ది ఇండియా క్లబ్: లండన్‌లో భారతీయ రుచులకు పేరుగాంచిన 70 ఏళ్ల ఈ రెస్టారెంట్ ఎందుకు మూతపడుతోంది?

ఇండియా క్లబ్

ఫొటో సోర్స్, INDIA CLUB

    • రచయిత, చెరిలాన్ మొల్లన్
    • హోదా, బీబీసీ న్యూస్, ముంబయి

ఈ ప్రదేశం గురించి వివరించడం అంత తేలిక కాదు. దాని కోసం మీరు కచ్చితంగా వెతుక్కుంటూ వెళ్లాల్సిందే. 70 ఏళ్లు గడచిపోయినా లండన్‌లోని భారతీయులు ఇప్పటికీ అక్కడికి వెళ్లాలని అనుకుంటారు. భారతీయుల ముఖాలు కనిపించడంతో పాటు అక్కడి వంటకాలు కూడా అందుకు ఒక కారణం.

విదేశాల్లో ఇంటి రుచులను ఆస్వాదించాలనిపిస్తే అక్కడికి వెళ్లాల్సిందే. అదే 'ది ఇండియా క్లబ్'

ఐకానిక్ లాంజ్‌ కలిగిన ఈ రెస్టారెంట్‌లో బార్ కూడా ఉంటుంది. సెంట్రల్ లండన్‌లో రద్దీగా ఉండే రహదారిలో ఉన్న హోటల్ స్ట్రాండ్ కాంటినెంటల్ లోపల ఈ క్లబ్ ఉంది. లండన్ నగరంలో దక్షిణాసియా సమాజానికి దశాబ్దాలుగా చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రదేశంగా నిలుస్తోంది ఇండియా క్లబ్.

భారత్ నుంచి తొలినాళ్లలో లండన్ వచ్చిన ప్రవాస భారతీయులు ఒకరినొకరు కలుసుకునేందుకు 1950లో ఈ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పుడు ఈ క్లబ్‌ మూతపడబోతోంది. ఈ క్లబ్ భవనాన్ని కూల్చేసి అత్యాధునిక హోటల్ నిర్మించాలని దాని యజమానులు భావిస్తున్నారు.

క్లబ్ మూసివేతతో నగరంలో కొంత చరిత్ర మరుగునపడిపోతుందని, ఈ వార్త విని బాధపడ్డామని క్లబ్‌తో భాగస్వామ్యం ఉన్న చాలా మంది చెప్పారు.

ఇండియా క్లబ్ మూసివేతకు వ్యతిరేకంగా ఏళ్ల తరబడి పోరాటం కొనసాగింది. కొన్న సంవత్సరాల కిందట దాని యజమానులు యాడ్గర్ మార్కర్, ఆయన కుమార్తె ఫిరోజా క్లబ్ కూల్చివేతకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ స్థలాన్ని కాపాడాలంటూ క్యాంపెయిన్ నిర్వహించడంతో పాటు వేల మంది సంతకాలు సేకరించారు.

కానీ, ఈ క్లబ్‌కు సెప్టెంబర్ 17 చివరి రోజు అని, ఆ రోజు వరకు తెరిచి ఉంటుందని వారు గత వారం మీడియాతో చెప్పారు.

ఇండియా క్లబ్

ఫొటో సోర్స్, INDIA CLUB

ఇక ఈ ప్రదేశం చరిత్రలో కలిసిపోనుందన్న వార్త చాలా మందికి దిగ్భ్రాంతిని కలిగించింది. 1900లలో భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రచారం నిర్వహించిన బ్రిటన్‌ ఆధారిత సంస్థకి చెందిన ఇండియా లీగ్ సభ్యులు హోటల్ స్ట్రాండ్ కాంటినెంటల్‌లోని మొదటి అంతస్తులో ఇండియా క్లబ్‌ను ప్రారంభించారు. క్లబ్ వ్యవస్థాపక సభ్యులలో భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కూడా ఉన్నారని చెబుతారు. 1990లలో మార్కర్లు ఈ ఆస్తిని కొనుగోలు చేశారు.

తొలినాళ్లలో భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఉద్యమకారులు ఇక్కడ సమావేశమయ్యేవారని నివేదికలు చెబుతున్నాయి. ఆ తర్వాత దక్షిణాసియా ప్రాంత ప్రజలు కలుసుకునేందుకు, కలిసి భోజనం చేసేందుకు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఈ ప్రదేశంగా అడ్డాగా మారిపోయింది.

''1950, 1960లలో తమ భాష మాట్లాడేవారి కోసం, స్వదేశీ ఆహారం తినేందుకు వచ్చిన వారిని కలుసుకోవడం కోసం కేవలం భారతీయులు మాత్రమే వెళ్లే ఏకైక ప్రదేశం ఇది'' అని చరిత్రకారులు కుసూమ్ వద్గమా చెప్పారు. 1953లో యూకే వచ్చిన ఆమె తరచూ ఈ క్లబ్‌కు వెళ్తుండేవారు.

''కొత్త ప్రదేశంలో నేను ఒంటరిని అని అనిపించకుండా ఇండియా క్లబ్ అందరికీ సాయపడింది'' అని ఆమె చెప్పారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, దీపావళి వంటి భారతీయ పండుగలు జరుపుకునేందుకు అందరూ ఇక్కడ కలిసేవారని ఆమె గుర్తు చేశారు.

వలస పాలన కాలంలో తూర్పు ఆఫ్రికాలో కుసూమ్ వద్గమా పుట్టి పెరిగారు. ఆ తర్వాత చదువుల కోసం యూకే వచ్చారు. భారత్‌కు స్వాత్రంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో చాలా మంది భారతీయులు కూడా చదువుకునేందుకు యూకే వచ్చేవారు. అయితే, ప్రవాస భారతీయుల కోసం అప్పట్లో లండన్‌లో ఎలాంటి సాంస్కృతిక సంస్థలూ లేవని ఆమె చెప్పారు.

ఇండియా క్లబ్

ఫొటో సోర్స్, NUPUR BASU

భారతీయ సమాజానికి ఉన్న ఆ వెలితిని ది ఇండియా క్లబ్ భర్తీ చేసింది. భారతీయ వంటకాలనూ రుచిచూపించింది. దక్షిణ భారత వంటకాలైన దోశ, సాంబార్.. ఉత్తర భారత వంటకం బటర్ చికెన్, పకోడీలు, కాఫీ, మసాలా టీ ఇలా చాలా రుచులను అందించింది.

క్లబ్ ఇంటీరియర్ కూడా స్వాత్రంత్య్రానికి ముందు భారత్‌లోని కాఫీ షాపుల తరహాలో ఉండేది. ఇక్కడకు వచ్చిన వారు చాయ్, సిగరెట్ తాగుతూ సంస్కృతి, రాజకీయాల గురించి మాట్లాడుకునేవారు. క్లబ్‌లోని షాండ్లియెర్స్, బల్లలు, కుర్చీలు కూడా 70 ఏళ్ల కిందట ఏర్పాటు చేసినవే. వాటిలో కూడా పెద్దగా మార్పుల్లేవు.

దశాబ్దాల నాటి సామాజిక - రాజకీయ చరిత్రకు గుర్తుగా అక్కడి గోడలపై క్లబ్‌ను సందర్శించిన దాదాబాయ్ నౌరోజీ, మొదటి బ్రిటిష్ ఇండియన్ ఎంపీ, తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ వంటి భారతీయ, బ్రిటిష్ ప్రముఖుల ఫొటోలు ఉండేవి.

ఈ క్లబ్ కేవలం ప్రవాస భారతీయులకు మాత్రమే కాకుండా జర్నలిస్టులు, బ్రిటిష్ గ్రూపులతో సహా అన్ని వర్గాల ప్రజలకు 'నోరూరించే కేంద్రం'గా మారిపోయింది.

1980లలో తన తోటి జర్నలిస్టులతో కలిసి తరచూ క్లబ్‌కు వెళ్లేదానినని జర్నలిస్టు, రచయిత కూడా అయిన శ్రాబణి బసు తెలిపారు.

''ఆ రోజుల్లో సెంట్రల్ లండన్‌లో తక్కువ ఖర్చుతో భారతీయ ఆహారం దొరికే ప్రదేశం అదొక్కటే'' అని ఆమె అన్నారు. నగరంలో అది అందరికీ తెలియని రహస్యమని, భారత్ నుంచి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా అక్కడికి తీసుకెళ్లేదానినని ఆమె చెప్పారు.

ఇండియా క్లబ్

ఫొటో సోర్స్, SMITA THAROOR

''క్లబ్ వ్యవస్థాపక సభ్యులలో మా నాన్న చందన్ థరూర్ కూడా ఒకరు. ఆయనకు పెళ్లికాక ముందు తరచూ వచ్చేవారు. ఈ క్లబ్‌లో జరిగిన ఎన్నో సరదా విషయాలు చెప్పేవారు'' అని మోటివేషనల్ స్పీకర్ స్మితా థరూర్ చెప్పారు.

కొన్నేళ్ల తర్వాత లండన్‌లో ఉంటున్న తనను కలిసేందుకు నాన్న వచ్చినప్పుడు ఈ క్లబ్‌కు తీసుకొచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పటికి ఆమె కూడా ఆ క్లబ్‌కు తరచూ వెళ్తుండేవారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన గౌరవార్థం ఒక కార్యక్రమం కూడా నిర్వహించినట్లు చెప్పారు.

''నా భర్త 50వ పుట్టినరోజు కూడా అక్కడే జరుపుకున్నాం.'' అని థరూర్ చెప్పారు.

''ఇండియా క్లబ్‌కు మా హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. అది ఇకమీదట ఉండకపోవడం బాధాకరం. ఇప్పుడు దాని జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉంటాయి'' అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి: