వన్ నేషన్-వన్ ఎలక్షన్: హైలెవెల్ కమిటీ రిపోర్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం, ఎన్నికలు ఎలా జరుగుతాయంటే...

‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’

ఫొటో సోర్స్, GETTY IMAGES

‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ పై ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

ఎన్డీయే మూడోసారి గెలిచి 100 రోజులు పూర్తయిన తర్వాత జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఆయన తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ మార్చిలో నివేదికను సమర్పించింది.

ఈ నివేదిక చట్ట రూపం దాల్చి అమల్లోకి వస్తే, దేశంలో ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. మొదటి దశలో పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తారు.

ఇవి జరిగిన100 రోజుల తర్వాత స్థానిక సంస్థల (గ్రామ పంచాయత్, బ్లాక్, జిల్లా పంచాయత్), అలాగే పట్టణ స్థానిక సంస్థల(మున్సిపాలిటీ, మున్సిపల్ కమిటీ, మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికలు జరుగుతాయని ఏఎన్ఐ తెలిపింది.

ఈ అత్యున్నత స్థాయి కమిటీ, దేశంలోని వివిధ వర్గాలతో చర్చలు జరిపి ఈ నివేదికను రూపొందించిందని వైష్ణవ్ తెలిపినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

‘‘త్వరలోనే ఈ కమిటీ సిఫార్సులను ముందుకు తీసుకెళ్లేందుకు ఒక ఇంప్లిమెంట్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తాం’’అని వైష్ణవ్ వెల్లడించారు.

రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఈ ఉన్నత స్థాయి కమిటీ 2023 సెప్టెంబర్ 2న ఏర్పాటైనప్పటి నుంచి 191 రోజులపాటు వివిధ వర్గాలతో ఈ అంశంపై చర్చించి 18,626 పేజీల నివేదికను రూపొందించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

‘ఒకే దేశం -ఒకే ఎన్నిక’ వల్ల ఓటర్లకు వెసులుబాటు కలుగుతుందని, వారికి అనవసర శ్రమ తగ్గుతుందని కమిటీ నివేదిక పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి చర్చ నడుస్తోంది. దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని ఎన్డీయే చెబుతోంది.

మరి ఇంతకు ముందు ఎలా ఉండేది? వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై చందన్ కుమార్ జాజ్వాడే గతంలో బీబీసీకి రాసిన కథనం ఈ కింద చదవొచ్చు.

గతంలో ఏం జరిగింది?

భారత్‌లో 1967 వరకు లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగేవి.

1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, దేశంలో కొత్త రాజ్యాంగం కింద 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలోనే రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించారు.

ఎందుకంటే, స్వాతంత్య్రం తర్వాత అసెంబ్లీలకు ఎన్నికలు జరగడం అదే తొలిసారి.

ఆ తర్వాత, 1957, 1962, 1967 సంవత్సరాల్లో లోక్‌సభ, చాలా అసెంబ్లీలకు ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి.

కేరళలో 1957 ఎన్నికల్లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

కానీ, అక్కడ జరిగిన తిరుగుబాట్లు, అస్తవ్యస్థ పరిస్థితుల కారణంగా నెహ్రూ ప్రభుత్వం ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలనను అమల్లోకి తీసుకొచ్చి, ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసింది.

1960లో కేరళకు మరోసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు.

ప్రధాని నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, ANI

ఒకే దేశం-ఒకే ఎన్నికకు రాజ్యాంగంలో ఏ సవరణ అవసరం?

‘‘1967 తర్వాత కొన్ని రాష్ట్రాలో అసెంబ్లీలు ముందుగానే రద్దయ్యాయి. అక్కడ రాష్ట్రపతి పాలనను అమల్లోకి తీసుకొచ్చారు. అంతేకాక, 1972లో జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలను షెడ్యూల్ కంటే ముందస్తుగా నిర్వహించారు’’ అని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ 2018లో చెప్పారు.

1967లో చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. బిహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా(ఒరిస్సా అప్పట్లో) వంటి అనేక రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు లేదా వాటి కూటములు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.

కానీ, వీటిలో చాలా రాష్ట్రాల్లో పదవీ కాలం పూర్తవ్వకముందే అసెంబ్లీలు రద్దు అయ్యాయి.

ఇలా 1967 తర్వాత ఏకకాలంలో జరగాల్సిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్‌కు పెద్ద మొత్తంలో విఘాతం ఏర్పడటం మొదలైంది.

ఈవీఎంలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏం చెప్పారు?

2018లో ఓపీ రావత్ ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా ఎంపికయ్యారు. అంతకు ముందు 2015లో ఆయన ఎన్నికల కమిషనర్‌గా పని చేశారు. అప్పుడే లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందా, లేదా? అని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను అడిగింది. దీని కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రశ్నించింది.

‘‘ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడం సాధ్యమవుతుందని అప్పుడే ప్రధాన ఎన్నికల కమిషనర్ కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. దీని కోసం ప్రభుత్వం నాలుగు పనులు చేయాల్సి ఉంటుంది. తొలుత రాజ్యాంగంలోని 5 ఆర్టికల్స్‌లో సవరణ అవసరం. అసెంబ్లీల పదవీ కాలానికి, రాష్ట్రపతి పాలన విధించడానికి ఉన్న ప్రొవిజన్లను మార్చాల్సి ఉంటుంది’’ అని ఓపీ రావత్ తెలిపారు.

ఇది మాత్రమే కాక, ప్రజా ప్రాతినిధ్య చట్టంతో పాటు సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఉన్న నిబంధనలను మార్చాలని ఎన్నికల కమిషనర్ చెప్పారు.

అవిశ్వాస పరీక్షలను నిర్మాణాత్మకంగా ఉండేలా రూపొందించాల్సి ఉందన్నారు.

ఇలా ఎన్నికలు జరిగితే మొత్తంగా 35 లక్షల ఈవీఎంలు అవసరం పడతాయని ఎన్నికల సంఘం తెలిపింది. దీని కోసం కొత్త ఈవీఎంలను కొనుగోలు చేయాల్సినవసరం ఉందని చెప్పింది.

భారత్‌లో ఉపయోగించే ఈవీఎం ధర సుమారు రూ.17 వేలు. వీవీప్యాట్ ధర కూడా దాదాపు అంతే ఉంటుంది.

‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ నిర్వహించేందుకు కొత్తగా 15 లక్షల కొత్త ఈవీఎంలు, వీవీప్యాట్‌లు అవసరం అవుతాయి.

ఒకవేళ నేటి అంచనాల ప్రకారం ఎన్నికల సంఘానికి 12 లక్షల అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్‌లు అవసరమైతే, వాటిని సిద్ధం చేయడానికి ఏడాది కంటే ఎక్కువ సమయం పడుతుందని ఓపీ రావత్ అన్నారు.

‘‘ఒకవేళ లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహిస్తే, ప్రస్తుతమున్న దానికంటే మూడింతలు ఎక్కువగా ఈవీఎంలు కావాల్సి ఉంది’’ అని భారత మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎస్‌.వై. ఖురేషి కూడా చెప్పారు.

ఎన్నికలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఏ రకమైన సమస్యలొస్తాయి?

ఒకే దేశం-ఒకే ఎన్నిక అనేది ఆచరణాత్మకంగా అసలు సాధ్యపడదని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణులు పీడీటీ ఆచారి గతంలో అన్నారు.

దేశంలోని అన్ని అసెంబ్లీలను ఏకకాలంలో రద్దు చేయాల్సి ఉంటుంది. ఇది అసలు సాధ్యపడదని తెలిపారు.

‘‘రాష్ట్ర అసెంబ్లీని ముందుగా రద్దు చేసే హక్కు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కేంద్రానికి కాదు. ఏదైనా కారణం చేత రాష్ట్రంలో అశాంతి పరిస్థితులు ఏర్పడితే, అప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయగలదు. అన్ని రాష్ట్రాల్లో ఇది ఒకేసారి సాధ్యం కాదు’’ అని పీడీటీ ఆచారి చెప్పారు.

పదవీ కాలం పూర్తి కాకుండానే ఏదైనా రాష్ట్ర అసెంబ్లీ రద్దు అయితే, అప్పుడు రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందని అన్నారు. ఇది దేశ సమాఖ్య విధానానికి వ్యతిరేకమని వెల్లడించారు.

రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి కూడా ఇది విరుద్ధం. రాష్ట్రాలకు విఘాతం కలిగించే అధికారం పార్లమెంట్‌కు లేదు.

ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడమంటే.. స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని ఖురేషి అన్నారు.

అన్ని ఎన్నికల్లో ఓటర్లు, పోలింగ్ స్టేషన్లు, ఈవీఎంలు, సెక్యూరిటీ ఒకే విధంగా ఉంటాయి.

కానీ, గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత కేంద్రంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య హక్కుల విషయంలో వివాదానికి అవకాశం ఉంటుంది.

రాజ్యాంగ సవరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో వివాదం కూడా నెలకొనే అవకాశం ఉంటుంది.

అంతేకాక, ఏదైనా రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఒక పార్టీకి లేదా కూటమికి మెజారిటీ రాకపోతే, రాజకీయ అస్థిర పరిస్థితులు కూడా నెలకొంటాయి.

ఎన్నికల ప్రచారం

ఫొటో సోర్స్, ANI

భారత్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎంత ఖర్చవుతుంది?

దేశంలో ఎన్నికలు నిర్వహించేందుకు భారీ మొత్తంలో ఖర్చవుతుందని, ఇదే ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ కు ప్రధాన ఉద్దేశమనే వాదన వినిపిస్తోంది. కానీ, అసలు వాస్తవాలు కాస్త భిన్నంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో భారత్‌లో ఎన్నికలు నిర్వహిస్తున్నారని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ చెప్పారు.

భారత్‌లో ఎన్నికల సందర్భంగా ఒక్కో ఓటర్‌పై ఒక అమెరికా డాలర్‌ను అంటే సుమారు 83 రూపాయలను ఖర్చు చేస్తున్నారు.

దీనిలోనే ఎన్నికల ఏర్పాట్లు, సెక్యూరిటీ, ఎన్నికల విధులకు ఉద్యోగులను తరలించడం, ఈవీఎంల ఏర్పాటు వంటి ప్రతి ఖర్చు ఉంటోంది.

ఎన్నికల ఖర్చుకు సంబంధించి పలు దేశాలలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కెన్యాలో ఒక్కో ఓటరుపై 25 డాలర్లు ఖర్చవుతోంది. అంటే దాదాపు రూ.2,077 వరకు ఖర్చు చేస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు కెన్యావే. భారత సరిహద్దు దేశం పాకిస్తాన్ సైతం గత జనరల్ ఎలక్షన్స్‌లో ఒక్కో ఓటరుపై 1.75 డాలర్లను అంటే రూ.145ను ఖర్చు చేసింది.

భారత్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు రూ.4 వేల కోట్లను ఖర్చు పెట్టడం పెద్ద విషయమేమీ కాదని ఖురేషి అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలకు ఈ వ్యయం రూ.60 వేల కోట్లవుతుంది. ఈ ఖర్చు కూడా ఆర్థిక వ్యవస్థకు మంచిదేనని తెలిపారు.

దీనివల్ల రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల చేతిలో ఉన్న నగదు పేద ప్రజలకు చేరుకుంటుందన్నారు.

ఎన్నికల సమయంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ బ్యానర్లను సిద్ధం చేయించడం నుంచి పోస్టర్లు ఏర్పాటు చేయడం, పబ్లిషిటీ మెటీరియల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆటో, రిక్షాలపై ప్రచారం వరకు ప్రతీది చేస్తుంటారు.

సామాన్య ప్రజలకు ప్రాధాన్యతను ఇచ్చే సమయం ఇదొక్కటేనని ఖురేషి అన్నారు. నేతలు ఈ సమయంలో ప్రజల దగ్గరికి వెళ్తుంటారని చెప్పారు. సామాన్య ప్రజలు కూడా ఇది పదే పదే కావాలనుకుంటారని చెప్పారు.

‘‘ నేను ఒకసారి ఒక ఈవెంట్‌కు వెళ్లినప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పులావ్‌తో పేద ప్రజల కడుపు నిండుతుందని ఒకరు అనడం విన్నాను. పేద ప్రజలకు ఎన్నికలెంత ప్రాధాన్యమైనవో ఇది తెలియజేస్తుంది’’ అని ఖురేషి గుర్తుకు చేసుకున్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉన్నప్పుడు, ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాన్ని ప్రకటించడానికీ, అమలు చేయడానికీ ఉండదు.

అప్పటికే అమల్లో ఉన్న పథకాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపదు.

అదే విధంగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఎలక్టోరల్ రాష్ట్రాల్లో మినహాయించి, మరే ఇతర రాష్ట్రాల పనులపై కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రభావం చూపదు.

ప్రతిపక్షాల కూటమి

ఫొటో సోర్స్, ANI

లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని 1983 సంవత్సరంలోనే లేవనెత్తారు. కానీ, ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఇందిరా గాంధీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు.

ఆ తర్వాత 1999లో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ‘లా కమిషన్’ ప్రతిపాదించింది.

ఆ సమయంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉంది.

2014లో బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించే అంశాన్ని కూడా చేర్చింది.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది. కానీ, విపక్ష పార్టీలు మాత్రం ఈ ఆలోచనపై గతంలోనే విమర్శలు చేశాయి.

‘‘భారత్ అనేది రాష్ట్రాల సమాఖ్య. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనేది ఈ సమాఖ్యపై, దాని అన్ని రాష్ట్రాలపై దాడి లాంటిది’’ అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గతంలో ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

గత ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వానికి కోరుకున్నంత సంఖ్యలో సీట్లు రాకపోయినా, ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఉన్నట్లు అశ్వినీ వైష్ణవ్ మాటలను బట్టి అర్ధమవుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)