‘‘కెనడా వెళ్తున్నానని చెప్పి హైదరాబాద్ వచ్చేశాడు, నా కొడుకును క్షమించి వదిలేయండి”...భారత్‌కు ఓ పాకిస్తానీ తల్లి వేడుకోలు

కొడుకు ఫోటోను చూపిస్తున్న ఫయాజ్ తల్లి

ఫొటో సోర్స్, COURTESY AZHAR IQBA

ఫొటో క్యాప్షన్, కొడుకు ఫోటోను చూపిస్తున్న ఫయాజ్ తల్లి
    • రచయిత, ముహమ్మద్ జుబేర్ ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“నా కొడుకు కెనడా దేశానికి వెళ్తున్నానని చెప్పి భారతదేశానికి వచ్చాడు. తన గొంతు విని 14 రోజులు అవుతోంది. భారతీయులకూ మాతృమూర్తులు ఉన్నారు. వారికి నా వేదన అర్థమవుతుందని అనుకుంటున్నాను“ అంటూ మహమ్మద్ ఫయాజ్ తల్లి భావోద్వేగానికి లోనయ్యారు.

భార్యా, కొడుకును కలుసుకునేందుకు భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి, నివసిస్తున్న నేరంపై పాకిస్తాన్‌కు చెందిన 24 ఏళ్ల మహమ్మద్ ఫయాజ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సంఘటనపై బీబీసీ ప్రతినిధి అమరేంద్ర యార్లగడ్డ హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్యను సంప్రదించగా, యువకుడి అరెస్ట్‌ను ధ్రువీకరించారు.

మహమ్మద్ ఫయాజ్ పాస్ పోర్ట్, వీసా లేకుండా నేపాల్ మీదుగా భారత్‌లో అక్రమంగా ప్రవేశించి, హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడన్న సమాచారం మేరకు ఆగస్టు 31వ తేదీన కిషన్‌బాగ్‌లో మహమ్మద్ ఫయాజ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

పాకిస్తాన్‌లోని షాంగ్లాలో నివాసం ఉంటున్న మహమ్మద్ ఫయాజ్ కుటుంబాన్ని బీబీసీ సంప్రదించింది.

మహమ్మద్ ఫయాజ్ తల్లి బీబీసీతో మాట్లాడుతూ “నా కొడుకు అలా భారత్‌కు వెళ్లి ఉండకూడదు. కానీ జరిగిపోయింది. భారత్ అతడిని క్షమించి, నా కోడలు, మనవడితోసహా తిరిగి పాకిస్తాన్‌కు పంపాలని కోరుకుంటున్నా. రెండు రోజుల కిందట నా కూతుళ్ల ద్వారా నాకీ విషయం తెలిసింది. వాడి పెళ్లి విషయం నాకు తెలీదు. ముందే తెలిసి ఉంటే, వాళ్లు దుబాయ్‌లో ఉన్నప్పుడే కోడలు, మనవడిని ఇంటికి తీసుకుని రమ్మని చెప్పేదాన్ని. కానీ చెప్పకుండా ఇలా చేశాడు. కానీ, నా కొడుకు భార్యని మోసం చేయాలని అనుకోలేదు. కుటుంబాన్ని కలుసుకోవడం కోసం సాహసం చేయడం, నాకు గర్వంగా అనిపిస్తోంది. బంధం పట్ల నా కొడుకు చూపిన విశ్వాసాన్ని భారతీయులు ప్రశంసించాలి” అన్నారు.

పాకిస్తాన్‌లోని ఫయాజ్ ఇల్లు

ఫొటో సోర్స్, COURTESY AZHAR IQBA

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని ఫయాజ్ ఇల్లు

భారత్‌కు ఎలా చేరుకున్నాడు?

హైదరాబాద్ సౌత్‌జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపిన వివరాల ప్రకారం....

‘‘పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్ ఫయాజ్ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న తన భార్య నేహా ఫాతిమా (29), మూడేళ్ల కుమారుడిని కలుసుకునేందుకు నగరానికి వచ్చాడు.

ఫాతిమా తండ్రి నకిలీ పత్రాలతో హైదరాబాద్‌లోనే శాశ్వతంగా ఉండేలా ఏర్పాటు చేస్తానని చెప్పడంతో అక్కడే ఉండిపోయాడు ఫయాజ్.

మహమ్మద్ ఫయాజ్ కరాచీలోని దుస్తుల డిజైనింగ్ సంస్థలో పనిచేసేవాడు. 2018లో ఆ సంస్థ మహమ్మద్ ఫయాజ్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పనిచేసే అవకాశం కల్పించడంతో అక్కడికి వెళ్లాడు.

ఏడాది తర్వాత హైదరాబాద్‌కు చెందిన ఫాతిమాను కలుసుకున్నాడు. కొన్నాళ్లకు ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఫాతిమా బిడ్డకు జన్మనిచ్చింది. 2022లో ఫాతిమా యూఏఈ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ వచ్చేసింది. అప్పటి నుంచి తన తల్లిదండ్రులతో కలిసి కుమారుడిని చూసుకుంటూ హైదరాబాద్‌లోనే ఉంటోంది.

2022 నవంబర్ నెలలో మహమ్మద్ ఫయాజ్ టూరిస్ట్ వీసాపై నేపాల్ చేరుకున్నాడు. అక్కడి నుంచి అక్రమంగా హైదరాబాద్‌ చేరుకుని, కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.

మార్చి నెలలో మహమ్మద్ గౌస్ అనే నకిలీ పేరుతో ఆధార్ గుర్తింపు పొందేందుకు ఆధార్ నమోదు కేంద్రానికి కూడా వెళ్లాడు.

అయితే, సమాచారాన్ని సేకరించిన పోలీసులు మహమ్మద్ ఫయాజ్‌ను అరెస్ట్ చేసి, కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.’’ అని చెప్పారు.

కెనడాకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి..

మహమ్మద్ ఫయాజ్ సోదరుడు ఇక్బాల్ హుస్సేన్ బీబీసీతో మాట్లాడారు.

“నా సోదరుడు 2018లో యూఏఈకి వెళ్లాడు. షార్జాలో ఉంటూ గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. నాలుగేళ్లపాటు అక్కడే ఉన్నాడు కానీ, వివాహం చేసుకున్న విషయం మాకు చెప్పలేదు. 2022లో షాంగ్లాకు వచ్చి, రెండు నెలలు ఉన్నాడు. ఉన్నన్ని రోజులూ తనకి మలేషియాలోనో, కెనడాలోనో స్నేహితుడు ఉన్నాడని, తనని రమ్మంటున్నాడని చెప్పేవాడు. 2022 ఏడాది చివరిలో కెనడాకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరి వెళ్లాడు” అని ఇక్బాల్ తెలిపారు.

“కెనడాకు చేరుకున్నానని, అక్కడే ఉంటున్నానని కూడా చెప్పాడు. కానీ మా ప్రాంతంలో ఉండే వ్యక్తి వచ్చి భారత్ మీడియాకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు చూపించాడు. అవి చూశాక మహమ్మద్ ఫయాజ్ అరెస్టయ్యాడని తెలుసుకున్నాం“ అని ఇక్బాల్ అన్నారు.

“మేం చదువుకోలేదు. నా సోదరుడి కోసం నేనేం చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ప్రస్తుతం మహమ్మద్ ఫయాజ్ చదివిన స్కూల్ నుంచి రికార్డులు తీసుకుంటున్నాం. ఫయాజ్ ను విడిపించే సాయం కోసం ఇస్లామాబాద్ ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటాం” అన్నారు.

తల్లి జీవితంలో అన్ని చీకటి క్షణాలే..

“మహమ్మద్ ఫయాజ్ తల్లి జీవితంలో అన్ని చీకటి క్షణాలే“ అని ఆమె బంధువు అజహర్ ఇక్బాల్ బీబీసీతో అన్నారు.

“ఫయాజ్ తల్లి చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. మా అమ్మానాన్నే చేరదీసి పెంచి, వివాహం చేశారు. కానీ కొన్నాళ్లకే విధి ఆమె భర్తను బలి తీసుకుంది. అప్పటికే ఆమె సంతానం పెద్దది. మహమ్మద్ ఫయాజ్ తోపాటు ఆరుగురు పిల్లలు ఉన్నారు. వారందరిలో ఫయాజ్ చిన్నవాడు. నా సోదరి జీవితంలో మంచి రోజులు ఏమైనా ఉన్నాయంటే అవి ఫయాజ్ దుబాయ్‌లో ఉద్యోగం చేసిన కాలమే” అని అజహర్ ఇక్బాల్ తెలిపారు.

ఫయాజ్ మెట్రిక్యులేషన్ వరకు చదివాడని, అతడి తోబుట్టువులెవరూ ఆ మాత్రం కూడా చదువుకోలేదని అన్నారు.

“ అతని తోబుట్టువులు ఇక్కడా అక్కడా పనిచేసుకుంటూ కాలం గడుపుతున్నారు. నాకూ ఒక్కోసారి పని దొరుకుతుంది. ఒక్కోసారి దొరకదు. నా సోదరి మాత్రం ఫయాజ్‌ను చాలా గారాబంగా చూసుకుంది. సంపాదనతో కుటుంబానికి ఆధారంగా ఉండేది కూడా అతడే“ అన్నారు.

“నా కొడుకు రోజూ నాకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. డబ్బు పంపడానికి అవసరమైన పత్రాలు సిద్ధం చేస్తున్నానని, అవి సిద్ధం కాగానే పంపుతానని చెప్పేవాడు” అని ఫయాజ్ తల్లి అన్నారు.

ఇప్పుడు ఆయన అరెస్ట్ కావడంతో కుటుంబం అంతా ఆందోళనలో ఉంది.

భారత్, నేపాల్ దేశస్తులు ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగించేందుకు వీసా అవసరం లేదు. సరిహద్దు దాటడానికి సరైన గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, ఓటర్, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.

అయితే కాలినడకన వచ్చేవారికి భారత్-నేపాల్ చెక్ పాయింట్ వద్ద తనిఖీ లేని కారణంగానే చాలామంది సులభంగా భారతదేశంలోకి ప్రవేశిస్తున్నారు.

నేపాల్ బార్డర్ నుంచి దిల్లీకి నేరుగా బస్ సర్వీసులు కూడా ఉన్నాయి. వీటిలో భారీ సంఖ్యలో నేపాల్, భారత్ దేశస్తులు ప్రయాణిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)