబియా: దక్షిణాఫ్రికా నుంచి స్వాతంత్ర్యం పొందిన నమీబియా పేరు అధికారికంగా ‘రిపబ్లిక్ ఆఫ్ నమీబియా’గా మారింది.
యెమెన్: నార్త్ యెమెన్, సౌత్ యెమెన్ ఏకీకరణతో ‘రిపబ్లిక్ ఆఫ్ యెమెన్’గా ఏర్పడింది.
1981
బిలీజ్: బ్రిటిష్ హోండురస్ స్వాతంత్ర్యం పొందిన తరువాత బిలీజ్‌గా ఏర్పడింది.
1980
జింబాబ్వే: బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన దక్షిణ రొడీషియా పేరు జింబాబ్వేగా మారింది.
వానువాతు: న్యూ హెబ్రిడీస్ దేశం ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం సంపాదించుకున్న తరువాత ‘రిపబ్లిక్ ఆఫ్ వానువాతు’గా మారింది. పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు ఈశాన్యంగా ఉండే దీవుల సమూహం ఈ దేశం.
1979
కిరిబాటి: బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన గిల్బర్ట్ ఐలాండ్స్ పేరు కిరిబాటీగా మారింది.
1978
తువాలూ: ఎల్లీస్ ఐలాండ్స్ బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత తువాలూగా మారాయి.
1977
జిబూటీ(Djibouti): ఫ్రెంచ్ సోమాలీలాండ్‌గా ఉన్న ఈ దేశం ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత ‘రిపబ్లిక్ ఆఫ్ జిబూటీ’గా మారింది.
1976
వియత్నాం: దక్షిణ, ఉత్తర వియత్నాంలు కలిసి ‘సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం’గా మారాయి.
1975
1972
శ్రీలంక: సిలోన్ అనే పేరు స్థానంలో శ్రీలంక అని మార్చారు. అయితే, 1991లో ఐక్యరాజ్యసమితికి ఈ మేరకు సమాచారం అందించారు.
1971
బంగ్లాదేశ్: పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా మారింది.
1968
స్పానిష్ గినియా స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం పొందడంతో ఈక్వటోరియల్ గినియాగా మారింది.
1966
బోట్స్‌వానా: బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన బెచువానాలాండ్ ‘రిపబ్లిక్ ఆఫ్ బోట్స్‌వానా’గా మారింది.
లెసోతో: బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన బసుతోలాండ్ ‘కింగ్‌డమ్ ఆఫ్ లెసోతో’గా మారింది.
1964
మలావీ: బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత న్యాసాలాండ్ పేరు మలావీగా మారింది.
1960
టోగో: ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత టోగోలీస్ రిపబ్లిక్ పేరు టోగోగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
1960, అంతకుముందు సంవత్సరాలలో అనేక ఆఫ్రికా దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, ఇటలీ నుంచి స్వాతంత్ర్యం పొందాయి. ఆసియా ఖండంలోని ఫిలిప్పీన్స్ వంటి దేశాలు అమెరికా నుంచి స్వాతంత్ర్యం దక్కించుకున్నాయి. అలాంటి అనేక దేశాల పేర్లలో మార్పులు వచ్చాయి.
1929లో ఇటలీ నుంచి స్వాతంత్ర్యం పొంది వాటికన్ సిటీ ఏర్పడింది.
1937లో పర్షియా ఇరాన్‌గా మారింది.
1947లో బ్రిటన్ నుంచి భారత్ స్వాతంత్ర్యం పొందే సమయంలో వేరుపడి పాకిస్తాన్ ఏర్పడింది.
ఇవి కూడా చదవండి:
- ఓసీడీ: పదేపదే చేతులు కడుక్కోవాలనే ఆలోచన చంపేస్తోందా? అయితే, వెంటనే ఇది చదవండి
- ఆంధ్రప్రదేశ్: 'ట్రాన్స్‌జెండర్ మహిళగా సర్జరీ చేయించుకున్నా... ఇప్పుడు జీవితం ఎలా ఉందంటే... ' -
- మదనపల్లె భానుభారత విద్యార్థులను అమెరికా ఎందుకు తిప్పి పంపుతోంది? స్టూడెంట్స్ ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














