శ్రీకృష్ణుడి ద్వారక కోసం సముద్రం అడుగుకి వెళ్లిన సబ్‌మెరైన్స్, అక్కడ ఏముంది?

Symbolic
    • రచయిత, జైదీప్ వసంత్
    • హోదా, బీబీసీ కోసం

గుజరాత్‌లో దేవభూమిగా పిలిచే ద్వారక హిందువులు అత్యంత పవిత్రంగా భావించే నాలుగు ప్రదేశాల్లో ఒకటి. ఈ నగరం అరేబియా మహా సముద్ర తీరాన ఉంటుంది.

శ్రీకృష్ణుడు నిర్మించిన నగరం సముద్రంలో ముగినిపోయిందని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ద్వారకా నగరం ఒకటి కంటే ఎక్కువసార్లు సముద్రంలో మునిగిపోయింది.

ఈ నగరం ఎప్పుడు సముద్రంలో మునిగిపోయిందో కచ్చితంగా చెప్పడం కష్టమైనప్పటికీ, విశ్వసనీయ సాక్ష్యాల ఆధారంగా అది నిజమేనన్న భావన కూడా ఉంది.

ద్వారక కోసం సముద్రంలో భారత పురావస్తు శాఖ పరిశోధన, తవ్వకాలను చేపట్టింది. ఈ తవ్వకాల్లో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

పాశ్చాత్య దేశాలలోనూ అట్లాంటిస్ నగరం సముద్రంలో మునిగిపోయిందని నమ్ముతారు. ప్లేటో ఈ పురాతన గాథను ప్రదర్శించారు.

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో వరదలు, అగ్నిపర్వతాల విస్ఫోటనం వంటి ఎన్నో విపత్తులు సంభవించాయి. అందువల్ల నగరాలు సముద్రంలో మునిగిపోయాయని విశ్వసించేవారికి కొదువలేదు.

ఇలాంటి అంశాల నేపథ్యంలో, 1966లో శాస్త్రవేత్త డొరాటి విటాలియానో జియాలజీ (భౌగోళిక శాస్త్రం)లో జియో - మైథాలజీ (పురాణగాథ)లను ఉప విభాగంగా చేర్చారు. దీని ద్వారా పురాణాలు, ఇతిహాసాలలో పేర్కొన్న విషయాల్లో భౌగోళిక దృక్కోణంలో అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది.

ద్వారక

ఫొటో సోర్స్, Getty Images

ద్వారక కోసం సముద్ర భూమిని సేకరించిన శ్రీకృష్ణుడు

బ్రహ్మను సృష్టికర్త అని, ఆ సృష్టిని నడిపేది విష్ణువు, సృష్టిని ముగించేది శివుడని హిందువులు విశ్వసిస్తారు. శ్రీకృష్ణుడు మహావిష్ణువు ఎనిమిదో అవతారంగా నమ్ముతారు.

శ్రీకృష్ణుడి జన్మదినాన్ని ద్వారక, మథుర, డాకోర్, నాథ్‌ద్వారా సహా దేశవ్యాప్తంగా జన్మాష్టమిగా జరుపుకుంటారు.

హిందువుల పవిత్ర గ్రంథమైన శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు జన్మించడం, బాల్యం, ఎదిగిన క్రమం, కంసవధ, మథురకి తిరిగిరావడం, అక్కడి నుంచి వెళ్లిపోవడం, ద్వారకా నగరాన్ని నిర్మించడం, యాదవుల పరాక్రమం, పతనం గురించి వివరించారు.

అంతేకాకుండా మహాభారతం, విష్ణుపురాణాల్లోనూ శ్రీకృష్ణుడి ప్రస్తావన ఉంది.

శ్రీమద్ భాగవతం, మహాభారతం ప్రకారం, కంసుడిని శ్రీకృష్ణుడు వధించడం మగధ సామ్రాజ్యాధినేత జరాసంధుడికి ఆగ్రహం తెప్పిస్తుంది. కంసుడి భార్యలైన అస్టి, ప్రక్షి జరాసంధుడి కుమార్తెలు కావడమే అందుకు కారణం.

దీంతో జరాసంధుడు శ్రీకృష్ణుడి మథురా నగరంపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఆ దాడుల నుంచి శ్రీకృష్ణుడు, బలరాముడు నగరాన్ని కాపాడుతారు. కానీ, 18వ సారి మథుర పతనం ప్రారంభమైనట్లుగా భావించిన శ్రీకృష్ణుడు ప్రజలతో సహా ద్వారకా నగరానికి మకాం మార్చారు.

ద్వారకా నగరాన్ని నిర్మించేందుకు శ్రీకృష్ణుడు 12 యోజనాల భూమిని సముద్రం నుంచి తీసుకున్నట్లు స్థానికులు చెబుతారు. దేవతల శిల్పి అయిన విశ్వకర్మ ద్వారకా నగరాన్ని నిర్మించారని, కృష్ణుడి 16 వేల 108 మంది భార్యల కోసం రాజభవనాలతో పాటు ప్రజల కోసం నివాసాలను నిర్మించినట్లు నమ్ముతారు.

యుద్ధ భూమి నుంచి వెళ్లిపోయినందుకు శ్రీకృష్ణుడిని రాంచోద్ అని, ద్వారకా నగరాన్ని నిర్మించినందుకు ద్వారకాధీశుడని పిలుస్తారు.

ద్వారక

ఫొటో సోర్స్, ALAMY

ద్వారక సముద్రంలో ఎప్పుడు మునిగిపోయింది?

హిందువుల విశ్వాసం ప్రకారం, విష్ణువు ఏడవ అవతారం రామావతారం. ఆయన జీవిత చరిత్ర రామాయణం. రాముడిని 'మర్యాద పురుషోత్తం'గా, కృష్ణుడిని 'పూర్ణావతారంగా ' గా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణుడి మరణానంతరం ద్వారకలో ప్రళయం సంభవించింది.

భారత పురావస్తు శాఖ(ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా)కు చెందిన మాజీ ఆర్కియాలజిస్ట్ కేకే ముహమ్మద్ ప్రకారం, మహాభారతం క్రీస్తు పూర్వం 1400 నుంచి 1500 సంవత్సరాల నాటిదిగా పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

బ్రిటిష్ కాలం నాటి నుంచే భారత్‌లో పురావస్తు పరిశోధనలు జరుగుతున్నాయి. భారత పురావస్తు శాఖ వాటిపై పరిశోధన, తవ్వకాలతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తోంది.

శ్రీమద్ భగవత్ మహాపురాణం ప్రకారం, 125 ఏళ్ల పాటు భూమిని పాలించిన అనంతరం శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్లిపోయాడని, ఆ తర్వాత శ్రీకృష్ణుడి రాజభవనం మినహా సముద్రం తన భూమిని తాను తీసేసుకుందని చెబుతారు.

అయితే, హిందూ విశ్వాసాల్లో చెప్పిన కాలానికి, పురావస్తు శాఖ అధికారులు చెబుతున్న కాలానికి మధ్య దాదాపు 1500 ఏళ్ల వ్యత్యాసం ఉంది.

''కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు కౌరవుల తల్లి అయిన గాంధారిని కలిసేందుకు వెళ్లారు. అప్పుడు ఆమె శ్రీకృష్ణుడికి శాపం పెట్టింది. తన వంశం నాశనమైనట్లే, నీ కళ్ల ముందే నీ వంశం కూడా నాశనమవుతుందని శపించింది. దాని తర్వాత 36 ఏళ్లకు గాంధారి శాపం నిజమైంది. ఆ సమయంలో కృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు'' అని పురాణ, ఇతిహాసాల నిపుణులు దేవదత్త పట్నాయక్ తెలిపారు.

హిందువులు విశ్వాసం ప్రకారం, ''కౌరవులు, పాండవులు కురుక్షేత్రం వద్ద యుద్ధం చేస్తారు. అయితే, గొప్ప విలుకాడు, పాండవుల్లో ఒకరైన అర్జునుడు తన కుటుంబ సభ్యులు, గురువులతో యుద్ధం చేసేందుకు వెనకడతాడు. అప్పుడు ధర్మాన్ని కాపాడేందుకు క్షత్రియధర్మాన్ని నిర్వర్తించాలని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు. 18 రోజుల పాటు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో చివరికి పాండవులు విజయం సాధిస్తారు.''

ఆ రోజు కృష్ణుడు గీతను బోధించిన రోజును ఇప్పటికీ హిందువులు గీతాజయంతిగా జరుపుకుంటారు.

ఈ ఏడాది, అంటే 2023లో 5,160వ గీతా జయంతి జరగనుంది. అలా, కురుక్షేత్ర యుద్ధం, గాంధారి శాపం నెరవేరడానికి 36 - 37 ఏళ్లు పట్టింది.

ద్వారక

ఫొటో సోర్స్, Getty Images

పరిశోధన, తవ్వకాలు, సంరక్షణ

1960లలో గుజరాత్‌లోని ద్వారకలో జగత్ ఆలయానికి సమీపంలో ఒక ఇంటిని కూల్చే పనులు జరుగుతున్న సమయంలో ఒక పురాతన ఆలయ గోపురం బయటపడింది. దీంతో పుణెకి చెందిన దక్కన్ కళాశాల అక్కడ తవ్వకాలు చేపట్టింది. ఇందులో 9వ శతాబద్దపు విష్ణు ఆలయ అవశేషాలు బయటపడ్డాయి.

తవ్వకాల్లో కొన్నిచోట్ల పలు పురాతన వస్తువులు దొరికాయి. ఆ తర్వాత జరిపిన తవ్వకాల్లో మూడు మీటర్ల లోతులో మరిన్ని వస్తువులు బయటపడ్డాయి. దీంతో అన్వేషణ కొనసాగించడంతో మళ్లీ వస్తువులు లభించాయి.

దీంతో ద్వారకా నగరం ఒకసారి కంటే ఎక్కువసార్లు ధ్వంసమైందని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

అయితే, అది ఊహించినదే. ఎందుకంటే ఇప్పటికే ద్వారకా ఆరుసార్లు మునిగిపోయిందని, ఇప్పుడున్న ద్వారక ఏడోదని స్థానికులు నమ్ముతున్నారు.

కర్ణాటకకు చెందిన పురావస్తు శాస్త్రవేత్త రంగనాథ రావు సముద్ర పరిశోధన చేయాలనే లక్ష్యంతో గుజరాత్‌లో స్థిరపడ్డారు. ఆయన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(సముద్ర శాస్త్రం)ని స్థాపించారు.

1989లో ఆయన సముద్ర గర్భంలో గడ్డిని, దీర్ఘచతురస్రాకారంలో ఉన్న రాళ్లను కనుగొన్నారు. అవేకాకుండా, అర్ధ గోళాకారంలో ఉన్న మానవ నిర్మిత రాళ్లు కూడా బయటపడ్డాయి.

వాటితో పాటు రాతి నాగలి కూడా బయటపడింది. అది ఇప్పటి నాగలి మాదిరిగానే ఉంది. ఇళ్ల నిర్మాణానికి సున్నపురాయిని విస్తృతంగా వినియోగించారు.

శతాబ్దాలుగా సున్నపురాయి వస్తువులు పరిశోధనల్లో బయటపడుతున్నాయి. సున్నపురాయితో చేసిన కుండలు, ఆభరణాలు, కరెన్సీ కూడా దొరికాయి. ఈ రకమైన నాణేలు ఒమన్, బహ్రెయిన్, మెసపటోమియాలో కూడా లభించాయి.

2007కి ముందు సముద్రం గర్భంలో నీటి ప్రవాహాన్ని అంచనా వేసేందుకు హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించారు. సుమారు 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గ్రిడ్డింగ్ ( నిలువుగా, అడ్డంగా గీతలతో గ్రాఫ్ గీయడం ) చేశారు. ఆ మార్కింగ్ ఆధారంగా చివరికి, 50 చదరపు మీటర్ల ప్రాంతంలో సర్వే నిర్వహించారు.

''1979లో మరోసారి జరిపిన తవ్వకాల్లో ఓడలకు సంబంధించిన శిథిలాలు దొరికాయి. ఆ ఓడల శిథిలాలా దాదాపు 2 వేల సంవత్సరాల నాటివని అంచనా. ఇప్పటికీ ద్వారకా చుట్టుపక్కల ప్రాంతాల్లో తవ్వకాలు, అన్వేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక పురావస్తు అవశేషాలు కూడా బయటపడ్డాయి'' అని భారత పురావస్తు శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అలోక్ త్రిపాఠి గతంలో బీబీసీకి చెప్పారు.

రంగురంగుల వస్తువులు కూడా దొరికాయని, ఎర్రగా ఉన్న కుండలపై నల్లని గుర్తులు వేయడంతో పాటు వాటి తయారీలో అనేక రంగులు వాడారని ఆయన తెలిపారు.

ద్వారక

ఫొటో సోర్స్, ALAMY

''500 కంటే ఎక్కువ శిలాజాలు దొరికాయి. కార్బన్ డేటింగ్ పద్ధతిలో పరిశీలించినప్పుడు అక్కడి సంస్కృతి దశలవారీగా అభివృద్ధి చెందిందని అవి రుజువు చేస్తున్నాయి. ఇక్కడ దొరికిన కుండలు సుమారు 2000 బీసీ కాలానికి చెందినవి. సముద్ర గర్భం లోపల రాతితో చేసిన వస్తువులు కూడా లభ్యమయ్యాయి. అయితే, ఆ ప్రాంతంలో కుండల్లాంటివి ఏవీ దొరకలేదు. ఎందుకంటే, ఆ ప్రాంతంలో సముద్ర ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది'' అని త్రిపాఠి వివరించారు.

ప్రస్తుతం సోనార్ టెక్నాలజీని వాడుతున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా సముద్ర గర్భంలోకి ధ్వనితరంగాలను పంపిస్తారు. వాటి నుంచి ప్రతిస్పందనల ద్వారా ఎక్కడ ఘనపదార్థాలు ఉన్నాయో తెలుసుకోవడం సాధ్యమవుతుంది.

దానితో పాటు, జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం), మోషన్ సెన్సార్లు, ఇతర సెన్సార్ల సాయంతో సముద్ర గర్భంలో నిర్దిష్ట ప్రాంతాల్లో సర్వే చేయొచ్చు.

సముద్రమట్టం పెరుగుదల, తగ్గుదల గురించి సీఎస్‌ఐఆర్-నియో మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ రాజీవ్ నిగమ్ మాట్లాడారు. ''15 వేల ఏళ్ల కిందట సముద్ర మట్టం ప్రస్తుత మట్టం కంటే దాదాపు 100 మీటర్లు తక్కువగా ఉండేది. ఆ తర్వాత 7 వేల సంవత్సరాల కాలంలో సముద్ర మట్టం పెరిగింది. అది ప్రస్తుత సముద్ర మట్టం కంటే ఎక్కువ'' అని ఆయన చెప్పారు.

''దాదాపు 3,500 ఏళ్ల కిందట సముద్ర మట్టం పడిపోయింది. ఆ సమయంలో ద్వారకా నగరం నిర్మితమైంది. కానీ మళ్లీ సముద్ర మట్టం పెరగడంతో నగరం మునిగిపోయింది'' అని ఆయన అన్నారు.

డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే సముద్ర గర్భంలో ఆటుపోట్లు స్థిరంగా ఉంటాయి. అప్పుడు మాత్రమే సముద్రం అడుగున అన్వేషణకు అనువుగా ఉంటుంది.

సముద్రంలో అన్వేషణ సాగించే పురావస్తు శాస్త్రవేత్తలు తక్కువ సంఖ్యలో ఉన్నందువల్ల పరిశోధన నెమ్మదిగా సాగుతోంది. పరిశోధన కోసం ప్రభుత్వం తగినంత నిధులు కూడా అందించడం లేదని పురావస్తు శాఖ రిటైర్డ్ అధికారి ముహమ్మద్ చెప్పారు.

పశ్చిమ దేశాల్లో సోలమన్ దీవులు, ఒకప్పటి గ్రీస్‌కి చెందిన శాంటోరిని వంటి మరికొన్ని నగరాలు కూడా సముద్రంలో మునిగిపోయినట్లు చెబుతారు.

సముద్ర మట్టాలు పెరగడం వల్ల తమ భూభాగంలో చాలా వరకూ మునిగిపోయిందని ఆస్ట్రేలియాకు చెందిన ఆదిమవాసి ప్రజలు నమ్ముతారు. వారి వద్ద వాటికి సంబంధించిన 21 పురాణాలు ఉన్నాయి.

తమిళనాడులో మహాబలిపురం గురించి కూడా ఇలాంటి కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. 2004లో భారత్‌లో సంభవించిన సునామీ తర్వాత కొన్ని భాగాలు సముద్రం నుంచి బయటపడ్డాయి.

గుజరాత్ పశ్చిమ తీరంలో అరేబియా సముద్రంలో ద్వారకా నగరం ఉంది. నేచర్ కమ్యూనికేషన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం కచ్, సూరత్, భావ్‌నగర్, భరూచ్ ప్రాంతాలపై కూడా సముద్రం ప్రభావం పడే అవకాశం ఉంది. దావరి, హజీరా, కాండ్లా ప్రాంతాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే జాబితాలో ఉన్నాయి.

అలాగే, జామ్‌నగర్, దేవభూమి ద్వారక, పోర్‌బందర్, జునాగఢ్, అమ్రేలీ, నవ్‌సారి, వల్సాద్, గిర్‌సోమ్‌నాథ్ ప్రాంతాలు స్వల్పంగా ప్రభావితమయ్యే అవకాశముందని, కచ్ ప్రాంతం మరోసారి దీవిగా మారే అవకాశం ఉందని ఆ నివేదికలో ఆందోళన వ్యక్తమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)