‘ఈ కోతుల బాధ పడలేను, మళ్లీ లండన్ వెళ్లిపోతా’ అని ఆ తెలంగాణ ఎన్నారై ఎందుకు అంటున్నారు...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
‘’కోతుల బాధకు నా వ్యవసాయం వదిలేసి తిరిగి లండన్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. కోతుల ఆగడాలపై నా పోరాటాన్ని ఎవరూ సీరియస్ గా పట్టించుకోలేదు. టైమ్ వేస్ట్ అయ్యింది’’- ఇది తెలంగాణకు చెందిన ఓ ఎన్నారై ఆవేదన.
నిజామాబాద్ జిల్లా గుమ్మిర్యాల్‌కు చెందిన ఎన్నారై ‘నేత రవి’ యూకే (బ్రిటన్) లో ‘హౌజ్ లోన్స్’ రంగంలో పనిచేసేవారు.
2010లో ఇండియాకు తిరిగి వచ్చిన నాటి నుంచి ఆయన వ్యవసాయం చేస్తున్నారు. తమ ప్రాంతంలో కోతుల తాకిడితో జరుగుతున్న నష్టం పై ఆయన 2015లో ‘కోతుల బెడద బాధితుల సంఘం’ ఏర్పాటు చేశారు.
ఏటేటా పెరిగిపోతున్న కోతుల సమస్యను తన సంఘం ద్వారా అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే, ఈ సమస్య నివారణలో ఆశించిన ఫలితాలు, మద్దతు తనకు అందలేదని రవి అన్నారు.
ప్రతి ఏటా తెలంగాణలో కోతుల దాడుల వల్ల దాదాపు 20 మంది చనిపోతున్నారని రవి అన్నారు. కోతుల దాడుల్లో బయటి ప్రపంచానికి రిపోర్ట్ కానివి చాలానే ఉన్నాయని, కోతుల దాడుల కారణంగా చాలామంది అంగవైకల్యానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రవి.
‘‘కోతులు ఎక్కువయ్యాయని నా పొలం కు దగ్గరగా ఉండే మా ఇంటిని వదిలేసి రెండు కిలోమీటర్ల దూరంలో కొత్తగా ఇల్లు కట్టుకున్నాను. కొత్త ఇంట్లో రెండు సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇప్పుడు అక్కడ కూడా కోతుల బాధ తప్పడం లేదు’’ అన్నారాయన.
వానరాల బెడదతో చివరకు తనకున్న పదెకరాల వ్యవసాయ భూమిలో ఇతర పంటలు వేయడం ఆపి ఆయిల్ పామ్ సాగు ప్రారంభించారు రవి. ఈ పంటకైతే వాటితో సమస్య ఉండదని ఆయన ఉద్దేశం.

ఫొటో సోర్స్, Facebook/Ravinetha
గల్లీ నుండి దిల్లీ వరకు..
గల్లీ నుంచి దిల్లీ వరకు కోతుల బెడద విస్తరించింది. సెప్టెంబర్ 9, 10వ తేదీలలో నిర్వహించనున్న జీ 20 సమావేశాల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీకి పలువురు ప్రపంచ దేశాధినేతలు రాబోతున్నారు.
ఈ సమావేశాల కోసం పెద్ద ఎత్తున సాగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఏర్పాటు చేసిన కొండముచ్చుల కటౌట్లు కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.
దిల్లీ నగరంలోని కోతులను భయపెట్టేందుకు ఇలా కొండముచ్చుల ఫోటోలతో కటౌట్లు ఏర్పాటు చేసినట్లుగా అధికారులు చెప్పారంటూ పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది.
మరోవైపు కొండముచ్చుల్లా అరిచేందుకు సుమారు 40 మందికి శిక్షణ కూడా ఇచ్చినట్లు పీటీఐ తెలిపింది.

ఫొటో సోర్స్, UGC
మహిళలు, వృద్దులు, చిన్న పిల్లలే బాధితులు
తెలంగాణలో కోతుల దాడులు పెరుగుతున్నాయి. జనావాసాల్లో ఏటేటా వాటి సంతతి పెరిగిపోతోంది. కోతుల దాడుల బాధితుల్లో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలే ఎక్కువగా ఉంటున్నారు.
ఇటీవల కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో నర్సవ్వ అనే మహిళ కోతుల గుంపు దాడిలో గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందారు.
గత ఏడాది అక్టోబర్‌లో నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లిలో కోతులు తరమడంతో ఇద్దరు అబ్బాయిలు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.
సెప్టెంబర్ 3న మహబూబాబాద్‌లో కోతుల కారణంగా ఇంటి డాబా పై నుంచి సిమెంట్ దిమ్మె విరిగి మీద పడటంతో సాబీరా బేగం (55) అనే మహిళ మృతి చెందారు.
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సాబీరా బేగం మనవడు అజహరుద్దీన్ ఆ రోజు ఏం జరిగిందో బీబీసీకి వివరించారు.
‘‘తాతయ్య, అమ్మమ్మ ఇద్దరు ఆరోగ్యంగా ఉండేవారు. ఆ వయసులో కూడా వారికి బీపి షుగర్ లాంటివి ఏవీ లేవు. ఆరోజు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో అమ్మమ్మ సాబీరా బేగం వాకిలి ఊడుస్తోంది. ఇంటి డాబా పైన విద్యుత్ తీగల కోసం కట్టిన సిమెంట్ దిమ్మెలను కోతుల గుంపు బలంగా ఊపడంతో ఒక దిమ్మె అమ్మమ్మపై పడి, కాలు విరిగిపోయింది. తలకు పెద్ద గాయమైంది. ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, PTI
మహబూబాబాద్‌లో కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని, పిల్లలను బయటకు తీసుకెళ్లాలన్నా భయంగా ఉంటుందని అజహరుద్దీన్ చెప్పారు.
సాబీరా బేగం ఘటన తర్వాత పెరిగిపోతున్న కోతులు, కుక్కలు, పందుల సమస్య నివారణకు మహబూబాబాద్ మున్సిపల్ పాలక వర్గం అత్యవసరంగా సమావేశం అయింది.
కోతుల బెడదకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, బీబీసీతో మాట్లాడారు.
‘‘కోతులను బంధించి దట్టమైన అటవీ ప్రాంతాల్లో వదిలేయాలని నిర్ణయించాం. వాటి సంతతి వృద్ది కాకుండా స్టెరిలైజేషన్ చేసేందుకు నిర్మల్‌లో ఉన్న కోతుల పునరావాస కేంద్రానికి అధ్యయన బృందాన్ని పంపుతున్నాం. మహబూబాబాద్ జిల్లా అంతటా ఈ సమస్య ఉంది. గతంలో కోతులను బంధించి వేరే ప్రాంతంలో వదిలేసినా తిరిగి వచ్చాయి.’’ అని కమిషనర్ వెల్లడించారు.
‘‘కోతుల దాడుల వల్ల మహబూబాబాద్‌లో ఇప్పటి వరకు మరణాలు చోటుచేసుకోలేదు. సాబీరా బేగం సిమెంట్ దిమ్మ మీద పడి చనిపోయిందని తెలిసింది. దీన్ని ఏ కేటగిరి మరణం కింద చేర్చాలన్న విషయం మా దగ్గిరికి వచ్చినప్పుడు ఆలోచిస్తాం’’ అని ప్రసన్న రాణి అన్నారు.
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద బాధితురాలి కుటుంబానికి పరిహారం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

అమ్మో.. కోతులా?
అటవీ సమీప జనావాసాలు, నదీ తీర ప్రాంతాల్లో కోతుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది.
పెద్దపల్లి జిల్లా గోదావరి తీరంలోని మంథని మండలం ‘ఉప్పట్ల’ గ్రామంలో కోతుల ఆగడాలను ఎంపీటీసీ సభ్యురాలు బడికెల దేవమ్మ బీబీసీకి వివరించారు.
‘‘మా గ్రామానికి మీరు ఎప్పుడు వచ్చినా అన్ని ఇళ్ల తలుపులు మీకు మూసే కనిపిస్తాయి. ఇక్కడ నివసించడం అంటే జైలులో ఉన్నట్లే. కోతుల భయానికి పొలం పనులకు ఎవరూ రావట్లేదు. కూలీలు పనిచేస్తుంటే వారి వెనుక రక్షణ కోసం మరో కూలీని పెట్టాలి. గత మూడేళ్లుగా మా గ్రామంలో కోతుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం నాలుగో తరం కోతులు మా ఊరిలో ఉన్నాయి. వాటి ఆగడాలు ఎక్కువైపోవడంతో గ్రామస్తులం అంతా ఒక్కటై కర్రలతో వాటిని గోదావరి తీరానికి తరిమేశాం. మూడో రోజు తిరిగి గ్రామంలో ప్రత్యక్షమయ్యాయి’’ అని తెలిపారు దేవమ్మ.
‘‘మహిళలే ఎక్కువగా కోతుల బాధితుల్లో ఉంటున్నారు. కోతుల సమస్యకు పరిష్కారం చూపిన పార్టీలకే మహిళలంతా గంపగుత్తగా ఓటు వేసే పరిస్థితులు ఉన్నాయి’’ అని దేవమ్మ అన్నారు.
గతేడాది ఇంట్లో నీరు మోస్తున్న సమయంలో దేవమ్మ పై కోతుల గుంపు దాడి చేయడంతో భయంతో ఆమె రేబీస్ వాక్సిన్ తీసుకోవాల్సి వచ్చింది.
‘‘సాధారణంగా కుక్కకాటుకు ఉపయోగించే రేబిస్ వాక్సిన్ ఈ మధ్యకాలంలో కోతుల దాడుల్లో గాయపడ్డ వారికే ఎక్కువగా వినియోగించిన పరిస్థితులు తెలంగాణలో ఏర్పడ్డాయి’’ అని ఎన్నారై రవి అన్నారు.

కోతులను పట్టుకునేందుకు నిధులు లేవు..
జనావాసాల్లో కోతుల బెడద తగ్గించేందుకు మంకీ ఫుడ్ కోర్ట్ లను గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. పండ్ల తోటల నిర్వహణ చేపట్టింది. అవి పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు.
కోతుల సంఖ్యను నియంత్రించేందుకు నిర్మల్‌లో 2020లో స్టెరిలైజేషన్, రీహాబిలిటేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇతర ప్రాంతాల నుంచి బంధించి తెచ్చిన కోతుల్లో రెండేళ్ల వయసు పైబడ్డ కోతులకు ఇక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ కేంద్రానికి తీసుకొచ్చే కోతుల సంఖ్య చాలా తక్కువగా ఉంది.
‘‘ఈ కేంద్రం ప్రారంభించిన తొలి రెండేళ్లలో కరోనా కారణంగా కోతులు ఎక్కువగా తీసుకురాలేదు. నిన్నటి వరకు (సెప్టెంబర్ 5) ఇక్కడ 1,248 కోతులకు స్టెరిలైజేషన్ నిర్వహించాం. ప్రతి రోజు 20 కోతులకు శస్త్రచికిత్స నిర్వహించే సామర్థ్యం ఈ సెంటర్‌కు ఉంది’’ అని రీహాబిలిటేషన్ సెంటర్ వెటర్నరీ డాక్టర్ శ్రీకర్ రాజు బీబీసీకి తెలిపారు.
మరోవైపు తెలంగాణలోని జనావాసాల్లో కోతుల సంఖ్య లక్షల్లో ఉంది. బంధించి తెచ్చే బాధ్యతను వాటి తాకిడి ఎక్కువగా ఉండే ఆయా గ్రామాపంచాయతీలు, మున్సిపాలిటీలకు అప్పగించారు. అయితే, ఈ పని ఖర్చుతో కూడుకున్నది కావడంతో తక్కువ ఆదాయం ఉండే గ్రామ పంచాయితీలకు అది భారంగా మారింది.
‘‘కోతుల నివారణ చర్యలపై గ్రామ పంచాయతీలకు ప్రత్యేకమైన సూచనలు, నిధులు లేవు. గ్రామసభ లో తీర్మానం చేసి స్టేట్ ఫైనాన్స్ కమీషన్ నిధులను ఇలాంటి పనులకు వాడుకునే అవకాశం ఉంది. అయితే, గత ఏడాది కాలంగా ఈ నిధులు విడుదల కాలేదు. కేంద్రం నుంచి కూడా గత మూడు నెలలుగా నిధులు లేవు. గ్రామాల్లో పారిశుధ్య పనులకు వినియోగించే ట్రాక్టర్‌కు డీజిల్ సరఫరా చేయడం కోసమే పెట్రోల్ బంక్‌లో అప్పు చేయాల్సి పరిస్థితి ఉంది.’’అని జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు గ్రహీత పెద్దపల్లి జిల్లా నాగారం గ్రామ సర్పంచ్ బూడిద మల్లేష్ బీబీసీతో అన్నారు.

‘కోతులు మమ్మల్ని నమ్మడం లేదు’
నిధులున్న మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు కోతులు బంధించేందుకు ఆన్‌లైన్ టెండర్లను నిర్వహిస్తున్నాయి.
తెలంగాణలో కోతులు పట్టే కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన కామంచి యేసుదాసు బీబీసీతో మాట్లాడారు.
‘‘ఒక్కో కోతికి 850 రూపాయలకు టెండర్ దక్కింది. అయితే వాటిని బంధించేందుకు పడే శ్రమ, అయ్యే ఖర్చుతో పోలిస్తే చివరకు మాకు మిగిలేది తక్కువే. జాలీల్లో బంధించే ముందు కోతులు ఇష్టపడే అరటి పండ్లు, దానిమ్మ, వేరుసెనగ లాంటి ఆహారం వేయాల్సి ఉంటుంది. అవి అంత తొందరగా నమ్మవు. వాటి నమ్మకం పొందడానికి కనీసం పది రోజుల పాటు కోతులకు ఆహారం ఇవ్వాల్సి వస్తోంది. రోజులు ఎక్కువైతే ఖర్చూ పెరుగుతుంది. కొన్నిసార్లు ఈ టెండర్లతో ఆర్థికంగా నష్టపోతున్నాం’’ అని అన్నారు యేసుదాసు.
‘‘వాళ్లకు బడ్జెట్ సరిపోక కొన్ని కోతులు పట్టిన తర్వాత మళ్లీ చూద్దాం అంటారు. అలా రెండేళ్లు గడిచే సరికి అక్కడ మిగిలి పోయిన కోతుల సంతతి వృద్ది అయి సమస్య అలాగే ఉంటోంది’’ అని యేసుదాసు వివరించారు.
కోతుల తీవ్రత వాస్తవమే అని, ఈ సమస్య నివారణ ప్రభుత్వాలకు సవాల్‌గా మారిందని ఈ ఏడాది మార్చిలో తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీబీసీతో అన్నారు.
నిర్మల్ సెంటర్ మాదిరే తెలంగాణలో నలుదిక్కులా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటుచేసే ఆలోచన ఉందని, కోతుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సబ్ కమిటీని వేశామని ఆయన చెప్పారు.
సబ్ కమిటీ సిఫార్సులు, కొత్త కేంద్రాల ఏర్పాటులో పురోగతి పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని మళ్లీ సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
ఇవి కూడా చదవండి
- వివాహం: సహజీవనంలో ఉండే మహిళకు చట్టంలో రక్షణ ఉండదా?
- సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి... పిల్లలు, టీనేజర్లు ఆ వలయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














